రివ్యూ

టచ్ చేస్తే ఇక అంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* టచ్ చేసి చూడు
*
తారాగణం:
రవితేజ, రాశీఖన్నా,
సీరత్ కపూర్, జయప్రకాష్,
ఫ్రెడ్డీదారువాలా, మురళీశర్మ,
వెనె్నల కిషోర్, సత్యం రాజేష్,
అన్నపూర్ణ, సుహాసిని
తదితరులు.
కథ: వక్కంతం వంశీ
కథనం: దీపక్‌రాజ్
ఎడిటింగ్: గౌతం రాజు
సంగీతం: ప్రీతమ్ (జామ్8)
నేపథ్య సంగీతం: మణిశర్మ
కెమెరా: చోటా కె.నాయుడు
నిర్మాణం: లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ
దర్శకత్వం: విక్రమ్ సిరికొండ
*
మాస్ మహారాజా అంటూ ముద్దుగా అభిమానులు గొప్పలు చెప్పుకునే రవితేజ గతంలో మూడు నెలలకో సినిమా చేస్తూ బాక్సాఫీస్ వద్ద తెగ సందడి చేసేవాడు. అయితే రాను రాను బాక్సాఫీస్ అతడిని వెక్కిరించింది. పరాజయాలతో బోల్తాకొట్టించింది. దాంతో ఆ సందడికి దూరంగా ఉంటూ ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చాడు. ఇక లాభం లేదనుకున్న ఈ మాస్ హీరో గడిచిన ఏడాదే తన రూటును మళ్లీ గతంలోకి మార్చేశాడు. మునుపటి జోరును పెంచేశాడు. వరుసగా సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. దాంతో ఆయన సినిమాలు వరుసగా.. వేగంగా ప్రేక్షకుల్ని పలకరించడానికి వస్తున్నాయి. ‘రాజా ది గ్రేట్’ సినిమా ఇచ్చిన షాక్ నుంచి అతడి అభిమానులే కాదు, ప్రేక్షకులూ ఇంకా కోలుకోనేలేదు. సరిగ్గా ఈ సినిమా విడుదలైన మూడు నెలల తర్వాత ‘టచ్ చేసి చూడు’ అంటూ తొందరగానే మళ్లీ థియేటర్లలోకి అడుగుపెట్టాడు. సహజంగా రవితేజ పోలీసాఫీసర్ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఆయన నటించిన ‘విక్రమార్కుడు’, ‘పవర్’. ఆయా చిత్రాల్లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అభిమానులనే కాదు, ప్రేక్షకులను సైతం తన డేరింగ్.. డాషింగ్ నటనతో ఆకట్టుకున్నాడు. రవితేజ అంటేనే మాస్, కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్.. ఇవన్నీ పక్కాగా ఉంటాయని ప్రేక్షకుడు ఆశిస్తాడు. అతడి మార్క్ నటన చూసి ఎంజాయ్ చేయొచ్చునని అభిమానులూ ఆరాటపడతారు. మరి మరోసారి పోలీస్ అధికారి పాత్రలో ‘టచ్ చేసి చూడు’లో కనిపించిన రవితేజ ప్రేక్షకులను ఎంత మేరకు టచ్ చేశాడు? గతంలో మాదిరిగా పోలీస్ పాత్ర ద్వారా తన పవర్‌ని చూపించాడా? ఎప్పుడూ కొత్త దర్శకుల్ని ప్రోత్సహిస్తూ సాగే రవితేజ ఈ సారి మరో కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండకు ఇచ్చిన అవకాశాన్ని అతడు ఏ మేరకు ఉపయోగించుకున్నాడు? వక్కంతం వంశీ అందించిన కథ మాస్ మహారాజాను గట్టెక్కించిందా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
