అక్షర

వీర ‘రసరాజీ’యంతో దేశభక్తి దీప్తిమంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ భారతం
పద్య కావ్యం
కవి: రసరాజు
132 పుటలు,
వెల: రూ.100/-లు;
ప్రతులకు: శ్రీమతి రంగినీని సూర్యనారాయణమ్మ, ఎల్.ఐ.జి. 177,
హౌసింగ్ బోర్డుకాలనీ,
తణుకు- 534211.

ఈ తరంలోని కొందరు కవులు తపస్సు చేయకుండా వరాలు కోరుకునే దశలో ఉంటున్నారు.
విశ్వనాథ, శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, కాళోజీ, శివసాగర్ వంటి మహనీయ కవులు ఎందరో కవిత్వానికి, అధ్యయనానికి భావుకతకు కలిగివున్న తీక్షణ దృష్టిని స్ఫూర్తిగా తీసుకోవాలి. వివిధ కవితాప్రక్రియల చారిత్రక అవసర నేపధ్యాలను వాని వైవిధ్యాలను తెలుగుసాహిత్య కల్పవృక్షశాఖా ఫలాలుగా అనుభవించాలి.
ప్రక్రియ రథం వంటిది మాత్రమే. ఆ రథాన్ని కవితాపథంలో నడిపించేవాడు ఉత్తరుడైతే ఉత్తుత్తి రచనలకే చేరతాం. అలాకాక నడిపేవాడు ఉత్తమ భావుకుడైన కవి అయితే ఉత్తమ కావ్యాల దర్శనాలకు చేరతాం.
పద్య రథాన్ని కవితామార్గంలో నల్లేరుపై బండి నడకగాకాక నల్లేరుపై బండి పరుగుల్లా నడిపించి రసజ్ఞ పాఠకులకు ‘విజయభారతం’అనే వీర రస కావ్యాన్ని దర్శింపజేసిన ఉత్తమ కవి శ్రీ రసరాజు.
ప.గో.జిల్లా తణుకు ఉత్తమ కవిత్వపు తనుపుమనకు కలగజేయడానికి ఒక యువ కవి నన్నయ్యను, బాలగంగాధర తిలక్‌ను మరికొందరు కవులను ఈనాడు రసరాజును తెలుగువారి కందించింది. ఇది ప్రాంతీయదనపు మాట!
సిక్కువంశానికి చెందిన భారత వీర సైనికుడు ‘రణసింగు’. తెలుగింటి ఆడపడుచైన ‘అమృత’ను పెళ్ళాడాడు. కవిగారు కోనసీమలో తెలుగు రుచులతో, సిక్కు సంప్రదాయాలతో పెళ్ళి జరిపించారు. ‘తూరుపు తెలతెలవారగనే తలుపులు తెరచీ తెరవకనే చెప్పాలమ్మా శ్రీవారి ముచ్చట్లు’ అని అమృతతో ఎవరూ అనే అవకాశం రాలేదు. కారణం తొలి రాత్రి ఆనందాలు వారికి కలిగే లోగానే సైనికాధికారుల నుంచి యుద్ధానికి సన్నద్ధుడవై రావాల్సిందిగా తంతి వచ్చింది. మొదటి రాత్రి తంతు జరగలేదు. అమృత కూడా వీర తిలకం దిద్ది యుద్ధానికి వెళ్ళండి అంది భర్తకి తగిన స్ర్తిగా, వీరవనితగా.
ఆమె తొలి రేయి వలపు ఫలాలను ముందు భావించుకొంది. ఆమె విరహ స్థితిని వర్ణిస్తూ...
‘‘తొలి ముద్దుతో కోర్కె తొలకరించెడివేళ/ బుగ్గపై నును సిగ్గు నిగ్గుదలచి/ నయనాంత దృష్టి సన్నాయి పాడెడి వేళ/ నుడి లేని అలజడి వడిని దలచి/ నడుముపై చెయివేసి నగవుచెల్కెడివేళ/ జివ్వుమను నరాల సెగను దలచి/ పిచ్చిగా తనువెల్ల వేటాడు వేళలో/ మాటకందని తొట్రుపాటు దలచి/ ఉవిద ఆ రాత్రి రతికేళి మాహజేసి/ ఎంతగా పట్టుదప్పెనో ఎన్నిమార్లు/ తన సొబగు తానె వీక్షించుకొనెనో! బళిర!/ పిచ్చి తొలిరేయి వింతగా రెచ్చగొట్టు’నన్నారు. ఇందులోని శృంగారభావ ప్రకటనలు నూతనత్వాన్ని సహజానుభూతిని సంతరించుకున్నాయి. పదభావ ప్రయోగ వైచిత్రి పద్యంలో శృంగారాన్ని పండించింది.
