సెంటర్ స్పెషల్

రణక్షేత్రం 11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం

బయట ఒక్కసారిగా మోగిన టపాకాయల చప్పుడుకు ఆలోచనల నుండి బయటపడ్డాడు అశోక్.
మళ్లీ మరో రౌండ్ ఫలితాలు తెలిసినట్లున్నాయి.
రౌండ్ మీద రౌండ్ ఫలితం వెలువడుతున్న కొద్దీ మోగుతున్న టపాకాయల చప్పుళ్లు ఎక్కువవుతున్నాయి.
ఎటు చూసినా ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది.
ఫోన్ పెట్టేస్తూ లోపలకు వచ్చాడు ఓబులేశు. అతను అశోక్ తరఫున ఈ నియోజకవర్గంలో పనులన్నీ చూస్తుంటాడు.
‘ఏమయింది?’ అన్నట్లు చూశాడు అశోక్.
‘అయిదో రౌండ్ ఫలితం వచ్చింది’
‘అది తెలుసు. మెజారిటీ ఎంత?’
‘రెండువేల అయిదు వందల పదహారు’
చిన్న నవ్వు అశోక్ మొహం మీద వెలసింది. ‘నన్ను ఎదిరించిన ఆ వసుంధరకి చెప్పు దెబ్బ కొట్టినట్లు రావాలి ఫలితం...’ అనుకున్నాడతను.
‘మొత్తం యాభై వేల మెజారిటీకి తగ్గితే మనం ఓడిపోయినట్లే!’ అన్నాడు అశోక్.
‘అంత మెజారిటీ కష్టమేమోనయ్యా!...’ అన్నాడు ఓబులేశు. అతను అశోక్ తండ్రితో కలిసి పని చేసినవాడు. అశోక్ కూడా అతన్ని బాగా గౌరవిస్తాడు.
‘ఎందుకు? ఇదే విధంగా రౌండ్ రౌండుకూ మెజారిటీ పెరుగుతూ పోతే, యాభై వేల మెజారిటీ రావటం ఎంతసేపు?
‘నేను చెప్పింది అయిదో రౌండ్‌లో మెజారిటీ కాదయ్యా! మొత్తం మెజారిటీనే!’
ఉలిక్కిపడ్డాడు అశోక్. ‘అదేంటి? నాలుగు రౌండ్లకి ఐదు వేలకి పైగా ఉన్న మెజారిటీ ఇప్పుడు సగానికి ఎలా పడిపోయింది?’
‘అయిదో రౌండ్లో వసుంధరకి మెజారిటీ వచ్చింది’
ఒక్క క్షణం అశోక్‌కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. లోకం తలకిందులయినట్లుంది. నా నియోజకవర్గంలో నేను వెనుకబడటమా? అది ఒక రౌండ్ కావచ్చు. కానీ అది ఎలా జరిగింది?’
ఏమీ అర్థంకాక ‘ఇలా ఎలా జరిగింది?’ అన్నాడు అశోక్.
‘ఆవిడ్ని తక్కువ ఎస్టిమేట్ వెయ్యలేం బాబూ!...’ అన్నాడు ఓబులేశు. ‘ఇప్పటికే ఆ పొరపాటు మనం చేశామనిపిస్తోంది..’ అన్నాడు.
ఆ మాట అశోక్‌కి ఎక్కడో తగిలింది.
* * *
వసుంధర
సికిందరాబాద్ స్టేషన్‌లో రైలు ఆగినట్లు వినిపిస్తున్న అనౌన్స్‌మెంట్‌తో నాకు మెలకువ వచ్చింది. పై బెర్త్ మీద నుండి కిందకి దిగుతూ కింద బెర్త్ మీద రాత్రి సినిమా ఇండస్ట్రీ మాటలు మాట్లాడుకుంటున్న యువకుల్ని చూద్దామనుకున్నాను. కానీ, వారు అప్పటికే రైలు దిగి వెళ్లిపోయారు.
అంత పెద్ద స్టేషన్. అంత మంది జనాన్ని ఒక్కసారి చూసి కూడా నాకు భయం కానీ, జంకు కానీ కలగలేదు.