ఇండస్ట్రీస్ అధినేత కార్తికేయ (రవితేజ)కు తన కుటుంబం అంటే ఎంతో ప్రేమ. కుటుంబమే ప్రపంచం. బంధాలు.. అనుబంధాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తాడు. పాండిచ్చేరిలో ఒక పరిశ్రమను ఏర్పాటు చేసుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతుంటాడు. కుటుంబం కోసం పాటుపడుతూ, వారి కోసమే జీవించే స్వభావం వున్న వ్యక్తి. కుటుంబానికి చెడ్డపేరు తెచ్చే ఏ పని చేయకూడదని అనుకుంటాడు. ఆ విధంగా తన సహచరులు కూడా వుండాలనుకుంటాడు. తండ్రి (జయప్రకాష్) కొడుకు కోసం తెగ బాధపడిపోతుంటాడు. పెళ్లి పీటలెక్కాల్సిన కొడుకు ఆ ధ్యాసే లేకుండా కాలం గడపడం అతడి మనసుని తొలిచేస్తుంటుంది. తండ్రి బాధను గమనించిన కార్తికేయ ఇక లాభం లేదనుకొని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అందుకోసం పుష్ప (రాశీఖన్నా) అనే అమ్మాయిని పెళ్లిచూపుల్లో చూస్తాడు. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియని కార్తికేయ రెండు, మూడు సార్లు పుష్పని హర్ట్ చేస్తాడు. దాంతో ఆమె అతడిని పెళ్లి చేసుకోనని చెబుతుంది. కానీ మనసులో మాత్రం అతడంటే ప్రేమ ఉంటుంది. ఆ ఇష్టం కారణంగానే కార్తికేయకి వేరే అమ్మాయితో జరిగే పెళ్లి సంబంధాన్ని కూడా కావాలనే చెడగొడుతుంది. ఈ విషయం తెలుసుకున్న కార్తికేయ పుష్పతో పెళ్లిని నిరాకరిస్తాడు. మరోవైపు కార్తికేయ కంపెనీకి వచ్చే మిషనరీస్‌ను సెల్వమ్ అనే గూండా లాక్కెళ్లిపోతాడు. ఈ విషయం గురించి కార్తికేయ పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోరు. రెండు నిమిషాల్లో ఈ సమస్యను పరిష్కరించవచ్చునని పోలీస్ అధికారితో చెబితే వారికి తీవ్రంగా కోపం వచ్చి కార్తికేయకు రెండు నిమిషాల టైమ్ ఇచ్చి సమస్యను పరిష్కరించమని సవాల్ విసిరుతారు అధికారులు. అప్పుడే కార్తికేయ పవర్ ఏంటో తెలుస్తుంది. ఇంతలో అతడి చెల్లెలు ఓ యువకుడి హత్యను కళ్లారా చూస్తుంది. ఆ హత్యను తాను చూశానని, సాక్ష్యం చెబుతానని అన్నతో చెబుతుంది. ఆ హత్య చేసిన నిందితుడు ఇర్ఫాన్ లాలా (ఫ్రెడ్డీ దారువాలా) ఆ చూకీ తెలుసుకునే ప్రయత్నంలో అతనే ఎదురుపడతాడు. అయితే ఇర్ఫాన్ లాలాను కార్తికేయ అంతకు ముందే చంపేసినట్లు పోలీస్ రికార్డుల్లో ఉంటుంది. దాంతో కార్తికేయ కూడా ఆశ్చర్యపోయి అతడిని వేటాడటం మొదలెడతాడు. అసలు కార్తికేయకు ఇర్ఫాన్ ఎలా తెలుసు? అప్పటికే చనిపోయిన ఇర్ఫాన్ ఎలా తిరిగి వచ్చాడు? ఇర్ఫాన్ చనిపోయాడని కమిషనర్ (మురళీశర్మ) కార్తికేయకు ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది? ఇంతకీ కార్తికేయ గతం ఏంటి? అతడి జీవితంలో పుష్ప (రాశీఖన్నా), దివ్య (సీరత్‌కపూర్) ఎలా వచ్చారు? ముజఫర్ పేట గొడవలు ఏంటి? అక్కడ లాలా ఎవరు? గతంలో దివ్యతో నిశ్చితార్థం వరకు వచ్చిన కార్తికేయ పెళ్లి ఎందుకు ఆగిపోతుంది? ఎంతగానో ఇష్టపడ్డ దివ్య కార్తికేయను ఎందుకు వద్దనుకుంటుంది? అనే విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
స్వతహాగా రచయిత అయిన విక్రమ్ సిరికొండ వక్కంతం వంశీ కథతో చేసిన ఈ ప్రయోగంలో ఏ మాత్రం కొత్తదనం లేదు. రొటీన్‌గా సాగి పరమబోర్ కొట్టించింది. పక్కా సమరసింహారెడ్డి, ఇంద్ర లాంటి ఫ్యాక్షనిస్టు కథను, పోలీస్ కథగా మార్చి, పాత కథను ఇచ్చి ఇటు నిర్మాతలను, అటు రవితేజను వక్కంతం బోల్తాకొట్టించాడు. ఏ మాత్రం పసలేని కథను దర్శకుడు తెరకెక్కించిన విధానం ఏ వర్గాన్నీ టచ్ చేయలేకపోయింది. ఈ సినిమా చూశాక రవితేజ మళ్లీ పోలీస్ పాత్ర అంటే ప్రేక్షకులు ఇక జీర్ణించుకోరు. చీదరించుకోవడం ఖాయం.
