రివ్యూ

కొత్తది కాదు పాతదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గృహం* బాగోలేదు

** *** *** **

తారాగణం:
సిద్ధార్థ్, ఆండ్రియా అనీషా, అతుల్‌కులకర్ణి సురేష్ తదితరులు
కెమెరా: శ్రేయాస్ కృష్ణ
సంగీతం: గిరీష్
నిర్మాత: సిద్ధార్థ్
దర్శకత్వం: మిలింద్ రావ్

ఈమధ్య కాలంలో హర్రర్ పేరిట వస్తున్న దెయ్యం సినిమాల్లోని దెయ్యాలని ఓసారి పరిశీలిస్తే పేరుకి దెయ్యాలే అయినా పరిపూర్ణమైన మనిషిలాగానే ప్రవర్తిస్తుంటాయి. మనిషికి ఉండే అన్ని భావోద్వేగాల్ని ప్రదర్శిస్తాయి. కాస్త గ్యాప్ దొరికితే ఓ సాంగ్‌ని కూడా తమ ఖాతాలో వేసేసుకుంటాయి. ఎక్కడో కారుచీకట్లో ఉండాల్సిన కొరివి దెయ్యా న్ని కాస్త కాయగూరల మార్కెట్లోకి తెచ్చేసి దెయ్యం అనే పదానికి నిర్వచనమే మార్చేసారు మన దర్శక నిర్మాతలు. దీంతో హర్రర్ చిత్రం అనగానే మరో పూర్తిస్థాయి కామెడీ చిత్రం అనుకునే దుస్థితి. అయితే అడపాదడపా కాస్త భిన్నమైన హర్రర్ చిత్రాలూ వచ్చిన సందర్భాలు వున్నా యి. అప్పటివరకూ ఎన్నో హర్రర్ చిత్రాలు వచ్చినప్పటికీ 1973లో వచ్చిన హాలీవుడ్ హర్రర్ మూవీ ‘ది ఎగ్జార్‌సిస్ట్’ మాత్రం ఒక్కసారిగా భారత సినీ ప్రేక్షకులని భయంతో ఉలిక్కిపడేలా చేసింది. ‘దెయ్యం అంటే ఇదేరా!’ అనిపిస్తుంది చిత్రం చూసినవాళ్లకి! అప్పట్లో ఈ మూవీ ఓ ట్రెండ్ సెట్టర్! ఈ సినిమా ఇన్‌స్పిరేషన్‌తో వచ్చిన చిత్రాలు కోకొల్లలు. అలా వచ్చిన మరో చిత్రమే ముందుగా తమిళంలో ‘అవళ్’ (ఆమె) పేరిట విడుదలై ఆపె తెలుగులో వచ్చిన ఈ గృహం! హీరో సిద్ధార్థ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా రచనా సహకారం కూడా అందించడం విశేషం! మణిరత్నం శిష్యుడైన మిలింద్‌రావ్ ఈ చిత్రానికి దర్శకుడు. మరి ఈ గృహంలోకి ప్రేక్షకులు వెళ్లొచ్చా? అవసరం లేదా? డిసైడ్ చేసే ముందు ఓసారి లోనికి వెళ్లి పరిశీలిద్దాం!
క్రిష్ (సిద్ధార్థ్) పేరు పొందిన ప్రముఖ బ్రెయిన్ సర్జన్. క్రిష్ భార్య లక్ష్మి (ఆండ్రియా)లది అన్యోన్య దాంపత్యం. ఆహ్లాదం కలిగించే హిమాలయ పర్వత ప్రాంతంలో విలాసవంతమైన నివాసంలో ఉల్లాసంతో ఆనందదాయకమైన జీవితం వారి సొంతం! మరోపక్క తన కుటుంబసభ్యులతో పక్కింట్లోకి దిగుతాడు పాల్ (అతుల్ కులకర్ణి). స్వల్ప వ్యవధిలోనే రెండు కుటుంబాల మధ్య సత్సంబంధం ఏర్పడుతుంది. ఇలావుండగా పాల్ పెద్దకూతురు జెనీ (అనీషా) ప్రవర్తనలో మార్పుతోపాటు క్రమంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. నుయ్యిలోకి గెంతేయడం, పర్వత అంచున నిలబడటం, ఉన్నట్టుండి అరవడం, పరిచయం లేని చైనీస్ భాషలో మాట్లాడటం ఇలాంటి వింత పోకడలతో కుటుంబ సభ్యులని బెంబేలెత్తిస్తుంది. మొత్తానికి మానసిక రోగిలా మారిపోతుంది. ఈ సమయంలోనే జెనీ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు క్రిష్. సైకియాట్రిస్ట్ ప్రసాద్ (సురేష్) దగ్గరికి జెనీని తీసుకెళతాడు. ‘‘పాల్ ఇంట్లో రెండు ఆత్మలు తిరుగుతున్నాయని, అవి అప్పుడప్పుడు జెనీని పట్టి పీడిస్తున్నాయని, ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవలసిందిగా చైనీస్ భాషలో హెచ్చరిస్తున్నాయని’’ జెనీతో ఇంటరాగేషన్ ద్వారా తెలుసుకున్న సైకియాట్రిస్ట్ ఈ విషయాన్ని పాల్, క్రిష్‌కి కూడా చెబుతాడు. కాని పాల్ ఇల్లు ఖాళీ చేయడానికి ఒప్పుకోడు. ఇక్కడే కథలో ట్విస్ట్! ‘‘రెండు ఆత్మలతోపాటు మరో ప్రేతాత్మ కూడా ఇంట్లో వుందని, ఆ ప్రేతాత్మ పాల్‌ని ఇల్లు ఖాళీ చేయనీయకుండా అడ్డుకుంటుందని’’ బాంబ్ పేలుస్తాడు భూతవైద్యుడు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? ప్రేతాత్మ ఎవరు? ఇంటికి ఆత్మలకి సంబంధం ఏమిటి? ఈ మొత్తం ఎపిసోడ్‌లో క్రిష్ పాత్ర ఏమిటి? వీటికి సమాధానమే క్లైమాక్స్!
