రివ్యూ

మధ్యలోనే చుట్టేశారు!...... (* ఇద్దరి మధ్య 18)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం: రామ్ కార్తీక్, భానుశ్రీ, దువ్వాసి మోహన్, రచ్చ రవి, అప్పారావు, గీతాసింగ్, రాఘవ సంగీతం: ఘంటాడి కృష్ణ
సినిమాటోగ్రఫీ: కె.ఎం.క్రిష్
నిర్మాత: శివరాజ్ పాటిల్
దర్శకత్వం: నాని ఆచార్య

సినీ కథకి సంబంధించినంత వరకూ -కాసిన్ని కన్నీళ్లు.. బోలెడన్ని నవ్వులు - రొమాంటిక్ మూడ్స్.. అట్లాగే ఓ నాలుగు ఫైట్లు - వీలైతే నాలుగు మాటలూ.. ఇంతే కదా సినీలైఫ్. అవన్నీ కూడా ఒక నాలుగు పాళ్లు మోతాదు మించాయనుకుందాం. తెగ ఏడిపించేసి.. నవ్వించామనుకొని తమకి తామే గిలిగింతలు పెట్టేసుకొని.. ఏ మాత్రం లవ్ ఫీలింగ్ లేకుండా నానా బీభత్సం చేసేసి.. మధ్యమధ్యలో ఒక సామాజికాంశాన్ని నెత్తికెత్తుకొని.. రీళ్లు చుట్టేస్తే.. ఇదీ ఓ సినిమా అయిపోతుంది. అదే మిషన్ 18.
మహి (రామ్ కార్తీక్) - కాలేజీలో రాక్‌స్టార్. కంప్యూటర్ జీనియస్. ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిన మహికి అరకులో జరిగిన ఇండస్ట్రియల్ టూర్‌లో హిమ (్భను త్రిపాఠి) పరిచయమవుతుంది. ఇద్దరూ ఒకే ప్రాజెక్ట్ ‘మిషన్ 18’ని ప్రెజెంట్ చేసేందుకు సిద్ధమవటంతో వారి కలయిక ప్రేమకి దారితీస్తుంది. క్లాస్‌మేట్ టోనీ, అతని బృందం అసాంఘిక కార్యకలాపాలను చేస్తూండటంతో మహి వాటిని అడ్డుకొని, వారితో వైరం తెచ్చుకుంటాడు. న్యూఢిల్లీలో ‘మిషన్ 18’ ప్రాజెక్ట్‌ని ప్రెజెంట్ చేసేందుకు అవరోధం ఏర్పడుతుంది. చివరికి - జాతీయ భద్రతా అంశంతో ముడిపడిన ఆ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయిందా? వైరి వర్గం వేసిన ఎత్తులకు మహి తీసుకున్న స్టెప్ ఏమిటి? మహి, హిమల ప్రేమ ప్రాజెక్ట్‌కి ‘శుభం’ కార్డు పడిందా? ఇత్యాది అంశాలతో క్లైమాక్స్‌కి చేరుకుంటుంది కథ.
లవ్‌స్టోరీలో సామాజికాంశాన్ని కలపటం వరకూ ఫర్వాలేదు. కాలేజీ నేపథ్యం అనటంతోనే.. రొటీన్‌గా ఉండే కామెడీ సీన్లు.. ఒక అమ్మాయి అబ్బాయి పరిచయం కావటానికి తీసుకునే మూలకాంశం విషయంలో మరికాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుణ్ణు. లవ్ సన్నివేశాలేవీ ఫీలింగ్‌ని కలిగించలేక పోవటానికి ఇదే మొదటి కారణం. ‘బ్యాగ్స్’ మారిపోవటం.. ఆ సంగతి తెలిసి కూడా పట్టించుకోని హీరోగార్ని కథాపరంగా వదిలేద్దాం. కానీ - లాజిక్‌తో సంబంధం లేని సన్నివేశాలు వచ్చి వెళ్లిపోతూంటాయి అర్థంపర్థంలేని కామెడీ సీన్లకు మల్లే. టైటిల్‌ని చూస్తే.. ‘18’ ఏళ్ల వయసులో ‘ప్రేమ’ చెవుల్లో రొద పెడుతోంటే.. అమ్మాయి అబ్బాయి ఏం చేసి ఉంటారా? అన్న సందేహం కలుగుతుంది. కానీ - వారిద్దరి మధ్య ‘మిషన్ 18’ రావటంతో సగం నీరసం వస్తుంది. పోనీ అదైనా సజావుగా సాగిందా అంటే అదీ లేదు. రెండు దశాబ్దాల క్రితం నాటి కథా ఇది అన్న అనుమానం బుర్రని తొలిచేస్తుంటుంది. రొటీన్‌గా సాగిపోయే సన్నివేశాల మధ్య.. సన్నివేశాలు రిపీట్ అవుతూ సహనాన్ని పరీక్షిస్తుంటాయి. ‘ఇద్దరి మధ్య’లో బిత్తిరి సత్తి ఏ రాద్ధాంతం చేస్తాడా? అని ఎదురుచూస్తే అక్కడా నిరాశే ఎదురయింది. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతూంటాయి. ప్రేక్షకులు సర్దుకుపోవాలి. అంతే! ‘జబర్దస్త్’ బృందంలోని కొంతమంది క్రేజ్‌ని తెగ వాడేసుకోవాలని తాపత్రయపడి ‘లేని కామెడీ’ని సృష్టిస్తే ఫలితం శూన్యం.
నటనాపరంగా - రామ్ కార్తీక్ ఫర్వాలేదనిపించాడు. ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనిపిస్తుంది. భాను త్రిపాఠికి చిన్న ఫ్లాష్‌బ్యాక్ ఉంది. ‘బాహుబలి’ చిత్రంలో తమన్నా స్నేహితురాలిగా కనిపించి మెరిసింది. ఆ ‘మెరుపు’ని ‘ఇద్దరి మధ్య’ మెరిపిద్దామని అనుకుంటే.. అక్కడక్కడ మాత్రమే తళుక్కుమంది. గ్లామర్‌గా ఉంది.
మాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ముంచెత్తారు. ఐతే- అర్థం చేసుకోటానికి కొద్దిగా టైం పడుతుంది. ‘జీవితం అనేది ఈక్వేషన్ కాదు.. అదో ఎమోషన్. ఈక్వేషన్ అనేది ఎమోషన్ బాలెన్స్ మీద ఆధారపడుతుంది.’ దీని అర్థం చెప్పటం కొద్దిగా కష్టమే. అలాంటిదే మరో డైలాగ్. ‘ఏడుపు వస్తే 1 శాతం మాత్రమే కన్నీళ్లు వస్తాయి. మిగతా 99 శాతం ఫీలింగ్స్’ - అంటాడు. వీటిని అర్థం చేసుకోవాలంటే మళ్లీ సినిమా చూడాలి.
దర్శకుడు నాని ఆచార్య కథని సజావుగా నడిపించటానికి తాపత్రయ పడ్డాడు. కానీ- అతడేదో ఫీలింగ్‌లో ఉన్నాననుకొన్నాడు. ఆ ఫీలింగ్‌ని ప్రేక్షకుల్లో కలిగించటంలో మాత్రం తప్పటడుగు వేశాడు. సంగీతం ఫర్వాలేదు. అరకు అందాలను కెమెరాలో చక్కగా బంధించారు. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్.

-బిఎనే్కె