రివ్యూ

కామెడీతో యుద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** కృష్ణార్జున యుద్ధం
**
తారాగణం:
నాని (ద్విపాత్రాభినయం),
అనుపమ పరమేశ్వరన్,
నాగినీడు, రుక్సర్ థిల్లాన్,
బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను,
సుదర్శన్, దేవదర్శిని తదితరులు.
**
సంగీతం: హిప్‌హాప్ తమిళ
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
కళ: సాహి సురేష్
నిర్మాణం: షైన్ స్క్రీన్స్
నిర్మాతలు:
హారీష్ పెద్ది, సాహు గారపాటి
కథ, మాటలు, కథనం, దర్శకత్వం:
మేర్లపాక గాంధీ
**
వినోదం కోసం నాని సినిమాలకు వెళ్లే ప్రేక్షకులున్నారు. అతడి సినిమా అంటేనే కచ్చితంగా వినోదం పంచుతుందనే బలమైన నమ్మకం వారికుంటుంది. టాలీవుడ్‌లో వరుస విజయాలతో యమజోరు మీదున్నాడు నాని. కథల ఎంపిక పరంగా, నటన పరంగా ఈ మధ్యకాలంలో అతడి సినిమాలు ఏ వర్గాన్నీ నిరాశపరచలేదు. ఒక మామూలు సినిమాని కూడా తన పెర్‌ఫార్మెన్స్‌తో విజయతీరాలవైపు చేరుస్తుంటాడు. అందుకే నాని సినిమాలపై చిత్ర పరిశ్రమ కూడా అంచనాలు పెంచుకుంటోంది. తన కెరీర్‌లో వరుసగా ఎనిమిది సక్సెస్‌లను చవిచూడడమంటే మాటలు కాదు. చేతలు కావాలి. అలాంటి చేతలను నాని టచ్‌చేసి రికార్డు సృష్టించాడు. కృష్ణ, అర్జున్ అనే రెండు విభిన్నమైన పాత్రలతో ద్విపాత్రాభినయం చేస్తుండడంఅంటేనే అందరూ నాని యుద్ధం ఎలా ఉండబోతోందోననే ఆసక్తిని పెంచుకున్నారు. ఇది వరకే అతడు జెండాపై కపిరాజు, జెంటిల్‌మెన్ చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశాడు. ఆ రెండు చిత్రాల్లో జెండాపై కపిరాజు పరాజయం అయితే, జెంటిల్‌మెన్ విజయతీరాలకు చేరింది. అలాగే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి హిట్ చిత్రాలతో మంచి ఊపుమీదున్న మేర్లపాక గాంధీ ఈ సారి నానితో జత కట్టాడు. మరి వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ ‘కృష్ణార్జున యుద్ధం’ ఎలా వుంది? నాని జైత్రయాత్రను కొనసాగించాడా? ముచ్చటగా మూడోసారి నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
చిత్తూరు జిల్లా అక్కుర్తి గ్రామంలో వుండే యువకుడు కృష్ణ (నాని) పొలాల్లో పక్షులు పంటను నాశనం చేయకుండా కాపు కాస్తుంటాడు. అతడికి నాటకాలంటే యమపిచ్చి. అంతేకాదు, ఊళ్లో వున్న అమ్మాయిలకు లవ్ ప్రపోజల్ చేస్తుంటాడు. దాంతో వారి దగ్గర అతడికి తిట్లు, చీవాట్లు తప్పవు. ఒక సందర్భంలో గ్రామ సర్పంచ్ (నాగినీడు) తన తల్లిని తిట్టాడని అతని కాలర్ పట్టుకుంటాడు. మనసులో ఏదీ దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పే మనస్తత్వం ఉన్న కృష్ణ.. సర్పంచ్ మనవరాలు రియా (రుక్సర్‌మీర్)ను చూసి ప్రేమలో పడతాడు. క్రమం గా కృష్ణ మంచితనం చూసి రియా కూడా అతడి ప్రేమలో పడుతుంది. కృష్ణ నిరుపేద కావడం ఇతరత్రా కారణాలతో ఆమె తాతయ్య ఆమెను హైదరాబాద్‌కు పంపేస్తాడు. ఈ కథకు సమాంతరంగా యూరప్‌లో అర్జున్ (నాని) పెద్ద రాక్‌స్టార్. అర్జున్‌కి అమ్మాయిలను ముగ్గులోకి దించే ప్లేబోయ్ మనస్తత్వం ఉంటుంది. ఓ సందర్భంలో సుబ్బలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్)ను చూసి ఆమెతో ప్రేమ లో పడతాడు. అయితే అర్జున్ ప్రేమను సుబ్బలక్ష్మి ఏ మాత్రం అంగీకరించదు. ఆమె హైదరాబాద్ బయలుదేరుతుంది. ఒక పక్క రియా.. మరో పక్క సుబ్బలక్ష్మిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. వారిని వెతుక్కుంటూ కృష్ణ, అర్జున్ ఇద్దరూ హైదరాబాద్ చేరుకుంటారు. ఇలా హైదరాబాద్‌కు చేరుకున్న కృష్ణ, అర్జున్‌లు కలుస్తారా? సుబ్బలక్ష్మి, రియాలు ఏమవుతారు? కృష్ణ, అర్జున్‌లకు ఒకే రకమైన సమస్య ఏర్పడుతుంది? అదేం సమస్య? ఆ సమస్యలోంచి ఇద్దరూ ఎలా బయటపడ్డారు? వీరిద్దరి మధ్య యుద్ధమే కృష్ణార్జున యుద్ధమా? చివరికి కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్రేమకథ, కామెడీ ఫార్ములా, ద్విపాత్రాభినయంతో తెలుగు చిత్రసీమలో ఇది వరకు చాలా సినిమాలే వచ్చాయి. ఇది టాలీవుడ్‌కు కొత్తేంకాదు. ఇదే తరహాలో వచ్చిన కథలు విజయానే్న అందుకున్నాయి. మళ్లీ అదే కానె్సప్ట్‌తో సేఫ్‌గేమ్ ఆడి మేర్లపాక గాంధీ ప్రయోగమే చేశాడు. తనకు కలిసి వచ్చిన కామెడీతోనే చిత్రాన్ని ఆద్యంతం నడిపించే ప్రయత్నం చేశాడు. స్క్రీన్‌ప్లే కాస్త కొత్తగా వున్న కథను నడిపే విధానంలో గాంధీ ఇంకా శ్రద్ధ పెట్టాల్సింది. ఒకే సమయంలో కృష్ణ, అర్జున్‌ల ప్రేమకథను నడిపించడం బాగుంది. పంచ్ డైలాగ్‌లు కూడా పేలాయి. ఇక ప్రేమకథలో ప్రతి నాయకులు ఉండాలి కదా అని ఊరికే పెద్ద పెద్ద విలన్లను పెట్టకుండా.. విలన్ అనే కానె్సప్ట్‌లో వారిని అంతం చేస్తూ సమాజానికి సందేశమిచ్చేట్టుగా వారి కథను ముగించడం అంత ఆసక్తికరంగా అనిపించలేదు. కొన్ని సన్నివేశాలతో మహిళల అక్రమ రవాణా వల్ల ఎన్ని బాధలు అనుభవిస్తారో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. నాని సినిమాలో ఇంతకు ముందెన్నడూ లేనటువంటి భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. చాలా సింపుల్‌గా సాగే కథ ఇది. తొలి సగ భాగం సన్నివేశాల్లో హాస్యం ఉంటే.. ద్వితీయార్థంలో అసలు కథ ఉంటుంది. ఆరంభ సన్నివేశాలు సాదాసీదాగా అనిపించినా, కథ ముందుకు నడుస్తున్న కొద్దీ, కృష్ణ పాత్ర, అతడి అల్లరి, అతను పలికే చిత్తూరు యాస నవ్వులు పంచుతుంది. మరో పక్క రాక్‌స్టార్ అర్జున్ ప్లేబాయ్‌గా సందడి చేస్తుంటాడు. ఈ పాత్రలో నాని పెద్దగా ఆకట్టుకోడు. బ్రహ్మాజీ సంగీతం అంటే చెవి కోసుకునే సుబ్బలక్ష్మి పిన్ని (దేవదర్శిని) నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు వినోదాన్ని పంచుతా యి. కేవలం వినోదమేనా అని అనుకుంటున్న క్రమంలో కథ మలుపు తిరుగుతుంది. ఇద్దరు హీరోయిన్‌లు, హీరోలు ఒకే విధమైన సమస్యలో చిక్కుకుంటారు. దీంతో కథ హైదరాబాద్‌కు చేరుకుని, తర్వాత ఎంటనే ఆసక్తి రేకెత్తిస్తుంది. అయితే ఆ ఆసక్తికి తగ్గట్టుగా ద్వితీయార్థంలో బలం లేకపోవడం సినిమాను కాస్త నీరస పరిచింది. తాము ప్రేమించిన అమ్మాయిలను హీరోలు రక్షించడమే అసలు కథ. ప్రథమార్థంతో పోలిస్తే వినోదం పాళ్లు తగ్గడంతోపాటు, కథలోనూ పెద్దగా విషయం లేకపోవడంతో సినిమా సాగదీతగా అనిపిస్తుంది. అయితే ఆరంభం నుంచి చివరి వరకూ కృష్ణ పాత్రలో నాని తనదైన నటనను ప్రదర్శించడం సినిమాకు కలిసొచ్చే విషయం. నాని రెండు పాత్రల్లో ఒదిగిపోయినా, కృష్ణగానే ఎక్కువగా ఆకట్టుకుంటాడు. ఊళ్లో అల్లరి చిల్లరగా తిరిగే కృష్ణ పాత్రలో నాని ఇరగొట్టేశాడు. చిత్తూరు యాసలో సహజంగా ఒదిగిపోయాడు. అక్కడి కట్టు, మాటతీరుతో మాస్ లుక్కులోకి మారిపోయాడు. ఊళ్లో తన స్నేహితులతో కలిసి పండించిన వినోదం ఆద్యంతం నవ్వులు పంచుతుంది. కథానాయికలు అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ థిల్లాన్ ఇద్దరూ అందంగా కనిపించి నటనతో ఆకట్టుకున్నారు. వారి పరిధి మేరకు నటన కనబరిచారు. ప్రథమార్థంలో బ్రహ్మాజీ, నాని స్నేహితులుగా కనిపించిన నటులు, సుబ్బలక్ష్మి పిన్నిగా నటించిన దేవదర్శిని, ప్రభాస్ శ్రీను తదితరులు వినోదాన్ని పంచారు. సాంకేతికంగా సినిమా బాగుంది. కార్తీక్ ఘట్టమనేని కెమెరాతో యూరప్‌తో పాటు చిత్తూరు జిల్లా పల్లె అందాలను తన కెమెరాలో అంతే అందంగా బంధించారు. హిప్‌హాప్ తమిళ స్వరపరచిన పాటలు ఓకే అనిపించాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. కథానాయకుల పాత్రలను సమాంతరంగా నడిపించిన విధానం, కామెడీ విషయంలో దర్శకుడి పనితనం కనిపిస్తుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. మొత్తం మీద కృష్ణార్జునుల యుద్ధం భలే గమ్మత్తుగా ముగిసింది.

-రతన్