రివ్యూ

కాశి కథ కంచికే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కాశి

తారాగణం:
విజయ్ ఆంటోనీ, అంజలి, సునైన
నాజర్, జయప్రకాష్, అమృత అయ్యర్,
యోగిబాబు తదితరులు.
సంగీతం: విజయ్ ఆంటోనీ
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ఎమ్.నాథన్
ఎడిటింగ్: లారెన్స్ కిషోర్
నిర్మాణం: విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్
నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోనీ
విలియమ్ అలెగ్జాండర్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిరుతిగ ఉదయనిధి
----------------------------------------------------
విజయ్ ఆంటోనీ.. అబ్బో! ఈ పేరు వినగానే మనకు ‘బిచ్చగాడు’ గుర్తొస్తాడు. ఎందుకంటే ఆ చిత్రంలో అంతటి పెర్‌ఫార్మెన్స్‌ని ప్రదర్శించాడు కాబట్టి. తెలుగు ప్రేక్షకులకు బిచ్చగాడుగా పరిచయమైన నటుడు విజయ్ ఆంటోనీ నుంచి మరో సినిమా వస్తుందంటే ఎవ్వరికైనా కాస్త ఆసక్తే. ఎందుకంటే ఏదో కొత్తదనం ఉండకపోతుందా? అని. ప్రేక్షకులు అంతగా ఆలోచించినప్పుడు ఏ నటుడైనా ఒళ్లు దగ్గరపెట్టుకొని, ప్రేక్షకులను.. అదీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక్క సినిమా ప్రేక్షకుల్ని మెప్పించినంత మాత్రాన అతడి నుంచి వచ్చే చిత్రాలన్నీ ఇక అదే వరసలో మంచి కథలను అందిస్తాయనుకుంటే మనదీ తప్పే. తాజాగా కిరుతిగ ఉదయనిధి దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘కాశి’. అంజలి కథానాయిక. సినిమా విడుదలకు ముందు విజయ్ ఆంటోనీ ఈ చిత్రం గురించి బాగా గొప్పలే చెప్పాడు. భావోద్వేగాలకు.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు పెద్దపీట వేసినట్లు ఓ ఇంటర్‌వ్యూలో పేర్కొన్నాడు. అదీ కాకుండా విడుదలకు కొద్ది రోజుల ముందే సినిమాలోని తొలి ఏడు నిమిషాల సన్నివేశాలను యూ-ట్యూబ్‌లో విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సైలెన్స్‌గా వచ్చిన ‘బిచ్చగాడు’ సక్సెస్‌తో తెలుగులోనూ తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఆ చిత్రం తర్వాత తను నటించిన ప్రతీ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులపైకి వదులుతూనే వున్నాడు. అలా వదిలిన చిత్రాలు ఏ మేరకు ఫలితాలనిచ్చాయో మనకు తెలియంది కాదు. అలా వదిలిన ఏ చిత్రం ‘బిచ్చగాడు’ను మరిపించలేకపోయింది. ఆ స్థాయిలో విజయం కాదు కదా.. కనీసం ఫర్వాలేదనిపించే స్థాయిలో కూడా లేక బాక్సాఫీస్ వద్ద పూర్తిగా బొక్కాబోర్లా పడేలా చేసింది. ‘బిచ్చిగాడే’నా? ఇలాంటి కథతో వచ్చాడేంటి? అనుకున్నారంతా. మదర్ సెంటిమెంట్ అయితే బాగా వర్కవుట్ అవుతుందనుకొని ఎన్నో ఆశలతో ‘కాశి’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విజయ్. మరి ఆ మదర్ సెంటిమెంట్ కాస్త సెంటి‘మెంటల్’ సినిమాగా మారి తుస్సుమనిపించి ఆరంభంలోనే థియేటర్‌లో అందర్నీ నిద్రపుచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించే నటుడు విజయ్ ఆంటోనీ ఈసారి ఇలాంటి నాసిరకమైన కథతో వచ్చాడేంటబ్బా! అని అందరూ అనుకుంటూ దిగాలుగానే దిక్కులు చూస్తూ సినిమా ఎప్పుడు అయిపోతుందా? అని ఊపిరి బిగబట్టుకొని, థియేటర్‌లో ఏసీ వుంది కదా అని హాయిగా నిద్రలోకి జారుకున్నారు. సరే మరి ఎన్నో ఆర్భాటాలతో.. అట్టహాసంగా మరో విజయాన్ని అందుకోవాలని వచ్చిన ‘కాశి’ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే ప్లీజ్.. కథలోకి వెళదాం.. కథలోకి కాదు సుమా.. కథల్లోకి! ఎన్నో కథలు.. ఎన్నో బ్యాక్‌గ్రౌండ్‌లు.. అబ్బో చెప్పలేం బాబోయ్.. అయినా సరే.. తప్పదు వెళదాం...
