రివ్యూ

పరుగు తగ్గిన సింగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** ఎస్-3
**
తారాగణం: సూర్య, అనుష్క, శృతిహాసన్, రాధిక, అనూప్‌సింగ్ ఠాకూర్, శరత్ సక్సేనా, శరత్‌బాబు, నాజర్, విజయకుమార్, నీతూచంద్ర, సుమన్, జయప్రకాష్, క్రిష్, రోబోశంకర్, నితిన్‌సత్య, రాధారవి తదితరులు.
సంగీతం: హారిస్ జైరాజ్
నిర్మాతలు: కెఇ జ్ఞానవేల్‌రాజా, మల్కాపురం శివకుమార్, ధవల్ జయంతీలాల్ గాద
రచన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరి
**

‘పోలీసు’ ప్రధాన పాత్రగా ప్రపంచంలో అత్యధిక సినిమాలొచ్చింది బహుశ భారత్‌లోనే కావొచ్చు. ఆ పాళ్లు తమిళ, తెలుగు భాషల్లో ఇంకాస్త ఎక్కువనీ నిశ్చయంగా చెప్పొచ్చు. అలాంటి ‘పోలీసు’ పాత్రతో సీక్వెల్‌గా వస్తున్న సింగమ్‌లో ‘ఎస్ 3’ ఒకటి. సాధారణంగా ఈ తరహా చిత్రాల్లో ప్రతినాయకుని పరిధి స్వరాష్ట్రానికే పరిమితమవుతుంది. ఇందులో అది దేశాలుదాటి విదేశాల్లో విహరించింది. అలాగే పోలీసు పరిశోధన కూడా ఆంధ్రప్రదేశ్ దాటి కర్నాటకకు అధికారితో సహా వెళ్లింది. మంగళూరు పోలీస్ కమిషనర్ హత్య కేసుని పరిశోధించడానికి ఆంధ్ర పోలీసు అధికారి నరసింహ (సూర్య) నియమితుడవుతాడు. ఆ పరిశోధనలో భాగంగా కమిషనర్‌ని హత్య చేసిన మధుసూదన్‌రెడ్డి (శరత్ సక్సేనా)ని పట్టుకునే క్రమంలో అతని ద్వారా మరిన్ని ప్రమాదకర నేరాలకు బాటలు వేసే కార్యక్రమాల్ని ఆస్ట్రేలియా నుంచి చేయిస్తున్న విఠల్ ప్రసాద్ (అనూప్‌సింగ్ ఠాకూర్) వైనం తెలుస్తుంది. ఇక పరిశోధన అటువైపు మళ్లి అతన్ని అంతం చేయడంతో ఎస్-3 మిషన్ ముగుస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియకుండా కధనీ, సీన్స్‌ని నడపడంలో దర్శకుడు హరి సగమే కృతకృత్యుడయ్యాడు. కమిషనర్ హత్య ఛేదనవరకూ పట్టుగా సాగిన కథ, విఠల్ ప్రసాద్‌ని పట్టుకునే క్రమంలో అంతర్జాతీయ వేదిక ఎక్కినా, అక్కడా పోలీసు ప్రవర్తన దేశీయ విధానానే్న అవలంభించడంలాంటి సన్నివేశాలు కృతకం అనిపించాయి. ఎంత అనుమతులు తీసుకున్నా -దేశంకాని దేశంలో పోలీసు అధికారి పరిమితుల్లేని పరిశోధనా ప్రవర్తన అతి అనిపించింది. అలాగే పరిశోధనకు ఆటంకం ఏర్పడుతుందని భార్య కావ్య (అనుష్క)తో డైవోర్స్ అని చెప్పడం, అయినా ఆమెకు దూరం కాలేక హోటల్‌లో కలవడం, మరోవైపు ఇనె్వస్టిగేటివ్ జర్నలిస్టు విద్య (శృతిహాసన్) నరసింహతో ప్రేమాయణం చిత్రానికి పెద్ద స్పీడ్ బ్రేకర్లయ్యాయి. కామెడీ ట్రాక్ మిస్సవుతుందనే నెపంతో చొప్పించిన హాస్యం కూడా అంతగా పండలేదు. సరికదా కొన్నిచోట్ల అసభ్యంగానూ అనిపించాయి.
