రివ్యూ

ప్రేమలో కథే లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* ఇది నా లవ్‌స్టోరీ
*
తారాగణం:
తరుణ్, ఓవియా,
మంచు మనోజ్ (అతిథి పాత్ర)
ఖయ్యూమ్, చిట్టిబాబు,
జగదీష్, అనిల్ తదితరులు
సంగీతం: శ్రీనాథ్ విజయ్
కెమెరా: క్రిస్ట్ఫోర్ జోసెఫ్
ఎడిటింగ్: శంకర్
నిర్మాణం: రామ్ ఎంటర్‌టైనర్స్
నిర్మాత: ఎస్.వి ప్రకాష్
దర్శకత్వం: రమేష్-గోపి
*
తెలుగు చిత్రసీమలో ప్రేమకథలు ఎప్పుడూ ఎవర్‌గ్రీనే. నాటి నుంచి నేటి వరకు ఇలాంటి చిత్రాల నిర్మాణం వేగంగా జరుగుతూనే ఉంది. యువతరం హృదయాలను కొల్లగొట్టాలంటే ప్రేమకథలే బెటర్ అని దర్శక, నిర్మాతలు సైతం గట్టిగా నమ్ముతున్నారు. ఫలితంగా వెండితెరపై ప్రేమకథలు కోకొల్లలుగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా తరుణ్ హీరోగా ‘ఇది నా లవ్‌స్టోరీ’ అంటూ మరో ప్రేమకథ ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలనటుడిగా మంచి పేరు తెచ్చుకున్న మాస్టర్ తరుణ్ హీరోగా మారిన తర్వాత నువ్వేకావాలి, నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు వంటి ప్రేమకథా చిత్రాలతో యువతరంలో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్నారు. అయితే అదే ఊపును కొనసాగించలేపోయాడు. మంచి కథలను ఎంచుకోవడంలో తడబడ్డాడు. వరుస పరాజయాలను ఎదుర్కోవడంతో బాక్సాఫీస్ అతడిని వెక్కిరించింది. ఒకప్పుడు లవర్‌బాయ్‌గా ఓ వెలుగు వెలిగిన తరుణ్, తర్వాత వరుస ఫ్లాప్‌లు ఎదురవ్వడంతో కష్టాల్లో పడ్డాడు. దాదాపు చిత్రసీమకు ఇక గుడ్‌బై చెప్పేశాడనుకుంటున్న సమయంలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు, గతంలోని తన స్థానాన్ని దక్కించుకునేందుకు మరో ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కన్నడంలో మంచి విజయాన్ని అందుకున్న ‘సింపుల్లాగ్ ఒంద్ లవ్‌స్టోరీ’ అనే చిత్రాన్ని తెలుగులో ‘ఇది నా లవ్‌స్టోరీ’ అనే పేరుతో తెరకెక్కించారు. రమేష్-గోపి దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాలా కాలం గ్యాప్ తర్వాత వచ్చిన తరుణ్‌కు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? ప్రేమికులంతా లవర్స్‌డేను జరుపుకుంటున్న వేళ థియేటర్లలో సందడి చేసిన ఈ ప్రేమకథా చిత్రం ఎలా ఉంది? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
తల్లిదండ్రులు లేని అభిరామ్ (తరుణ్) యాడ్ ఫిలిం డైరెక్టర్. అభిరామ్‌కి చెల్లెలంటే ప్రాణం. అందుకే చెల్లి ప్రేమించిన అబ్బాయితోనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. చెల్లి తనకు కాబోయే మరదలిని తన అన్న పెళ్లి చేసుకుంటే బాగుంటుందని వాళ్లిద్దరిని ఒకటి చేసే ప్రయత్నం చేస్తుంది. చెల్లెలి మాట కాదనలేక అభిరామ్..డాక్టర్ శృతిని చూసేందుకు ఒప్పుకుంటాడు. అలా వెళ్లే దారిలో ఓ అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. తీరా తనే శృతి (ఓవియా) అని తెలిసి ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇంట్లో వాళ్లంతా గుడికి వెళ్లారని రావడానికి చాలా టైమ్ పడుతుందని శృతి చెప్పడంతో ఈలోగా ఒకరి ఇష్టాఇష్టాలను ఇంకొకరు తెలుసుకోవచ్చని గతం గురించి మాట్లాడుకోవడం మొదలుపెడతారు. ఇద్దరు తమ తొలిప్రేమకథలను పంచుకుంటారు. అదే సమయంలో శృతి కూడా అభిరామ్‌తో ప్రేమలో పడుతుంది. మరసటి రోజు ఉదయం లేచేసరికి అభిరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. శృతి కంప్లయింట్ ఇచ్చినందుకే తనని అరెస్ట్ చేశారని తెలసి షాక్ అవుతాడు అభిరామ్. అసలు శృతి అలా ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది? అభిరామ్ చేసిన తప్పేంటి? చివరకు తను ప్రేమించిన అమ్మాయి శృతి అభిరామ్‌కి దక్కిందా? తదితర విషయాలను తెరపై చూడాల్సిందే.
