బిజినెస్

అదనపు పన్నును తొలగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిఎస్‌టిపై ఆర్‌బిఐ మాజీ గవర్నర్ సి రంగరాజన్

హైదరాబాద్, డిసెంబర్ 21: అంతర్ రాష్ట్రీయ అమ్మకాలపై ప్రతిపాదించిన ఒక శాతం అదనపు పన్ను అనేది వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) స్ఫూర్తికి విరుద్ధమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మాజీ గవర్నర్ సి రంగరాజన్ అన్నారు. దాన్ని అమలు కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ‘జిఎస్‌టి బిల్లు మంచిదే. అయితే ఇందులో ఒక శాతం అదనపు పనే్న సరికాదు. జిఎస్‌టి ప్రయోజనాలకు ఇది వ్యతిరేకం. కాబట్టి దాన్ని అమలు కానివ్వకూడదు. ఆ ప్రతిపాదనను తొలగించాలి.’ అని సోమవారం ఇక్కడ రంగరాజన్ పిటిఐతో మాట్లాడుతూ తెలిపారు. గత వారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. కాంగ్రెస్ డిమాండ్‌కు అనుగుణంగా ఒక శాతం అదనపు పన్నును తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అయితే దీనివల్ల జిఎస్‌టి రేటును రాజ్యాంగ బిల్లులో చేర్చే అవకాశం ఉండదన్నారు. నిజానికి తయారీ పరిశ్రమలు అధికంగా ఉన్న గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల అభ్యర్థన మేరకే అంతర్ రాష్ట్రీయ అమ్మకాలపై ఈ ఒక శాతం అదనపు పన్నును ప్రతిపాదించామని జిఎస్‌టిపై జరిగిన ఓ పారిశ్రామిక సమావేశంలో జైట్లీ పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు పెట్టిన పెట్టుబడుల నేపథ్యంలో జిఎస్‌టితో తమ ఆదాయం తగ్గిపోతుందని, అందుకే ఒక శాతం అదనపు పన్నుకు ఆ రాష్ట్రాలు డిమాండ్ చేశాయన్నారు. అయితే తయారీ పరిశ్రమలు లేని రాష్ట్రాలకు ఈ ఒక శాతం పన్ను విధించకపోవడం వల్ల లాభం కలుగనుంది. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జిఎస్‌టి బిల్లును అమల్లోకి తీసుకురావాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది తెలిసిందే. దీంతో ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం కలుగజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్ర సోనియా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు కూడా. లోక్‌సభలో కావాల్సినంత మెజారిటీ ఉన్నప్పటికీ, రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో బిల్లు ఆమోదంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాల ఆందోళనను తగ్గించేందుకు జిఎస్‌టి రేటు 18 శాతం దిగువనే ఉంటుందని కూడా జైట్లీ గత వారం స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈసారి సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందుతుందన్న నమ్మకం లేకపోయింది. జైట్లీ కూడా ఇదే వెలిబుచ్చారు. ఈ బుధవారంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నది తెలిసిందే. ఇదిలావుంటే దేశంలోని అన్ని రాష్ట్రాల ఆమోదం జిఎస్‌టికి అవసరమని, కాబట్టి కొన్ని విషయాల్లో రాజీపడక తప్పదన్నారు ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారు మండలి మాజీ చైర్మన్ కూడా అయిన రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఇక నల్లధనంపై మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారత్‌కు తీసుకురావాలని, అలాగే దేశంలో పుట్టుకొస్తున్న నల్లధనానికీ అడ్డుకట్ట వేయాలన్నారు. జిడిపి వృద్ధిరేటుపై స్పందిస్తూ ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో 7.5 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేశారు. ఎగుమతులు వరుసగా 12వ నెల క్షీణించడంపై మాట్లాడుతూ ఈ 12 నెలల్లో దిగుమతులు కూడా తగ్గాయి కదా అన్నారు. అయితే ఎగుమతుల్లో చోటుచేసుకున్న స్థాయిలో పతనం.. దిగుమతుల్లో లేదన్నారు. అయితే అంతర్జాతీయంగా పడిపోయిన ముడి చమురు ధరలు.. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడుతున్న భారత్‌కు లాభం కలిగిస్తున్నాయన్నారు.