రవితేజ శైలి, మాస్ కొలతలతో రూపుదిద్దుకున్న చిత్రమిది. ఫక్తు వాణిజ్య అంశాలతో కూడిన కథను ఎంచుకున్న దర్శకుడు ఆ విధంగా తెరకెక్కించడంలో పూర్తిగా తడబడ్డాడు. వక్కంతం వంశీ రాసిన కథలోగానీ, దీపక్‌రాజ్ తీర్చిదిద్దిన కథనంలో గానీ ఎక్కడా ప్రేక్షకులకు నచ్చే అంశాలేవీ కనిపించవు. మొత్తం రెండు హత్యలకు కారణమైన హంతకుడిని మట్టుబెట్టడంతో కథ ముగుస్తుంది. తొలి సగభాగం ఎక్కువగా సరదా సన్నివేశాలతో సాగింది. రాశీఖన్నా పెళ్లిచూపుల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు మరీ చీప్‌గా అనిపిస్తాయి. విరామానికి ముందు కథలో మలుపు ఆసక్తిని రేకెత్తించినా ద్వితీయార్ధం మొత్తం ఫ్లాష్‌బ్యాక్ నేపథ్యంలోనే సాగడంతో ప్రేక్షకుడికి పెద్ద సహన పరీక్షే పెట్టింది. ఏసీపీ కార్తికేయగా రవితేజ కథలోకి ప్రవేశించడం.. కథంతా ద్వితీయార్ధంలోనే ఉండడంతో పాటు రవితేజ శైలి మాస్ హంగామా అంతా రొటీన్‌గా అనిపిస్తుంది. ముఖ్యమంత్రి ర్యాలీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు మాత్రం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. క్లైమాక్స్ పేలిపోయింది.
నటీనటుల విషయానికొస్తే.. రవిజతే రెండు కోణాల్లో సాగే పాత్రను తనదైన స్టయిల్‌లోనే పోషించాడు. ఇలాంటి పోలీస్ పాత్రలు అతడికి కొట్టినపిండే. అది ఈ చిత్రంతో మరోసారి రుజువయింది కూడా. కామెడీ, యాక్షన్ సన్నివేశాల్లో తన మార్కును చూపిస్తూ పాత్రలో ఇమిడిపోయి నటించాడు. పెర్ఫామెన్స్ పరంగా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. అయితే గతంలో రవితేజ చేసిన తరహా రొటీన్ సీన్స్‌లో కనిపించటంతో కొత్తదనమేలేదు. రాశీఖన్నా.. రవితేజతో తొలి అర్ధ్భాగంలో పోటీపడి నటించింది. ద్వితీయార్ధంలో ఆమె పాత్ర కనిపించపోవడం కూడా పెద్ద మైనస్సే. మరో హీరోయిన్ సీరత్‌కపూర్ పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యం లేదు. ఓవర్ గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారిద్దరూ. నటించడానికి స్కోప్‌లేని కథానాయికల పాత్రలు చిత్రం సాగదీతకు మాత్రం బాగానే ఉపయోగపడ్డాయి. తండ్రి పాత్రలో జయప్రకాష్ ఆకట్టుకున్నారు. వెనె్నల కిషోర్, షాయాజీ షిండే, సత్యం రాజేష్, జీవా, విలన్‌గా నటించిన ఫ్రిడే, సుహాసిని, అన్నపూర్ణ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. డీజీపీగా మురళీశర్మకు మంచి క్యారెక్టర్ లభించింది. దానిని ఆయన తన సహజ ధోరణిలో కానిచ్చేశాడు.
