రివ్యూ

బో‘రింగు’ల రాంబాబు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు * ఉంగరాల రాంబాబు
*
తారాగణం:
సునీల్, మియాజార్జ్
పోసాని కృష్ణమురళి
ప్రకాష్‌రాజ్, వెనె్నల కిషోర్
ఆశిష్ విద్యార్థి, రాజీవ్ కనకాల
ఫొటోగ్రఫీ: సర్వేష్ మురారి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
మాటలు: చంద్రమోహన్‌రావు
నిర్మాత: పరుచూరి కిరీటి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
క్రాంతి మాధవ్
*
అందాల రాముడు, మర్యాద రామన్న, పూలరంగడు..ఇవి సునీల్ కమెడియన్ నుంచి హీరోగా మారిన తర్వాత అతడి కెరీర్‌లో చెప్పుకోతగ్గ విజయాలు. ఓనమాలు వంటి చక్కటి సందేశాత్మక చిత్రాన్ని అందించిన క్రాంతి మాధవ్ ఆ తర్వాత ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ వంటి హృదయాన్ని కదిలించే ప్రేమకథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. వీరిద్దిరి కాంబినేషన్‌లో సినిమా అంటే తప్పకుండా వినోదాత్మకంగా అలరిస్తుందనే అనుకుంటారు. అయితే, అలా ఆలోచించి థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడిని పూర్తిగా నిరాశపరిచాడు రాంబాబు. హాస్యనటుడిగా మంచి పేరున్న సునీల్ చాలా కాలంగా హీరోగా విజయం సాధించాలని తహతహలాడుతున్నాడు. అలా హీరోగా అడుగుపెట్టాక వచ్చిన ఫామ్‌ను ఏ మాత్రం కొనసాగించలేక పోయాడు. వరుస అపజయాలతో కెరీర్‌ని సందిగ్థంలో పడేసుకున్నాడు. ఎంతో ఆశగా మరోసారి ఈ ‘ఉంగరాల రాంబాబు’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సునీల్ కామెడీని విడిచిపెట్టి కమర్షియల్ చిత్రాలు చేస్తున్నాడనే విమర్శలు రావడం.. అతడు చేసిన ఇటీవలీ చిత్రాలన్నీ పరాజయాల పాలు కావడంతో తన చిత్రాల్లో కామెడీ తప్పనిసరి అని భావించి ఆ దిశగా అడుగులు వేసి వెగటు కామెడీతో మరింత వెనక్కు వెళ్లాడు. ప్రేక్షకుడు థియేటర్ లోకి అడుగుపెట్డే ముందు సునీల్ సినిమాలో హాస్యం వుండాలనే ఆశిస్తాడు. అయితే ఆ హాస్యం మచ్చుకైనా కనిపించదు. సగటు కమర్షియల్ చిత్రాల్లో వుండే ఎలిమెంట్స్ అన్నీ వున్నాయి. కానీ ఏం లాభం..? ఆ ఎలిమెంట్స్ ఏవీ సరిగా కుదరక ఏ వర్గాన్నీ ఆకట్టుకోలేకపోయాయి.
కథలోకి వెళదాం... ఎంతో గారాబంగా, అల్లారు ముద్దుగా తాతయ్య (విజయ్‌కుమార్) నీడలో పెరిగిన రాంబాబు (సునీల్) తన చిన్న తనం నుంచి తాతయ్య చెప్పిన కథల్లోని స్వాతంత్య్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకునే వాడు. పెద్దయ్యాక వాళ్లని అక్కడే వదిలేసి సినిమా హీరోలను ఆదర్శంగా తీసుకుని వారిలాగే డైలాగ్స్, స్టెప్స్‌కి, ఫైట్స్‌కి ఇన్‌స్పైర్ అవుతాడు. అనుకోకుండా రెండు వందల కోట్ల అప్పుల్ని మిగిల్చి తాతయ్య కన్నుమూస్తాడు. అదే టైంలో బాదం బాబా (పోసాని కృష్ణమురళి) ఆశీస్సులతో ఊహించని విధంగా రెండు వందల కోట్లకు అధిపతి అవుతాడు. తన ఆఫీస్‌లో పనిచేసే సావిత్రి (మియాజార్జ్)ని ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అందుకోసం వారు కేరళలో వుండే సావిత్రి తండ్రి రంగనాయర్ (ప్రకాష్‌రాజ్) దగ్గరికి వెళ్తారు. ఆయనది కమ్యూనిజాన్ని ఊళ్లో అందరికీ నూరిపోసే క్యారెక్టర్. కార్పొరేట్ విధానాన్ని చీల్చి చెండాడుతూ వుంటాడు. ఫారిన్ కారు కనిపించినా సహించడు. అలాంటి రంగనాయర్ రాంబాబుని అల్లుడుగా చేసుకోవడానికి ఇష్టపడడు. ఆ వూరికి అతిథిగా రావడం వల్ల ఆ క్షణం నుంచి రాంబాబు రంగనాయర్ ఇంట్లోనే వుంటాడు. అతడు పెట్టే టెస్ట్‌లు నెగ్గాడా? తన ప్రవర్తనతో రంగనాయర్‌ని ఎలా మెప్పించాడు? సావిత్రిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అన్నదే చిత్రం క్లైమాక్స్.
