రివ్యూ

కుక్కల కిడ్నాప్ గోల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* కిట్టు ఉన్నాడు జాగ్రత్త
*

తారాగణం: రాజ్‌తరుణ్, అను ఇమ్మాన్యుయేల్, అర్బాజ్‌ఖాన్, రఘుబాబు, రాజారవీంద్ర, హంసానందిని, వెనె్నల కిషోర్, ఫృథ్వీ, స్నిగ్ధ, ప్రవీణ్, సుదర్శన్, ‘బాహుబలి’ ప్రభాకర్, నాగబాబు, ప్రియ, సమీర్.
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ ఎన్
*
‘కాదేదీ కవితకనర్హం’...అన్నారు వెనుకటికో మహాకవి. దానే్న సినిమా రంగానికీ అన్వయించి ‘కాదేదీ కథలకనర్హం’ అంటూ దర్శకుడు వంశీకృష్ణ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’తో గుర్తు చేశాడు. ‘కిడ్నాప్’ అనగానే మనకు మనుషులు గుర్తుకొస్తారు. సంపన్నుల శునకాలని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించవచ్చన్న ఉద్దేశ్యాన్ని హీరోకి ఆపాదించి కథ నడిపారు. వైవిధ్యమైన పాయింట్‌తో కొంత విజయం సాధించినా, దాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నంలో లాజిక్‌ని వదిలేయడం వల్ల విసుగుపుట్టింది.
మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన కృష్ణమూర్తి ముద్దు పేరు కిట్టు (రాజ్‌తరుణ్). స్నేహితులతో కలిసి కార్ కేర్ పేరిట మెకానిక్ షెడ్డు పెడతాడు. తనవల్ల డబ్బు పోగొట్టుకున్న ప్రేమికురాలు జానకి (అను ఇమ్మాన్యుయల్)కి తిరిగి ఆ సొమ్ము చేకూర్చే విధంలో జగ్గు (బాహుబలి ప్రభాకర్) వద్ద అప్పుచేస్తాడు. అప్పు, వడ్డీ తీర్చడానికి ఈజీ క్యాష్ ప్రాసెస్‌లో ధనవంతుల కుక్కల్ని కిడ్నాప్ చేసి సొమ్ము డిమాండ్ చేస్తూంటాడు. కిట్టు కిడ్నాప్‌ల వ్యవహారం తెలుసుకున్న జానకి, అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది. పరిస్థితిని అర్థం చేసుకుని తిరిగి దగ్గరవుదామనుకున్న టైంలో జానకి, ఆమె కుక్క కిడ్నాప్‌నకు గురవుతారు. చివరకు జానకి కిట్టులు ఎలా ఒకటయ్యారన్నది మిగతా కథ.
కుక్కల కిడ్నాప్ అన్న మాటే కాస్త వేళాకోళంగా అనిపించినట్టే, సినిమాలో సన్నివేశాలన్నీ అదేస్థాయిలో ఉండాలన్న కాన్సప్ట్.. చివరకు చిత్రాన్ని ‘ఓవర్ కామెడీ’ చేసేసింది. అదెంత వరకూ వెళ్లిందంటే, ఆ ప్రక్రియకు ఎక్కడ ఫుల్‌స్టాప్ పెట్టాలో దర్శకుడికి అర్థంకానంత వరకూ. అందుకు చిన్న ఉదాహరణగా ద్వితీయార్థం నడిచిన తీరునే ప్రస్తావించాలి. ఎంతో పటిష్టమైన రక్షణ వలయంలో ఉంచే ఇన్‌కంటాక్స్ రికవరీ సేఫ్‌లో ఉంచే కార్యాలయంలోకి -బహిరంగ బంగ్లాలోకి వెళ్లినంత ఈజీగా వెళ్లడం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాలో జరిగినట్టు బయట జరగదు. అలాగే ఎంతో పేరుమోసిన ఆదాయపు పన్ను అధికారిగా ఆదిత్య నారాయణ (నాగబాబు) పాత్రను మలిచారు. కానీ అంతటి తెలివైన వ్యక్తే కేవలం కిడ్నాపర్స్ నుంచి ఫోను రాగానే, సామాన్యుడిలా డబ్బు తీసుకుని పరిగెత్తడం అసంబద్ధ సన్నివేశం. ప్రియురాలు అసహ్యించుకున్న తరువాత కూడా కుక్కల కిడ్నాప్ పంథానుంచి హీరో బయటకు రాకపోవడం -పాత్ర వ్యక్తిత్వాన్ని దిగజార్చడమే!
కథానాయిక -హీరో వ్యక్తిత్వాన్ని అభివర్ణిస్తూ ‘ఆక్సిజన్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు. ఎడ్యుకేషన్ లేకపోతే మనిషి ఫ్యూచరే చచ్చిపోతుంది’ అన్న భావన కలవాడని చెపుతుంది. కానీ ఆ స్థాయికి తగినట్టు సినిమాలో ఏ సీనూ కనిపించదు. కిట్టు పాత్రకు కావాల్సిన ఈజ్‌నీ, హీరోయిన్‌తో కెమిస్ట్రీని రాజ్‌తరుణ్ సమర్ధవంతంనే నిర్వహించాడు. జానకిగా అను పాత్రకిచ్చిన పరిధిలో బాగానే నటించింది. ఆమె స్నేహితురాలిగా స్నిగ్ధ ఉన్నది రెండుమూడు సీన్లయినా ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఇక అన్ని పాత్రల్నీ డామినేట్ చేసి పాత్ర రేచీ (పృథ్వీ)ది. ఆ రోల్‌తో చెడుగుడాడేశాడు. కథానాయకుడి ఫ్రెండ్స్‌గా ప్రవీణ్, సుదర్శన్‌లు చక్కటి కామెడీ టైమింగ్‌తో అలరించారు. నిమేషీ బాబా(రఘుబాబు) సినిమాను బేస్ చేసుకుని వేసిన జోకులు పేలాయి. చివర్లో ప్రతి నాయకుడి (అర్బాజ్‌ఖాన్)ని మానసిక చికిత్సాలయంలో చేర్చడం వ్యవస్థను అపహాస్యం చేసినట్టు అనిపిస్తుంది. సంభాషణల్లో సాయిమాధవ్ బుర్రా తన మార్కు చమక్కులు (‘సేఫ్ నెత్తుకుపోయిన వాడంటే సల్మాన్‌ఖాన్‌లా సిక్స్‌ప్యాక్‌తో ఉంటాడనుకున్నా. వీడేంటి సిమ్‌కార్డ్‌లా చిన్నగా ఉన్నాడు’, ‘మొహాలున్నవి చూసుకోడానికేగా...’) కనిపించాయి. అనూప్ రూబెన్స్ గీతాల్లో ఏదీ చెప్పుకోతగ్గదిగా లేదు. హంసానందినిపై చిత్రీకరించిన ఐటెమ్‌సాంగ్ ‘నేనే సింగపూర్ సిరిమల్లె’ ప్రారంభంలో బహుళ ప్రాచుర్యం పొందిన ‘సారొత్తారు రొస్తారు’ పాట మ్యూజిక్‌ని వాడుకోవాల్సిన అవసరం ఎందుకో అర్ధంకాదు. సినిమా బాగుండాలంటే కావాల్సింది బడ్జెట్ కాదు, సబ్జెక్ట్. ఇదీ సినిమాలో నిమేషీబాబా ద్వారా అనిపించిన డైలాగ్. ఈ చిత్రానికి అక్షరాలా వర్తించే డైలాగ్ కూడా.

-అనే్వషి