అమెరికాలోని భరత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చీఫ్ భరత్ (విజయ్ ఆంటోనీ) దర్జాగా జీవితంలో సుఖ సంతోషాలతో కాలం గడుపుతుంటాడు. డాక్టర్‌గానే కాక, హాస్పిటల్ చీఫ్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. అతనికి జీవితంలో ఏ లోటూ వుండదు. అదే సమయంలో అందరి అభిమానాన్ని కూడగట్టుకుంటాడు. అయితే భరత్‌ను చిన్ననాటి ఓ జ్ఞాపం నీడలా వెంటాడుతూనే వుంటుంది. ఒక పాము తనని కాటేయడానికి వస్తున్నట్లు, ఎవరో తరుముతున్నట్లు పీడకలతో సతమతమవుతుంటాడు. ఏమిటిది? ఓ జ్ఞాపకం నన్ను ఇలా నిద్ర లేకుండా చేస్తోంది? అని ఆలోచిస్తుంటాడు. అనుకోకుండా తల్లి అనారోగ్యం పాలవుతుంది. కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతాయి. డాక్టర్‌గా భరత్ తన తల్లిని రక్షించుకునేందుకు తన కిడ్నీని ఇచ్చి కాపాడుకుంటానని తండ్రితో చెబుతాడు. వద్దు బాబు.. వద్దు తల్లికి కిడ్నీ ఇవ్వొద్దు. నీ కిడ్నీ మ్యాచ్ కాదు అంటాడు. నా కిడ్నీ ఎందుకు మ్యాచ్ కాదు.. ఒక డాక్టర్‌గా మీరే అలా అంటే ఎలా? అని అడుగుతాడు భరత్. అప్పుడు భరత్‌కు అసలు విషయం తెలుస్తుంది.. తను దత్తపుత్రుడుని అని. అసలు విషయం తెలుసుకున్న అతడు పెంచి పెద్ద చేసిన అమ్మానాన్నల అనుమతితో తన సొంత తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడుంటారు? కన్నవారిని వెదుక్కుంటూ ఇండియా బయలుదేరుతాడు. తన బాల్యం అంతా కంచర్లపాలెం అనే ఓ గ్రామంలో జరిగిందని తెలుసుకుని అక్కడికి వెళతాడు. ఆ గ్రామంలో భరత్‌కు ఎదురైన అనుభవాలేమిటి? అలా స్వదేశానికి వచ్చిన భరత్ తన తల్లి దండ్రుల్ని కనుక్కోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అసలు భరత్ కన్నవారికి ఎలా దూరం అయ్యాడు? తన అమ్మానాన్నల గురించి నిజం తెలిసిందా? అనేదే కథ. దర్శకురాలు కిరుతిగ ఉదయనిధి సినిమాను ఎక్కడో మొదలు పెట్టి.. మరెక్కడికో తీసుకెళ్లి నానా కంగాళీగా కానిచ్చేశారు. సినిమా ప్రారంభం చాలా ఆసక్తికరం అనిపిస్తుంది. ఆ ఆసక్తికరం ఎంతో సేపు నిలవదు. ముందుగా హీరోను అతని పరిస్థితిని పరిచయం చేసి కొద్దిసేపటికే అతన్ని కన్న తల్లిదండ్రుల వేటలో పడేయడంతో ప్రేక్షకులకు విసుగుపుట్టించింది. ఆ వేటలో.. తల్లిని కనుగొన్న హీరోకు తండ్రిని కనుక్కోవడం కష్టతరంగా మారుతుంది. అతడికే కాదు.. చూసే ప్రేక్షకులకు కూడా ఆ సన్నివేశాల సమయంలో పిచ్చెక్కి అంతకంటే కష్టతరంగా మారుతుంది. భరత్ ఇండియా వచ్చాక సినిమా అంతా ప్రేక్షకులను ముప్పుతిప్పలు పెడుతుంది. ఎన్నో కథలు.. మరెన్నో హీరోగారి వేషాలు అబ్బ..