రివ్యూ

ఉన్నది ఒకటే స్నేహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నది ఒకటే జిందగీ ** ఫర్వాలేదు

** ** ** **

తారాగణం:

రామ్, అనుపమ పరమేశ్వరన్
లావణ్య త్రిపాఠి, శ్రీవిష్ణు, రాజ్
కిరిటీ, ప్రియదర్శి, ఆనంద్ అనీషా ఆంబ్రోస్ తదితరులు
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
కెమెరా: సమీర్‌రెడ్డి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సమర్పణ: స్రవంతి రవికిషోర్
నిర్మాత: కృష్ణ చైతన్య
రచన-దర్శకత్వం: కిషోర్ తిరుమల

ఎనర్జిటిక్ హీరో రామ్, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘నేను శైలజ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. అదే ఉత్సాహంతో మరోసారి వీరిద్దరూ కలిసి ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం సక్సెస్ కావడం.. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించడంతో ఈ సినిమాపై అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ప్రేమ, స్నేహం మధ్య ప్రధానంగా సాగిందీచిత్రం. ప్రతి వ్యక్తి జీవితంలో ప్రేమ, స్నేహం రెండూ ముఖ్యమైనవే. దేని ప్రాధాన్యత దానిదే. అయితే ఆ ప్రాధాన్యత వ్యక్తులను బట్టి, పరిస్థితులను బట్టి కూడా ఆధారపడి వుంటుంది. ‘నేను శైలజ’, ‘హైపర్’ తర్వాత రామ్ నటించిన చిత్రమిదే. అనుపమూ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠితో పాటు శ్రీవిష్ణు కీలక పాత్రను పోషించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం..
కథలోకి వెళితే.. స్నేహమేరా ప్రాణం అనుకునే యువకుడు అభి (రామ్) ఎత్తుపల్లాలు ఎన్ని ఎదురైనా జీవితం మొత్తం మనతో వుండేవాడే స్నేహితుడంటాడు. అలాంటి అభికి స్కూల్‌లో తనతో పాటు చదువుకునే వాసు (శ్రీవిష్ణు) అంటే చెప్పలేనంత ప్రాణం. వాసు జోలికి ఎవరు వచ్చినా అస్సలు ఊరుకోడు.. ఎదురుతిరుగుతాడు. అంతేకాదు, చిన్నప్పుడే మంచి స్కూల్‌లో సీటు లభించినా వాసు కోసం వదులుకుంటాడు. వారి వయసుతో పాటు స్నేహం కూడా పెరిగి పెద్దవుతుంది. పెద్దయ్యాక నలుగురు స్నేహితులతో కలిసి రాక్ బ్యాండ్ మొదలెడతాడు. అభికి వాసుతో పాటు మ్యూజిక్ అంటే కూడా అంతే ఇష్టం. అలా ఎంతో హాయిగా సాగిపోతున్న వారి జీవితాల్లోకి ఓ సంఘటన కారణంగా మహా (అనుపమా పరమేశ్వరన్) అనే అమ్మాయి ఎంటరవుతుంది. మహాకు కూడా సంగీతమంటే ప్రాణం. కానీ ఇంట్లో వాళ్లు ఆమెను డాక్టర్‌గానే చూడాలనుకుంటారు. దాంతో ఆమె అదే వృత్తిలో అయిష్టంగానే కొనసాగుతుంటుంది. ఆ సమయంలో తన కుటుంబ సమస్యల విషయంలో అభి ఆమెకు ధైర్యం చెబుతాడు. డాక్టర్ చదువుకున్నా, తనకు సింగర్ కావాలని, స్టేజ్‌పై పాటలు పాడాలనే కోరిక ఉంటుంది. ఆ కోరికను తెలుసుకున్న