రివ్యూ

కథలేని కంగాళీ చిత్రమ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుటుంబ కథాచిత్రమ్ * బాగోలేదు
తారాగణం:
నందు, శ్రీముఖి కమల్ కామరాజ్ తదితరులు
సంగీతం: సునీల్ కశ్కప్
కెమెరా: మల్హర్ భట్ జోషి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిర్మాత: దాసరి భాస్కర్ యాదవ్
దర్శకత్వం: వి.ఎస్. వాసు

** *** *********

సినీ దర్శకత్వం అంటే ఏమిటి? దర్శకుడిగా ఉండాల్సిన క్వాలిటీస్ ఏమిటి? వాటిని ఎలా నిర్వర్తించాలి? ఇత్యాది విషయాల పట్ల ఏ మాత్రం అవగాహన లేకుండా కేవలం తెరపై తమ పేరు చూడడం కోసమే దర్శకులుగా అవతారమెత్తిన ఎంతో మంది దర్శకుల చిత్రాన్ని గతంలో చూశాం. అంత వరకూ ఫర్వాలేదు. ఇటువంటి అవలక్షణాలకి బోనస్‌గా అసలు సినిమా అంటే ఏమిటి? అది ఎలా ఉండాలి? దాని ఉద్దేశ్యం ఏమిటి? అన్న కనీస పరిజ్ఞానం లేకుండా వి.ఎస్. వాసు లాంటి దర్శకులు ఏవో నాలుగు పిచ్చి లైన్‌లు రాసుకొని వాటిని తెరపై ఆవిష్కరిస్తే ఎలా ఉంటుందో ఈ కుటుంబ కథా చిత్రమ్ మనకి చెబుతుంది. తెలుగు ప్రేక్షకులు కలలో కూడా ఊహించని విచిత్రం ఈ సినిమా! దర్శకుడు తనకున్న పైత్యాన్ని ప్రేక్షకులపై రుద్దాలనుకోవడం క్షమించరానిది. తెలుగు సినిమా స్టామినా కాపాడాలంటే చిత్ర పరిశ్రమ నుంచి వి.ఎస్.వాసు లాంటి మ్యాడ్ దర్శకులని ఏరి పారేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. పిచ్చి ముదిరి పాకాన పడ్డ దర్శకుని చేష్టలు ఏమిటో ఓసారి గమనిద్దాం..
భార్య పల్లవి (శ్రీముఖి), భర్త చరణ్ (నందు)ల మధ్య గొడవ. భార్యని ఉద్యోగం మానేసి ఇంటి పట్టునే ఉండి తనకి ప్రేమానురాగాలు పంచమంటాడు చరణ్. ఆర్థిక స్వాతంత్రం కోసం ఉద్యోగం చేస్తానంటుంది పల్లవి. గొడవ పెద్దదై పల్లవిని చంపేస్తాడు. నిద్రనుంచి ఉలిక్కిపడి లేస్తాడు చరణ్. ఈ ఎపిసోడ్ అంతా చరణ్ కల! అదేంటి సినిమా ప్రారంభమే ఇలా గందరగోళంగా ఉందేమిటి? అంటారా? ప్రారంభమే కాదు, సినిమా మొత్తం కూడా ఇలానే వుంటుంది. కంగారు పడకండి! కాస్త ఓపిక పట్టండి. స్నేహితుడు దగ్గరికి వెళుతున్నాను, వచ్చేసరికి వంట చేయమంటాడు చరణ్. ‘అలసిపోయి వచ్చాను వంట చేయలేను బయట భోంచేసి రా’ అంటుంది పల్లవి. చరణ్ బయటికి వెళతాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న పల్లవిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తాడు వాచ్‌మన్ (కమల్ కామరాజ్). ఈ సమయంలోనే ఇంటికొచ్చిన చరణ్ అనూహ్యంగా పల్లవి చేతుల్లోనే హత్యకు గురవుతాడు. ఆపై వాచ్‌మన్ బారి నుంచి తప్పించుకోవడానికి తనని తాను కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకుంటుంది పల్లవి. నిద్ర నుంచి ఉలిక్కిపడి లేస్తాడు వాచ్‌మన్. ఈ ఎపిసోడంతా వాచ్‌మన్ కల! నిజంగానే ఇదంతా కలా? లేక వాస్తవమా? తెలుసుకోవడానికి ఇంట్లోకి వెళతాడు వాచ్‌మన్. బెడ్‌రూమ్‌లో పల్లవి శవాన్ని చూస్తాడు. ఈ లోపు ఇంటికొచ్చిన చరణ్‌తో పల్లవి మళ్లీ ఆత్యహత్య గూర్చి చెబుతాడు. ‘ఏనాడో చనిపోయిన పల్లవి మళ్లీ చనిపోవడమేమిట’ని ప్రశ్నిస్తాడు చరణ్. ‘ఎలా చనిపోయింది?’ అని అడుగుతాడు వాచ్‌మన్. తానే చంపేసానంటాడు చరణ్. నిద్ర నుంచి ఉలిక్కిపడి లేస్తుంది పల్లవి. ఈ ఎపిసోడంతా పల్లవి కల!
