రివ్యూ

కామెడీ కోసం కథ కిచిడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సప్తగిరి ఎల్‌ఎల్‌బి * బాగోలేదు

తారాగణం:
సప్తగిరి, కాశిష్ వోహ్రా సాయికుమార్, శివప్రసాద్ డా.రవికిరణ్, షకలక శంకర్
గొల్లపూడి, కోట శ్రీనివాసరావు రఘుబాబు, ఝాన్సీ ఎల్.బి. శ్రీరామ్ తదితరులు
సంగీతం: విజయ్ బుల్గానిన్
కెమెరా: ఎస్.ఆర్ సారంగం
నిర్మాణం: సాయి సెల్యూలాయిడ్, సినిమాటిక్ క్రియేషన్స్
నిర్మాత: డా.రవికిరణ్
దర్శకత్వం: చరణ్ లక్కాకుల

** ** ** ** ** * * *

స్యనటులు హీరోలుగా అవతారం ఎత్తడం టాలీవుడ్‌కు కొత్తేమీకాదు. గతంలో అలీ ‘యమలీల’తో ప్రారంభమైన ఈ వరస సునీల్, శ్రీనివాసరెడ్డిదాకా పాకింది. నవరసాల్లో హాస్య రసానికి చాలా ప్రాధాన్యత వుంది. అందరూ నవ్వగలరు. కానీ కొందరే నవ్వించగలరు. కొందర్ని చూస్తేనే నవ్వు వస్తుంది. సినిమా రంగంలో లాంగ్‌టైమ్ కెరీర్ కంటిన్యూ చేసిన ఏ హాస్యనటుడి కెరీర్ గ్రాఫ్ చూసినా స్క్రీన్ మీద అతడిని చూడగానే ఎలా వున్నా, ప్రేక్షకులు ముందుగా నవ్వుతారు. సునీల్ లాంటి వారు అలా హీరోలుగానే ఉండిపోతుంటే, శ్రీనివాస్‌రెడ్డిలాంటి వారు మరోవైపు కమెడియన్స్‌గా కూడా రాణిస్తున్నారు. ఇలా హాస్యనటుడి నుండి కథానాయకుడిగా మారిన వారిలో సప్తగిరి కూడా ఒకరు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు హీరోగా పరిచయమైన అతడు చేసిన రెండో ప్రయత్నం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’. తొలి ప్రయత్నంగా చేసిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ రీమేక్ సినిమానే. అది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ప్రేక్షకుల్లోనూ సప్తగిరికి మంచి క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. దాంతో మళ్లీ హీరోగా రాణించాలనే చేసిన ప్రయత్నం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’. ఇది కూడా రీమేకే (జాలీ ఎల్‌ఎల్‌బి-బాలీవుడ్) కావడం గమనార్హం! ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ నిర్మాతతోనే ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ చిత్రం చేశాడు. అయితే హీరో వేషం వేయగానే తమ నుంచి ప్రేక్షకులు కామెడీ కాకుండా డ్యాన్సులు, ఫైట్లు ఆశిస్తారనే ఆలోచన మన హాస్యనటులకు ఎందుకు వస్తుందో ఏమో కానీ.. ఒక్కసారి హీరో క్యారెక్టర్‌లో ఓవరాక్షన్ చేసి ఎక్స్‌ట్రాగా జీవించేస్తారు. అదే గొప్ప అనుకుంటారు. అదే ఈ చిత్రంలో సప్తగిరి కూడా చేసేశాడు. ఎంతో ఆర్భాటం గా వచ్చిన ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’తో అతడు మరోసారి సక్సెస్‌ని అందుకున్నాడా? లేదా? అనే విషయం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
ఓ చిన్న పల్లెటూరికి చెందిన రైతుబిడ్డ సప్తగిరి (సప్తగిరి) ఎల్‌ఎల్‌బి పూర్తి చేసి తన ఊరి కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుంటాడు. అక్కడ ఎన్ని కేసులు వాదించినా వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అతడు వాదించే కేసులకు ఏ మాత్రం విలువ ఉండట్లేదని భావిస్తాడు. ఇక లాభం లేదనుకున్న అతడు హైదరాబాద్ వెళ్లి పేరుకు పేరు, డబ్బుకు డబ్బు సంపాదించడంతో పాటు, పెద్ద లాయర్ అయిపోదామని సిటీకి వస్తాడు. అంతేకాదు, తన మరదలు చిట్టి (కశిష్ వోహ్రా)ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆ ప్రకారమే సిటీకి చేరుకున్న సప్తగిరి తన భావ (నిర్మాత రవికిరణ్) అండచూసుకుంటాడు. అలాం టి సమయంలో అతనికి రాజ్‌పాల్ (సాయికుమార్) అనే లాయర్ గురించి తెలుస్తుంది. ఇక్కడ అతడి దృష్టిని అప్పటికే ముగిసిపోయిన ఒక కేసు ఆకర్షిస్తుంది. ఈ కేసును రాజ్‌పాలే టేకప్ చేసి ఓ బడా బాబును బయటపడేస్తాడు. కోర్టు తీర్పు కూడా ఇచ్చేశాక ఈ కేసును తిరగదోడుతాడు సప్తగిరి. ఆ కోర్టుకు జడ్డి (శివప్రసాద్). ఈ కేసు విషయంలో సప్తగిరికి ఎన్నో చిక్కులు ఎదురవుతాయి. ఇంతకీ రాజ్‌పాల్ క్లైంట్ ఎవరు? అతను చేసిన యాక్సిడెంట్‌లో చనిపోయింది ఎవరు? పల్లెటూరి నుంచి వచ్చిన న్యాయవాది సప్తగిరి ఎలా వాదించాడు? అడుగడుగునా అతడికి ఎదురైన ఇబ్బందుల్ని ఎలా అధిగమించాడు? పెద్ద లాయర్ రాజ్‌పాల్ మీద ఎలా విజయం సాధించాడు అన్నదే ఆసక్తికరం.
దేశ ప్రజలందరికీ సమాన న్యాయం దక్కాలని భారత రాజ్యాంగం చెబుతుంది. కోర్టులు కూడా అదే రీతిలో పనిచేయాలని కూడా సూచించింది. అదే విధంగా సరైన ఆధారాలుంటే మన వ్యవస్థలు కూడా పనిచేస్తున్నాయి. మనం రోజూ ఎన్నో యాక్సిడెంట్స్‌ను చూస్తుంటాం. ఆ యాక్సిడెంట్‌లో నిందితులకు మాత్రం శిక్ష పడటం మనం చూసుండం. ఇలాంటి పాయింట్‌ను తీసుకొని బాలీవుడ్‌లో తెరకెక్కించిన ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ‘జాలీ ఎల్‌ఎల్‌బి’లో వినోదం, ఎమోషన్ సమపాళ్లలో ఉండి ఆసక్తిని రేకెత్తిస్తాయి. న్యాయ వ్యవస్థ పేద, ధనిక వర్గాల తారతమ్యాలతో ఏ రీతిన అన్యాయం చేస్తుందనే పాయింట్‌ని తీసుకొని ఒక సోషల్ సెటైర్‌లా తీర్చిదిద్దిన విధానం కదిలిస్తుంది. అయితే ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’లో మాత్రం అవేమీ కనిపించవు. దర్శకుడు తను ఎంచుకున్న కథకు డ్యాన్సు లు, ఫైట్లు సెట్ అవుతాయా? లేదా? అని కూడా చూడలేదు. పాటలు, ఫైట్లని కథ డిమాండ్ చేయడం వేరు.. మన డిమాండ్లకి తగ్గట్టు కథని పక్కదోవ పట్టించడం వేరు. ఈ విధంగా మాతృకని ఖూనీ చేసి ఆటాడేశారు. ఓ మంచి కథ ఈ విధంగా పక్కదారి పట్టేసింది. చూసే ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించింది. ఇలా కథ దారి మళ్లడానికి దర్శకుడు ఒక్కడే బాధ్యు డు కాదు, కథానాయకుడు కూడా కారణం. ఇలాంటి చిత్రాలను రీమేక్ చేయడం చాలా కష్టం. మాతృక మంచి విజయాన్ని అందుకున్నప్పుడు ఆ కథను రీమేక్ చేసే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా ఇక అంతే! కామెడీ కోసం జోడించిన సన్నివేశాలు మరీ పేలవంగా తయారయ్యాయి. అయితే రైతు సమస్యలను చర్చిస్తే ఎమోషనల్ బాగా వర్కవుట్ అవుతుందని చేసిన ప్రయత్నం బావుంది. కానీ దాన్ని సరైన రీతిలో ప్రేక్షకుడిని చేరవేయలేక చతికిలపడింది. ఈ చిత్రంలో హాయిగా కాసేపు నవ్వుకోవడానికి ఏ మాత్రం వీలులేదు. సప్తగిరి నుంచి కామెడీ ఆశించిన వారికి నిరాశే ఎదురయింది. ప్రథమార్ధం ఎంతగానో విసిగించింది. ద్వితీయార్ధంలోనైనా కదుటపడుతుందనుకుంటే అదీ జరగలేదు. ఏదో ఫస్ట్ఫా కంటే కొద్దిలో కొద్దిగా సెకండాఫ్ ఫర్వాలేదనిపించింది. చివరలో వచ్చే కోర్టు సన్నివేశం మాత్రమే ఆకట్టుకుంది. అలాగే సప్తగిరి టేకప్ చేసిన కేసులో వాదన, తీర్పు సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. సప్తగిరి బాధితుల పక్షాన పోరాడటం ఆసక్తిని కలిగిస్తుంది. విచారణ సమంలో లాయర్ రాజ్‌పాల్‌ను ఎదిరించే సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. విశ్రాంతికి