ప్రేమకథలకు మంచి ఫీల్‌తో పాటు హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ముఖ్యం. మూడు కోణాల్లో ఓ ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే దర్శకుడు కేవలం సంభాషణలపైనే దృష్టిపెట్టడం వల్ల సినిమా పక్కదారి పట్టింది. సంభాషణలన్నీ సిల్లీగా అనిపిస్తాయి. తెరపై ప్రేమకథలు సాగే విధానం కూడా గందరగళమే. ప్రథమార్థంతో పోలిస్తే, ద్వితీయార్ధం కాస్త బెటర్. తరుణ్-ఓవియా జంట తెరపై అందంగా కనిపించినప్పటికీ వారిద్దరి మధ్య కెమిస్ట్రీని పండించడంలో దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడు. చాలా సన్నివేశాలు సంభాషణల వల్లే సాగదీసినట్టు అనిపిస్తాయి. కథలో కొత్తదనం అనిపించినా దాన్ని తెరపై సరైన రీతిలో ఆవిష్కరించలేపోయారు.
చాలా కాలం తర్వాత తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చిన తరుణ్ లవర్‌బాయ్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇలాంటి పాత్రల్లో జీవించడం అతడికి కొట్టినపిండే. కథా, కథనాల పరంగా పెద్దగా నటించడానికి స్కోప్ లేకపోయినా ఉన్నంతలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ప్రీ క్లయమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో తరుణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇందులో తరుణ్ మూడు షేడ్స్‌లో కనపడ్డాడు. ప్రాతల ప్రకారం తరుణ్ లుక్ బాగానే ఉంది. హీరో తెలివైన వాడు. అతని చుట్టూ ఉన్నవారంతా తెలివి తక్కువైన వారు అనేలా దర్శకుడు హీరో క్యారెక్టరైజేషన్‌ను డిజైన్ చేశారు. చెల్లెలంటే ప్రాణంగా ఉండే హీరోకి లైఫ్ అంటే లెక్క ఉండదు. అదేంటో మరి.. ప్రేమకంటే జీవితం గొప్పదే కానీ దాన్ని చూపించాల్సిన విధానం సరికాదనే భావన సగటు ప్రేక్షకుడికి గుర్తుకొస్తుంది. ఇక హీరోయిన్ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పాలంటే ప్రేమకథలో హీరోయిన్ ముఖ్యంగా మ్యాజిక్‌తో ముంచేయాలి. అలాంటి మ్యాజిక్ ఇందులో కనిపించదు. ఓవియా సగటు హీరోయిన్‌గానే అనిపించింది. క్యారెక్టర్‌కు న్యాయం చేసింది. బిగ్‌బాస్ వివాదాలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ గ్లామర్‌తో ఆకట్టుకుని నటనా పరంగా ఫర్వాలేదనిపించింది. తరుణ్, ఓవియా పాత్రలే సినిమాలో కీలకం. ఆ ఇద్దరి పాత్రలు మినహా తెరపై ఎప్పుడోగానీ, కొత్త పాత్ర కనిపించదు. అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడే హీరో చెల్లెలి పాత్ర తప్ప సినిమాలో మరే క్యారెక్టర్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక పాటల్లో మంచు మనోజ్ తన రియల్ లైఫ్ క్యారెక్టర్ హీరోగా తెరపై కనిపిస్తాడు. చిత్రంలో నటించిన ఖయ్యూమ్, అనిల్, జగదీష్ తమ పా త్రల్లో ఒదిగిపోయారు.
సాంకేతికంగా సినిమాకు పెద్దగా మార్కులేమీ పడవు. శ్రీనాథ్ విజయ్ అందించిన సంగీతం ఆకట్టుకోదు. క్రిస్ట్ఫర్ జోసెఫ్ ఛాయాగ్రహణం ఫర్వాలేదు. శంకర్ తన ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది. ఈ చిత్రాన్ని ఇద్దరు దర్శకులు తెరకెక్కించారు. వారికి ఇదే తొలి సినిమా. వాళ్ల అనుభవలేమి తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. దర్శకులు రమేష్-గోపి తీసుకున్నది రొటీన్ కథే అయినా కొత్తగా, ఆసక్తికరంగా అనిపించే స్క్రీన్‌ప్లే, అర్థవంతమైన సన్నివేశాలను, చక్కటి సంభాషణలు రాసుకోవాల్సింది. కానీ బోర్ కొట్టించే కథనం, చికాకు తెప్పించే సంభాషణలు చిత్రాన్ని ప్రేమలో కథే లేకుండా చేశాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నా ఫలితం లేకపోయింది. మొత్తానికి తరుణ్ నటన, క్లైమాక్స్ ట్విస్ట్ మినహా ఈ లవ్‌స్టోరీలో ఆకట్టుకునే అంశాలేవీ లేవు.

-ఎం.డి అబ్దుల్