రివ్యూ

నిరుత్సాహ పరిచే రోమాంటిక్ డ్రామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇగో * బాగోలేదు
తారాగణం:
ఆశిష్‌రాజ్, సిమ్రన్, దీక్షాసేథ్, పృథ్వీ, రావురమేష్ తదితరులు
ఎడిటింగ్: శివ వై ప్రసాద్
కెమెరా: జి.కె.ప్రసాద్
సంగీతం: సాయి కార్తీక్
నిర్మాత: విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుబ్రహ్మణ్యం

**************

మధ్య ఆకతాయి సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా అడుగు పెట్టిన ఇచ్చిన ఆశిష్‌రాజ్ తొలి సినిమాతోనే కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ చిత్రం తర్వాత ఆయన నటిస్తున్న రెండో చిత్రం ‘ఇగో’. సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎవరి ఇగో.. ఎవరికి ఇబ్బంది పెట్టిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
అమలాపురం అనే ఊళ్లో గోపి (ఆశిష్‌రాజ్)కి అక్కడే వుండే ఇందు (సిమ్రన్) అంటే అస్సలు పడదు. ఇద్దరిమధ్య తరుచూ గొడవలే. ఆమెను ఎప్పుడూ ఏడిపిస్తూ వుంటాడు. అందుకే ఇందుకు గోపి అంటే చాలా చిరాకు.. కోపం ఉంటుంది. గోపి నుండి అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ఇందు ఒక డాక్టర్‌ను పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. దాంతో గోపి కూడా ఇందుకంటే అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకోవాలని హైదరాబాద్‌కు వస్తాడు. ఈ నేపథ్యంలో ఇద్దరిమధ్య దూరం పెరగడంతో ఒకరంటే ఒకరికి అనుకోకుండా ఇష్టం పెరుగుతుంది. దాంతో ఇద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. ఒకరంటే ఒకరికి అస్సలు పడని ఆ ఇద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు అన్నది మిగతా కథ.
నటనాపరంగా.. చూడటానికి ఆకట్టుకునేలా హీరో ఆశిష్‌రాజ్ మొదటి సినిమా కంటే బెటర్‌గానే అనిపించాడు. అయితే డైలాగ్స్ విషయంలో ఇంకాస్త మెరుగుపరచుకుంటే బావుంటుంది. సినిమా చివరి 15 నిమిషాల పాటు రావురమేష్ పాత్ర అందర్నీ ఆకట్టుకుంటుంది. మొదటి భాగంలో థర్టీ ఇయర్స్ పృథ్వీ చేసిన కామెడీ కొంత పండింది. హీరో, పృథ్వీ గ్యాంగ్ నడుమ నడిచే ఫన్నీ సన్నివేశాలు నవ్వించాయి. పల్లెటూరి అమ్మాయిగా సిమ్రన్ అందంగా కనిపిస్తూనే మంచి నటన కనబరిచింది. ఇక దీక్షాసేథ్ కూడా మంచి పాత్రలోనే కనిపించి అటు నటన.. ఇటు గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సాంకేతికంగా చూస్తే సినిమా నిర్మాణ విలువలు ఫర్వాలేదనే స్థాయిలో ఉన్నాయి. సంగీతం ఓకె. రెండు పాటలు వినడానికి, స్క్రీన్‌పై చూడటానికి బాగున్నాయి. కెమెరా వర్క్ ఫర్వాలేదు. విలేజ్ సన్నివేశాల్లో కెమెరా పనితనం హైలైట్‌గా వుంది. కొన్ని సన్నివేశాలు అందంగా చూపే ప్రయత్నం చేసారు. ఇక దర్శకుడు సుబ్రహ్మణ్యం విషయానికొస్తే.. ఆయన ఎంచుకున్న కథాంశం కొత్తదేమీ కాదు. పైగా సరైన కథనం, సన్నివేశాలు, రొమాన్స్, ఇతర ఎమోషన్స్ లేకుండా చూపడంతో ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదు. దర్శకుడిలో వున్న క్లారిటీ మిస్ అయి సినిమా నిరాశగా మారింది. కథ విషయంలో ఎంతో కొంత కొత్తదనం చూపిస్తే బావుండేది. వెండితెరపై ఇలాంటి కథలతో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి. పైగా సన్నివేశాలను పండించడంలో కూడా దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. సినిమాకు ఖచ్చితంగా ఒక ఫ్లాట్ అనేది లేకపోవడమే పెద్ద డ్రాబ్యాక్. ఆరంభంలో విలేజ్ డ్రామాగా చూపించి మధ్యలో లవ్‌స్టోరీగా మార్చి ఆఖరులో మర్డర్ మిస్టరీ అని చెప్పడం, వాటిని కూడా సాగదీసి చూపించడంతో కొంత అసహనం రేకెత్తుతుంది. అంతేకాక, సినిమాలో చాలా లాజిక్ లేని సిల్లీ సన్నివేశాలు ఉంటాయి. కామెడీ పాత్రలు కూడా తరచూ వస్తూ పోతూ సినిమా అసలు కథను తప్పుదోవ పట్టించాయి. అప్పటివరకు ఒకరంటే ఒకరికి పడక కొట్టుకున్న హీరో హీరోయిన్లు ప్రేమలో పడే సన్నివేశం అస్సలు ఆకట్టుకోదు. అంతేగాక దర్శకుడు హీరో హీరోయిన్ల మధ్యనుండే ప్రేమ అనే కోణాన్ని సరిగా ఎలివేట్ చేయలేకపోయారు.
మొత్తంమీద ఈ ‘ఇగో’ చిత్రం ఆసక్తికరమైన అంశాలు లేక నిరుత్సాహపరిచే రొమాంటిక్ డ్రామాగా ఉంది. ఒక నిర్దిష్టమైన కథంటూ లేకపోవడం, సరైన సన్నివేశాలు, హీరో హీరోయిన్లమధ్య లాజిక్ లేని ప్రేమ లాంటి చాలా అంశాలు ప్రేక్షకుడిని కన్‌ఫ్యూజ్ చేస్తాయి. చివరి పదిహేను నిముషాల క్లైమాక్స్, అక్కడక్కడా నవ్వించే కామెడీ మినహాయిస్తే.. ఈ ఎమోషన్స్ లేని ప్రేమకథలో ఎంజాయ్ చేయడానికి ఏమీ దొరకదు. ప్చ్...!

-త్రివేది