రివ్యూ

వాచ్‌మన్‌కి ఎక్కువ.. ‘జవాన్’కి తక్కువ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జవాన్*బాగోలేదు
తారాగణం: సాయిధరమ్ తేజ్, మెహ్రీన్, ప్రసన్న, కోట శ్రీనివాసరావు సుబ్బరాజు తదితరులు
కెమెరా: కె.వి గుహన్
ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్
సంగీతం: ఎస్.ఎస్. థమన్
నిర్మాత: కృష్ణ
దర్శకత్వం: బి.వి.ఎస్ రవి

*** *** *** ****

‘‘ఇంటికొక్కడు ఒక జవాన్‌లా తన కుటుంబ సభ్యులకి రక్షణగా ఉండాలి’’ అనే కానె్సప్ట్‌తో వచ్చిన చిత్రం ఈ ‘జవాన్’. వరుస పరాజయాలతో సతమతమవుతున్న సాయిధరమ్ తేజ్‌కు ఎంతో కీలకమయిన ఈ చిత్రం అతని కెరీర్‌కి ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలుసుకునే ముందు కథేంటో చూద్దాం..
జై (సాయిధరమ్ తేజ్) చదువులో గోల్డ్ మెడలిస్ట్. కుటుంబం కన్నా దేశాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తి. మిసైల్స్ (క్షిపణి) తదితర వాటిని తయారుచేసే రక్షణశాఖకి సంబంధించిన ‘డిఆర్‌డిఓ’ సంస్థలో సైంటిస్ట్‌గా ఉద్యోగం చేయాలన్నది అతని ఆశ యం. అందుకోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇలా ఉండగా, జై చిన్ననాటి స్నేహితుడు బాల్యం నుండే నేర ప్రవృత్తి గల కేశవ్ (ప్రసన్న) ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి అయిదు వందల కోట్ల డబ్బుకి ఓ ‘డీల్’ కుదుర్చుకుంటాడు. ఆ డీల్ ప్రకారం డిఆర్‌డిఓలో తయారైన అతి శక్తివంతమైన ఆక్టోపస్ అనే క్షిపణిని భారతదేశంపై ప్రయోగించి తద్వారా విధ్వంసం సృష్టించాలన్నది ఆ అజ్ఞాతవ్యక్తి ఉద్దేశ్యం. మరి క్షిపణిని అపహరించడానికి కేశవ్ పన్నిన ఎత్తుగడ ఏమిటి? కేశవ్ ప్లాన్‌ని పసిగట్టిన జై ఆ ఎత్తుగడల్ని ఎలా అడ్డుకున్నాడు? ఈ క్రమంలో జై కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానమే తక్కిన సినిమా.
పై కథని కాస్త పరిశీలిస్తే ‘ఇంటికొక్కడు జవాన్‌లా మారాలి’ అనే దర్శకుడి నినాదానికి కథా గమనానికి సరైన లింక్ కనిపించదు. వాస్తవానికి క్షిపణి చుట్టూ మాత్రమే కథ తిరుగుతుంది. అలాంటప్పుడు కథకి పెద్దగా కనెక్ట్ లేని సన్నివేశాల్ని అల్లుకునే బదులు, కథానాయకుని పాత్రని బాధ్యతాయుతమైన ప్రభుత్వ భద్రతాధికారిగా మలిచినట్లయితే, నాయక ప్రతినాయకల మధ్య జనరంజకమైన సన్నివేశాల్ని అల్లుకునే వీలుండటమే కాకుండా, అవి సమంజసంగానూ అనిపించేవి. ఈ సినిమాకి ఉన్న అతిపెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ప్రతీ సన్నివేశం కూడా అంతో ఇంతో అసమంజసంగా అనిపించడం. ‘నా కుటుంబాన్నయినా వదులుకుంటాను గాని, దేశాన్ని మాత్రం వదులుకోను’ వంటి బరువైన డైలాగుల్ని అలాగే ‘సాయుధ బలగాలతో ఎంతో కట్టుదిట్టమైన భద్రత గల వలయాన్ని ఛేదించి క్షిపణిని అపహరించడం’ లాంటి భారీ సన్నివేశాల్ని రాసుకున్న దర్శకుడు ఆ స్థాయిలో తెరపై ‘ప్లే’ చేయలేకపోవడంతో ప్రేక్షకులు కన్విన్సింగ్ కాలేకపోయారు. ఎంచుకున్న నేపథ్యానికి, చెబుతున్న పాయింట్‌కి ఎక్కడా పొంతన లేకపోవడంతో సినిమాకి కనెక్ట్ కాలేకపోతాం. అయినా ఇంతటి దేశభక్తి కలిగిన కథానాయకుడు దేశాన్ని రక్షించే జవాన్ ఉద్వేగానికి ప్రయత్నించాలే గాని, సైంటిస్ట్ జాబ్‌కి దరఖాస్తు చేసుకోవడమేమిటో? పైపెచ్చు ఇంటికొక జవాన్ ఉండాలంటాడు. కథానుసారం కథానాయకుని కుటుంబ సభ్యులకి ప్రాణహాని ఉంటుంది. అంతేగాని తక్కిన అన్ని కుటుంబాలకి ఈ పరిస్థితి ఉండదు