ఎప్పటి నుండో కలలు కంటున్న గమ్యానికి చేరుకుంటున్నానన్న ఆనందం తప్ప, తెలియని నగరానికి వచ్చిన ఆందోళన నాలో ఏ మాత్రం లేదు.
ఏనాటికైనా నేను చేరుకోవలసిన గమ్యం ఇదే అన్నట్లు, యుగాల తరువాత స్వంత ఊరికి చేరుకుంటున్నట్లు... అన్పించింది తప్ప, ఇంటి నుండి పారిపోయి వస్తే కలిగే భయం ఎంత మాత్రమూ కలగలేదు.
నా స్కూలు రోజుల నాటి స్నేహితురాలు ఇక్కడే ఉంది. ఆ అమ్మాయి ద్వారా ఈ నగరంలో నేను ఎక్కడ ఉండాలో వివరాలు ముందే సేకరించి పెట్టుకున్నాను.
నగరంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు ఉంటాయనీ, అక్కడ ఒంటరిగా ఉంటూ ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్లు నెలకింత అని ఇచ్చి ఉండవచ్చని చెప్పింది.
ఆ అమ్మాయి సరాసరా తన దగ్గరకు రమ్మంది. కానీ, ఒక్కరోజు కూడా ఆ అమ్మాయితో గడపటం నాకు ఇష్టం లేదు. ‘తరువాత నా వలన ఆ అమ్మాయికి కష్టం రాకూడదు...’ అనుకోవటం వలన ఆ నిర్ణయం తీసుకున్నాను. దానికి బదులు నాకు ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అఅడస్ చెప్పమని అడిగాను. ఆ అమ్మాయి రాసిన అడ్రస్ జాగ్రత్తగా దాచుకున్నాను.
సరాసరి స్టేషన్ బయటకు నడిచి, ప్రయాణికులను ఆటోలు ఎక్కించటంలో సహాయపడుతున్న పోలీస్ కానిస్టేబుల్‌కి ఆ అడ్రస్ చూపించాను.
అతను క్యూలో ఉన్న ఒక ఆటోలో నన్ను ఎక్కించి నేను వెళ్లవలసిన అడ్రస్ నోట్‌బుక్‌లో నోట్ చేసుకుని, దానే్న ఆటో అతనికి చెప్పి నన్ను పంపించాడు.
ఆ హాస్టల్ అడ్రస్సూ, పేరూ చెప్పగానే ఆటోడ్రైవర్ నన్ను ఒకసారి ఆపాదమస్తకం పరికించి చూడటం నేను గమనించక పోలేదు. కానీ, దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు.
ప్రజలు సక్సెస్ సాధించిన మనుషులను ఎంత గౌరవిస్తారో, సక్సెస్ కోసం ప్రయత్నించే మనుషులను అంతగా నిరుత్సాహపరుస్తారు. ముఖ్యంగా సినీ రంగానికి, దానిలో చేరటానికి వచ్చే ఆడవారికీ - ఇది బాగా వర్తిస్తుంది.
అయితే ఇలాంటి వంకర చూపులు నాకు కొత్త కాదు. రికార్డు డాన్సుల కోసం వెళ్లినపుడు ఇలాంటి వారు అడుగడుక్కీ కనిపిస్తారు. నేను చేయగలిగింది వారిని పట్టించుకోక పోవటమే!
ఒకసారి ఆటో బయలుదేరాక అతన్ని పట్టించుకోకుండా రోడ్డుకు అటు, ఇటూ చూస్తూ కూర్చున్నాను. మధ్యలో ఒకటి రెండుసార్లు అతను ఏదో మాట్లాడించబోయాడు.. కానీ.. నా నుండి ఏ రెస్పాన్సూ రాకపోవటంతో ఊరుకున్నాడు.
అరగంటలో ఆటో నేను చెప్పిన అడ్రస్‌కు చేరుకుంది.
స్కూటర్ దూరటానికి వీలు లేనంత సన్నగా ఉన్న ఒక సందులో ఒక పక్కన ఉన్న అపార్టమెంట్‌లో ఉంది నాకు కావలసిన హాస్టల్.