ఓ తండ్రి, కొడుకును పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి ‘చూడండి వీడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో’ అని చెప్పి వాటిని అనిపించడం, అలాగే పరిశోధనలో భాగంగా పబ్‌కు వచ్చిన డిసిపి, హోదాను మరచి నర్తకితో నృత్యం (సోనీ సోనీ పాట) చేయడంలాంటి సన్నివేశాలు ఎంత సినిమాటిక్ సీన్లు అనుకున్నా, కథకు పూర్తిగా అడ్డంపడ్డాయి. ప్రస్తావించుకుంటే -చిత్రంలో అనేకానేక అసంగతాలు కనిపిస్తాయి.
సూర్య ప్రదర్శించిన హీరోయిజం పెర్‌ఫార్మెన్స్ ముందు -ఈ అసంగతాలు పెద్దగా అనిపించవు. వయసుమీద పడిన ఛాయలు సూర్యలో కనిపిస్తున్నా, ఆ విషయాన్ని మరిపించే రీతిలో యక్షన్ ఎడిసోడ్స్‌ను రక్తికట్టించటం ప్లస్ పాయింట్. విఠల్ ప్రసాద్‌గా అనూప్‌సింగ్ ఠాకూర్ అభినయం సంగతి అటుంచి ఆకర్షణీయమైన బాడీతో ఆకట్టుకున్నాడు. శృతిహాసన్ మంచి ఈజ్‌తో నటించినా సన్నివేశాల కల్పన సరిగ్గా లేకపోవడంతో రాణించలేదు. రాధిక, సుమన్, నాజర్ తదితరుల పాత్రల పరిధి చాలా తక్కువ. మనందరికీ అలవాటైన నటుడు శరత్‌బాబుకి ఇందులో సరైన అనువాద గళం ఇవ్వకపోవడంతో అసౌకర్య భావన కలుగుతుంది. హారిస్ జైరాజ్ స్వరాల్లో అనుష్క- సూర్యలపై చిత్రీకరించిన ‘ముసిముసి నవ్వుల ప్రేమా’ బావుంది. ‘నేను ఎవిడన్స్‌కన్నా, ఎమోషన్స్‌నే ఎక్కువ నమ్ముతా’నన్న ఈ చిత్రంలోని డైలాగ్ సూత్రం ప్రస్తుతం తమిళనాట ఏర్పడిన ప్రతిష్ఠంభనను తలపిస్తోంది. ‘పవర్‌ఫుల్ మనిషినైన నన్ను పవర్‌లేని రూమ్‌లో ఉంచావ్’ అన్న పంచ్ డైలాగూ బాగా పండింది. ఆఖర్లో చెప్పుకుంటున్నా ముందే చెప్పుకోవాల్సిన అంశం- ఈ చిత్రం స్టంట్ మాస్టర్ (కణల్ కణ్ణన్) ప్రతిభ. అలాగే ఏ ఫోన్ కాల్ ఎటు ఎప్పుడెళ్లిందో, ఎలా వస్తోందో, వచ్చిందో అన్నది కంప్యూటర్ సాయంతో చిటికెలమీద ఏ భావాన్నీ వ్యక్తం చేయకుండా ఏ స్థితిలో ఉన్నా చెప్పేసిన మురళి (నితిన్ సత్య) నటన. ఈ అంశాన్ని దర్శకుడు సమర్థవంతంగా వినియోగించుకున్నాడు. దర్శకుడుకు హరికి అలవాటైన సూపర్ స్పీడ్ స్టయిల్‌నే ఎస్-3లోనూ ప్రయోగించి -ప్రేక్షకులను థియేటర్లో కూర్చోబెట్టగలిగాడు.

-అనే్వషి