రివ్యూ

తీరూ తెన్నూలేని ‘లంకా’కాండ... ( * లంక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం: రాశి, సాయిరోనక్, ఇనాషా, సత్య, సుదర్శన్, సత్యం రాజేష్, నల్లవేణు, సుప్రీత్, గిరిబాబు, లీనా సిద్ధు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నిర్మాతలు: నామన దినేష్,
నామన విష్ణుకుమార్
కథ, మాటలు,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీముని

‘‘నువ్వు చెప్పే విషయానికి అవతలివాడు కన్విన్స్ కాకపోతే కన్‌ఫ్యూజ్ చేసేయ్’’ అన్న వాక్యం లోకంలో ప్రచారంలో వుంది. సరిగ్గా ఈ పంథాని ఈ చిత్ర దర్శకుడు (శ్రీముని) అవలంభించినట్లు అనిపించింది. అసలు ఈ చిత్ర కథ ఏమిటి? అని దర్శకుడ్ని (ఈ చిత్ర దర్శకుడే కథాకర్త కూడా) అడిగినా తడబడకుండా ఒకేసారి చెప్పడం కష్టం. అంత సంక్లిష్టంగా ‘లంక’ కథావస్తువుని ఏర్పరిచారు. అర్ధమైనంతమటుకు ‘లంక’ కథావస్తువులోకి వెళితే.. జాతీయ అవార్డు గ్రహీత అయిన స్వాతి (ఇనాషా, మలయాళనటి) లఘు చిత్ర దర్శకుని ఒత్తిడిమేరకు వారు తీసే చిత్రంలో నటించడానికి సమ్మతిస్తుంది. చిత్ర షూటింగ్ నిమిత్తం ఆ యూనిట్ నగర శివార్లలోని ఓ పాడుబడిన బంగ్లాని ఎన్నుకుంటారు. ఆ బంగ్లాలో ఉన్న రెబేకా విలియమ్స్ (రాశి), మోనోఫోబియా (విపరీతమైన ఒంటరితనాన్ని అనుభవిచే మనస్తత్వం)తో బాధపడుతున్న చిత్ర నాయిక స్వాతికి తనకున్న టెలీపతి (మాటలు, సంకేతాలు అనేవి ఏవీ లేకుండా ఒకరి మైండ్ నుంచి ఇంకొకరి మైండ్‌తో సమాచారం తెలిపే జ్ఞానం) ద్వారా దగ్గరవుతుంది. షూటింగ్ పూర్తయిన మర్నాడే స్వాతి అదృశ్యమవుతుంది. మరి ఇలా స్వాతి ఉన్నట్లుండి అదృశ్యమవడానికి కారణం ఏమిటి? అసలు రెబేకా ఎవరు? ఎందుకు ఇవన్నీ జరిగాయి అన్నదానికి సమాధానాల సరళి మిగతా భాగంలో దొరకాలి. కాని సినిమా పూర్తయినా వాటికి సంతృప్తికరంగా జవాబు దొరకలేదు. దొరికినవి అరకొరగా ఉన్నాయి. మొత్తానికి కన్‌ఫ్యూజన్‌తోనే ‘లంకా’కాండ పూర్తయింది. అసలు సినిమాకు లంక అని ఎందుకు పేరుపెట్టారో కూడా అంతగా అవగతం కాదు. బహుశా చిత్రంలో ప్రతినాయకుడు శరత్ తను అమ్మాయిలను దాచిన ప్రదేశం సముద్రాల అవతల గుహలో వుండడం చేత సినిమాకు ఆ పేరు పెట్టారేమోనన్న భావన ప్రేక్షకుడికి కలిగింది. ఇలా అన్నిటికీ మనకి మనం అనుకోవడం వంటి లక్షణాలతోనే ‘లంక’ ప్రయాణం సాగింది. వౌలికంగా టెలీపతి లక్షణం ఒకరి మైండ్ మరొకరు చదవగలడం, వగైరా. అంతేకాని ఒకరిని అధీనపర్చుకోవడం కాదు. ‘స్వాతి శ్వాస నా భిక్ష..’ అంటూ సంభాషణలు చేయడం అసందర్భం (సంభాషణా నేత దర్శకుడే). అంతకన్నా వేధించే ప్రశ్న మరొకటుంది. ప్రతినాయకుడు శరత్ ప్రధాన వ్యాపకం అమ్మాయిల్ని అక్రమ రవాణా చేయడం అని చెప్పారు. మరి ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారే ఆ సంగతి చూసుకుంటారు కదా. ఎందుకంటే అలా అమ్మాయిల్ని అక్రమ రవాణా చేయడం తీవ్ర నేరం క్రిందకు వస్తుంది. దాని నివారణకు పోలీసు యంత్రాంగం సత్వరం స్పందిస్తుంది కూడా. అలా చేయకుండా శరత్ బయటకు రాడానికి కథమీద కథ, ఉపకథ అల్లి చెప్పాం అని అటు లఘు చిత్ర దర్శకుడు సాయి (సాయిరోనక్) ఇటు రెబేకా చెప్పడం చాలా హాస్యాస్పదం. రెబేకాతో చిత్రకారుడికి సంబంధం, పిల్లలూ తదితరాలకి స్పష్టతలేదు. వీడియోలో చూసినదానికీ, తర్వాత రెబేకా ముఖతా చెప్పించినదానికీ భేదం స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇదీ పోలీసుల్ని కన్‌ఫ్యూజ్ చెయ్యడానికి చెప్పారా అన్నదానిపైనా క్లారిటీ లేదు. ఇలా ‘లంక’ మొత్తం కన్‌ఫ్యూజన్‌తో ఆరంభమై గందరగోళంగా సాగి చివరకు కంగాళీతనంతోనే ఖతమెంది. గతంలో కొన్ని ‘వాశి’గల చిత్రాల్లో నటించిన ‘రాశి’ ఈ చిత్రంతో రెబేకా పాత్ర ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. తన పరిధివరకూ బాగానే భావాలు ప్రకటించినా, కథలో వున్న కొరుకుడుపడని లక్షణం ద్వారా అవి రాణింపుకు నోచుకోలేదు. షార్ట్ఫిలిం డైరెక్టరుగా సాయిరోనక్ ఫర్వాలేదు. మోనోఫోబియా బాధితురాలు స్వాతి పాత్రలో ఇనాషాకు నటించడానికి పెద్ద స్కోప్ లేదు. ఉన్నంతసేపు షార్ట్ఫిలిమ్ హీరోగా సత్య, కెమెరామెన్‌గా సుదర్శన్ బాగా నటించారు. ఈ పాత్రకు రాసిన సంభాషణ (ఎదవ మొహాన్ని అందంగా చూపడమే మా పని...) బాగా పేలింది. పోలీసాఫీసరు పాత్రలో గిరిబాబును చూస్తే జాలేసింది. అంత తక్కువ నిడివి, గుర్తింపునకు వీల్లేనిది అది. కేసుని పరిశోధించే ప్రధాన పోలీసధికారి పాత్రధారి రూపానికి ఓకె అయినా వారి సంభాషణా ఉచ్ఛారణాశైలి సరిగాలేదు. ‘మనిషన్నవాడెవడైనా ఉంటాడా’ అన్న ప్రశ్నకు సమాధానంగా ‘అందుకే నిన్ను తీసుకొచ్చాం’ అన్న కౌంటర్ బాగుంది. అయితే ‘దగ్గరకొచ్చింది వద్దంటే, కావలసినప్పుడు తలదించుకు తీసుకోవాలి’ అన్న డైలాగ్‌కి అన్వయం కుదరలేదు. ‘సమస్యల్లో ఉన్నావ్ కనుక నీకన్నీ సమస్యల్లాగానే కన్పడతాయి’ అన్నది బాగుంది. ‘సమాధానం ప్రశ్నకు శాటిస్‌ఫ్యాక్షన్ మాత్రమే’ అన్న ఈ చిత్ర సంభాషణ దురదృష్టవశాత్తూ చిత్ర పోకడ విషయంలో సరికాలేదు. ఎందుకంటే, సినిమాలో లేవనె్తన ఏ ప్రశ్నకీ సంతృప్తికర సమాధానం దొరకదు. సినిమాలో ఒక్కటే పాట. అయితే నేపథ్య సంగీతం అందివ్వడంలో మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల చక్కటి కృషి చేశారు. సాగిపోతున్న దెయ్యాల జోనర్ చిత్రాలనుంచి సైంటిఫిక్ థ్రిల్లర్ చట్రంలోకి ‘లంక’ని ప్రవేశపెట్టడం వైవిధ్యమనిపించినా ఏ క్లిష్టతా లేకుండా సరళంగా అర్థమయ్యేలా ‘లంక’ దారిని శ్రీముని మలచివుంటే బావుండేది.

-అనే్వషి (anveshi)