తెలుగు సంస్కృతిని సిక్కుసంస్కృతిని మనోహర పద్యాల్లో దర్శింపజేశారు. కవి తెలుగువాడవడంవల్ల తెలుగు సంస్కృతిని అభివర్ణించడంలో ఆశ్చర్యం లేదు. కాని సిక్కుల ఆచార వ్యవహార జీవన శైలిని తనదైన శైలిలో అభివర్ణించిన తీరు ప్రశంసనీయం.
భారతీయ పంజాబీ సైనికుడంటే ఒక్కమాటలో ‘త్యాగోపనిషత్తు’అని అనడం నిలువెత్తు వీరారాధనే! వివాహ సందర్భంలో సిక్కులుచేసే నృత్య నేత్రోత్సవాన్ని-
‘మనువున నృత్యహేల అభిమానము వారికి- దేహమందు ప్ర/త్యణువు మనస్సుతో కలసి హాయిగ నయ్యెడ నవ్వుకొంచు న/ర్తన మొనరించు- కాలమొక రాగ తరంగిణిలోన మున్గి తే/లును- హరివిల్లులన్నింటికి లోగిలి సిక్కుల పెండ్లి చూడగన్ అనే ఒకే ఒక్క పద్యంలో వర్ణించారు. సిక్కుల పెళ్ళి హరివిల్లులన్నింటికి లోగిలి అనడం సృజనాత్మక భావ సృష్టికి ఓ సాక్ష్యం. సిక్కువారు ‘బారత్’ అని చెప్పుకునే ఊరేగింపు ఒక ప్రత్యేకమైన ముద్ర అన్నారు.
నిజానికి ఈ ‘రణసింగ్’ వీర కథాత్మక కావ్యం పంజాబీ భాషలో సమర్ధ అనువాదకునిచే అనువదింపజేస్తే ఒక తెలుగు కవికి సిక్కులపట్ల గల ప్రేమాభిమానాలు తెలిసే అవకాశం వుంటుంది. అంతేకాదు ఒక తెలుగు కవి భావ దర్శనాలు తెలుస్తాయి.
అమృతాశయం, వివాహం, విందు, శోభనం, తెలుగు వరులు, రంగప్రవేశం, ముందుచూపు, యుద్ధ్భూమి, నడచివచ్చిన దేవుడు, మహావీరచక్ర అనే శీర్షికా విభాగాల్లో సుమారు 600 పద్యాల్లో నడుస్తుంది, ఈ వీర రస కథాకావ్యం.
పెళ్ళి విందులో సిక్కువారికి ‘ఆవకాయ నరయ’తమ శౌర్యరుచులు గుర్తుకు వచ్చాయనడంలో సాభిప్రాయ పదప్రయోగ కౌశల్యం ముచ్చటించింది.
పద్యాలు ఎలా వ్రాయాలో బహిరంగంగా తెల్పుతూ, ఎలా వ్రాయకూడదో కూడా ఆంతరంగికంగా తెలిపే ఈ కావ్యం కవి సమాజానికీ ప్రయోజనదాయకమే.
రసం మనిషికి సంబంధించింది, మనిషి ప్రపంచంలో ఎక్కడివాడయినా ఆయన బ్రతుకుబాటల్లో నవరసాలను దాటి వెళ్ళలేడు. అందుకనే రసదృష్టి కావ్యాన్ని మనిషి హృదయానికి తలుపులు తెరుస్తుంది.
వీర రస దృష్టితో సహృదయ పాఠకుని హృదయ కవాటాల్ని తెరుస్తుంది ఈ విజయ భారతం. ఈ వీర రస సందేశభక్తికి ఉన్ముఖుల్ని చేస్తుంది.