ఒక ఫ్లోర్ మొత్తం హాస్టల్ కింద తీసుకున్నారు. యాదమ్మ అనే ఆవిడ దాన్ని నడుపుతుంది.
నేను అందులో చేరటానికి వచ్చానని తెలియగానే ఆమె నన్ను ఆప్యాయంగా ఆహ్వానించింది. నా బ్యాగ్ తీసుకుని లోపలకు నడిచింది. దారిలోనే, ‘ఏ ఊరు నుండి వస్తున్నావమ్మా?...’ అని అడిగింది.
నా ఊరి పేరు చెప్పడం నాకు అసలు ఇష్టం లేదు. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి, నోటికొచ్చిన పేరు చెప్పాను - విజయవాడ... అని.
‘సినిమాల్లో చేరటానికి వచ్చావా, ఏంటి?’
మొదటిసారి ఆశ్చర్యపోయాను. ‘అవును. మీకెలా తెలిసింది?’ అడిగాను.
‘నిన్ను చూడగానే అలా అనిపించావ్. ఏదో ఉద్యోగం చేసుకునే లక్షణం నీలో నాకు కనపడలేదు. అయినా చూడ చక్కగా ఉన్నావ్! నీవు అనుకుంటున్నట్లే సక్సెస్ అవుతావులే...’ ధైర్యం చెప్పింది.
చాలా రోజుల తరువాత మొదటిసారి ఆనందంగా నవ్వాను.
హాస్టల్ చూపిస్తూ వివరించసాగింది యాదమ్మ. ‘ఇదేనమ్మా! మన హాస్టల్. రెండు ఫ్లాట్లు పడుకోవటానికి వాడుతుంటే.. మరొకటి వంటకీ, నా కుటుంబం ఉండటానికీ వాడుతున్నాము’
ఆ రెండు ఫ్లాటులూ.. దగ్గర దగ్గరగా వేసిన మంచాలతో కిక్కిరిసి ఉన్నాయి.
‘మొత్తం ఇక్కడ ఎంత మంది ఉంటారేమిటి? ఇరుకుగా ఉన్న గదులను చూస్తూ అడిగాను నేను.
‘నీతో కలిపి ఇరవై మంది ఉన్నారమ్మా!’
‘ఈ రెండు ఫ్లాటుల్లో ఇరవై మందా...’ ఆశ్చర్యంగా అడిగాను.
‘పగలంతా ఎవరి పనుల్లో వాళ్లు బయటకు వెళ్తుంటారు. ఎప్పుడో రాత్రిపూట కాసేపు పడుకోవటానికే కదా! ఇంతమంది ఉండబట్టే అంత తక్కువ ధరకు ఇవ్వగలుగుతున్నాం...’
‘ఇంతకీ బాడుగ ఎంతండీ?’
చెప్పింది యాదమ్మ.
నేను వచ్చిన ఊరు స్థాయికి అది చాలా ఎక్కువ మొత్తమే! కానీ హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉంటాయో ఒక అంచనా ఉంది.
నా ఆలోచనను చూసి ఏమనుకుందో ‘ఉండటానికీ, భోజనాలికీ కలిపి కదమ్మా!...’ అంది.
‘నేను ఆలోచిస్తుంది దాని గురించి కాదండీ’
‘మరేమిటమ్మా!’ అని నేను సమాధానం చెప్పకముందే, ‘సామాను పెట్టుకోవటానికి ఇక్కడ రాక్స్ పెట్టాము. బాత్రూం అక్కడ ఉంది...’ మిగిలిన సదుపాయాలు చూపిస్తూ చెప్పింది.
‘ఇక్కడ ఎవరూ లేరేమిటి? మిగిలిన వారందరూ ఏరి?’
‘ఈ సమయంలో ఎవరూ ఉండరమ్మా! ఎవరి పనుల మీద వారు వెళ్లిపోయారు. మళ్లీ ఎప్పుడో రాత్రికి అందరూ చేరుకుంటారు’
యాదమ్మ చూపిన ఒక రాక్‌లో నాకున్న కొద్ది సామాను సర్దుకుని, మంచం మీద విశ్రాంతిగా పడుకున్నాను.
