రివ్యూ

‘గల్ఫ్’ కన్నీటి వెతలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గల్ఫ్ ** ఫర్వాలేదు

**
తారాగణం:
చేతన్, డింపుల్ హయాతి
బిత్తిరి సత్తి తదితరులు
సంగీతం:ప్రవీణ్ ఇమ్మడి
నిర్మాతలు:
యక్కలి రవీంద్రబాబు
ఎం.ఎస్.కుమార్
దర్శకత్వం: పి.సునీల్‌రెడ్డి
**
సామాజిక చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సునీల్‌కుమార్‌రెడ్డి సినిమాలు కమర్షియాలిటీకి దూరంగా వుంటాయి. ఇప్పటికే పలు విషయాలపై సినిమాలు తీసిన ఆయన తాజాగా చేసిన ప్రయత్నం గల్ఫ్ బాధితులపై. గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ డబ్బు సంపాదించి ఇక్కడున్న వారికి పంపి తమ కుటుంబంలో ఆనందాలు నింపాలనుకునే చాలామంది ఎన్నో కష్టనష్టాలూ చవిచూస్తున్నారు. అలాంటి సంచలనాత్మక ప్రయత్నమే ‘గల్ఫ్’. మరి గల్ఫ్ సినిమాలో ఏముంది.. ఎలాంటి విషయాలను చర్చించారు అన్నది తెలియాలంటే మాత్రం కథలోకి వెళ్లాల్సిందే.
సిరిసిల్లాకు చెందిన చేనేత కార్మికుడి కుమారుడు శివ (చేతన్) తన స్నేహితుడిలాగే దుబాయ్ వెళ్లి బాగా సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా గల్ఫ్ వెళతాడు. అతనిలాగే పనికోసం గోదావరి జిల్లాకు చెందిన లక్ష్మి (డింపుల్ హయాతి) కూడా గల్ఫ్ చేరుకుంటుంది. అలా ప్రయాణంలో పరిచయమైన వారిద్దరూ త్వరలోనే ప్రేమికులైపోతారు. కానీ శివ, లక్ష్మిలు ఊహించుకున్నట్టుగా దుబాయ్‌లోని పరిస్థితులు కనిపించవు. అక్కడ బాగా ఎక్కువ సంపాదించవచ్చనే ఆశతో వెళ్లిన వాళ్లకు తీవ్ర నిరాశే మిగులుతుంది. శ్రమ దోపిడీకి గురవుతారు. అలా తనతోపాటు వేలాదిమంది కార్మికులు ఉన్నారని తెలుసుకుంటాడు శివ. అక్కడ బానిసలుగా బతికే బదులు సొంత ఊళ్ళో కష్టాల్లో బతకడమే మేలని భావించి స్నేహితులు, లక్ష్మితో కలిసి దుబాయ్ నుండి బయటపడాలని ప్లాన్ వేస్తాడు. అలా బయట పడేందుకు శివ ఏం చేశాడు, చివరికి వాళ్లంతా బయటకు రాగలిగారా లేదా, అసలు గల్ఫ్ కష్టాలు, ఆ కష్టాలను అనుభవిస్తున్న భారతీయుల బతుకులు ఎలా ఉంటాయి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమాలో ముఖ్యంగా ఎంచుకున్న కథాంశం.. అసలు గల్ఫ్‌కు వెళ్ళే వలస బాధితులు ఎలాంటి కష్టాలు పడుతున్నారు అన్నది ప్రధాన అంశం. అక్కడికి వెళుతున్న భారతీయులు అవగాహన లోపం వలన దళారులు, ఇక్కడి బ్రోకర్లు, అరబ్బుల చేతుల్లో ఎలాంటి హింసలు, ముఖ్యంగా ఇంటి పనికోసం వెళ్ళే ఆడవాళ్ళు పడే నరకయాతన ఎలా ఉంటుంది అనే అంశాలను చాలా విశదంగా చూపించారు. అలాగే అక్కడ మనవాళ్ళే తోటివాళ్లను ఎలా మోసం చేస్తున్నారు, అరబ్ షేకుల అసలు స్వరూపం ఏమిటనే విషయాన్ని తెలిసేలా తీశాడు దర్శకుడు. గల్ఫ్‌లోని వర్కర్స్ క్యాంప్, అరబ్ షేకుల ఇళ్ళు, ఎడారి ప్రాంతం వంటి సహజ లొకేషన్లలో తీయడం రియలిస్టిక్‌గా వుంది. ఒక్కో మనిషిలో ఒక్కో సమస్యను చూపించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. కూలి కోసం అక్కడకు వెళ్లిన ఇండియన్స్ విదేశీ మారకద్రవ్యం రూపాన మన దేశానికి ఎంతో లాభాన్ని ఇస్తున్నా వారి బాగుకోసం ఇక్కడి ప్రభుత్వాలు ఏమీ చేయకపోవటాన్ని ప్రశ్నించడం కూడా బాగుంది. సినిమా మొదటి భాగం మొత్తం ఈ తరహా అంశాలతోనే నడుస్తూ ఆకట్టుకుంది. హీరో చేతన్ నటన ఫరవాలేదు. ఇక హీరోయిన్ డింపుల్ హయాతి తన పాత్రలో పరిధిమేరా బాగా నటించింది. ఇక మిగతా పాత్రల్లో సంతోష్‌పవన్, అనిల్ కళ్యాణ్‌ల నటన ఆకట్టుకుంది.
ఇక సాంకేతిక విషయానికివస్తే.. దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి గల్ఫ్ వలస కష్టాలు అనే సామాజిక అంశాన్ని ఎంచుకుని దాన్ని పూర్తి స్థాయి సినిమాగా మలిచే విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే బావుండేది. రెండో భాగంలో ఇంకాస్త బెటర్‌గా తీసి ఉండాల్సిది. ప్రవీణ్ ఇమ్మడి సంగీతం, ఎస్వీ శివరాం కెమెరా పనితనం ఓకె అనిపించాయి. శామ్యూల్ కళ్యాణ్ ఎడిటింగ్ బాగా ఉంది. ఇక పులగం చిన్నారాయణ మాటలు ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. ఇక సినిమా విషయంలో గల్ఫ్ కలలు, కష్టాలు వంటి అంశాలతో హృద్యంగా సాగిపోయిన సినిమా, హీరో తిరగబడటంతో సెకెండ్ హాఫ్ జోరుగా ఉంటుందని అనుకున్న సమయంలో రివర్స్‌గా మరి కొద్దిగా చప్పబడిపోయింది. హీరో, హీరోయిన్, అతని స్నేహితులు పారిపోవడం, అరబ్ షేక్‌కు కనిపించకుండా తలదాచుకోవడం వంటి అంశాలను ఇంకాస్త బాగా చూపించాల్సి ఉండాల్సింది. అలాగే కొన్ని ఫన్నీ వేషాలు రిపీట్ అవ్వడం కూడా ప్రేక్షకుడిని ఇబ్బంది పెట్టాయి. తమ కుటుంబాల కోసం ఏళ్ల తరబడి గల్ఫ్‌లో ఉంటూ కష్టాలు పడుతున్న ఎంతోమంది మగ, ఆడ కూలీల జీవితాల్ని సహజంగా చూపించారు కానీ సెకెండాఫ్ కథనం, లవ్‌ట్రాక్‌ల మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. సినిమాలో ఆకట్టుకునే సన్నివేశాలు, ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి విషయాలను వదిలేశారు.

-త్రివేది