చూడతరమా! ప్రతీ కథలో ఫ్లాష్‌బ్యాక్‌లో హీరోనే కనిపించి మరింత కంగాళీ చేశాడు. సినిమా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్, ముంగిపు రెండూ ఏ మాత్రం కుదరలేదు. హీరో విజయ్ ఆంటోనీ తన సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్‌తో సినిమాను లాక్కొచ్చే ప్రయత్నం చేసినా మెప్పించలేకపోయాడు. దర్శకురాలు ఎంచుకున్న పాయింట్ మంచిదే కానీ.. అదే సెంటిమెంట్‌ను ఆద్యంతం నడిపించలేక చతికిలపడ్డారు. కథనమైతే పూర్తి నిరుత్సాహకారంగానే సాగింది. ముఖ్యమైన అసలు అంశంపై ప్రేక్షకులు ఆసక్తిని కోల్పోయేలా చేసింది. హీరో గురించి రాసుకున్న కథలో హీరో గురించి మాత్రమే చెప్పాల్సింది పోయి మధ్యలో కథతో, హీరోతో ఏ మాత్రం సంబంధంలేని ఇద్దరు వ్యక్తుల పూర్తి కథల్ని చెప్పడంతో అనవసరంగా గంటకు పైగా రన్‌టైమ్‌ను వృథా చేశారనిపించిది. ఆ గంటసేపు సినిమాలో ఏం జరుగుతుంది? కథ ఎటుపోతోంది? హీరో కథలోకి సంబంధంలేని వ్యక్తుల జీవితాలు ఎందుకొచ్చాయి అనేది అంతుపట్టక గందరగోళానికి గురయ్యాడు ప్రేక్షకుడు. బిచ్చగాడు, డాక్టర్ సలీం, నకిలీ లాంటి వైవిధ్యమైన కథలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఇలాంటి నాసిరకమైన కథను ఎందుకు ఎంచుకున్నాడో అర్థం కాదు. ఓ బిడ్డ తన తల్లి జ్ఞాపకాలను వెతుక్కుంటూ చేసే ప్రయాణం మనసుకు హత్తుకుంటుంది. అయితే దాన్ని తీర్చిదిద్దిన విధానం కూడా బావుంటే ‘కాశి’ మరో ‘బిచ్చగాడు’ అయ్యేది. ముఖ్యంగా కంచెర్లపాలెంలో జరిగే సంఘటనలు, సన్నివేశాలు కథకు ఏ మాత్రం సంబంధం లేనివిగా అనిపిస్తాయి. ఒకే సినిమాలో మూడు ఉపకథలు ఉండడం.. అందులో రెండు కథలతో అసలు కథకు ఏ మాత్రం సంబంధం లేకపోవడం ‘కాశి’కి ప్రతికూల అంశాలుగా మారాయి. ప్రతీ సన్నివేశాన్ని సాగదీయడం ఇబ్బంది కలిగించింది. ఇలాంటి కథల్లో వినోదం ఆశించడం అత్యాశే అవుతుంది. అయితే దర్శకురాలు అక్కడక్కడా కొన్ని సెటైర్లు వేసినప్పటికీ అవేమీ ‘కాశి’ని కాపాడలేకపోయాయి. తన తొలి సినిమా నుంచి ఒకే రకమైన హావభావాలతో నెట్టుకొస్తున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ సినిమాలోనూ దానినే కొనసాగించి వివిధ రకాల గెటప్‌లతో విసుగుపుట్టించాడు. అన్ని గెటప్‌ల్లోనూ ఒకే రకమైన ఫీలింగ్. ఏ గెటప్‌లోనూ బలమైన భావోద్వేగాలు చూపించే అవకాశం రాకపోవడంతో ఆ పాత్రలు రొటీన్ సాగాయి. ఇక హీరోయిన్ అంజలిది పనికిరాని చిన్నపాత్ర. ఆమె పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యం లేదు. ఆమెది అతిథి పాత్రే అని చెప్పొచ్చు. నాజర్, జయప్రకాశ్ కథకు అవసరం లేని తమ పాత్రల్లో బాగానే రాణించే ప్రయత్నం చేశారు. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన యోగిబాబు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగిలిన వాళ్లంతా తమిళ నటీనటులే. విజయ్ ఆంటోనీ అందించిన పాటలు ఏ మాత్రం ఆకట్టుకోవు. ఆ పాటలే కథ గమనానికి అడ్డుపడ్డాయి కూడా. తమిళ పాటల్లోని సాహిత్యం మక్కీకి మక్కీ అనువదించారు. నేపథ్య సంగీతం, రిచర్డ్ ఎమ్. నాథన్ సినిమాటోగ్రఫీ, పోరాట దృశ్యాలు ఓకే. లారెన్స్ కిషోర్ ఎడిటింగ్‌లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కథకు సంబంధంలేని ఉపకథల్లో కత్తెరకు పదునుపెట్టాల్సింది. మొత్తం మీద ‘బిచ్చగాడు’లో మదర్ సెంటిమెంట్‌తో విజయాన్ని అందుకున్న విజయ్ ఆంటోనీ మరోసారి అదే బాటలో నడిచి ‘కాశి’ ప్రయాణమే చేసి చతికిలపడడమే కాకుండా, ఎట్టకేలకు కథను కంచికే చేర్చాడు.

--రతన్