కథ చదువుతుంటే బుర్ర తిరుగుతుంది కదూ! టూకీగా చదువుతున్న వాళ్ల పరిస్థితే ఇలా ఉంటే టాకీస్‌లో ఈ సినిమా చూస్తున్న వాళ్ల పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. కలలో తనని చంపేసానన్నాడు. కాబట్టి చరణ్‌కి తనపై ప్రేమలేదని నిర్ధారించుకుంటుంది పల్లవి. అంతేకాకుండా చరణ్‌కి మరొక అమ్మాయితో స్నేహం కూడా ఉందని తెలుసుకుంటుంది. దీంతో చరణ్‌ని వదిలి వెళ్లిపోవడానికి నిశ్చయించుకుంటుంది. సరిగ్గా ఈ సమయంలోనే చరణ్, పల్లవిల కూతురితో సీన్‌లోకి ఎంటరవుతాడు చరణ్ మామ. భార్యాభర్తల అనుబంధం, పిల్లల సంరక్షణ గూర్చి లెక్చరిస్తాడు. కూతురిని తమవద్ద ఉంచుకోవడం కోసం ఒకరికొకరు పోటీ పడతారు చరణ్, పల్లవిలు. నిద్ర నుంచి ఉలిక్కిపడి లేస్తుంది కూతురు. ఈ నాలుగవ ఎపిసోడ్ కూతురి కల! ‘అమ్మా, నాన్నలు కలిసుండాలి, లేకపోతే సూసైడ్ చేసుకుంటా’నని మేడమీద పిట్టగోడపై నిలుచుంటుంది కూతురు! పిట్టగోడ పైనే కూతురిని వదిలేసి ముద్దు, ముచ్చట్లలో మునిగిపోతారు చరణ్, పల్లవిలు. హమ్మయ్య! సినిమా కథ అయిపోయింది. దర్శకుడికి నమస్కారం పెట్టి, కొబ్బరికాయ కొట్టేయవచ్చు! ఆగండాగండి! ఇంకొంచెం ఉంది! నిద్ర నుంచి మెల్లగా మేల్కొంటాడు దర్శకుడు. ఈ ‘చెత్త’ మొత్తం సారీ! చిత్రం మొత్తం దర్శకుని కల! నిద్రలేవగానే పేపర్ పై శుభం అని రెండక్షరాలు రాయడం దర్శకుని వంతయితే, బతుకు జీవుడా! అంటూ థియేటర్ నుంచి పరుగులు పెట్టడం ప్రేక్షకుల వంతు!
సింపుల్‌గా భార్యాభర్తల అనుబంధం గూర్చి నాలుగు మాటలు చెప్పడానికి దర్శకుడు పడ్డ పాట్లు చూస్తుంటే అతనిపై కోప్పడలా? లేక జాలి పడాలా? తెలియని పరిస్థితి! సినిమాని కనీస సినిమాగా కూడా తీయడం చేతకాని దర్శకుడు వి.ఎస్.వాసు ప్రయోగాల జోలికి వెళ్లడం విడ్డూరం! వంద నిమిషాలకే శుభం కార్డు పడడం సినిమా మొత్తానికి హర్షించతగ్గ అంశం! నిడివి యాభై నిమిషాలకి కుదించినట్లయితే ఎడిటర్ ప్రవీణ్ పూడి మరిన్ని అభినందనలు అందుకునేవాడు! ‘ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ’లాంటి అరిగిపోయిన డైలాగులు మాత్రమే వినిపించడం ఈ చిత్రానికున్న ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. సినిమాలో ఏది కల? ఏది వాస్తవం? అనేవి గుర్తించడం కష్టం! అసలు స్క్రీన్‌ప్లే మొత్తం కలలపైనే నడుస్తుందా? అనే అనుమానమూ రాక మానదు! చరణ్, పల్లవిలుగా నటించిన నందు, శ్రీముఖిల నటన గూర్చి మాట్లాడుకోవడం కన్నా దర్శకుని పైత్యానికి బలయిన బాధితులుగా వారిపై జాలి చూపడమే ఉత్తమం! శ్రీముఖి కాంబినేషన్‌లో వాచ్‌మన్ పాత్రలో నటించిన కమల్ కామరాజ్ నటన కంపరం పుట్టిస్తుంది! ఉచితంగా ఈ సినిమా చూస్తే అవకాశం వచ్చినా చూడకపోవడమే శ్రేయస్కరం. చూస్తే దర్శకుని మెంటల్ మీకూ అంటుకునే ప్రమాదం ఉంది. తస్మాత్..జాగ్రత్త!

-మద్ది మురళి