రివ్యూ

‘భరత్’ మెప్పించాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది*** భరత్ అనే నేను
***
తారాగణం:
మహేష్‌బాబు, కియారా అద్వానీ,
ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, ఆమని,
సితార, పోసాని కృష్ణమురళి,
రవిశంకర్, జీవా, రావురమేష్,
దేవరాజ్, అజయ్, బ్రహ్మాజీ తదితరులు.

ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్ర్తీ
నిర్మాణం: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: డి.వి.వి దానయ్య
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్,
కెమెరా: రవి కె.చంద్రన్, తిరు
దర్శకత్వం: కొరటాల శివ
***
తెలుగు చిత్రసీమలో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్‌లతో యయజోరు మీదున్నాడు దర్శకుడు కొరటాల శివ. టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన మహేష్‌బాబు సినిమా అంటే ప్రేక్షకుల్లోనే కాదు.. బిజినెస్ వర్గాల్లోనే మంచి క్రేజ్ ఉంటుంది. గతంలో వీళ్లిద్దరూ కలిసి చేసిన ‘శ్రీమంతుడు’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఈ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఎలాంటి అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులను అలరించేందుకు మహేష్ చేసిన ప్రయోగాలు తెలుగులో మరో హీరో చేయలేదంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అలాంటి ఈ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘్భరత్ అనే నేను’ అంచనాలను రెట్టింపు చేసింది. అదీ కాకుండా ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తుండటంతో సినిమా ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి ఇటు పరిశ్రమలో, అటు అభిమానుల్లో నెలకొంది. దర్శకుడు కొరటాల శివకి ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్‌తో తాను చేస్తున్న సినిమాపై వుండే అంచనాలు ఏ స్థాయిలో వుంటాయనేది తెలుసు. అందుకు తగ్గ సినిమాని అందించడానికి తను పడాల్సిన తపన, చేయాల్సిన కృషి ఎంతో వుంటుందన్నది కూడా ఆయన ఊహించుకోగలడు. మరి ‘్భరత్ అనే నేను’ వీరి అంచనాలను అందుకుందా? ముఖ్యమంత్రిగా మహేష్ ఏ మేరకు అలరించాడు? భరత్ అనే అతడి క్యారెక్టర్ అభిమానులకు ఎలాంటి అనుభూతిని మిగిల్చింది? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
భరత్ రామ్ (మహేష్‌బాబు) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాఘవ (శరత్‌కుమార్) తనయుడు. తండ్రి రాఘవ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో నవోదయం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా ఎదుగుతాడు. భరత్‌కు ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవటమంటే చాలా ఇష్టం. అందుకోసం లండన్ వెళ్లిన భరత్ అక్కడ ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీలో డిగ్రీల మీద డిగ్రీలు పుచ్చుకుంటాడు. అలాంటి సమయంలో తన తండ్రి హఠాన్మరణంతో లండన్ నుంచి ఇంటికి వస్తాడు. తండ్రి మరణం అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ముఖ్యమంత్రి రాఘవ మృతితో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలవుతాయి. రాఘవ మరణానంతరం ఆ పదవి ఎవరికి దక్కాలనే దాని సంశయం ఏర్పడుతుంది. అప్పుడు పార్టీలో చీలిక రాకుండా ఉండేందుకు వరదరాజులు అలియాస్ నానాజీ (ప్రకాశ్‌రాజ్) నిర్ణయం మేరకు పార్టీ వాళ్లు అంతా కలిసి భరత్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. అలా రాజకీయాల గురించి, రాష్ట్ర పాలన గురించి, పార్టీలోని రాజకీయ నాయకుల గురించి ఏ మాత్రం అవగాహన లేని భరత్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అదుపు తప్పిన ప్రజాజీవితాన్ని తన మొండి నిర్ణయాలతో గాడిన పెట్టే ప్రయత్నం చేస్తాడు. భరత్ దూకుడు స్వభావం రాష్ట్ర రాజకీయ వ్యవస్థమీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత కుమారుడి కేసులో భరత్‌కు తొలి ఎదురుదెబ్బ తగులుతుంది. ప్రజల నుంచి భరత్‌కు మద్దతు పెరుగుతున్నా.. సొంత పార్టీ నుంచే ప్రతిఘటన ఎదురవుతుంటుంది. ఈ పోరాటంలో భరత్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? అతడికి ఎదురైన అవాంతరాలేంటి? వాటిని ఎలా అధిగమించాడు? వసుమతి (కియారా అద్వానీ)తో ప్రేమకథ ఎలా మొదలైంది? ఇంతకీ తండ్రి రాఘవ మరణం వెనకున్న రహస్యమేమిటి? చివరకు భరత్ తను అనుకున్న గమ్యాన్ని చేరుకున్నాడా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
