రివ్యూ

మహానటికి మళ్లీ జీవం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

**** మహానటి

తారాగణం:
======
కీర్తిసురేష్, దుల్కర్ సల్మాన్,
సమంత, విజయ్ దేవరకొండ,
రాజేంద్రప్రసాద్, భానుప్రియ,
తులసి, దివ్యవాణి,
తనికెళ్ల భరణి, నరేష్,
మాళవికా నాయర్,
షాలినీ పాండే,
మోహన్‌బాబు, నాగచైతన్య,
ప్రకాష్‌రాజ్, క్రిష్,
శ్రీనివాస్ అవసరాల,
సందీప్ వంగా,
తరుణ్ భాస్కర్ తదితరులు.
సంగీతం: మిక్కీ జె. మేయర్
సినిమాటోగ్రఫీ: డానీ శాంజెక్ లోఫెజ్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
కళ: అవినాశ్
మాటలు: సాయి మాధవ్ బుర్రా
సాహిత్యం: సిరివెనె్నల సీతారామశాస్ర్తీ,
రామజోగయ్య శాస్ర్తీ
నిర్మాణం: వైజయంతీ మూవీస్,
స్వప్న మూవీస్
నిర్మాతలు: ప్రియాంకదత్, స్వప్నాదత్
దర్శకత్వం:
నాగ్ అశ్విన్

సావిత్రి కథ ఓ ఉద్వేగం.. ఓ ఉల్లాసం.. ఓ విషాదం... వెండితెరపై అభినయంతో కట్టిపడేసిన ఓ నటి వెనుక ఇంత కథ ఉందా? అంటూ విస్మయపరిచిన ఓ ప్రయాణం. జీరో నుంచి వంద వరకూ ఎదిగే ప్రయాణమే విజయం. వంద నుంచి జీరోకు పడిపోవడం పతనం. వీటి మధ్య ఊగిసలాడే ప్రతి జీవితం ఓ పాఠం. ‘మహానటి’ సావిత్రి జీవితం అలాంటి గుణ పాఠమే. సావిత్రి అంటే ఓ ‘మాయాబజార్’ శశిరేఖ. సావిత్రి అంటే ‘దేవదాసు’లోని పార్వతి. సావిత్రి అంటే మేరీ ‘మిస్సమ్మ’. సావిత్రి అంటే నింగిలోని నక్షత్రం!
కానీ అసలు సావిత్రి వేరు. సావిత్రి అంటే విఫలమైన ఓ ప్రేమ. సావిత్రి అంటే నమ్మక ద్రోహులకు బలైన సగటు మహిళ. సావిత్రి అంటే అగాధాన్ని అక్కున చేర్చుకున్న అమాయకురాలు. సావిత్రి అంటే విషాదాన్ని విషంగా మార్చుకుని గొంతులోనే దాచుకున్న విధి వంచిత. సావిత్రి అంటే నేలకు రాలిన ఓ మహావృక్షం. ఎవర్‌గ్రీన్ అందాల రాశి మహానటి సావిత్రి జీవితం ఆధారంగా బయోపిక్ వస్తుందంటేనే అందరిలో ఏదో ఒక ఆలోచన.. తెలియని అలజడి.. ఏం చెప్పబోతున్నారో.. ఏం తీయబోతున్నారోనన్న ఆందోళన అందర్నీ ఊపిరి బిగపట్టేలా చేసింది. చాలా వరకు మరుగున పడ్డ విషయాలను సినిమాగా మలుస్తారా? అనే సందేహాలు మొదలయ్యాయి. అలనాటి స్టార్ హీరోయిన్ సావిత్రి జీవిత కథతో సినిమా రూపొందిస్తానని దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రకటించగానే అసలు సావిత్రి బయోపిక్ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంటి? ఆ మహానటి జీవితంలో దాగిన విషయాలను ఏమైనా తెరపై చూపిస్తారా? ఉన్నది ఉన్నట్లు చూపిస్తారా? లేదా? ఏమాత్రం అనుభవం లేని ఓ దర్శకుడికి సావిత్రి జీవితాన్ని సినిమాగా మలిచే దమ్మూ, ధైర్యం ఉందా? లాంటి అనేక ప్రశ్నలు మదిని తొలిచాయి. జీవిత చరిత్రలను సినిమాలుగా మలచడం అంటే సాధారణ సినిమాలు తీసినంత సులభమైతే కాదు. ఎందుకంటే విషయ సంగ్రహణ చేసుకున్న తర్వాత అందులో ఎటువంటి వివాదం లేకుండా.. ఎవరి మనసూ నొప్పించకుండా.. అందరికీ నచ్చేలా చిత్రాన్ని తెరకెక్కించాలి. అలాంటి కత్తిమీద