‘పిరికితనంబుతోడ భయవిహ్వలుడౌచు- క్షణక్షణంబు ఊ/ పిరి గొనుచున్ శరీరమును వీడుట కంటెను దేశసేవలో/శిరమెగనెత్తి వీర రస శీధువుగ్రోలుచు కన్ను మూసినన్/ సురపతి ప్రక్కనే కలుగుచోటు చరిత్ర ధరిత్రినేలెడిన్’-
‘దేశసేవ చేయుటకంటె దేవతార్చనమ్ము వేరేమి కలదు భాగ్యమ్ము కాదె’.
‘తమకున్ భద్రతగూర్చు సైనికుని పాత్రన్ మెచ్చుకోకుండ-దే/శములో
నెవ్వరు గాలిపీల్చిన కృతజ్ఞత్వంబుగాదద్ది; ఏ/ చమురందీయక
వెల్గుకోరుకొనుటల్ సంస్కార మెట్లౌను’-;
‘శీలోదంచిత దేశభక్తికి భగత్‌సింగ్ నామమే అగ్రతాం/బూలం
బందుకొనంగ నెన్నడయినన్ ముందుండు- నూనూగు మీ/సాలారాట
ముసల్పువేళ ఉరితో సల్లాపమాడెన్’-
ఈవిధంగా ఎన్నో వీరరస గుళికలు. వైద్యాలయంలో ఉన్న కథా నాయకుడు సింగ్‌ను లాల్‌బహదూరుశాస్ర్తీ తానుగా వచ్చి అభినందిస్తారు.
లాల్‌బహదూరు గురించి వ్రాస్తూ- యాహ్యాఖాన్‌కి శాస్ర్తీగారు అర్భకుడిలా కన్పించాడేమో- ‘్ఫరంగి గుండు చిన్నదె! ఎతె్తైన కోటనైన
క్షణములో మట్టి గరపింప గలిగియుండు’ అన్నారు.
నవ భారత నిర్మాణంలో జవహర్‌లాల్ నెహ్రూ పాత్ర మరువరానిది నిజమే. కానీ శత్రుదేశాల విషయంలో- ముఖ్యంగా చైనా విషయంలో అంత మేధావీ సరైన అంచనా వేయలేకపోయారేమోననిపిస్తుంది. లాల్‌బహదూరుశాస్ర్తీ శత్రువుల పట్ల అచంచలమైన అంచనాలు గలవాడు, విజయ భారత కథానాయకుడు రణసింగుకు శాస్ర్తీగారంటే అవధులులేని సకారణ ప్రేమ. ఆయన ‘మహితాశయాలు జాతి కాస్తులు- నిక్కవౌ నీతికొరకు పుట్టినటువంటి నిలువెత్తు పొట్టివాడు- అంటాడు.
సైనిక వీరారాధనలో దేశప్రముఖ వీరారాధనలున్నాయి.
నవవధువు భర్తతో ఏ ప్రథమానుభూతులూ సుఖాలూ పొందకుండా యుద్ధానికి వీర తిలకందిద్దిన కథానాయిక ఉన్న కావ్యమిది.
ఈ పెళ్ళి అవగానే తొలి రాతిరి వలపులు రేగకుండానే ఆమెను వదలి, తల్లినీ, తండ్రినీ వదలి యుద్ధప్రవేశం చేసిన సిక్కువీరుని యొక్క కథాకావ్యం.
‘కనుపాప నిదురవోవును/కనురెప్పయె నిదుర పోదు;
కాచును దానిన్/ జనగణమనములపై తెర/ చినగొడుగై
సైనికుండు సేవ దల్చిరున్’అన్నారు. కనుగుడ్డుల్ని కనురెప్పలు ఎలా కాపాడుతున్నాయో ఆ విధంగా జన సమూహాలపై తెరచిన గొడుగుల్లా సైనికులు రక్షణ సేవలు చేస్తున్నాయట.
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందదగిన కావ్యం సందేహం లేదు. అందామంటే- ‘బాబోయ్ నాకెందుకండీ ఈ సాహిత్య అకాడమీ పురస్కర స్వీకార, తిరస్కార సంసార ఈతిబాధలు నన్నిలా శాంతిగా ఉండనివ్వరా అంటారేమో సత్తెకాలపుమనిషి రసరాజుగారు అనిపించింది.
దేశభక్తిని దీప్తిమంతం చేసే ఈ కావ్యం భావుక రసజ్ఞ హృదయ గౌరవ పురస్కారాలను పొందగలిగే వీర ‘రసరాజీయం’.

-సన్నిధానం నరసింహశర్మ