రివ్యూ

క్లాస్‌పైనే గురి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది*** స్పైడర్
***
తారాగణం:
మహేష్‌బాబు,
రకుల్ ప్రీత్‌సింగ్
ఎస్.జె సూర్య, భరత్ తదితరులు
కెమెరా: సంతోష్‌శివన్
సంగీతం: హారిస్ జైరాజ్
నిర్మాణం: ఎన్‌విఆర్ సినిమా ఎల్‌ఎల్‌పి, రియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు:
ఎన్.వి ప్రసాద్, రాగూర్ మధు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
ఎ.ఆర్ మురుగదాస్
***
మహేష్‌బాబు, మురుగదాస్ కలయికలో సినిమా అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి. గజిని, ఠాగూర్, తుపాకీ వంటి భారీ బ్లాక్ బస్టర్ విజయాల తర్వాత దర్శకుడు మురగదాస్ రూపొందించిన చిత్రం కావడంతో సహజంగానే ‘స్పైడర్’పై అందరిలో ఆసక్తి నెలకొంది. తెలుగులో ‘స్టాలిన్’ తర్వాత మురుగదాస్ దర్శకత్వం వహించిన తెలుగుచిత్రమిదే కావడం విశేషం. ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న హీరో మహేష్‌బాబు తొలిసారిగా చేసిన ద్విభాషా చిత్రం కావడం.. ఈ సినిమా ద్వారా ప్రిన్స్ తమిళ ప్రేక్షకులకు హీరోగా పరిచయం అవడంతో అంచనాలు మరింత పెరిగాయి. మనిషిలో కొంత స్థాయిలో మాత్రమే ఉండే పైశాచికత్వం స్థాయిని మించి పెరిగిపోతే ఆ మనిషి మృగంలా ఎలా మారతాడు? ఏం చేస్తాడు? అతను సమాజానికి ప్రమాదంలా ఎలా పరిణమిస్తాడు? అనే అంశాలతో అల్లుకున్న చిత్రమిది. పాన్ ఇండియా ఇమేజ్ వున్న మురుగదాస్, స్టయల్‌కి మారుపేరైన మహేష్‌ల కలయికలో వచ్చిన ఈ ‘స్పైడర్’ ఎలా వుందో చూద్దాం..
కథలోకి వెళితే.. ఇంటిలిజెన్స్ ఏజెన్సీలో పనిచేసే ఉద్యోగి శివ (మహేష్‌బాబు) ఫోన్‌కాల్ ట్యాప్ చేస్తూ అసాంఘిక కార్యక్రమాలను, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తుంటాడు. ఫోన్ కాల్ ట్యాప్ చేసే సమయంలో అనుమానాస్పదంగా అనిపించిన వాటి వివరాలను అధికారులకు చేరవేయడమే పని. ఫోన్‌లో ఎవరు ఏడ్చినా, ఎవరు హెల్ప్ అని అరిచినా స్పందించేలా సొంతగా సాఫ్ట్‌వేర్‌ను కనిపెడతాడు. ఎవరికి ఎలాంటి ముప్పు ఉన్న వెంటనే స్పందించి వారికి సాయపడుతుంటారు శివ. అలాంటి అతడి జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి (రకుల్ ప్రీత్‌సింగ్) ప్రవేశిస్తుంది. ఎలాంటి పరిచయాలు లేకుండా బ్లైండ్‌డేట్ ద్వారా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది రకుల్. ఈ విషయం తెలుసుకున్న శివ ఆమె ఫోన్‌కాల్ ట్రేస్ చేసి ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. ఫోన్‌కాల్స్ ట్యాపింగ్ చేస్తున్న క్రమంలోనే ఓ అమ్మాయి తన స్నేహితురాలికి చేసిన కాల్ వింటాడు. ‘మా ఇంట్లో దెయ్యం ఉంది’ అని భయపడుతున్న ఆ అమ్మాయికి సాయంగా వెళ్లమని తన స్నేహితురాలైన ఓ లేడీ కానిస్టేబుల్‌ని ఆ ఇంటికి పంపిస్తాడు శివ. ఆపదలో వున్న అమ్మాయి ఇంటికి వెళ్లిన లేడీ కానిస్టేబుల్‌తో పాటు సహాయం కోసం ఆర్థించిన అమ్మాయి దారుణంగా హత్యకు గురవుతారు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు చలించిపోతాడు శివ. ఆ హత్యకు కారకులైన వారిని కనిపెట్టేందుకు రంగంలోకి దిగుతాడు శివ. ఆ క్రమంలోనే సైకో కిల్లర్ భైరవ (ఎస్.జె సూర్య) గురించి తెలిస్తుంది శివకు. తన ఆనందం కోసం జనాలను హత్య చేసే వ్యక్తి భైరవుడు తన తమ్ముడు (్భరత్)తో కలిసి చేసిన విధ్వంసాలేంటి? ఫలితంగా జరిగిన నష్టాలేంటి? శివకు భైరవుడికి మధ్య ఏం జరిగింది? ఇంతకీ ఆ భైరవ ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? ఎందుకు సైకో కిల్లర్‌గా మారతాడు? అతి ప్రమాదకరమైన భైరవను శివ ఎలా తుదముట్టించాడు? అన్నదే కథ.