ముందుగా చెప్పినట్టుగా ఏ చిత్రాన్నయితే దర్శకుడు మిలింద్‌రావ్ స్ఫూర్తిగా తీసుకున్నాడో అదే చిత్ర స్ఫూర్తితో అనేక చిత్రాలు రావడంతో ఈ గృహంలో ప్రేక్షకుల్ని భయపెట్టే ప్రతి సన్నివేశం కూడా గతంలో ఏదో ఒక సినిమాలో చూసిందే! దెయ్యంతో పీడించబడుతున్న వ్యక్తి భయం గొలిపే వికృత చేష్టలతో బీభత్సంగా హాహాకారాలు చేయడం, గాల్లో తేలియాడటం, చుట్టూ వున్న మనుషుల్ని, వస్తువుల్ని విసిరేయడం ఎన్నో చిత్రాల్లో చూసేసాం! ఇలాంటి సన్నివేశాల వరకూ ఫర్వాలేదుకానీ మొత్తం మేకింగ్ విధానంలో కూడా హాలీవుడ్ బాటనే అనుసరించడంతో కేవలం ఒక వర్గం ప్రేక్షకులని మాత్రమే ఆకట్టుకునే అవకాశం! కథనం నిదానంగా వుండటంతో అత్యధిక ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే ప్రమాదం! లాజిక్‌కి అందని సీన్లు ఎన్నో! పోతే ప్రేక్షకులని భయపెట్టడానికి ఉద్దేశించిన ‘కట్‌షాట్స్’ సౌండ్ ఎఫెక్ట్‌తో ఆకట్టుకుంటా యి. మాతృకంలోని లైన్ మాత్రమే తీసుకుని దా నికి మన నేటివిటీకి తగినట్లుగా కథని అల్లుకుంటే బాగుండేది. అలా చెయ్యకపోవడంతో మనది కాని సినిమా చూస్తున్న ఫీల్! ఆత్మ, ప్రేతాత్మ అంటూ రెండు రకాల దెయ్యాలని చూపడంతో జరుగుతున్న సంఘటనలకి ఎవరు కారణమో తెలీని పరిస్థితి! కామెడీ, కమర్షియల్ అంశాలు వుండకూడదనుకుంటే ఆ దిశగా కథని రాసుకోవాలే తప్ప ఇలా తలాతోకా లేని కథని తెరకెక్కించడం సమంజసం అనిపించుకోదు! ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే చైనీస్ కుటుంబం ఎపిసోడ్‌ని ‘రీ డిజైనింగ్’ చేయాల్సింది. అసలు కన్‌ఫ్యూజన్ మొత్తం ఇక్కడి నుంచే మొదలు! ఈ చైనీస్ కుటుంబం దెయ్యాలు మారిన తర్వాత కూడా తమ కానె్సప్ట్‌ని కొనసాగించడం విచిత్రం! ‘‘ప్రేతాత్మని దేవుడు కూడా అడ్డుకోలేడని’’ చెప్పడం దర్శకుని అవివేకాన్ని తెలియజేస్తుంది! ద్వితీయార్థంలో ఆత్మలని కాసేపు పక్కనపెట్టి సిద్ధార్థ్ రూపంలో ప్రేతాత్మతో కొద్దిసేపు హడావుడి చేయించి, ‘మీరూ మీరూ కొట్టుకుచావండి’ అంటూ క్లైమాక్స్‌ని దెయ్యాల చేతిలో పెట్టడంతోనే దర్శకుడు సినిమాపై పట్టుక కోల్పోయాడన్నది సుస్పష్టం!
ఫ్రెంచ్ మెన్ గెటప్‌లో సిద్ధార్థ్ చలాకీగా కన్పిస్తాడు. ప్రేతాత్మగా పవర్‌ఫుల్ నటనని కనబర్చాడు. ఎటొచ్చీ బ్రెయిన్ సర్జన్‌గా మాత్రం సూట్ కాలేకపోయాడు. ఆండ్రియా పాత్ర పరిధి మేరకు హుం దాగా నటించింది. కాకపోతే సిద్ధార్థ్‌తో జోడి మాత్రం సరిగా కుదరలేదనే చెప్పాలి! సైకియాట్రిస్ట్ పాత్రలో తెల్లని గడ్డంతో కనపడే సురేష్‌ని పోల్చడానికి కాస్త టైమ్ పడుతుంది. జెనీ పాత్రలో అనీషా అదరగొట్టింది. హేట్సాఫ్! గిరీష్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద హైలెట్, అలాగే శ్రేయాస్ కృష్ణ కెమెరా వర్క్ మరొక హైలెట్‌గా చెప్పాలి! ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా వున్నాయి! ప్రేక్షకులని భయపెట్టడంలో పూర్తి మార్కులు సంపాదించిన దర్శకుడు మిలింద్‌రావు కథ, కథనాల్లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. మొత్తానికి అస్తవ్యస్తంగా వున్న ఈ గృహంలోకి వెళ్లడం కంటే మరో హార్రర్ మూవీ కోసం ఎదురుచూడటం బెటర్!

-మద్ది మురళి