రివ్యూ

అనుబంధాల కలబోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** శతమానం భవతి
**
తారాగణం: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్‌రాజ్, జయసుధ, నరేష్, సిజ్జు, ఇంద్రజ, రాజా రవీంద్ర,
తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: మిక్కీ జె మేయర్
ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి
నిర్మాత: దిల్ రాజు
రచన, దర్శకత్వం: వేగేశ్న సతీష్
**

రేపటి తరం ‘డాలర్ల’ సేద్యంలో పడి.. ఉన్న ఊరికీ, కన్న తల్లిదండ్రులకూ -అనుబంధాలూ ఆప్యాయతలకూ దూరమై.. దూర తీరాలకు చేరిపోవటమన్నది నేటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న ‘మానసిక’ సమస్య. కొనే్నళ్లుగా వేదనని వొలికిస్తున్న కన్నీటి గాథ. ఇటువంటి కథల్లో బోలెడంత ఎమోషనల్ డ్రామా ఉంటుంది. అలనాటి ‘సీతారామయ్యగారి మనవరాలు’ మొదలుకొని.. విదేశీ పయనం కథలు మానసిక సంఘర్షణనీ.. సెంటిమెంట్ల పంటని పండించాయి. అదే ధోరణిలో కాస్తంత భిన్నంగా.. కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా ‘శతమానం భవతి’ తెలుగుదనాన్నీ.. పల్లెటూరి అందచందాలనూ.. ఓణీల- పట్టుచీరల రెపరెపల్నీ.. లేత వయసు పల్లె సొబగులనూ.. పంచెకట్టు సూత్రాల్ని మేళవించింది.
***
ఆత్రేయపురం ఊళ్లో రాజుగారు (ప్రకాష్‌రాజ్), జానకమ్మలు ఆదర్శ దంపతులు. వారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఎదిగిన పిల్లలు ‘రెక్కలొచ్చి’ విదేశాలకు రివ్వున ఎగిరిపోతే.. రాజుగారు మాత్రం మనవడు రాజు (శర్వానంద్), జానకమ్మతో కాలక్షేపం చేస్తూ.. బతుకుని వొకింత హాయిగా.. మరింత భారంగా వెళ్లదీస్తూంటాడు. పిల్లలు ఉన్నత స్థితికి రావాలని, మంచి ఉద్యోగాల్తో భార్యా పిల్లల్తో కళకళలాడుతూ ఉండాలని అందరు తండ్రులూ కోరుకున్నట్టే.. రాజుగారూ కోరుకుంటారు. అయతే- ఒక్క వేదన మాత్రం ఆయన్ని కలచివేస్తూంటుంది. దేశంలోనే ఉంటే.. ఏదో ఒక రోజు వీలు చూసుకొని పిల్లలు వస్తారన్న ఆశ ఉండేది. కానీ సముద్రాల కావల కాపురం.. ఉద్యోగ బాధ్యతలతో సతమతమవుతూ.. తల్లిదండ్రులను కనీసం చూట్టానికి కూడా వారికి వీలు పడదు. రాకపోవటానికి ఏదో ఒక సాకుని వెతుక్కుంటూ ఉంటారు. దీంతో -రాజుగారు క్షోభకు గురై ఉన్నట్టుండి పిల్లలకు ఓ భయంకరమైన నిజాన్ని వెల్లడిస్తాడు. ఆ నిజం ఏమిటంటే భార్య జానకమ్మతో విడాకులు. ఈ వయసులో ఆయనకి విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పటివరకూ వారిద్దరిదీ అన్యోన్య దాంపత్యం అనుకుంటున్న పిల్లల్లో సైతం అలజడిని సృష్టించిందీ వార్త. దాంతో ‘సంక్రాంతి’ పండక్కి అంతా హుటాహుటిన వాలిపోతారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాలో ఉంటున్న రాజుగారి మనవరాలు నిత్యా (అనుపమ పరమేశ్వరన్) ఇండియా రావటం.. ఆత్రేయపురం చేరటం -రాజు పట్ల ప్రేమ చిగురించటం జరిగిపోతాయి. తండ్రిపై ఉన్న గౌరవంతో ఆయన్ని ప్రశ్నించటానికి ఎవరూ సాహసించరు. అమ్మతో ఆయన విడాకులు ఎందుకు కోరుతున్నాడు? తండ్రి ఆలోచనలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ క్లైమాక్స్ సమాధానం చెబుతుంది.
కథ ఇంత సాదాసీదాగా ఉన్నప్పటికీ.. సమాజంలోని ‘బర్నింగ్ ఇష్యూ’ని చక్కగా నడిపిస్తూ.. సంక్రాంతి పండక్కి ప్రేక్షకుల్ని కూడా ఆహ్వానించినట్టుంటుంది. కథ విషయం కాస్తంత పక్కనబెడితే.. పల్లె అందాలనూ.. ఆహ్లాదకర వాతావరణాన్నీ.. సెల్ఫీ దిగినట్టు.. ఎంచక్కా ఎంజాయ్ చేసేట్టు ఛాయాగ్రహకుడు తన పనితనాన్ని చూపెట్టాడు. విదేశీ మోజు అంటేనే స్వదేశీ సెంటిమెంట్‌తో ముడిపడి ఉంటుంది. చేతికంది వచ్చిన పిల్లలు విదేశాల్లో స్థిరపడి.. చేతులారా డాలర్లు సంపాదిస్తున్నారంటూ.. మాట వరసకి చెప్పుకోటానికే గానీ.. ఆ మాటల వెనుక ఉన్న ఆవేదనని అర్థం చేసుకోగలిగితే- కుటుంబ విలువల పట్ల ప్రేమాప్యాయతల మధ్య కొట్టుమిట్టాడే సందిగ్ధతని పట్టుకొన్నట్టే. ఈ పాయింట్ దగ్గరే దర్శకుడు ప్రేక్షకుల్ని కథతో ‘కనెక్ట్’ చేయగలిగాడు. దీనికి చక్కటి ముక్తాయింపునిస్తూ.. కుటుంబ వ్యవస్థ ఏ రీతిన ఉంటే బావుంటుందో చాటి చెప్పాడు.
సంక్రాంతి -పల్లెసీమ.. వాతావరణానికి తగ్గట్టు కథంతా సాఫీగా సాగిపోతూ.. మధ్యమధ్య నవ్వుల్ని కురిపిస్తూ.. పిండివంటల ఘుమఘుమల్నీ ఆస్వాదింపజేస్తూ.. లేలేత ప్రేమని పరిచయం చేస్తూంది. ‘పల్లె’ పదానికి అటు ఇటు ఏ మాత్రం ట్రాక్ తప్పకుండా.. దర్శకుడు ఆద్యంతం కథని ఒకే ట్రాక్‌లో నడిపించాడు. కాబట్టి- ఎక్కడా బోర్ కొట్టదు. మిక్కీ జె మేయర్ సంగీతం కథని పిల్ల తెమ్మెరలా నడిపించింది. అందుకు తగ్గట్టే పాటల చిత్రీకరణ.. సన్నివేశాల గుబాళింపు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
నటనాపరంగా - అందరూ హేమాహేమీలే. ‘బొమ్మరిల్లు’ ఫాదర్ క్యారెక్టర్ చేసిన ప్రకాష్‌రాజ్‌కి ఇటువంటి పాత్ర కొట్టిన పిండే. జయసుధకి కొత్త కాదు. నరేష్, ఇంద్రజ.. నటనలో ఏ ఒక్కరినీ ఎన్నిక పెట్టడానికి లేదు. శర్వానంద్ -అనుపమ పరమేశ్వరన్ ఈ కథకి మరింత ఫ్రెష్‌నెస్‌ని తెచ్చిపెట్టారు. పల్లె సెంటిమెంట్ల బ్యాక్‌గ్రౌండ్‌లోకి - తాజాగా మొబైల్స్, టీవీలూ, లాప్‌టాప్‌లూ.. ఎలాంటి ‘నిశ్శబ్దాన్ని’ కుటుంబంలో ఆవరింపజేస్తున్నాయో చూపెట్టారు. దాంతో- ఈ కథ మన చుట్టూ జరుగుతున్నదే అనిపిస్తుంది.

-బిఎనే్క