రివ్యూ

సాగదీసిన ప్రేమ కథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తను నేను (బాగోలేదు)
తారాగణం:
సంతోష్ శోభన్, అవిక గోర్, రవిబాబు, తదితరులు.
సంగీతం:
సన్నీ ఎం ఆర్
నిర్మాతలు:
రామ్‌మోహన్- సురేష్‌బాబు
దర్శకత్వం:
రామ్‌మోహన్ పి
అష్టాచెమ్మా, ఉయ్యాలా జంపాలా సినిమాలతో అభిరుచిగల నిర్మాతగా తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్‌మోహన్. ఆ రెండు సినిమాల తరువాత దర్శకుడిగా మారుతూ రూపొందించిన సినిమా ‘తను నేను’. ప్రభాస్‌తో వర్షం సినిమా తీసిన దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్‌ని హీరోగా పరిచయం చేస్తూ అవికగోర్ హీరోయిన్‌గా నటించింది. అచ్చమైన తెలుగు సినిమాగా రూపొందిన ‘తను నేను’ ఎలా ఉందంటే..
ఒంటరి యువకుడు కిరణ్ (సంతోష్ శోభన్) కాల్ సెంటర్ కంపెనీలో పనిచేస్తూ, లీజర్ టైంలో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తుంటాడు. కిరణ్‌కి బెస్ట్‌ఫ్రెండ్ నరేష్ (అభిషేక్). నరేష్ బర్త్‌డే పార్టీలో కీర్తి (అవికగోర్)ని చూసి ప్రేమలో పడతాడు కిరణ్. కానీ తనుండేది బెంగళూరు కావడంతో కిరణ్ తన ప్రేమని చెప్పేలోపే ఆమె బెంగళూరు వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తరువాత కీర్తి హైదరాబాద్‌కి షిఫ్టవుతుంది. అప్పుడే నరేష్, కిరణ్, కీర్తి, కాస్ట్ఫీలింగ్ శ్రీకాంత్ (రోహిత్‌వర్మ) కలిసి టూర్ ప్లాన్ చేస్తారు. ఈ టూర్ టైంలో కిరణ్- కీర్తిలు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అంతా బాగుంది అనుకునేలోగా కీర్తి తండ్రి బండిరెడ్డి సర్వేశ్వరరావు (రవిబాబు) చిన్నప్పటినుంచే కీర్తి అమెరికాకి వెళ్లి అక్కడ సెటిలవ్వాలని బ్రెయిన్ వాష్ చేసి ఉంటాడు. కానీ కిరణ్‌కు అమెరికా అన్నా, అమెరికాకు వెళ్తున్న వాళ్ళన్నా చిరాకు. ఈ విషయం తెలిసాక కిరణ్- కీర్తిల మధ్య పలు సమస్యలు వస్తాయి. ఆ సమస్యలేమిటి? కిరణ్- కీర్తిల ప్రేమని విడగొట్టడానికి సర్వేశ్వరరావు ఏం ప్లాన్ చేశాడు? అసలు కిరణ్‌కి అమెరికా అంటే ఎందుకంత కోపం? చివరికి కిరణ్- కీర్తిలు కలిసారా? లేదా? లాంటి ప్రశ్నలకు సమాధానాలుగా స్క్రీన్‌పై చూడాలి.
ఈ సినిమా ద్వారా సంతోష్ శోభన్ హీరోగా పరిచయమయ్యాడు. గతంలో గోల్కొండ హైస్కూల్ సినిమాలో నటించిన అనుభవంతో హీరోగా మంచి మార్కులు కొట్టేసాడు. సంతోష్ వాయిస్, అతను వాయిస్‌లో చూపిన మాడ్యులేషన్ బాగున్నాయి. హీరోయిన్ అవిక తన పాత్రలో బాగానే నటించింది. అయితే ఇక్కడ నటనను ప్రదర్శించేంత అవసరం రాలేదు. సంతోష్ ఫ్రెండ్‌గా కనిపించిన అభిషేక్ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో నవ్విస్తూ వచ్చాడు. రోహిత్‌వర్మ బలుపు ఎన్నారైగా బాగా చేసాడు. రవిబాబు, సత్యకృష్ణన్‌లు తమ పాత్రల పరిధిమేర నటించారు. సినిమా మొదటి భాగం చాలా ఎంటర్‌టైనింగ్‌గా స్టార్టవుతుంది. ఫస్ట్‌హాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అయితే సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్‌గా చెప్పాల్సింది సెకండాఫ్. ఎమోషనల్ కంటెంట్ చాలా ఉంది కానీ దాన్ని ఎక్కడా సీరియస్‌గా చెప్పడానికి డైరెక్టర్ ప్రయత్నించలేదు. ప్రతి సీరియస్ ఇష్యూని కామిక్‌గా చెప్పడానికే ఇష్టపడ్డాడు. ఈ సినిమాలో ట్విస్ట్ ఆడియన్స్‌కి పెద్దగా కిక్కివ్వదు. ఫస్ట్‌హాఫ్‌లో ఒక ఫ్రెష్ ఫ్లేవర్‌ని చూపిస్తూ వచ్చిన డైరెక్టర్ సెకండాఫ్‌ని పరమ రొటీన్‌గా ముగించేసాడు.
బడ్జెట్‌తో తీసిన సినిమాయే అయినా -విజువల్స్, మ్యూజిక్, కంటెంట్‌పరంగా క్వాలిటీ కనిపించింది. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ బాగుంది. ఇచ్చిన రెండుమూడు లొకేషన్స్‌ని బోర్‌కొట్టకుండా, బ్యూటిఫుల్‌గా చూపించాడు. ఆర్ట్ డైరెక్టర్ ఎస్ రవీందర్ వేసిన సింపుల్ హౌస్‌సెట్స్ సినిమా కంటెంట్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. ఇక సన్నీ ఎంఆర్ పాటలు మరియు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్. ఎడిటర్ మార్తండ్ కె.వెంకటేష్ సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేయలేకపోయారు. సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించింది రామ్‌మోహన్- సాయికుమార్‌లు. కథనంపరంగా సెకండాఫ్‌లో బలం కరవైంది. రామ్‌మోహన్ నిర్మాతగా ఓకే, దర్శకుడిగా యావరేజ్ అనిపించుకున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా అలా అలా సాగిపోయే ప్రేమకథని ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవడం కష్టమే. హీరోగా పరిచయమైన సంతోష్ శోభన్ పెర్ఫార్మెన్స్, అవిక గోర్ ప్రెజన్స్, బాగానే వర్కౌట్ అయిన కామెడీ, ఫస్ట్‌హాఫ్‌కి హెల్ప్ అయ్యే అంశాలైతే, సెకండాఫ్ ట్విస్ట్‌ల్లో కిక్‌లేకపోవడం, ఎమోషనల్ కంటెంట్‌ని ఆడియన్స్‌కి కనెక్టయ్యేలా తీయలేకపోవడం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్. సెకెండాఫ్‌లో సీరియస్‌నెస్ మిస్సైంది. ముఖ్యంగా సంతోష్- రవిబాబుకి మధ్య సీరియస్‌గా మాటల యుద్ధం జరుగుతుంది. కానీ, ఆ తరువాత కామెడీ చెసేయ్యడం సిల్లీగా అనిపిస్తుంది. దానికితోడు స్లోగా సాగే నేరేషన్‌తో కథంతా మెల్లగా సాగుతుందా? అని ప్రేక్షకుడు ఫీలయ్యేలా ఉంటుంది. అలాగే సినిమాకి మెయిన్ ఎమోషన్ అయిన క్లైమాక్స్ సీన్ కరక్ట్‌గా కుదరలేదు. మొత్తానికి తను నేను ఓ మోస్తరు మూస ప్రేమకథ అని చెప్పాల్సిందే.

-త్రివేది