రివ్యూ

‘అంధ’మైన ప్రతీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** కాబిల్
**
తారాగణం: హృతిక్‌రోషన్, యామీగౌతమ్, సురేష్‌మేనన్, రోనిత్‌రాయ్, రోహిత్‌రాయ్
కథ: సంజయ్ మసూమ్, విజయ్‌కుమార్ మిశ్రా
సినిమాటోగ్రఫీ: సుదీప్ ఛటర్జీ, అయ్‌నంకా బోస్
సంగీతం: రాజేష్ రోషన్
ఎడిటింగ్: అకీవ్ అలీ
నిర్మాణం: రాకేష్ రోషన్
దర్శకత్వం: సంజయ్‌గుప్తా
**
నేల విడవకుండా సాము చేయడం -బాలీవుడ్ అనుసరించే సినిమా స్టయిల్. క్లాస్, మాస్‌ల కలబోత కథను -ఎక్కడో మొదలుపెట్టి అనుకున్నచోట ఆపడం చాలాకాలంగా స్టార్ హీరోలు అనుసరిస్తున్న సినిమాటిక్ కోణం. ఆ తరహాలో వచ్చించే -కాబిల్.
రోహన్ భట్నాగర్ (హృతిక్ రోషన్) ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్. సుప్రియశర్మ (యామీగౌతమ్) ఓ పియానో ప్లేయర్. అంథత్వాన్ని జయించి ఆత్మవిశ్వాసంతో జీవిస్తుంటారు. అనుకోని కలయికలో ప్రేమలో పడతారు. పెళ్లి చేసుకుని, కొత్త జీవితాన్ని మొదలుపెడతారు. ఇద్దరూ ఒక ప్లాట్‌లోకి మారే ప్రయత్నాల్లో ఉంటారు. ఇంతలోనే ఆ ప్రాంతానికి చెందిన కార్పొరేటర్ (రోహిత్‌రాయ్) తమ్ముడు అమిత్ షెల్లార్ (రోనిత్‌రాయ్), అతని స్నేహితుడి చేతిలో అంధురాలైన సుప్రియ బలత్కారానికి గురవుతుంది. రోహన్, సుప్రియలు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. న్యాయం జరగకపోగా, మరోసారి సుప్రియ రేప్‌కు గురవుతుంది. భరించలేని సుప్రియ ఆత్మహత్యకు పాల్పడుతుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సుప్రియకు జరిగిన అన్యాయంపై చట్టపరమైన న్యాయం జరగనపుడు -రోహన్ ఏం చేశాడు? కిరాతకులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? ఇదీ సినిమా.
‘క్రిష్’ సిరీస్‌తో సూపర్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న హృతిక్ -మరోసారి చేసిన వైవిధ్యమైన ప్రయోగం కాబిల్. సొంత నిర్మాణ సంస్థ ఫిల్మ్‌కార్ట్ ప్రొడక్షన్స్‌పై తండ్రి రాకేష్ రోషన్ నిర్మించిన ‘కాబిల్’లో అంధుడి పాత్ర పోషించాడు. ఇటీవలి కాలంలో సూపర్ హీరోలు చేస్తున్న సరికొత్త ప్రయోగాల్లో -హృతిక్ అంధుడి పాత్ర చేయడం ఒకటిగా ప్రస్తావించొచ్చు. దీంతో ఆడియన్స్‌లో కాబిల్ అంచనాలు పెంచింది. గతేడాది హృతిక్ చేసిన ‘మొహెంజొదారో’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలినా -మరోసారి ‘కాబిల్’తో వైవిధ్యానికే ఓటేసి మంచి ఫలితానే్న అందుకున్నాడు. కాబిల్ హృతిక్ కెరీర్‌కు కొత్త బూస్టే.
నిజానికి -ఇదో సాదాసీదా రివేంజ్ స్టోరీ. క్లాసిక్‌ను మాస్‌తో మిక్స్‌చేసి డిజైన్ చేసిన సినిమా. ప్రాణానికి ప్రాణమైన భార్య అత్యాచారానికి గురవ్వడం, అంధులన్న సానుభూతితోనైనా న్యాయం చేయకపోగా చట్టం నిర్లక్ష్యం చూపడంలాంటి సన్నివేశాల్లో హృతిక్ నటన బావుంది. భార్య మృతికి కారణమైన వారిపై అంధుడు ఎలాంటి ఆధారాలు దొరకకుండా ప్రతీకారం తీర్చుకోవడమన్న -హీరోయిజాన్ని కథలోకి చొప్పించిన వైనం మాస్ ప్రేక్షకులను సంతృప్తిపర్చేదే. తొలి సగభాగం ‘అంథ’మైన ప్రేమ, అనుబంధాలతో లాక్కొచ్చిన దర్శకుడు -సెకెండాఫ్‌లో ప్రతీకార సన్నివేశాలతో హృతిక్‌నుంచి ఆశించే యాక్షన్ ఎపిసోడ్స్‌కి తెరలేపాడు. చూపులేకున్నా ‘ముందుచూపు’ ప్రదర్శించటం, ఆధారాలు లేకుండా అంతమొందించే వ్యూహాన్ని అనుసరించటంలాంటి -యాక్షన్ ఎపిసోడ్స్ రక్తికట్టించాయి. ఓ మంచి లవ్‌పెయిర్‌గా హృతిక్, యామీగౌతమ్‌ల మధ్య కెమిస్ట్రీ వర్కవుటైంది. ఆ ‘లవ్ బ్యూటీ’ని అంధులుగా నటించిన విధానంతో మరికొంత హైట్స్‌కు తీసుకెళ్లారు. రివేంజ్ స్టోరీ ముందే తెలిసిపోతున్నా -హీరో ఎలాంటి చాకచక్యాన్ని ప్రదర్శిస్తాడన్న ఉత్సుకత ఆడియన్స్‌ని పూర్తిగా సంతృప్తిపర్చింది.
సినిమా మొత్తాన్ని హృతిక్, యామీలే నిలబెట్టేశారు. పాత్రల్లో లీనమైన విధానం ప్రతి సన్నివేశంలో కనిపించింది. ‘అంధ’మైన ప్రేమకథ ఎత్తుకుని రక్తికట్టించే సన్నివేశాలతో దర్శకుడు సంజయ్‌గుప్తా సులువుగా నడిపించేశాడు. రాజేష్ రోషన్ కవితాత్మకమైన బాణీలు, యాక్షన్ ఎడిసోడ్స్‌కు కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో ప్రతిభ కనపడింది. సుదీప్ ఛటర్జీ, అయంకా బోస్‌ల కెమెరా పనితనం సినిమాను ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది. రాకేష్ రోషన్ నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడలేదు. మొత్తంగా -ప్రతీకారం మేళవించిన ఓ ‘అంధ’మైన ప్రేమ కథ.

-ప్రవవి