నేటితరం మనుషులను పట్టించుకోవడం మానేశారు. మానవత్వం అనే మాటను మరచిపోతున్నారు. ఎదుటి వ్యక్తిలో ప్రేమను చూడలేకపోతున్నారు. ఇలాంటి వేగవంతమైన యుగంలో మనం కూడా వేగంగానే ఉండాలి. అదే సమయంలో మనవత్వాన్ని మరిచిపోయన విషయాన్ని సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సాధారణంగా మురుగదాస్ సినిమాలు వినోదంగా సాగుతూ అంతర్లీనంగా ఒక సందేశం ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం వినోదపు పాళ్లను కాస్త తగ్గించి, ఒక సందేశాన్ని కమర్షియల్ ప్యాకేజ్ మాదిరి ప్రేక్షకులకు అందించాడు. మురుగదాస్ సినిమాల్లో బలమైన కథ, కథనం వుంటాయి. ఈ సినిమాలో అవి కనిపించవు. ప్రేక్షకులను ఆసక్తితో కట్టిపడేసే సన్నివేశాలు అందంగా మలచగల దర్శకుడు మురుగదాస్ ఈ సినిమాలో ఒకటి ఆరా తప్ప రక్తికట్టించలేకపోయాడు. మొదటి సగం ఉన్నంత బలంగా రెండవ సగం అనిపించదు. అలాగే సెకండాఫ్‌లో నడిచే మైండ్‌గేమ్ ఎపిసోడ్స్ బాగున్నా, కొంచెం సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో విజువల్ ఎఫెక్ట్స్ మీద మరింత శ్రద్ధ పెట్టి వుంటే బావుండేది. దర్శకుడు తీసుకున్న లైన్ రొటీన్‌గా అనిపించింది. రోటీన్ లైన్ కావడం.. కామెడీ లేకపోవడం, ఏ క్లాస్ కథనం, ప్లాట్ నెరేషన్ సినిమాను కాస్త బోర్ కొట్టించింది. మురుగదాస్ మార్క్ సందేశం, థ్రిల్లింగ్ అంశాలతో సాగుతుంది. మనకు పరిచయం లేని వాళ్లకు కూడా సాయం చేయడమే నిజమైన మానవత్వం అనే అంశం ఆధారంగా చిత్రాన్ని నడిపించాడు దర్శకుడు. ఒక అమ్మాయి, లేడీ కానిస్టేబుల్ హత్య నుంచే కథ వేగం పుంజుకుంటుంది. ఆ కేసు పరిశోధన తీరు, భైరవ నేపథ్యం లాంటి అంశాలు ప్రేక్షకుడికి ఆసక్తి కలిగిస్తాయి. అక్కడ నుంచి హీరో విలన్‌ల మధ్య కథ నడుస్తుంది. విలన్ సవాల్ విసిరిన ప్రతీసారీ హీరో తన ఇంటిలిజెన్స్‌తో ముప్పును పసిగట్టడం, దాని నుంచి బయటపడేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా సాగుతాయి. అయితే దర్శకుడు మురుగదాస్, తన గత చిత్రాల స్థాయిలో ప్రేక్షకులను కథలో లీనం చేయలేకపోయాడు. విలన్ అనుకున్న పనులన్నీ చేసేస్తుండటం, అతను తలపెట్టిన ముప్పు నుంచి గట్టేక్కించేందు హీరో చేసే ప్రయత్నాలు ప్రేక్షకులకు కాస్త మింగుడు పడవు. దర్శకుడు రాసుకున్న కథ, కథనాల్లో అక్కడక్కడ తడబడ్డట్టు కనిపిస్తుంది. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం ఇలా నాలుగు విభాగాలను దర్శకుడు హ్యాండిల్ చేశారు. ఫేస్‌బుక్, వాట్సాప్, టీవి, ల్యాప్ ట్యాప్‌లకు అతుక్కుపోవడం కాదు, పక్కనున్న మనిషికి మన ప్రేమని, ఆప్యాయతని షేర్ చేయండి అంటూ ఇచ్చిన సందేశం మంచిదే, అయినా మరింత జనరంజకంగా తీర్చిదిద్ది వుంటే బాగుండేది. బిసి కేంద్రాల్లోని ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది.