ఇంతలో లోపలకు విసవిసా నడుచుకుంటూ వచ్చింది ఒక అమ్మాయి. వయసు ముప్పై లోపు ఉంటుంది. చూడటానికి ఆకర్షణీయంగా ఉంది. అయితే ఆ ఆకర్షణ సహజ సౌందర్యంతో కూడుకున్నది కాదు. రకరకాల మేకప్ వాడటంతో వచ్చింది. వేసుకున్న బట్టలు మోడ్రన్‌గా ఉన్నాయి. నడకలో నిర్లక్ష్యం, చూపులో నిర్వేదం, మొహంలో నిస్తేజం ఆమె మనసులో చెలరేగుతున్న ఏదో బాధను ప్రతిఫలింప జేస్తున్నాయి.
రావటం రావటమే చేతిలోని హ్యాండ్ బ్యాగ్ ఒక మూలకు విసిరేసి నా మంచం పక్కన ఉన్న మరో మంచం మీద కూలబడింది.
పడుకున్న నేను లేచి మంచం మీద కూర్చున్నాను.
వచ్చిన అమ్మాయిని చూసి తెచ్చిందో, నేను వచ్చానని తెచ్చిందో, యాదమ్మ రెండు కప్పులు టీ తెచ్చింది. చెరొక కప్పూ ఇచ్చింది.
‘ఈ అమ్మాయి పేరు జానకి. ఇక్కడే ఉంటుంది...’ కొత్తగా లోపలకు వచ్చిన అమ్మాయిని పరిచయం చేసింది యాదమ్మ.
వెలుతురు పడకుండా చేతిని కళ్లకు అడ్డం పెట్టుకుని పడుకున్న జానకి అయిష్టంగా ఆ చేతిని పక్కకు తొలగించి నన్ను చూసింది.
‘నమస్కారం...’ చేతులు రెండూ జోడించి నమస్కరించాను.
‘హలో...’ పడుకునే చేతిని ముందుకు చాచింది జానకి.
‘నా పేరు వసుంధర. ఇక్కడ ఉండటానికి వచ్చాను’ చెప్పాను.
‘ఇప్పుడే రైలు దిగి వస్తున్నావా?’
‘అవును’
‘సినిమాల్లో చేయాలనా?’
‘మీకెలా తెలిసింది? వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. అందరూ నన్ను చిన్నప్పటి నుండి తెలిసినట్లు నేను ఇక్కడకి ఎందుకు వచ్చానో చెప్తున్నారు’
‘అనుభవం తల్లీ! అనుభవం... నేననే కాదు. నిన్నూ, నీ అవతారాన్నీ చూసిన ఎవరైనా నువ్వు వచ్చింది ఎందుకో చెప్పగలరు’
నా మొహం మాడిపోయింది.
మొహం ముడుచుకున్న నన్ను పరిశీలనగా చూసింది జానకి. ‘నాట్ బ్యాడ్! చూడటానికి బానే ఉన్నావ్! నటించిన అనుభవం ఉందా?’
‘లేదు’
‘డాన్సు వచ్చా?’
‘అదొక్కటే వచ్చు’
‘ఇంగ్లీషు మాట్లాడటం వచ్చా?’
‘రాదు’
‘నీ పోర్ట్ఫులియో తయారుచేసుకున్నావా?’
‘అంటే ఏమిటి?’
గాఢంగా నిట్టూర్చింది జానకి. ‘చూడు పిల్లా!... ఇంట్లో చెప్పి వచ్చావా?’
‘నాకు ఇల్లు లేదు. నా.. అనే వాళ్లు ఎవరూ లేరు’
‘మరి డబ్బులు బాగా ఉన్నాయా?’
‘ఏవో ఒకటి రెండు నెలలకి సరిపడా ఉన్నాయి. అంతే!...’

ఏదో పని గుర్తుకు వచ్చినట్లుంది యాదమ్మ లోపలకు వెళ్లిపోయింది.
‘సరే! రెండు నెలల తరువాత డబ్బులు అయిపోతాయి కదా! అప్పుడు ఏం చేస్తావ్?’