సామే ఈ మధ్య వార్తల్లో నిలిచిన ‘మహానటి’ బయోపిక్. జీవితం తెరపై ఆవిష్కృతమవుతోంటే కళ్లకి, మనసుకి పక్కన ఏం జరుగుతోందనే ధ్యాస ఉండదు. మహానటి సావిత్రి జీవిత కథని తీద్దామని తలపెట్టి ఆమె జీవితానికే ఒక నివాళిని ఇచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్. తను తెలుసుకున్న ఓ మహానటి మహోన్నత జీవిత చరిత్రని ప్రపంచానికి కళ్లకి కట్టినట్టు, కన్నీళ్లొచ్చేట్టు చూసిన కళ్లలో కలకాలం నిలిచిపోయేట్టు చేశాడు. జీవిత కథ చెప్పడం వేరు.. తన కోణంలో కథ చెబుతూ ఇది జీవితమే అనిపించడం వేరు. బయోపిక్‌లు చాలానే వస్తుంటాయి. కానీ నాగ్ అశ్విన్ దృక్కోణంలో ‘మహానటి’ జీవితం మొదలవడమే మనల్ని మరో లోకంలోకి, మనకు తెలిసిన సావిత్రి గురించి మనకు తెలియని ప్రపంచంలోకి తీసుకుపోతుంది. ఇప్పటి తరం సావిత్రి పేరు విని ఉండొచ్చు. ఆమె ఫొటోనో, ఎక్కడో ఒక సందర్భంలో ఆమె నటించిన సినిమానో చూసి ఉండవచ్చు. కానీ ఆమె పూర్తిస్థాయి జీవితం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ సినిమా ద్వారా దర్శకుడు రీసెర్చ్ చేసి సంపాదించిన విషయాలతో ‘మహానటి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. నటీనటుల ఎంపిక దగ్గరి నుంచి ప్రచార చిత్రాల వరకూ ప్రతిదీ విభిన్నంగా తీర్చిదిద్దారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కథానాయికకు సూపర్‌స్టార్ స్టేటస్ అందించిన తొలితరం హీరోయిన్ సావిత్రి. తరాలు మారినా చెరిగిపోని, మాసిపోని, మెరుపుపోని నటనాచాతుర్యం ఆమెది. కళ్లతోనే హావభావాలు పలికించగలిగిన అతికొద్ది మంది నటీమణుల్లో సావిత్రిది అగ్రస్థానం. తొలితరం కథానాయికల తర్వాత తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఓ వెలుగు వెలిగిన ధృవతార సావిత్రి. ఆమె కన్నా ముందు చిత్ర పరిశ్రమలో చాలా మంది కథానాయికలు ఉన్నారు. ఆ తర్వాత చాలా మంది వచ్చారు. కానీ, సావిత్రి మాత్రమే ‘మహానటి’ అయ్యారు. ఎన్నో అద్భుత పాత్రలతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న సావిత్రి నిజ జీవితం కూడా సినిమా కథలాగే సాగింది. అత్యున్నత శిఖరాలను చూసిన ఆ మహానటి చివరి రోజుల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అయితే ఆ మహానటి జీవితంపై ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వాటి లో ఏది నిజం? ఏది అబ ద్ధం..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు తెరరూపమే ‘మహానటి’. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంది? అలనాటి అందాల రాశిని ఈ తరానికి పరిచయం చేసేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిం ది? సావిత్రిగా టైటిల్ పాత్రను పోషించిన కీర్తిసురేష్ ఏ మేరకు ఆకట్టుకుంది? అతిరథ మహారథులు పోషించిన అతిథి పాత్రలు ఎలా ఉన్నాయి? మరి ఈ ‘మహానటి’ సావిత్రి జీవితాన్ని తెరపై ఎలా ఆవిష్కరించిందో చూద్దాం...