మహేష్‌బాబు ఇమేజ్‌కు తగ్గట్టుగా కమర్షియల్ సన్నివేశాలు రాసుకున్న దర్శకుడు దీనిని పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించి నూటికి నూరుపాళ్లు మరో సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. రాజకీయ నేపథ్యంతో సాగే చిత్రం అనగానే ఇందులో సందేశాలు.. భారీ ఉపన్యాసాలు.. రాజకీయ నాయకులమీద విమర్శల వర్షం ఉంటుందని సహజంగానే అందరూ అనుకుంటారు. కానీ ఆ ఊసే ఎక్కడా కనిపించదు. సాఫీగా అలా సాగిపోతుంది. మాస్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమాని తీర్చిదిద్దాడు దర్శకుడు కొరటాల. భరత్ ముఖ్యమంత్రి అయ్యాక కథ వేగం పుంజుకుంటూ ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యమంత్రిగా భరత్ తీసుకునే నిర్ణయాలు చూడడానికి ఆసక్తికరంగా, షాకింగ్‌గా అనిపిస్తాయి. ముఖ్యమంత్రి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అలా అక్కడక్కడ వినోదాన్ని మిస్ కాకుండా తనదైన శైలిలో మేళవించాడు. వసుమతితో ప్రేమకథ కావాల్సినంత వినోదాన్ని పంచింది. ముఖ్యంగా ‘్భరత్ అనే నేను’ పాట బ్యాక్ గ్రౌండ్‌లో హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం బావుంది. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో ఊపుమీదున్న కొరటాల..మహేష్‌తో చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది. సమకాలీన రాజకీయ అంశాలు.. వాటికి తగ్గట్లు కమర్షియల్ అంశాలను జోడించి ప్రేక్షకులను మైమరిపించాడు. రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి అయిపోవడం.. త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని అందరినీ ఇబ్బంది పెట్టడం..అసెంబ్లీలో సరదాగా సాగిపోయే సన్నివేశాలు.. ఇవన్నీ సెకండాఫ్‌ను నిలబెట్టాయి. కొరటాల మార్క్ డైలాగ్స్.. మహేష్ ప్రజెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ప్రజా సమస్యల్ని ఆధారం చేసుకుని కొరటాల రాసిన ప్రతి సన్నివేశం, వాటికి చూపిన పరిష్కారాలు సమ్మతంగా అనిపిస్తూ ప్రేక్షకులకు బాగా కనెక్టవుతాయి. అయితే క్లైమాక్స్ మాత్రం అభిమానులు ఆశించిన స్థాయిలో లేదు. భరత్ ముఖ్యమంత్రిగా రాజీనామా.. తిరిగి పగ్గాలు చేపట్టడం లాంటి సన్నివేశాల్లో దర్శకుడు నాటకీయత ఎక్కువగా జోడించాడు. విశ్రాంతి దగ్గరా పెద్ద మలుపులు ఏవీ లేవు. అయినా ద్వితీయార్థం పూర్తిగా మాస్‌కు నచ్చేలా తీర్చిదిద్దాడు. ‘రాచకొండ’ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎపిసోడ్స్ మహేష్ అభిమానులను, యాక్షన్ ప్రియులకు బాగా నచ్చుతాయి. అక్కడి నుంచి కథ వేగమే మారిపోయింది. పాటలను, పోరాట దృశ్యాల్ని, మాస్ ఎలిమెంట్స్‌ని రాజకీయాల్ని, చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ద్వితీయార్థం సాగిపోతుంది. ప్రెస్‌మీట్ ఎపిసోడ్ మొత్తం క్లాప్స్ కొట్టిస్తుంది. మీడియాను సైతం కార్నర్ చేస్తూ రాసుకున్న డైలాగ్‌లు ఆలోచింపజేస్తాయి. ప్రెస్‌మీట్ దృశ్యం సరాసరి మనమే ప్రస్తుత మీడియా వ్యవస్థని, దానిని ఎంజాయ్ చేస్తోన్న ప్రజలని ప్రశ్నిస్తున్నంత సహజంగా అనిపిస్తుంది. పర్సనల్ వ్యవహారాల్లో తలదూర్చే మీడియాకి చురకలు అంటించిన విధానం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతుంది. మహేష్ అత్యంత ఎమోషనల్ పెర్‌ఫార్మెన్స్‌తో రక్తికట్టించిన ఈ సన్నివేశం ఈ చిత్రానికే హైలైట్‌గా నిలిచింది. సినిమాకి ప్రధాన బలం నిస్సందేహంగా మహేష్‌బాబే. ముఖ్యమంత్రి పాత్రలో అతడు ప్రదర్శించిన నటన అద్భుతంగా పండి సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. కథ పరంగా చూస్తే సినిమా మామూలుగానే ఉంటుంది. కానీ దానికి మహేష్ పెర్ఫార్మెన్స్‌ను యాడ్ చేసి చూస్తే మాత్రం గొప్పగా ఉంటుంది. అంతలా