రివ్యూ

అతను.. ఆమె.. ఓ ఆత్మ..... ** శివలింగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం: రాఘవ లారెన్స్, రితికాసింగ్, శక్తివేల్ వాసు, ఊర్వశి, భానుప్రియ, జయప్రకాష్, వడివేలు, ప్రదీప్ రావత్, రాధారవి.
సంగీతం: ఎస్.ఎస్.తమన్
నిర్మాత: రమేష్ పి.పిళ్లై
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.వాసు

గత మూడు నాల్గేళ్ళుగా అందరి నోళ్ళల్లో నానుతున్న భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి. బాహుబలి-2కు సైతం ఇక మూడో పార్టు ఉండదని ఆ చిత్ర దర్శకుడు తేల్చేసినా, ఇటీవలకాలంలో తెలుగు చిత్రసీమ కథా కేంద్రంగా మారిన ఆత్మల పరంపరకు మాత్రం అంతం తెలియడంలేదు. వారానికి విడుదలయ్యే రెండు మూడు చిత్రాల్లో కనీసం ఒక చిత్రమైనా ఆత్మల ఘోషలో దద్దరిల్లుతుండడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆ కొసాగింపు ప్రక్రియలో మరో భాగం ఈ వారం వచ్చిన అనువాద ఆత్మ సమ్మిళితం ‘శివలింగ’ (ఈ చిత్రం ఇదే పేరుతో 2016 ఫిబ్రవరి 12న కన్నడంలో విడుదలైంది. అదే ఇప్పుడు తమిళంలో రీమేక్ అయి తెలుగులోనూ అనువదితమైంది). అయితే అవడానికి ఇది రొటీన్ ఘోస్ట్ స్టోరీ అయినా ఈ జోనర్‌లో దాదాపు మాస్టరీ చేసిన రాఘవ లారెన్స్ (కాంచన, సీక్వెల్స్ ముని, గంగ చిత్రాల ద్వారా) చంద్రముఖి ఫేం పి.వాసు దర్శక మాయాజాలం, అన్నిటికీ మించి నటిగా ఎన్నో చిత్రాల అనుభవం లేకపోయినా దాదాపు కథాపరంగా ఏర్పర్చిన ‘ఆత్మ’ ఆవాహనా ఘట్టాల్ని పరిగణించతగ్గ విధంగా నటించిన రితికాసింగ్ నటన శివలింగను చూసేలా చేసింది. వివరాల్లోకెళితే సిబిసిఐడి ఆఫీసర్ శివలింగేశ్వరరావు (రాఘవ లారెన్స్)కు అంతకుముందు ఆత్మహత్యగా తేల్చేసిన ఓ వంటవాడు రహీమ్ (శక్తివేల్ వాసు) కేసును తిరిగి తెరిచి ఇస్తారు. ఆ మర్డర్ మిస్టరీని శివలింగ ఎలా పరిష్కరించాడు? హంతకులెవరు అన్నది చిత్ర ప్రధాన కథావస్తువు. అయితే ఇక్కడ మర్టర్ ఎవరు చేశారన్నది తేల్చే విధానంకన్నా, అలా హత్యకు గురైన రహీం ఆత్మ శివలింగ భార్య సత్యభామ (రితికాసింగ్)లో ప్రవేశించి చేసిన హంగామాయే సినిమాలో సింహభాగమై కూర్చుంది. ఇలాంటి ఆత్మల గోలలో లాజిక్ విషయంలో ప్రేక్షకులంతా ధృతరాష్ట్రులైపోతేనే కథను ఆస్వాదించగలరు. శివలింగ అందుకు మినహాయింపు కాదు. కాకపోతే స్వయంగా తాను విశిష్ట పోలీసు అధికారి అయివుండీ రహీం ఆత్మను తనలో ప్రవేశించమని అడగడం లాజిక్‌లెస్‌నెస్ విధానానికి పరాకాష్ట. దీన్ని పక్కకు పెట్టి చూపినా జరిగిన ఉదంతం (రహీం మరణం) ఆత్మహత్యగా ఎకాఎకి తేల్చేసినా తిరిగి కేసును తెరిచినప్పుడైనా దాన్ని హత్యగా చెప్పడానికి కనబడే సాక్ష్యాలు (పావురం రెక్క-రక్తంతో ఉన్నది) చాలు. అసలు దాన్ని తన పరిశోధన ఆరంభంలోనే శివలింగ తెలుసుకున్నట్లు చూపారు. అయినా దాన్ని పతాక సన్నివేశం వరకూ లాగడం కేవలం సినిమా ప్రొసీడీసింగ్స్ జరగడానికేనని అనిపించింది. నటనా విశే్లషణ విషయానికొస్తే నిశ్చయంగా అగ్రతాంబూలం సత్యభామ పాత్రధారిణి రితికాసింగ్‌దే. స్ర్తి సహజ విరుద్ధమైన ఆత్మ ఆవిష్కృత సన్నివేశాన్ని లోపరహితంగా తనలో చూపింది. ముఖ్యంగా నమాజు సమయానికి ఓ పక్కకు వెళ్లి, ఆ నమాజు (ముస్లిం సోదరులు చేసే ప్రార్థన) చేసిన విధానం సింప్లీ సూపర్బ్. ఓ రకంగా నాయక పాత్రధారి లారెన్స్‌ను నటనాపరంగా రితిక అధిగమించేసింది. ఈ పరిస్థితిని ఒకింత బ్యాలెన్స్ చేయడానికే, కథాపరంగా అంతగా సముచితం కాకపోయినా రహీం ఆత్మను తనపై ఆవహింపచేసుకునే ఘట్టాలు పెట్టుకున్నాడు లారెన్స్. వయసు పెరుగుతున్నా లారెన్స్ తన ముపటి నృత్య వైభవాన్ని ఇంకా ప్రదర్శించి హర్షింపజేయడం మరో విశేషం. ముఖ్యంగా చిత్ర ప్రారంభంలో వచ్చిన ‘చిన్న కబాలి’ పాటలో అది కనిపిస్తుంది. అలాగే రహీం పాత్రధారి శక్తివేల్ వాసు (దర్శకుడు పి.వాసు కుమారుడు) నటననీ పక్కకు పెట్టలేం. తననెందుకు ఎవరు చంపారో తెలుసుకోడానికి ఆ పాత్ర పడిన ఆవేదనను బాగా పలికించాడు. ప్రత్యేకించి ‘జూలా జూలా జూలా’ అంటూ మూడు రకాల మాడ్యులేషన్స్‌లో ఇచ్చిన ఊత పదాలు పలికేటప్పుడు చక్కటి వేరియేషన్‌తో కూడిన నటనని కనపర్చాడు. పుల్కా (వడివేలు) పాత్ర కొన్నిచోట్లే అలరించింది. ఈ పాత్రకు బ్రహ్మానందం గాత్రధారణ అందించాడు. శివలింగ తల్లిపాత్రలో ఊర్వశి నటించారు. ఆ పాత్రకిచ్చిన టివి వంటల తయారీ లక్షణం అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఊర్వశి- వడివేలు ఉన్న ఓ సన్నివేశం (దొంగతనం విషయం కథగా చెప్తూ నిజంగా దోచుకోవడం) అలరించింది. ‘దారపుపోగును చూసి అది ఏ బట్టదో చెప్పేయగల దిట్ట అతను’ అన్న సంభాషణలు ఓకె. కానీ వాటే కోఇన్సిడెన్స్ అన్న పదానికి తెలుగులో వెటకారంగా వాచీ కొయ్యబారిపోయిందా అన్న పదప్రయోగం ఏ విధంగానూ మ్యాచ్ కాలేదు. తమన్ స్వరాలు ఎప్పటిలాగే బీట్ ఓరియెంటెడ్‌గానే నడిచాయి. ధీమ్‌సాంగ్ ‘శివలింగా’ సాహిత్యపరంగా (సామాన్యునివలె ఆహార్యం, అసామాన్యమే నీ ధైర్యం, ఆపద చూడని అడుగువలె, అలికిడి తెలియని పిడుగువలె విజయము తథ్యమే నికరంగా వెలుగుల విభూతి దాల్చగా అన్న చోట్ల) ఆకట్టుకుంది. సాంకేతిక బలంగా సర్వేష్ మురారి ఛాయాగ్రహణ వైభవాన్ని తప్పక పేర్కొనాలి. చిత్ర నిడివి రెండు గంటల ముప్ఫై ఆరు నిమిషాలలో కొసరు నిమిషాల్ని కత్తిరించకపోవడం సినిమాకు నష్టమేగాని, లాభంకాలేదు.

-అనే్వషి