సాంకేతికంగా చోటా కె.నాయుడు కెమెరా పనితనం బాగుంది. చిత్రంలో ఏ మాత్రం పసలేకున్నా కెమెరాలో అందంగా చూపించాడు. మణిశర్మ నేపథ్య సంగీతం బాగుంది. జామ్ 8 గ్రూప్ సంగీతంలో పాటలు గుర్తుండి పోయేలా లేవు. నిర్మాణ విలువలు రిచ్‌గానే చిత్రానికి తగ్గట్టుగానే వున్నాయి. విక్రమ్ సిరికొండకు ఇదే తొలి చిత్రమైనప్పుడు కథ.. కథనం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. రవితేజ లాంటి మాస్ ఇమేజ్ వున్న హీరోని డైరెక్ట్ చేస్తున్నప్పుడు దర్శకుడు లోతుగా ఆలోచించి ఆ విధంగా చిత్రాన్ని తెరకెక్కించాల్సింది పోయి తూతూ మంత్రంగా లాగించేసి చేతులు దులుపుకొని బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తాపడ్డాడు. శ్రీనివాస్ రెడ్డి, రవిరెడ్డి, మల్లు కేశవ్ అందించిన సంభాషణల్లో ఎక్కడా మెరుపులే కనిపించకపోగా, సినిమా చూసే ప్రేక్షకుల నెత్తిన ఉరుములు పడ్డట్టు తోచింది. రవితేజ నటన, హాస్యం, నేపథ్య సంగీతం, కెమెరా, యాక్షన్ పార్ట్ కుదిరినా, కొత్తదనం లేని కథ, కథనాలు, బలమైన ప్రతి నాయకుడు లేకపోవడం, క్లైమాక్స్ మరీ వీక్‌గా ఉండడం చిత్రానికి పెద్ద మైనస్‌గా నిలిచాయి. రవితేజ గత చిత్రాలనే పోలి వుండడం కూడా ఓ లోటే. ఎడిటింగ్ విషయంలో మరింత దృష్టి పెట్టాల్సింది.
మొత్తం మీద పోలీస్ అనేవాడు బాధ్యతల్ని, కుటుంబాన్ని బ్యాలన్స్ చేస్తూ ముందుకెళ్లాలని దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బావుంది. అయితే.. ఏదైనా ఓ సినిమాను తెరకెక్కించేముందు దర్శకుడు అనే వాడు కూడా కథ, కథనాలను బ్యాలన్స్ చేస్తూ ముందుకెళ్లాలన్న విషయాన్ని మాత్రం మరచిపోయినట్టుంది. హీరో తన ఐడెంటిటీని వదిలేసి గతాన్ని మర్చిపోయి కొత్త జీవితం గడపడం, మళ్లీ అతని గతంలోని ఒక వ్యక్తి కనిపించి తిరిగి ఆ పాత వ్యక్తి బయటకి రావడం.. ఇలాంటి త్రెడ్‌తో ఇప్పటికే మనం ఎన్నో చిత్రాలు చూసుంటాం. అరిగిపోయిన పాత కథలే ఇవి. ఇలాంటి కథల్ని సవ్యంగా చెప్పకపోతే ఒకే టికెట్‌పై రెండు సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుంది. హీరోని పవర్‌ఫుల్ పోలీస్‌గా చూపించడానికి, అతడిని ఎలివేట్ చేయడానికి తగ్గ సన్నివేశాలే లేవు. అందుకే తెలిసీ..తెలియక ఈ చిత్రాన్ని ఎవరైనా టచ్ చేస్తే ఇక అంతే!

-ఎం.డి అబ్దుల్