హీరో మహేష్‌బాబు చాలా రోజుల తర్వాత ఇలాంటి క్యారెక్టర్‌లో కనిపించాడు. ఎమోషనల్ ఎలిమెంట్‌తో కూడిన కథలో లీనమై శివగా విశ్వరూపానే్న ప్రదర్శించాడు. న్యూ లుక్‌తో అభిమానులను అలరించాడు. నటనలో సైతం కొత్తదనం కనిపించింది. ఫైట్స్, యాక్టింగ్, డాన్స్ ఇలా అన్నింటిలో తన సత్తాను ప్రదర్శించాడు. ఇంటిలిజెన్స్ బ్యూరో ఆఫీసర్‌గా తనదైన శైలిలో రాణించాడు. దర్శకుడి ఆలోచనల్లో కథానాయకుడు ఒదిగిపోయిన తీరు స్టయిలిష్‌గా సాగుతాయి. ముఖ్యంగా ఎదుటివారి ఏడుపులో ఆనందం కోరుకునే వ్యక్తిగా భైరవుడు (ఎస్.జె సూర్య) ప్రతినాయకుడి పాత్రలో లీనమైన తీరు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సైకో అంటే ఇలా ఉంటాడు అన్న రీతిలో నటనను ప్రదర్శించాడు. హీరోకు, సైకోకు మధ్య బయోవార్ జరుగుతుంది. అలా వీరిద్దరి మధ్య జరిగే వార్ ప్రేక్షకుడికి ఆసక్తికరంగా ఉంటుంది. సైన్స్‌ఫిక్షన్‌తో పాటు లవ్‌ట్రాక్ మాస్ మాసాలాతో దర్శకుడు మేసేజ్ అందించే ప్రయత్నం చేశాడు. మహేష్ క్యారెక్టర్ ఎంత ఫవర్‌ఫుల్ పాజిటివ్ తరహాలో వుంటుందో, సూర్య పాత్ర కూడా అంతే తరహాలో ఫవర్‌ఫుల్ నెగెటివ్ తరహాలో సాగుతుంది. హీరో, విలన్ పోరాటాలకి మధ్య ట్విస్టులు జోడించి, కథపై ప్రేక్షకుల్లో ఆసక్తికలిగించాడు దర్శకుడు. చివరి అరగంటలో దర్శకుడి మార్క్ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే కనిపించింది. ఏం జరుగుతుందా? అని ఉత్కంఠరేపింది. విలన్ సూర్య తమ్ముడు భరత్‌ను చూస్తుండగానే జనం మధ్య హీరో చంపడంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్ తన పాత్రలో లీనమై నటించింది. రకుల్- మహేష్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సరదాగా వున్నాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కేవలం పాటల కోసమే కాకుండా రకుల్ పాత్ర కథలో ఓ ముఖ్యభాగం. సూర్య తమ్ముడిగా నటించిన భరత్ తన పాత్రకు న్యాయం చేశాడు. సాంకేతికత హాలీవుడ్ సినిమాలను గుర్తు చేస్తుంది. సంతోష్‌శివన్ కెమెరా చిత్రానికి హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ అద్భుతం. విజువల్స్‌లో ఎక్కడా రాజీపడలేదు. స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు హైలెట్‌గా నిలిచాయి. హారిష్ జైరాజ్ సంగీతం సోసోనే. రీ రికార్డింగ్ బావుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. అయితే క్లైమాక్స్‌లో విలన్ అంతమవడం ఉన్నట్టుండి జరిగిపోవడం ప్రేక్షకులకు కొంత నిరాశకలిగింది. మొత్తం మీద ఈ ‘స్పైడర్’ క్లాస్ ప్రేక్షకులకు చేరువైంది.

-ఎం.డి అబ్దుల్