అభి తన రాక్ బ్యాండ్‌లో పాడే అవకాశం ఇస్తాడు. అంతేకాదు, ఆమె అభిప్రాయాలకూ విలువనిస్తాడు. దాంతో ఒకరంటే ఒకరికి ప్రేమ పుడుతుంది. కానీ వారి ఇష్టాఇష్టాలను ఒకరికొకరు చెప్పుకోరు. మనసులోనే దాచుకుంటారు. అయితే మహా తన ప్రాణ స్నేహితుడు వాసు మరదలని, ఆమెను వాసు కూడా ఇష్టపడుతున్నాడని అభికి తెలుస్తుంది. ప్రాణ స్నేహితుల మధ్య ఈగోలు రాకూడదన్న ఒప్పందంతో ఇద్దరూ ఒకేసారి మహాకు ప్రపోజ్ చేస్తారు. కానీ ఆమె మాత్రం వాసుకే ఓకె చెబుతుంది. ఆ తర్వాత వాసు, ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా మహాపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తుండటంతో కోపంతో అభి వాసుకు దూరంగా వెళ్లిపోతాడు. అయితే అక్కడ అభికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి అవేమిటి? ప్రాణ స్నేహితుడిని కాదని అభి అలా ఎందుకు వెళ్లిపోయాడు? ఇద్దరూ తిరిగి కలుసుకున్నారా? మహా - వాసుల మధ్య ఏం జరిగింది? వీరి కథలో వెడ్డింగ్ ప్లానర్ మేఘన (లావణ్య త్రిపాఠి) పాత్ర ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
ప్రేమకథల్లో పెద్దగా చెప్పుకోవడానికి కొత్త అంశాలు ఏమీ ఉండవు. కాకపోతే కథ, కథనమే కీలక అంశాలు. అలాంటి అంశాలను సినిమా ఆరంభం నుంచి చివరి వరకు నడిపించే తీరుపైనే సినిమా సక్సెస్ ఆధారపడి వుంటుంది. ‘నేను శైలజ’తో రామ్‌ను సరికొత్తగా చూపించిన దర్శకుడు కిషోర్ తిరుమల మరోసారి తన వంతుగా కొత్త ప్రయోగమే చేశాడు. ప్రేమ, స్నేహం అనే రెండు అంశాలను బేస్ చేసుకున్న కథలో ఈ రెండింటినీ పస్ట్ఫా వరకు బాగానే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు. కానీ సెకండాఫ్‌కి వచ్చే సరికి సన్నివేశాల్లో ఏ మాత్రం కొత్తదనం కనిపించలేదు. ద్వితీయార్థంలో పతాక సన్నివేశాల ముందు వరకు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. అయితే ఎమోషనల్ సీన్స్, పతాక సన్నివేశాల్లో దర్శకుడి ప్రతిభ కనిపించింది. అయితే తొలిభాగం మరింత వేగంగా కథ నడిపివుంటే బాగుండనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకు కథలో పెద్దగా ట్విస్ట్‌లు లేకుండా ఫ్రెండ్స్‌తోనే కథ నడిపించటం కాస్త ఇబ్బంది పెడుతుంది. తెలుగులో గతంలో స్నేహం, ప్రేమ మధ్య ఇరుక్కున్న ఇద్దరు స్నేహితుల కథలు బోలెడొ చ్చాయ. దర్శకుడు తిరుమల ఈ పాత కథకి కొత్త కోణం ఇవ్వలేకపోయాడు. ఒక కారణం మీద దూరమైన ఇద్దరు స్నేహితులు తిరిగి ఎలా ఒకటయ్యారనేది ఈ చిత్రం ఇతివృత్తం. అయితే స్నేహితులు విడిపోవడానికి బలమైన కారణం కానీ, ఇద్దరూ తిరిగి ఒకటయ్యేందుకు తగిన సందర్భంకానీ సరైన విధంగా సృష్టించలేకపోవడం ఈ చిత్రంలో పెద్ద లోపం. ఒకే అమ్మాయితో ప్రేమలో పడ్డ ఇద్దరు స్నేహితుల కథలో దర్శకుడు కొత్తగా చూపించిందంటూ ఏదైనా వుంటే, ఇద్దరూ ఒకేసారి ఆమెకి ప్రేమిస్తున్నానని చెప్పడం.. ఇద్దరిలో ఎవరు నచ్చారో ఆలోచించుకుని చెప్పమనడం. ఈ పాయింట్ తర్వాత కథ ఆసక్తికరంగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. ఒక్కసారిగా గొడవకి దారితీసి, ఇద్దరు ప్రాణ మిత్రులు దూరమైపోయే ఘట్టం చోటు చేసుకుంటుంది. విడిపోవడానికి బలమైన కారణం వున్నట్టయితే మళ్లీ కలవడానికి అలాంటి గట్టి కారణాలు వుండి తీరాలి. మాట్లాడుకుంటే తొలగిపోయే మనస్పర్థలు కావడం వల్ల తిరిగి కలుస్తారో లేదో అనే సంఘర్షణకి తావులేకుండా పోయింది. స్నేహితులు ఇద్దరి మధ్య ఎంత అనుబంధం వుందనేది డైలాగుల్లో చెబుతుంటారే తప్ప, వారి గాఢమైన స్నేహా న్ని చూపించే సన్నివేశం ఒక్కటీ లేకపోవడం మరో బలహీనతే. దర్శకుడు కేవలం మాటలతో సరిపెట్టకుండా ఫ్రెండ్‌షిఫ్ ఎంత గాఢమైనదో తెలిపే సన్నివేశాలపై దృష్టిపెడితే బావుండేది. ఫ్రెండ్‌షిఫ్ అంటూ హీరో అనుక్షణం అతని ధ్యాసలోనే వుంటాడు కానీ, మాటల్లో కాకుండా, అతని స్నేహాన్ని చేతల్లో చూపించే అవకాశం పతాక సన్నివేశాల్లో కానీ దర్శకుడు ఇవ్వలేదు. మాటల రచయితగా దర్శకుడు ఓకే అనిపించి కథనం విషయంలో మాత్రం కాస్త తడబడ్డాడు. విడిపోయిన స్నేహితులు మళ్లీ కలుస్తారా? లేదా? అనే ఆసక్తి ప్రేక్షకుడిలో మొదలవడం.. మహా గురించి తెలిశాక, అభి మళ్లీ ఇండియాకు రావడం.. ఆ తర్వాత వాసుకి, అభికి మేఘనతో పరిచయం, సాన్నిహిత్యం పెరగడంతో కథ మరిన్ని మలుపులు తీసుకుంటుందని ఖచ్చితంగా ఊహిస్తాం. కానీ అదేం జరగదు. ద్వితీయార్థంలో సంభాషణలు, స్నేహం నేపథ్యంలో సన్నివేశాలు చక్కగానే కుదిరాయి. క్లైమాక్స్‌లో అభి-మహాల మధ్య ప్రేమ గురించి వాసు చెప్పే సంగతులు ఫీల్‌ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా దర్శకుడు కిషోర్ తిరుమలలోని రచనా నైపుణ్యం అడుగడుగునా కనిపిస్తుంది. స్నేహం గురించి ఆయన రాసిన సంభాషణలు యువతను విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే దర్శకుడు స్నేహ బంధాన్ని మాటల్లో, కొన్ని కీలక సన్నివేశాల్లో అయితే బాగానే చెప్పగలిగాడు. కానీ మిగతా చాలా సీన్లలో అంత ప్రతిభావంతంగా కనెక్ట్ చేయలేకపోయాడు. ముఖ్యంగా అభి - వాసుల మధ్య స్నేహబంధాన్ని గొప్ప స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయలేదు. ఒకసారి ప్రేమలో విఫలమైన హీరో రెండోసారి ప్రేమలో పడాలంటే బలమైన కారణాలు, పరిస్థితులు ఖచ్చితంగా అవసరమవుతాయి. కానీ ఇక్కడ మాత్రం హీరో సులభంగా రెండోసారి ప్రేమలో పడిపోవడం కొంత నిరుత్సాహకరంగా అనిపించింది. పెళ్లి తంతు పేరు చెప్పి కొత్త పాత్రలు ఎంటరవడంలో కథ నీరసంగా తయారైంది.