‘ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటాను’
‘మరి సినీ ఛాన్స్ కోసం ప్రయత్నాలు ఎప్పుడు చేస్తావ్?’
‘మీరు నన్ను భయపెడుతున్నారు’ అన్నాను నేను.
యాదమ్మ మా మాటలన్నీ వింటున్నట్లుంది, ‘ఏంటమ్మా జానకీ! మొదటిరోజే అమ్మాయిని బెదరకొట్టి తిప్పి పంపుతావా ఏంటి?’ అంది.
‘నా మాటలు మీకు బెదరకొట్టటంలా ఉండవచ్చు. కానీ పోర్ట్ఫోలియో కూడా లేకుండా వచ్చిన ఈ అమ్మాయి ఏమయిపోతుందా అన్న బాధతో మాట్లాడుతున్నాను’ అంది జానకి.
‘అసలీ పోర్ట్ఫోలియో అంటే ఏమిటో చెప్పకూడదా?’ అన్నానే్నను. ఎన్నో తెలుసనుకుని ఇక్కడకు వచ్చిన నాకు ఏమీ తెలియదని అప్పుడే అర్థం అవుతోంది.
‘నీలా సినిమాల్లో చేరాలని ఇక్కడకు వచ్చేవారు వందల్లో ఉంటారు. మరి అవకాశాలో... అతి తక్కువ ఉంటాయి. అలాంటప్పుడు మనలో ఏదో ప్రత్యేకత లేనిదే ఏ డైరెక్టరూ మనకి అవకాశం ఇవ్వడు. ఆ ప్రత్యేకత ఏమిటో మనకి మనమే అర్థం చేసుకుని, ఎదుటి వాళ్లకి అర్థమయ్యేలా ప్రొజెక్ట్ చేసుకోవాలి...’
‘అంటే ఏం చెయ్యాలి?’ ఆత్రుత పట్టలేక అడిగాను.
‘నువు ఏదన్నా డైరెక్టర్ దగ్గరకు అవకాశాల కోసం వెళ్లినపుడు అతను తన మనసులో ఉన్న పాత్రకి నువు సరిపోతావా? లేదా.. అని ఊహించుకుంటాడు. అతని ఊహల్లో ఉన్న పాత్రకి నువు సరిపోతావని అనిపిస్తే మిగిలిన టెస్టులు చేసేదాకా వెళ్తుంది నీ కేసు. అయితే ఈ ఎసెస్‌మెంట్ చేయాలంటే దర్శకుడికి సమయం పడుతుంది. ఈ రోజూ రేపూ అంత సమయం ఎవరి దగ్గరా ఉండటం లేదు. అందుకే నిన్ను నువ్వు రకరకాల పోజుల్లో, రకరకాల కోణాల్లో... ఫొటోలు తీయించుకుని ఒక ఆల్బమ్ చేయించుకున్నావనుకో! ఎవరైనా అడగ్గానే అది వారి చేతిలో పెట్టవచ్చు. రెండు మూడు నిమిషాల్లో అతనికి మన గురించి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది..’
అర్థమయినట్లు తల ఊపాను నేను.
‘ఆ చేయించే ఆల్బమ్ ఏదో మంచి ఫొటోగ్రాఫర్ దగ్గర చేయించుకో... ఆ విషయంలో డబ్బుల గురించి చూసుకోకు. అలాగే దాన్ని అందరికీ చూపే ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. దీనికంతటికీ డబ్బులు కావాలి. మరి నీ దగ్గర ఉన్నాయో, లేదో చూసుకో...’
‘చెప్పాను కదా! కొన్ని ఉన్నాయి. మరి అవి సరిపోతాయో, లేదో తెలియదు’
‘వాటన్నిటినీ మొదట్లోనే అవగొట్టుకోకు. ముందు ఏదో ఒక పని సంపాదించుకో... నీ జరుగుబాటుకు నెలకు సరిపడా డబ్బు సంపాదించుకుంటూ... మిగిలిన ప్రయత్నాలు చేసుకో’ సలహా చెప్పింది జానకి.