తీవ్ర అనారోగ్యం పాలై అపస్మారక స్థితిలో ఉన్న సావిత్రి (కీర్తి సురేష్)ను బెంగళూరులోని చాళుక్య ఆసుపత్రిలో చేరుస్తారు. ఆమె ఎవరో తెలియకుండా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం చేస్తుంటే ఒక లేడీ డాక్టర్ సావిత్రిని గుర్తించి వెంటనే ఎమర్జెన్సీ వార్డులో చేరుస్తుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న సినీ అభిమానులు ఆసుపత్రికి పోటెత్తుతారు. అప్పటి నుంచి ఏడాది పాటు ఆమె కోమాలోనే ఉండిపోతుంది. స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఆమె కోమా స్టేజ్‌లో హాస్పిటల్‌లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? అసలేం జరిగింది? అనే దానిపై ప్రజావాణి పత్రిక న్యూస్ కవర్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంది. ఆ సమయంలోనే ఆ పత్రికలో విలేకరిగా చేరుతుంది మధురవాణి (సమంత). ఆమెకు సావిత్రి కథ రాసే బాధ్యతను అప్పగిస్తారు. ఫొటో జర్నలిస్ట్ విజయ్ ఆంటోనీ (విజయ్ దేవరకొండ)తో కలిసి ఆమె పరిశోధన మొదలు పెడుతుంది. అదే సమయంలో సావిత్రి పెద్దమ్మ (్భనుప్రియ) సావిత్రి కొడుక్కి అతని తల్లి గొప్పతనం గురించి చెప్పడంతో కథ ప్రారంభమవుతుంది. విజయవాడలో బాల్యదశ నుంచి సావిత్రి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం క్రమంగా స్టార్ హీరోయిన్‌గా ఎదగడం.. అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న జెమినీ గణేశన్‌ను వివాహం చేసుకోవడం.. అందాల నటిగా తిరుగులేని వైభవాన్ని చూడటం.. అంతలోనే భర్తతో విభేదాలు రావడం.. తాగుడుకు బానిస కావడం.. చివరకు కోమాదశలో ప్రాణాలు విడిచిపెట్టడం.. ఇలా మహానటి సావిత్రి జీవితంలో వివిధ కోణాలను యూనిట్ అందంగా ఆవిష్కరించింది. అసలు సావిత్రికి భర్తతో ఎందుకు విభేదాలు వచ్చాయి? ఆమె ఎందుకు కోమాలోకి వెళ్లింది? కోమాలోకి వెళ్లడానికి ముందు సావిత్రి ఏం చేసింది? బెంగళూరులో శంకరయ్యను కలవడానికి వచ్చిన సావిత్రికి ఏం జరిగింది? అసలు శంకరయ్య ఎవరు? తదితర విషయాలను జర్నలిస్ట్ మధురవాణి ఎలా వెలుగులోకి తీసుకొచ్చిందనేది ‘మహానటి’ చిత్రం. సావిత్రికి ఆరేళ్లు ఉన్నప్పుడే తండ్రి చనిపోవడంతో పెదనాన్న వెంకట రామయ్య చౌదరి (రాజేంద్రప్రసాద్) సంరక్షణలో పెరుగుతుంది. చిన్న తనం నుంచి ఈ పని నీ వల్లకాదు అంటే ఎలాగైనా పట్టుపట్టి ఆ పని చేసి చూపించటం సావిత్రికి అలవాటు. అందుకే తనకు రాదు అన్న నాట్యం దూరం నుంచి చూసి నేర్చుకుంటుంది. సావిత్రిలోని ప్రతిభను గుర్తించి నాటకాలు వేసేందుకు అరుణోదయ నాట్యమండలి బాలనటిగా అవకాశం ఇస్తారు. నాటకాలకు ఆదరణ తగ్గిపోవటంతో సావిత్రిని సినిమాల్లో నటింపజేయాలని నిర్ణయించుకుంటారు ఆమె పెదనాన్న. ఆ ప్రయత్నాల్లో భాగంగా 14 ఏళ్ల వయసులో సావిత్రి చెన్నై చేరుకుంటారు. తమిళం రాకపోవటంతో అక్కడ ఇబ్బంది పడుతుంటే.. జెమిని స్టూడియోలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న జెమినీ గణేశన్ (దుల్కర్ సల్మాన్) సావిత్రి అందం చూసి ఎప్పటికైనా పెద్ద నటి అవుతుందని చెప్పి ఫొటోలు తీసి పత్రికలకు అందజేస్తాడు. అలా పత్రికల్లో వచ్చిన ఆమె ఫొటోలు చూసిన ఎల్వీ ప్రసాద్ తన సినిమాలో అక్కినేని