కదా! జవాన్ అనే టైటిల్ కారణంగా మహిళా ప్రేక్షకులు సినిమాకి దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు. అసలు మన దేశంలో పోలీస్ వ్యవస్థ, ఇంటిలిజెన్స్ వ్యవస్థ లాంటివి ఉన్నట్లు దర్శకుడు గుర్తించినట్లుగా లేదు. హీరోనే అన్నీ తానై చేసేస్తుంటాడు. ఒక పక్క తన తెలివి తేటలతో కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడేస్తాడు. ఇంకోపక్క శత్రువులతో సాయుధ పోరాటం చేసి, క్షిపణిని భద్రంగా ప్రభుత్వానికి అందజేస్తాడు. మరో పక్క హైదరాబాద్ నగరాన్ని ధ్వంసం చేయడానికి ముష్కరులు ఎక్కడెక్కడ బాంబులు అమర్చారో ఇట్టే గుర్తించేస్తాడు. ఇవి చాలవన్నట్లు ఆ బాంబులు బ్లాస్ట్ అవకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా తనే చెప్పేస్తాడు. పనిలోపనిగా ప్రధాన శత్రువు స్థావరాన్ని క్షణా ల్లో కనిపెట్టేస్తాడు. వావ్... వాట్ ఎ హీరో ఓరియెంటెడ్ మూవీ! కుటుంబం, దేశం ఈ రెండు అంశాలని ఒకదానికొకటి ముడిపెట్టడంతో దర్శకుడు తాను చెప్పాలనుకున్న పాయింట్‌ని స్పష్టంగా చెప్పలేకపోయాడు. సినిమా చివరి అరగంట కథనం వేగం పుంజుకొని ఉత్కంఠను కలిగిస్తుంది. ‘మిసైల్’ని కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరన్నది సస్పెన్స్‌గానే ఉండిపోయింది. హీరో, విలన్‌ల మధ్య సాగే మైండ్‌గేమ్ సీన్లని కాస్త ఆసక్తికరంగా రాసుకోవాల్సింది. కామెడీని పూర్తిగా పక్కన పెట్టేసిన దర్శకుడు ‘ఆరు పాయింటులుండాలి’ అనే పడి సూత్రాన్ని మాత్రం అమలు పరిచాడు. తన చుట్టూ ఎంతో నెట్‌వర్క్ ఉండి ప్రతి సమాచారాన్ని క్షణాల్లో సేకరించడమే కాకుండా, డబ్బుతో ఏదైనా కొనగలిగే సత్తా ఉన్న కేశవ్ ‘మిసైల్’ కోసం జై ఇంట్లో మకాం వేసి కాలయాపన చేయడం వింతగా అనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..ఎనె్నన్నో...!
జై పాత్రలో సాయిధరమ్ తేజ్ యాక్టివ్‌గా నటించాడు. అతను చెప్పిన పవర్‌ఫుల్ డైలాగులు ఆకట్టుకుంటాయి. కథానాయకి మెహ్రీన్ కేవలం పాటలకే పరిమితం. ఆహార్యంలో మరీ మోడ్రన్‌గా ఉండటంతో హాలీవుడ్ నటిని చూస్తున్న ఫీల్! సాయితేజకి జోడీగా ఆమె సరిగా కుదరలేదనే చెప్పాలి. కేశవ్ పాత్రలో కనిపించిన ప్రసన్న పాత్ర పరంగా కనబర్చిన బిల్డప్ కాస్త ఓవర్‌గా అనిపిస్తుంది. అయినప్పటికీ నటన పరంగా మంచి మార్కులే ఇవ్వొచ్చు. పోలీస్ అధికారిగా కనిపించిన నాగబాబు కేవలం రెండు డైలాగులకే పరిమితం. కోట శ్రీనివాసరావు, సుబ్బరాజులను దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు. బాలనటులు నలుగురూ బాగా నటించారు. స్కూల్ చదివే బాలుడిని నేరాలు చేయడంలో ఆరితేరిన వాడిగా చూపడం, ‘డబ్బే ముఖ్యం, డబ్బుకోసం ఏ పని చేసినా తప్పులేదు’ వంటి పెద్ద పెద్ద డైలాగుల్ని ఆ బాలుడిచేత చెప్పించడం దర్శకుడి విజ్ఞతకే వదిలేద్దాం. ఎస్.ఎస్. థమన్ సంగీతం ఈ సినిమాకి మరో మైనస్ పాయింట్. కనీసం ఒక్కపాట కూడా మనల్ని ఆకట్టుకోదు. ఇవీ పాటలేనా..? అని అనిపిస్తుంది. ప్రేక్షకులకు విసుగుపుట్టింది కూడా.
దర్శకుడు కేవలం సాయిధరమ్ తేజ్ హీరోయిజం పైనే దృష్టి పెట్టడంతో తక్కిన అంశాలకి న్యాయం చేయలేకపోయాడు. యాక్షన్ హీరోతో సినిమా చేస్తున్నప్పుడు కేవలం అభిమానుల్ని మాత్రమే కాకుండా , తక్కిన ప్రేక్షకులని కూడా బి.వి.ఎస్ రవి లాంటి దర్శకులు పరిగణనలోకి తీసుకోవాలి! తీసుకుంటారని ఆశిద్దాం... అంతవరకు మరో సినిమా కోసం వేచి చూద్దాం!

-మద్ది మురళి