ముందు కథానాయకుడికి కనువిప్పు కలగడానికి కారణమైన ట్విస్ట్ భలే నచ్చుతుంది. అయితే ఆకట్టుకునే కథనం లేకపోవడం.. ఎక్కడా నవ్వడానికి వీలు లేకపోవడం.. ఆసక్తిని కలిగించే సన్నివేశాలు ఊహించినంతంగా లేకపోవడం చిత్రానికి బలహీనతగా మారాయి. న్యాయం కోసం పోరాడే లాయర్ అని దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ఆసక్తికరమైనదే అయినా, దానికి తగిన విధంగా కథనం రాసుకోలేకపోయారనిపిస్తుంది. కేవలం పతాక సన్నివేశాల ఎపిసోడ్ తప్ప ఈ చిత్రంలో చెప్పుకోవడానికి ఏం లేదు. కేవలం రెండు ఫైట్స్ చేసి, ఆఖరున కాసేపు స్పీచ్ ఇచ్చి కేసును గెలుస్తాడు. వింతగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో వచ్చే లవ్‌ట్రాక్, పాటలు కథనానికి అడ్డుతగిలి బోర్లా కొట్టించింది. అలాగే ఇతర సీన్స్ విషయంలో కూడా ఏ మాత్రం శ్రద్ధ పెట్టినట్లు కనిపించదు. సీరియస్‌గా కథ సాగుతుంటే మధ్య మధ్యలో వచ్చే కొన్ని పాటలు, ఫైట్లు చికాకు కలిగిస్తాయి. దర్శకుడు కొన్ని చోట్ల మాస్ కామెడీని పండించే ప్రయత్నం చేశాడు. కామెడీ, యాక్షన్ సన్నివేశాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఇవన్నీ సప్తగిరి కోసమే జోడించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
నటీనటుల విషయానికొస్తే.. సప్తగిరి తన క్యారెక్టర్‌ను వీరలెవల్లో తనదైన స్టయిల్‌లో సమర్ధవంతంగానే పోషించాడు. ఈ సారి కూడా డ్యాన్సుల్లో, ఫైట్స్‌లో తన సత్తా చాటాడు. ప్రతి సన్నివేశంలో అతడి ఉత్సాహం ‘హీరో’ లెవల్లో కనిపించింది. ఇక హీరోయిన్ కాశిష్ వోహ్రా గురించి చెప్పుకోకపోతేనే బెటర్. ఆమె పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యం లేదు. పాటలకే పరిమితమయింది. ఏ రకంగానూ ఆకట్టుకోదు. అహం, తెలివి తేటలు కలిగిన లాయర్‌గా సాయికుమార్ నటన చాలా బావుంది. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టినపిండే. క్రిమినల్ లాయర్‌గా ఆయన మెప్పించాడు. జడ్జిగా శివప్రసాద్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మిగతా పాత్రల్లో కోట శ్రీనివాసరావు, షకలక శంకర్, ఎల్.బి. శ్రీరామ్, గొల్లపూపి మారుతీరావు, రవికాలే, ఝాన్సీ చలాకీగా నటించారు. ఉన్నంతలో తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికంగా సంగీతం ఆకట్టుకునే స్థాయిలో లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. కెమెరా పనితనం బావుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బావున్నాయి. పరుచూరి మాటల్లో ప్రత్యేకతలేమీ లేవు. రొటీన్‌గానే అనిపించాయి.
ఏదైనా ఒక విజయవంతమైన కథను తీసుకొని రీమేక్ చేయడం కష్టం. ఇలాంటి కథలను రీమేక్ చేస్తున్నప్పుడు ఫీల్ మిస్సవకుండా చూసుకోవాలి. మార్పుల్లో అతి తెలివి ప్రదర్శించి ఓవరాక్షన్ చేస్తే ఇదిగో.. ఇలాగే కిచిడీలా తయారవుతుంది. మంచి కథకు మాసాలాలు దట్టిస్తే కూడా ఇలాగే బోర్లాపడుతుంది. అయితే దర్శకుడు చరణ్ లక్కాకుల చిత్రాన్ని విజయవంతం చేయ డం కోసం పడ్డ శ్రమ, తపన ప్రతీ ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలను తీర్చిదిద్దిన తీరు సైతం అతడి ప్రతిభను చాటుతుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా మరి ఎందుకో ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ ఏ వర్గాన్నీ మెప్పించలేకపోయాడు. ప్చ్..!

-ఎం.డి అబ్దుల్