సరసన హీరోయిన్‌గా తొలి అవకాశం ఇస్తారు. కానీ ఆ అవకాశం సావిత్రి చేజారిపోతుంది. తర్వాత అదే ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లిచేసి చూడు సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటారు. అలా వెండితెర మీదకు అడుగుపెట్టిన సావిత్రి ఎలా మహానటిగా ఎదిగారు? జెమినీ గణేశన్ ఆమె జీవితంలోకి ఎలా ప్రవేశించారు? పెళ్లి తర్వాత సావిత్రి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? కోట్ల ఆస్తులు సంపాదించిన సావిత్రి చివరకు అన్నీ పోగొట్టుకోవడానికి కారణమేంటి? అన్నది ఆసక్తికరం. జీవిత కథల్ని తెరకెక్కించాలంటే తగిన పరిశోధన అవసరం. వాస్తవికత ఉట్టి పడుతూనే ఆయా కథల్లో తగిన డ్రామా పండాలి. ఆ నేపథ్యం కూడా తెరపై పక్కాగా కనిపించాలి. ఆ విషయంలో దర్శకుడు వందశాతం విజయం సాధించాడు. ఈ చిత్రంలో బలాలు చాలానే వున్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవలసింది దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి. ఒక మహానటి జీవితాన్ని సినిమాగా ఎలా తీయాలి, ఎలా తీస్తే అది గొప్ప చిత్రంగా నిలుస్తుంది అనే విషయాల్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఆ మహానటి జీవితాన్ని సినిమా, వ్యక్తిగత జీవితంగా విభజించి వాటి రెండింటినీ సమాంతరంగా నడుపుతూ ఒక జీవితం ఇంకో జీవితంపై ఎలాంటి ప్రభావం చూపింది? మనసారా ప్రేమించిన జెమినీ గణేశన్ సావిత్రిని ఎలా నిర్లక్ష్యం చేశాడు? నా అనుకున్న వాళ్లంతా ఆమెను ఎలా మోసం చేశారు? ఆ క్షోభను మర్చిపోవడానికి ఆమె మద్యానికి ఎంతలా బానిసయ్యారు? వంటి విషయాల్ని ఎంతో భావోద్వేగపూరితంగా వివరించారు. అలాగే ఆమె నటిగా ఎదగడంలో కె.వి.రెడ్డి, కె.వి. చౌదరి, ఎల్వీ ప్రసాద్, చక్రపాణి లాంటి ప్రముఖుల పాత్ర ఎలాంటిదో వివరంగా చూపారు. సావిత్రి వ్యక్తి గత జీవితంతో పాటు, ఆమె నట జీవితం లోతుల్లోకి తొంగిచూసి కథను రాసుకున్నాడు దర్శకుడు. ఒక కంట్లో నుంచే కన్నీళ్లు రావాలని, అది కూడా రెండు చుక్కల కన్నీరే కార్చాలని దర్శకుడు కె.వి.రెడ్డి చెప్పడం.. సావిత్రి గ్లిజరిన్ వాడకుండా రెండంటే రెండు చుక్కలే కన్నీళ్లు కార్చడం లాంటి సన్నివేశంతో మొదలు పెడితే దాదాపు ఆద్యంతం సినిమా ప్రేక్షకుల కళ్లు చెమ్మగిల్లేలా చేస్తుంది. దశాబ్దాల నట ప్రయాణం.. మూడు వందల సినిమాలతో కూడిన సుదీర్ఘ ప్రయాణం సావిత్రిది. ఆ జీవితం మొత్తాన్ని తెరపై చూపించాలంటే సాహసంతో కూడుకున్న పనే. కానీ దర్శకుడు సావిత్రి బాల్యం మొదలుకొని, ఏ దశను వదిలిపెట్టకుండా జీవితం మొత్తాన్ని తెరపై అందంగా ఆవిష్కరించాడు. సావిత్రి గురించి తెలుసుకోవాలని జర్నలిస్ట్ మధురవాణి తపిస్తోంటే ఆమెతో పాటుగా మనలోను ఆరాటం పెరిగిపోతుంది. సావిత్రి కథని ఎక్కడ్నుంచి మొదలు పెట్టాలి. ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేదాంట్లో దర్శకుడుకి వున్న క్లారిటీ చూస్తే అసలు ఇది అతని రెండవ చిత్రమేనా? అనిపిస్తుంది. తలలు పండిన దర్శకులే ముట్టుకోవడానికి భయపడే కథ ఇది. అనే్నళ్ల జీవితాన్ని కొన్ని గంటల్లో చెప్పడం, అంత అద్భుతంలోని ఏ ముఖ్య ఘట్టాన్ని వదలకుండా చూపడం మామూలు విషయం కాదు. దేవదాసు కథ చదివిన ఒక మామూలు అమ్మాయిగా సావిత్రి కదిలిపోతుంది. వాళ్లిద్దరి జీవితం అలాగే ఎందుకు వుండాలి? దేవదాసుకి పెళ్లయితే మాత్రం పార్వతి ఎందుకు దూరం కావాలి? అని సావిత్రి భావిస్తుంది. అదే పరిస్థితి తన జీవితంలో తలెత్తినప్పుడు ఆమె నిర్ణయం తీసుకున్నట్టు చూపించడం మనసుతోనే చప్పట్లు కొట్టేట్టు చేస్తుంది. ఆమె నిజ జీవితాన్ని, తెర జీవితాన్ని సమాంతరంగా నడిపిస్తూ నిజ జీవితంలోని సంఘటనలను తెరపై జీవించినట్టు చూపించడం కూడా ఈ బయోపిక్‌ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ‘రావోయి చందమామ మా వింత గాధ వినుమా’ అనేది ఆ సినిమా కోసం రచయిత రాసిన పాట. కానీ సావిత్రికి ఆ టైమ్‌లో జీవితంలో ఎదురైన సంఘటనలకి ఆ సాహిత్యం అద్దం పడుతుంది. తొలి సగభాగంలో బాల్యంతో పాటు, నాటకజీవితం, సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు నటిగా ఎదిగిన క్రమం, ప్రేమ, పెళ్లి వరకూ చూపించారు. తను అనుకొన్నది సాధించేవరకూ వదిలిపెట్టని సావిత్రి నైజాన్ని చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. చాలా సన్నివేశాలు హృద్యంగా సాగుతూ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ద్వితీయార్థంలో జెమినీ గణేశన్‌తో కలిసి జీవితాన్ని మొదలు పెట్టడం, పెళ్లి తర్వాత కూడా ఆమె నటిగా ఓ వెలుగు వెలగడం ఆ తర్వాత వైవాహిక జీవితంలో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు తదితర విషయాలను చూపించారు. వీటన్నిటి మధ్యలోనే ఆమె నటనా వైభవాన్ని ‘మాయాబజార్’, ‘మిస్సమ్మ’, ‘మూగమనసులు’ తదితర చిత్రాల్లోని ఘట్టాలతో చూపించిన విధానం సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ కథని నడిపించడానికి సాధనంగా వాడుకున్న సమంత పాత్ర ఆమె మూగ ప్రేమికుడిగా విజయ్ ఆంటోనీల ఉపకథని కూడా అసలు కథకి అడ్డం పడకుండా నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో సమంత నటన, ఆమె మాటలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. శంకరయ్య ఎవరు అనే హుక్‌తో నడిపించిన కథకి సమంత ద్వారా సావిత్రి జీవితంలో మిగిలిన కోరిక తీర్చి ఒక సినిమాటిక్ క్లయిమాక్స్ ఇచ్చిన తీరుని బట్టి నాగ్ అశ్విన్ ఎంత గొప్ప కథకుడనేది మరోసారి తేటతెల్లమవుతుంది.
నటీనటుల విషయానికొస్తే..‘మహానటి’ టైటిల్ పాత్రని పోషించిన కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. సినిమాకు ప్రధాన బలం ఆమె. సావిత్రి పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేసిందా అన్నంతగా జీవించారు. పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు.. లుక్ పరంగానే కాదు.. నటన పరంగా కూడా ‘కీర్తి’ని మూటగట్టుకుంది. 14 ఏళ్ల వయసులో సావిత్రిలోని అల్లరి, చిలిపితనం, నటిగా ఎదుగుతున్న సమయంలో హుందాతనం, ప్రేమ, కరుణ, భయం, కోపం ఇలా ప్రతీ రసాన్ని అద్భుతంగా పలికించారు. తెరమీద సావిత్రినే చూస్తున్నామా? అన్నంతగా మెప్పించారు. బ్లాక్ అండ్ వైట్ షేడ్స్‌తో కూడిన సన్నివేశాల్లో కీర్తి అచ్చం సావిత్రిలానే కనిపించారు. ఇప్పటి వరకూ ‘మహానటి’ అనగానే సావిత్రి గుర్తొచ్చినట్టు, ఇక మీదట ‘సావిత్రి’ అంటే కీర్తి గుర్తొస్తుంది.