సినిమాను నిలబెట్టే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు మహేష్. విదేశాల్లో చదువుకుంటూ, రాజకీయాల గురించి అస్సలు అవగాహన లేని ఒక మామూలు కుర్రాడు ముఖ్యమంత్రి అయితే ఎలా నడుచుకుంటాడు, పరిపాలన ఎలా సాగిస్తాడు, వ్యవస్థలో అందరికీ జవాబుదారీతనం అలవడేలా ఎలా పనిచేస్తాడు, ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడతాడు అనే సున్నితమైన అంశాల్ని మహేష్ తన నటనతో తెరమీద పలికించిన విధానం వండర్. భరత్ రామ్‌గా మహేష్‌బాబు నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన కథను పూర్తిగా తన భుజాల మీదే నడిపించాడు. ముఖ్యమంత్రి పాత్రకు కావాల్సిన హుందాతనం చూపిస్తూనే, స్టయిలిష్‌గా, రొమాంటిక్‌గానూ ఆకట్టుకున్నాడు. యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. తన కెరీర్‌లోనే మరచిపోలేని బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా తన అభిమానులను అలరిస్తాయి. ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్ అత్యుత్తమ నటన ఈ సినిమాలో కనిపిస్తుంది. అతడు నటించిన ఉత్తమ చిత్రాల జాబితాలో ‘్భరత్ అనే నేను’ కచ్చితంగా ఉంటుంది. సంభాషణలు పలికే విధానంలో మహేష్ కొత్తగా అనిపిస్తా డు. ఇక ఎమోషన్ సన్నివేశా లు, ఎంటర్‌టైన్‌మెంట్ పంచేటప్పుడు మరోసారి తనదైన మా ర్కువేసి చెలరేగిపోయాడు. హీరోయిన్‌గా నటించిన కియా రా అద్వానీకి ఇది తొలి తెలుగు చిత్రం. మహేష్ సరసన చాలా క్యూట్‌గా కనిపించింది. ఆమెది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. ఈ మధ్య మనం చూస్తున్న చిత్రాల్లోని హీరోయిన్‌ల కంటే చాలా బెటర్‌గా అనిపించింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసి మహేష్ సరసన కనిపించి మంచి మార్కుల్ని కొట్టేసింది. గాడ్‌ఫాదర్ పాత్రలో ప్రకాశ్‌రాజ్ మెప్పించాడు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టినపిండే. ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీగా బ్రహ్మాజీ, రాజకీయ నాయకుడు పోసానీ కృష్ణమురళి కామెడీ ట్రాక్‌లు ఆకట్టుకున్నాయి. శరత్‌కుమార్, ఆమని, సితార, అజయ్, రావు రమేష్, దేవరాజ్, జర్నలిస్ట్‌గా నటించిన సూర్య తమ పాత్రల మేర అలరించారు. మిగిలిన ఏ పాత్రనూ దర్శకుడు తక్కువ చేయలేదు. కథకు అవసరమైన మేరకు అందరి నుంచి తగిన నటనను రాబట్టుకున్నాడు. సాంకేతికంగా సినిమా అత్యున్నత స్థాయిలో వుంది. ముఖ్యంగా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సందర్భానుసారమైన పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ‘్భరత్ అనే నేను’, ‘వచ్చాడయ్యా సామి’ పాటలను సరైన సమయంలో వాడుకున్నాడు దర్శకుడు. ఈ రెండు పాటలు హీరోయిజాన్ని అత్యున్నత స్థాయిలో చూపించే పాటలే. ‘వసుమతి’ పాటలో రామజోగయ్య శాస్ర్తీ సాహిత్యం అర్థవంతంగా ఉంటుంది. మూడు యాక్షన్ ఎపిసోడ్స్‌ను తీర్చిదిద్దిన విధానం బాగుంది. మరీ హింస, రక్తపాతం జోలికి వెళ్లకుండా క్లాస్ ప్రేక్షకులకు కూడా నచ్చేలా తెరకెక్కించాడు దర్శకుడు కొరటాల. సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్, తిరునవుక్కరసుల కెమెరా పనితనం చాలా గొప్పగా వుంది. ముఖ్యంగా ఫైట్స్, పాటలు, అసెంబ్లీ సన్నివేశాలను బాగా చూపించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు చాలా ఉపయోగపడింది. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ వేసిన అసెంబ్లీ సెట్, ‘వచ్చాడయ్యా సామి పాటలో..’ దేవాలయం సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక నిర్మాత డి.వి.వి దానయ్య అయితే ఎక్కడా తగ్గకుండా ఖర్చుపెట్టే గొప్ప గౌరవప్రదమైన సినిమాను అందించారు. నాయకులు లేని సమాజాన్ని రూపొందించడమే ఉత్తమ నాయకుడి లక్షణం, ఇచ్చిన మాట మీద నిలబడాలనే అంశాలను దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథ ఇది. మొత్తం మీద కథుకుడిగా, దర్శకుడిగా కొరటాల శివ మరోసారి రాణించాడు. ఒక స్టార్ హీరో నుండి అభిమానులు, ప్రేక్షకులు ఏ స్థాయి సినిమానైతే ఆశిస్తారో అలాంటి సినిమానే అందించి మెప్పించాడు. *

-ఎం.డి అబ్దుల్