రివ్యూ

చూపున్న అంధుడి కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** కనుపాప
**
తారాగణం: మోహన్‌లాల్, సముద్రకని, నెడుముడి వేణు, విమలారామన్, అనూశ్రీ, చెంబన్ వినోద్, రెంజిస్ ఫనిక్కర్, ముమ్ముఖ్యోయా, బేబీ మీనాక్షి తదితరులు
సంగీతం: జిమ్‌జాకబ్,
బిబీ మాధ్యూ, జస్టిన్ జేమ్స్, ఎల్ధోస్
నేపథ్య సంగీతం: రాన్ ఎథిన్ యోహాన్
నిర్మాత: వి మోహన్‌లాల్
రచన, దర్శకత్వం: ప్రియదర్శన్
**
మూస చిత్రాలకు భిన్నంగా కొత్తదనమున్న కథా చిత్రాలను ఎంచుకుని అభినయించే ఉత్తమాభిరుచి కలిగిన నటుడు మోహన్‌లాల్. జాతీయస్థాయి గుర్తింపు పొందిన చిత్రాల దర్శకుడు ప్రియదర్శన్. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘కనుపాప’ నిశ్చయంగా రొటీన్ చిత్రాలకు దూరంగా ఉన్న చిత్రమే.
ఓ పట్టణంలోని బహుళ అంతస్థుల గృహ సముదాయానికి లిఫ్ట్ ఆపరేటర్ కమ్ కేర్‌టేకర్ -జైరామ్. జైరామ్ చూపులేని వాడైనా -చూపున్నవారు సైతం దృష్టి సారించలేని అనేకానేక అంశాలను నిశితంగా గమనించి చెప్పగల నేర్పున్న వ్యక్తి. ఈ లక్షణం కారణంగానే -జైరామ్ అంధుడేనా? లేక అలా నటిస్తున్నాడా? అన్న అనుమానం చుట్టుపక్కల వారిని వేధిస్తూంటుంది. సుప్రీంకోర్టు న్యాయాధిపతిగా పనిచేసి విశ్రాంత జీవనం గడుపుతున్న కృష్ణమూర్తి (నెడుముడి వేణు) జైరామ్‌తో అపార్ట్‌మెంట్‌లో ఉంటూ చాలా సన్నిహితంగా ఉంటాడు. ఆ సన్నిహితంతోనే తనకు సంబంధించిన అన్ని విషయాలనూ అరమరికలు లేకుండా చర్చిస్తాడు. ఆ క్రమంలోనే తన సంరక్షణలో ఊటీ స్కూల్‌లో చదువుతున్న నందిని (బేబీ మీనాక్షి) విషయన్నీ చెపుతాడు. ఆమె జన్మ రహస్యం, జరపాల్సిన నగదు లావాదేవీలు అన్నీ వివరిస్తాడు. ఆ తరువాత కృష్ణమూర్తి అదే అపార్ట్‌మెంట్‌లో హత్యకు గురవుతాడు. సహజంగా కృష్ణమూర్తితో సన్నిహితంగా ఉండే జైరామ్‌పై పోలీసులకు అనుమానం కలుగుతుంది. మరి చివరకు తన నిర్దోషిత్వాన్ని జైరామ్ ఎలా నిరూపించుకున్నాడు. అసలా హత్యచేసింది ఎవరు? ఎందుకు? నందిని తండ్రెవరు? లాంటి సమాధానాలతో ‘కనుపాప’ ముగుస్తుంది.