సావిత్రిపై అపారమైన ప్రేమ వున్నా కానీ మనిషిలోని సగటు బలహీనతల్ని అధిగమించలేక, పరోక్షంగా ఆమె పతనానికి కారణమైన వాడిగా జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఇచ్చిన పెర్‌ఫార్మెన్స్ చిరస్మరణీయం. ‘కాదల్ మన్నన్’గా గుర్తింపు పొందిన జెమినీ గణేశన్ శైలిలోనే దుల్కర్ హావభావాలను ప్రదర్శించాడు. సావిత్రి కథను నడిపించే కీలక పాత్రలో సమంత నటన సూపర్. జర్నలిస్ట్ మధురవాణిగా సావిత్రి జీవితం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించే పాత్రలో సమంత జీవించారు. విజయ్ ఆంటోనీగా విజయ్ దేవరకొండ ఫొటోగ్రాఫర్ పాత్రలో మెప్పించారు. ప్రజావాణి పత్రిక ఎడిటర్ పాత్రలో తనికెళ్ల భరణి, సావిత్రి పెద్దమ్మ పాత్రలో భానుప్రియ, సావిత్రి తల్లిగా దివ్యవాణి, జెమిని గణేశన్ మొదటి భార్య అలవేలు పాత్రలో మాళవికా నాయర్, సావిత్రి స్నేహితురాలు సుశీల పాత్రలో షాలినీపాండే తదితరులు వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అక్కినేని నాగేశ్వరరావుగా నాగచైతన్య, ఎస్వీఆర్‌గా మోహన్‌బాబు, చక్రపాణి పాత్రలో ప్రకాష్‌రాజ్, కె.వి.రెడ్డిగా క్రిష్, ఆదుర్తి సుబ్బారావుగా సందీప్ వంగా, సింగీతం శ్రీనివాస్‌గా తరుణ్ భాస్కర్, ఎల్వీ ప్రసాద్‌గా అవసరాల శ్రీనివాస్ ఇలా అలనాటి మహానుభావుల పాత్రల్లో నటించి అలరించారు. రాజేంద్రప్రసాద్‌కి అద్భుతమైన పాత్ర దక్కింది. నటకిరీటి తన కీర్తి కిరీటంలో మరో మణిగా మిగిలిపోయే రీతిన సావిత్రి పెదనాన్న పాత్రకి ప్రాణం పోశారు. సాంకేతికంగా చూస్తే మిక్కీ జె.మేయర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ డానీ 80ల కాలంలో నడిచే కథను ఫిలింలోను, జర్నలిస్ట్ మధురవాణి కోణంలో నడిచే సావిత్రి కథను డిజిటల్ కెమెరా ద్వారా చూపించి సాంకేతికంగా సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. బ్లాక్ అండ్ వైట్, ఈస్ట్‌మన్ కలర్ తదితర టెక్నిక్స్‌తో ఈ సినిమాకి అథెంటిక్ అప్పీల్ తేవడంలో ఛాయాగ్రహకుడు చక్కని ప్రతిభ చూపించాడు. ఈ చిత్రంలో సాయిమాధవ్ బుర్రా సంభాషణలు కట్టిపడేస్తాయి. తోట తరణి నేతృత్వంలో శివంరావు, అవినాష్‌లు ఆ కాలం నాటి నేపథ్యాన్ని.. అందుకు సరిపోయే చక్కటి వాతావరణం సృష్టించారు. ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది. అప్పటి సినిమా సెట్టింగులను పోలిన సెట్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. కోటగిరి ఎడిటింగ్ చిత్రానికి బాగా ఉపయోగపడింది. ప్రియాంకదత్, స్వప్నదత్‌ల నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే వున్నాయి. సినిమా చూసినంతసేపు ఓ ఉద్వేగానికి గురైన ప్రేక్షకుడికి ఆ తర్వాత కూడా ఆ సినిమా గుర్తుకు వస్తుందంటే అంతకంటే గొప్ప సినిమా ఏముంటుంది? ప్రతి ప్రేక్షకుడి మనసును తాకే ‘మహానటి’కి మళ్లీ జీవం పోసిన దర్శకుడు నాగ్ అశ్విన్, ఓ మహానటి జీవితాన్ని నేటి తరానికి పరిచయం చేసేందుకు నిర్మాతలు ప్రియాంకదత్, స్వప్నదత్ చేసిన ప్రయత్నాన్ని అభినందించకుండా ఉండగలమా? *

--ఎం.డి. అబ్దుల్