కమర్షియల్ సినిమాలు తీయడం చాలా ఈజీ అనుకునే వారికి ఈ చిత్రం పెద్ద గుణపాఠ నేర్పుతుంది. తను చేస్తున్న కమర్షియల్ కథలోనే ఈ సారి కామెడీ వుండేట్లు చూసుకున్నాడు సునీల్. అదిరేటి డ్రెస్సుల్లో కనిపించాలని అర్మానీ దుస్తులు వేసుకుని తన మార్క్ హాస్యాన్ని పండించడానికి చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. ఈ సినిమాలో ఏ ఒక్క క్యారెక్టరైజేషన్ కూడా సమంజసం అనిపించదు. హీరోయిన్ ఇంట్లో మందు కొడుతూ, సిగరెట్లు తాగుతూ ఆమె తండ్రి చేత బ్యాడ్ అనిపించుకుంటాడు. ఒక్కోసారి వెకిలి చేష్టలు చేసే రాంబాబు అప్పటికప్పుడు సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పేస్తుంటాడు. సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిలా దేశంలోని అన్ని సమస్యల గురించి చర్చిస్తాడు. దర్శకుడిగా మంచి ఇమేజ్ వున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సునీల్ కెరీర్‌ని మరింత సందిగ్ధంలోకి నెట్టేసిందని చెప్పొచ్చు. తాతయ్య చెప్పిన కథలు విని ఆ పాత్రలనుంచి స్ఫూర్తి పొందాడని, ఆ తర్వాత సినిమాలు చూస్తూ హీరోలని చూసి ఇన్‌స్పెయిర్ అవుతున్నాడని ఇంట్రడక్షన్ ఎందుకిచ్చారో, ఆ తర్వాత మళ్లీ ఆ ఊసే వుండదు. ప్రతి చిత్రంలో చిరంజీవి స్టయిల్‌ని ఇమిటేట్ చేసే సునీల్ ఈసారి ఆ పని చేయడం కోసం ఇంట్రడక్షన్‌లోనే చూపించారు. ‘ఇంద్ర’లోని ‘దాయి దాయి దామ్మ’ స్టెప్స్‌నూ వదల్లేదు. సునీల్ తను కమెడియన్‌గా క్లిక్ అవడానికి దోహదం చేసిన కొన్ని మేనరిజమ్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకోవాలని చూశాడు. కానీ బోల్తాపడ్డాడు. చాలా అసహజంగా అనిపించడమేకాకుండా, తను పోషించిన రిజ్ బిజినెస్ మాన్ క్యారెక్టర్ ఏ మాత్రం సూట్‌కాలేదు. కామెడీ కోసం తపించడం అయితే తెలిసింది కానీ స్లో మోషన్ షాట్స్‌లో సూపర్‌స్టార్ రేంజ్ హీరో ఇంట్రడక్షన్‌ని, అవసరం లేకున్నా ఐదు పాటలని మాత్రం విడిచిపెట్టలేదు. అందుకే ఇలా కమర్షియల్ రూట్లోకి వచ్చి నానా తిప్పలు పడ్డారు. ‘ఉంగరాల రాంబాబు’ అనే టైటిల్ వినగానే చక్కని వినోదాత్మకంతో పాటు క్రాంతి మాధవ్ మార్క్ కూడా వుంటుందని అందరూ ఆశిస్తారు. అలాగే యాక్షన్ హీరోగా చాలా సినిమాల్లో రాణించాలని ఆరాటపడుతున్న సునీల్ తనలోని కామెడీ యాంగిల్‌తో మరోసారి అందర్నీ నవ్విస్తాడని ఊహిస్తారు. కానీ సునీల్ ఇటీవల