ఓ అంధుడు సెంటర్‌పాయింట్‌గా థ్రిల్లర్‌ని నడపడం, అదీ దాదాపు రెండు గంటలకు పైగా సినిమా చూపించటం నిజంగా సాహసమే. దాన్ని కొనసాగించడం కోసం ప్రియదర్శన్ సాధారణ తీరాలన్నీ దాటేశాడు. ఇంకొన్ని విషయాలు హత్యకు జోడించి సమన్వయ పర్చడానికి ప్రయత్నం చేసినా, దానికీ సరైన స్పష్టతనివ్వలేదు. ఉదాహరణకు కేసుని పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారి గంగ (అనూశ్రీ), దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన సీరియల్ హత్యలతో కృష్ణమూర్తి హత్యకు సంబంధం ఉందా? అన్న అనుమానం వ్యక్తం చేస్తుంది. దాన్ని చివర్లో సమన్వయపర్చడాన్ని విస్మరించారు. ఆ అనుమానం గంగ పరిశోధనలో భాగమేనా? అన్నదీ తేల్చలేదు. అలాగే పటిష్టమైన సాంకేతిక సాయం, పోలీసు యంత్రాంగం ఉన్న ఈకాలంలో కూడా కేవలం ఓ దివ్యాంగుడు (అతనికెంత సమర్ధత ఆపాదించినా) మీదే కేసుని, పరిశోధననీ నడిపించడం హాస్యాస్పదం. అదేవిధంగా కేవలం అడుగుల చప్పుడు సంఖ్యతో అవతలి వ్యక్తి ఎక్కడున్నాడో తెలపగల సమర్ధతున్న జైరామ్‌కు కేవలం అడుగు దూరంలో హంతకుడు ఉన్నాడన్న విషయం గుర్తించినా సంబంధిత పోలీసు అధికారుల్ని అడగకపోవడం సినిమాను పొడిగించడానికా? అన్న అభిప్రాయం కలిగింది. హంతకుడిని చివరవరకూ తెలుపకుండా కథ నడిపించడం థ్రిల్లర్స్ వౌలిక లక్షణం. ఆ లక్షణాన్ని తోసిరాజని హంతకుడు వాసుదేవ్ (సముద్రకని) అని ప్రేక్షకులకు విశ్రాంతి ముందే తెలిపినా, మిగతా కథని నడపడం అభినందనీయం. జైరామ్ పాత్రని ఎంతో ఉదాత్తంగా చూపి, ఓ దశలో అపార్టుమెంటులో పనిచేసే శ్రీదేవి (విమలారామన్)ని దుర్భాషలాడటానికి వచ్చిన ఆమె తాగుబోతు భర్త మధు ‘నువ్వేనా ఈమెకు తోడు’ అంటూ వ్యంగ్యంగా అన్నప్పుడు, ‘నువ్వే అన్నావుగా తోడు’ అని అతనితో అనిపించడం సరిగాలేదు. అసలామాట ‘తోడు’తోనే మనిద్దరం పెళ్లిచేసుకుందాం లాంటి మాటల్ని శ్రీదేవి పాత్రతో అనిపించి, ఫొటోలు, జంట అంటూ పొడిగించడం లాంటివి జైరామ్ పాత్రను కాస్తంత తక్కువచేశాయి. ఇక పోలీస్ టార్చర్ తదితరాలు ఇటీవలొచ్చిన ‘దృశ్యం’ (దృశ్యం’, కనుపాప రెంటికీ మూల చిత్రాలు మలయాళ భాషలోనే. ‘వెప్పం’ మలయాళ చిత్రానికి అనువాదమే కనుపాప) చిత్రాన్ని గుర్తుచేశాయి. చివర్లో గుడ్డివాడైన జైరామ్‌కు కనుపాపగా నేను ఉంటానని నందిని అనడం బావుంది. నటీనటుల ప్రతిభాంశాలను చెప్పుకోవాల్సివస్తే తప్పకుండా అగ్ర తాంబూలం మోహన్‌లాల్‌కే చెందుతుంది. ఒక రకంగా చెప్పాలంటే చిత్ర భారాన్ని దాదాపు ఒంటి చేత్తో మోశారు మోహన్‌లాల్. కేవలం శబ్దాలూ, స్పర్శలతో నటించాల్సిన అంధ పాత్ర తనదైనా, ఆ వెలితిని తెలియకుండా ఆద్యంతం అభినయ కౌశలాన్ని ప్రదర్శించారు. అలాగే తానున్నది కేవలం కొన్ని సన్నివేశాల్లోనైనా నందినిగా బేబీ మీనాక్షి తన ఉనికిని పటిష్టంగా తెలియపరిచింది. కామెడీకంటూ ప్రత్యేక ట్రాక్ తదితరాలేవీ పెట్టకుండా సంయమనాన్ని ప్రదర్శించిన దర్శకుడు ప్రియదర్శన్, ఉన్నంతలోనే పోలీసులు పరిశోధనచేసే క్రమంలో సెక్యూరిటీ గార్డు ఖాదర్ (ముమ్ముఖ్యోయా) పాత్ర ద్వారా చక్కటి హాస్యాన్ని పండించారు. పాటల్లో ‘మెరిసే మచ్చలా....’ శ్రావ్యంగా ఉంది. ‘దేవుడు కొన్ని లోపాల్తో పుట్టిన వ్యక్తులకి కొన్ని శక్తుల్నీ ఇస్తాడు’ అన్న సంభాషణా చిత్ర గమనానికి ఉపకరించింది. కేరళ అందాల్ని ఏకాంబరం కెమేరా బాగా చూపింది. అయితే ఎడిటర్ తన పనితనంతో చిత్ర నిడివిని రెండు గంటలకు కుదిస్తే మరింత బావుండేది.

-అనే్వషి