ఆమె ఇస్తున్న సలహాలు అడగకుండా ఇస్తున్న వరంలా ఉండటంతో నేను ఆసక్తిగా వింటున్నాను.
‘పనంటే.. పదో క్లాసు చదివిన నాకు ఎలాంటి పని దొరుకుతుంది’ అడిగాను.
‘అది నువు ఏమి చేయగలవు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. చదువు సంగతి పక్కన పెట్టు. ఇంకేదన్నా నిపుణత నీకుందా?’
‘డాన్సు చేయటం వచ్చు...’
పెద్దగా నవ్వింది జానకి. ‘తిప్పి తిప్పి అన్ని విషయాలూ తిరిగి సినిమాల దగ్గరకు తీసుకువెళ్తున్నావ్... అది ఆ రంగం మీద నీకున్న ఆకర్షణని తెలుపుతోంది.’ అని కాస్త విరామం ఇచ్చి ‘నీకు వచ్చిన పని డాన్సు చేయటం అనుకుంటే, ఏదన్నా డాన్సు ట్రూపులో చేరవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకో... సినిమా హీరోయిన్ కావాలని ఆశపడుతున్న నువ్వు డాన్సర్‌గా చేరటం వలన నీ అవకాశాలు నువు తక్కువ చేసుకున్నట్లు అవుతుందేమో...’
‘మరి ఏమి చెయ్యమంటారు’
‘నువు వచ్చి ఇంకా గంట కూడా అయినట్లు లేదు. మనం చాలా ఎక్కువ మాట్లాడుకుంటున్నామేమో! అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఏదన్నా మాల్‌లో హెల్పర్‌గా చేరవచ్చు. ఎక్కడైనా హోటల్, హాస్పిటల్ లాంటి చోట రిసెప్షనిస్ట్‌గా చేరవచ్చు. దారిన పోతుంటే అనేక శారీ సెంటర్లలో హెల్పర్లు కావాలి... అని బోర్డులు కనిపిస్తూంటాయి. వాటిలో చేరవచ్చు. నీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు. రోజులు గడిచేకొద్దీ ఏమి చెయ్యాలో నీకే తెలుస్తుంది’
జానకి చెప్తున్న మాటలతో నాకు తెలియని ఆత్మవిశ్వాసం కలిగింది. ‘అలాగే చేస్తాను...’ కాన్ఫిడెంట్‌గా ఉన్నాను.
జానకి కూడా ఉత్సాహంగా చెప్పుకుపోతోంది. ‘దానికంటే తేలిగ్గా డబ్బులు సంపాదించాలంటే సినిమాల్లో ఎక్‌స్ట్రాలుగా పని చేయవచ్చు. ఒకటి, రెండు డైలాగులు ఉండే పాత్రల కోసం ప్రయత్నించవచ్చు. కానీ.. సినీ రంగంలో పైకి వెళ్లదలచుకుంటే ఇవన్నీ అవరోధాలవుతాయి. అందుకే నువు చేసే పని సినీ రంగానికి దూరంగా ఉండేటట్లు చూసుకో! తినడానికి తిండి ఉన్నా లేకపోయినా బట్టలూ, మేకప్ తక్కువ చేసుకోకు. అలాగే ఉన్న సమయం సద్వినియోగం చేసుకో. ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సులో చేరు. నువు ఏది చదువుకున్నావన్నది ఎవరికీ అవసరం లేదు. ఎలా మాట్లాడుతున్నావన్నదే ముఖ్యం...’ ఊపిరి తియ్యకుండా చెప్పి కళ్లు పెద్దవి చేసుకుని వింటున్న నన్ను చూసి నవ్వి, ‘... అలాగే ఒక సెల్‌ఫోన్ తీసుకో!.. అడ్రస్ కార్డు ఒకటి ప్రింట్ చేయించు...’
‘చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు...’ కృతజ్ఞతగా అన్నాను. ‘మీరు కూడా సినిమాల్లో చేరటానికే వచ్చారా?’

మిగతా వచ్చేవారం

-పుట్టగంటి గోపీకృష్ణ 94901 58002