చేసిన ఫ్లాప్‌ల సినిమాలు దీనికంటే నయం అనేంతగా ఉంది. దర్శకుడు క్రాంతి కుమార్ చేసిన సినిమాయేనా? అనిపిస్తుంది. అతడు గతంలో చేసిన సినిమాలను పోలిస్తే. అడుగడుగునా అర్థం పర్థంలేని సన్నివేశాలు.. అనవసరమైన టైమింగ్‌లేని పంచ్‌లు.. కథ, కథనాలతో విసిగి వేసారిన ప్రేక్షకులపై ఒక్కసారిగా వచ్చిపడే పాటలు పిడుగుల్లా అనిపించాయి. ఎవరి ఊహలకి అందని విధంగా మనం ఏ జోనర్ సినిమా చూస్తున్నామో అర్థంకాని విధంగా వుంది. హీరోయిన్ పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యత లేదు. పాటలకే పరిమితమైంది. హీరో ఏది చేసినా సర్దుకు పోయే మనస్తత్వంతో వుంటుంది. రాంబాబు, రంగనాయర్ కనిపించిన ప్రతి సన్నివేశంలో వెనక ఒక ప్రాపర్టీగా వుంటుందే తప్ప ప్రాధాన్యత కనిపించదు. ముఖ్యంగా ఈ వీరిద్దరి మధ్య జరిగే లవ్‌స్టోరీ గురించి చెప్పుకోకపోతేనే బెటర్. చిందర వందరగా వుంది. హీరోయిన్ పుట్టిన రోజు సర్‌ప్రైజ్ చేస్తాస్తానంటూ దుబాయ్ తీసుకెళ్లిన హీరో ఆమెని సర్‌ప్రైజ్ చేయడం మాటేమో కానీ, చూసే ప్రేక్షకులకు మాత్రం టార్చర్ తప్పలేదు. మరీ ఇంత టార్చరా? అనిపించింది. ఇక హీరోయిన్ తండ్రిగా కనిపించిన ప్రకాష్‌రాజ్ పాత్రలో కొత్తదనం లేదు. అలవాటైన పాత్రే అయినా ఆకట్టుకోలేకపోయాడు. రాంబాబుకి ముందు ‘ఉంగరాలు’ తగిలించడం కోసం ‘బాదం బాబా’ అంటూ పోసాని కృష్ణమురళి క్యారెక్టర్ మరీ చీప్‌గా అనిపించింది. ఎలాంటి వినోదం లేదు. ఇది సినిమాకే నాసిరకం ట్రాక్.
సాంకేతిక విభాగాల గురించి చెప్పుకోవాలంటే సర్వేష్ మురారి ఫొటోగ్రఫీ ఒక్కటే బావుంది. ప్రతీ సీన్‌ని అందంగా చూపించాడు. జిబ్రాన్ సంగీంత పేలిపోయింది. ఒక్కపాట కూడా వినసొంపుగా లేదు. చంద్రమోహన్ మాటలు ఎక్కడా ఆకట్టుకోలేదు. నిర్మాత చేసిన భారీ ఖర్చు వృథాయే. మొత్తం మీద సునీల్ ఈ చిత్రంతో బో‘రింగు’ల బాబుగా మిగిలిపోయాడు.
వెనె్నల కిషోర్‌తో కామెడీ పండించాలనుకున్నారు. కానీ అదీ వర్కవుట్ కాలేదు. కొన్ని కామెడీ కోసం సీన్లు తూచ్ అనిపించాయి. కుక్కని వెతుకుతూ అడవిలోకి వెళ్లే సన్నివేశం కానీ, సునీల్ ఫ్రూట్స్ తెచ్చే సీన్ పరమ బోర్‌గా అనిపించాయి. ఆశిష్ విద్యార్థి ట్రాక్ మరీ చెత్తగా వుంది. హీరోని ఏదేదో చేసెయ్యాలని, చివర్లో అతనేమీ చేయకుండానే మిగులుతుంది. రెండు వందల కోట్లు వదిలేసి పోతాడు. ఇదీ ఓ క్యారెక్టరేనా అనిపించింది.

-ఎం.డి