రాక్ బ్యాండ్ మెంబర్ పాత్రలో అభిగా రామ్ సరికొత్త లుక్‌తో ఆకట్టుకున్నాడు. రామ్ సినిమా అంటే సాధారణంగా ఫైట్స్, డ్యాన్సులతో అదరగొడతాడు అనుకుంటారు ప్రేక్షకులు. అయితే వీటికి భిన్నంగా రామ్ వాటితో మెప్పించలేదు. అందుకు కారణం అన్నీ మాంటేజ్ సాంగ్స్ కావడమే. ‘నేను శైలజ’తో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న అతడు ఈ సినిమాలో తన మార్క్ ఎనర్జీని చూపించాడు. ముఖ్యంగా రాక్‌స్టార్ లుక్‌తో రామ్ బాడీ లాంగ్వే జ్, పెర్ఫార్మెన్స్ యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. కొన్ని సార్లు ఎమోషన్ సీన్స్‌లో రామ్ తన నటనతో కంటతడి పెట్టించాడు కూడా. అతడి పాత్ర ముఖ్యంగా రెండు కోణాల్లో సాగుతుంది. ద్వితీయార్థంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలు కీలకం. ఆ సన్నివేశాల్లో రామ్ నటన కట్టిపడేస్తుంది. ప్రేమ, స్నేహం గురించి చెప్పే సన్నివేశాల్లో రామ్ నటను మెచ్చుకోవలసిందే.
మహా క్యారెక్టర్‌లో అనుపమా పరమేశ్వరన్ తన చలాకీ నటనతో ఆకట్టుకుంది. తన క్యారెక్టర్ ఫస్ట్ఫా వరకే పరిమితమైనా పాత్రకనుగుణంగా ఒదిగిపోయింది. అందంగా, హుందాగా కనిపించింది. కళ్లతోనే భావాలను పలికిస్తూ మహా పాత్రకు ప్రాణం పోసింది. ఇక వెడ్డింగ్ ప్లానర్ మేఘనగా లావణ్య త్రిపాఠి పాత్రలో నటనకు స్కోపే లేదు. ఏదో వుం ది.. అంటే వుంది అనిపించింది. సెకండాఫ్‌లో వచ్చే ఈ క్యారెక్టర్‌కు ఏ మాత్రం ప్రాధాన్యత లేకుండాపోయింది. లావణ్య ఏ మాత్రం ప్రాధాన్యత లేని క్యారెక్టర్ చేసిందే మిటబ్బా.. అనిపించింది. వాసు పాత్రలో నటించిన శ్రీవిష్ణు నటన ఓకె. ఫ్రెండ్ అంటే ప్రాణమిచ్చే స్నేహితుడిగా, ప్రియురాలు దూరమైన ప్రేమికుడిగా వాసు నటనను కొనసాగించాడు. కాకపోతే సినిమా అంతా ఒకే ఎక్స్‌ప్రెషన్‌తో బోర్ కొట్టించాడు. అభి, వాసుల స్నేహితులుగా రాజ్, కిరిటీ చేసే సందడి ఆకట్టుకుంటుంది. ఇక ప్రియదర్శి తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. ఈ చిత్రంలో అనుకోని అతిథి పాత్ర ఎంట్రీ ఇస్తుంది. రామ్‌తో ప్రేమలో పడిన యువతిగా అనీషా ఆంబ్రోస్ కనిపించింది. ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. గెస్ట్‌గానే మాయమైంది.
సాంకేతికంగా చూస్తే సాధారణంగా ఫీల్‌గుడ్ ప్రేమకథలకు సంగీతం ప్రాణం. ఈ సినిమాకు ఆ ప్రాణం పోసే బాధ్యతను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పూర్తిగా నెరవేర్చాడు. ఎమోషన్ సీన్స్‌లో వచ్చే ట్రెండ్‌మారినా సాంగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించింది. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు, ఉన్నది ఒక్కటే జిందగీ, లైఫ్ ఈజ్ రెయిన్, వాట్ అమ్మా.. వాటీస్ దిసమ్మా.. అనే పాటలు వినడానికే కాదు, వెండితెరపై కనువిందు చేశాయి. సమీర్‌రెడ్డి కెమెరా ఆకట్టుకుంది. షూట్ చేసిన సహజ లొకేషన్లు ఆహ్లాదకరంగా కనిపించాయి. ఎడిటింగ్ విషయానికొస్తే శ్రీకర ప్రసాద్ ఫస్ట్ఫా లెంగ్త్‌ని కొద్దిగా తగ్గించి ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే వున్నాయి. సో.. మొత్తం మీద ‘ఉన్నది ఒకటే జిందగీ’ని ఫర్వాలేదనిపించే స్థాయికే పరిమిత చేశాడు దర్శకుడు.

-ఎం.డి అబ్దుల్