రివ్యూ

టిక్కెట్టు తెగడం కష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నేల టిక్కెట్టు

తారాగణం:
--------------
రవితేజ, మాళవిక శర్మ, జగపతిబాబు,
శరత్‌బాబు, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు,
పృథ్వీ, సంపత్ రాజ్, ప్రియదర్శి, పోసాని,
జయప్రకాష్‌రెడ్డి, బ్రహ్మాజీ, శివాజీ రాజా,
సురేఖావాణి, ప్రవీణ్, జ్యోతి తదితరులు.
కథ: సత్యానంద్, కూర్పు: చోటా కె.ప్రసాద్
సంగీతం: శక్తికాంత్ కార్తీక్, కెమెరా: ముఖేష్ జి.
నిర్మాణం: ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: రజనీ తాళ్లూరి
కథ, మాటలు, దర్శకత్వం:
కళ్యాణ్ కృష్ణ కురసాల

మాస్ ప్రేక్షకులతో పాటు, కుటుంబ ప్రేక్షకులను సైతం రవితేజ సినిమాలు ఎంతగానో అలరిస్తాయని అందరిలో గట్టినమ్మకం. ఆ నమ్మకంతోనే రవితేజ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు థియేటర్లవైపు దృష్టిసారిస్తారు. ఒకప్పుడు వరుస విజయాలకు కేరాఫ్ అడ్రస్ రవితేజ. అతడితో సినిమా చేస్తున్నామంటే దర్శక, నిర్మాతలు ఏ విషయంలో పెద్దగా ఇబ్బంది పడాల్సి వచ్చేది కాదు. ఏ నటుడి కెరీర్‌లోనైనా జయాపజయాలు సహజం. అవి రవితేజను పలకరించాయి. మాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో రవితేజ ఒకరు. రెండేళ్లు సినిమాలు చేయకుండా గ్యాప్ తీసుకున్న అతడు ‘రాజా ది గ్రేట్’తో స్పీడ్ పెంచి మళ్లీ తన స్టామినా ఏంటో చూపించాడు. అదే ఊపులో ఆ తర్వాత వచ్చిన ‘టచ్ చేసి చూడు’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేక చతికిలపడింది. మాస్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న రవితేజ గత కొంతకాలంగా తన స్థాయికి తగ్గట్టుగా ఆకట్టుకోలేకపోతున్నాడు. కథలను ఎంపిక చేసుకుంటున్న విధానం.. దర్శకుడిపై నమ్మకం.. ఇవన్నీ మాస్‌రాజాను కెరీర్‌లో వెనక్కు నెట్టేస్తున్నాయా? అనిపిస్తోంది. తాజాగా ‘నేల టిక్కెట్టు’ అంటూ పక్కా మాస్ టైటిల్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు రవితేజ. ‘సోగ్గాడే చిన్ని నాయనా..’, ‘రారండోయ్.. వేడుక చూద్దాం..’ సినిమాలతో వరుస విజయాలు సాధించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కావడంతో సహజంగానే అంచనాలు పెరిగాయి. ‘నేల టిక్కెట్టు’ అని మాస్‌ని ఆకట్టుకునేలా టైటిల్ పెట్టి సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. టైటిల్ వినడానికి మాస్ ఆడియెన్స్‌కు దగ్గరగా ఉంది. అయితే సినిమాలోని ఎమోషన్స్ బాల్కనీ ఆడియెన్స్‌ను కూడా మెప్పిస్తాయని మొదటి నుంచి యూనిట్ చెబుతూ వచ్చింది. అనాథ అయిన కథానాయకుడు ప్రతి ఒక్కరిలో తనకు బంధువులను వెతుక్కుంటూ ఉంటాడు. అలా ఓ కుటుంబాన్ని ఏర్పరచుకున్న హీరోకి అనుకోకుండా ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను అతడు ఎలా తీర్చుకున్నాడు? ఈ సినిమాతో రవితేజ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడా? దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు హ్యాట్రిక్ దక్కిందా? క్లాస్, మాస్ ఆడియెన్స్‌ను ‘నేల టిక్కెట్టు’ ఏ మేరకు మెప్పించింది? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కథలో హీరో నేల టిక్కెట్టుగాడు (రవితేజ) ఓ అనాథ. అమ్మానాన్నతో పాటు కనీసం పేరు కూడా లేని హీరోని చేరదీసిన వ్యక్తి థియేటర్‌లో నేల టిక్కెట్టులో పడుకోబెడతాడు. అప్పటి నుంచి అదే హీరో ఇల్లు, పేరు అవుతుంది. నేల టిక్కెట్టు పేరుతోనే పెరిగి పెద్దవాడైన హీరో, తనను అన్నా, తమ్ముడు అని పిలిచిన ప్రతీ వారికి కాదనకుండా సాయం చేస్తుంటాడు. నలుగురితో కలిసి సంతోషంగా ఉండాలనుకునే రకం. ఎవరినైనా సరే వరసలు పెట్టి పిలిచేస్తాడు. కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్పే హీరో ఓ కేసు కారణంగా స్నేహితులతో సహా వైజాగ్ వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది. అలా హైదరాబాద్ చేరిన హీరో తన స్నేహితులతో కలిసి ఉంటాడు. అనాథ కావడంతో ప్రతి ఒక్కరినీ ఏదో ఒక బంధంతో పిలుచుకుంటూ ఉంటాడు. ఓ సందర్భంలోడాక్టర్ కోర్సు చదువుతున్న మాళవిక (మాలవికా శర్మ)ను చూసి ప్రేమలో పడతాడు. మరో వైపు ఆనంద్ భూపతి (శరత్‌బాబు) చాలా మంచి వ్యక్తి. అనాథల కోసం ‘ఆనంద నిలయం’ను నిర్మించాలనుకుంటాడు. అది అతడి జీవితాశయం. మరో ఆశ తన కొడుకు అజయ్ భూపతి (జగపతిబాబు)ని మంత్రిగా చూడాలనుకుంటాడు. ఆనంద్ భూపతి వారసుడిగా అజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ఎన్నికల్లో విజయం సాధించి హోం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. అయితే అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాల పేరుతో తండ్రి ఆస్తిని దానం చేసేస్తున్నాడని ఆనంద్ భూపతిని పథకం ప్రకారం బాంబు బ్లాస్ట్ ద్వారా హతమారుస్తాడు. అది టెర్రరిస్టుల చర్య అని అందరూ అనుకుంటారు. ఈ విషయంలో నిజాలు తెలుసుకున్న జర్నలిస్ట్ గౌతమి మీద హత్యా ప్రయత్నం చేస్తాడు. అధికారం అడ్డుపెట్టుకొని ఉద్యోగాలు అమ్ముకోవడం, కబ్జాలు, దందాలు చేస్తూ వేల కోట్ల ఆస్తులు సంపాదిస్తాడు. చిన్నప్పటి నుంచి అనాథలా పెరిగిన నేల టిక్కెట్టు చుట్టూ జనం మధ్యలో మనం, జీవితంలో అందరినీ కలుపుకుని పోవాలి అనే తత్వంతో ప్రతి ఒక్కరికీ సహాయ చేస్తుంటాడు. అలా జనానికి సాయం చేసే ప్రక్రియలో అతడికి, హోం మంత్రి ఆదిత్య భూపతి (జగపతిబాబు)కి మధ్య తరుచూ గొడవలు జరుగుతుంటాయి. ఒకానొక సందర్భంలో నేల టిక్కెట్టుగాడు తాను కావాలనే ఆదిత్య భూపతితో గొడవపెట్టుకుంటున్నానని అంటాడు. అసలు నేల టిక్కెట్టు హోం మంత్రిని ఎందుకు టార్గెట్ చేశాడు? వారిద్దరి మధ్య సంబంధం ఏమిటి? హోం మంత్రి చేసిన తప్పు ఏమిటి? ఆదిత్య భూపతి అవినీతిని, దుర్మార్గాలను ఎలా బయటపెట్టాడు? ఆనంద భూపతి హత్య వెనక అసలు కారణం ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నేల టికెట్ రూపాయి ధర పలికిన రోజుల్లో ఇలాంటి కథలు చాలానే వచ్చేవి. అప్పట్లో సినిమా అంటే ప్రేమ, హాస్యం, ఫైట్ లాంటివన్నీ వుండాలనే పడికట్టు రూలుండేది. అన్ని సినిమాలూ అలాగే వుండే సరికి ఫైట్లూ, నవ్వులూ బాగున్న సినిమాలకి టిక్కెట్లు బాగా తెగేవి. కానీ కాలం చెల్లిపోయిన ఈ కథలు ఇప్పుడు ఎక్కువగా రావడం లేదు. వచ్చినా కొత్తదనం కోరుకుంటోన్న నేటి తరం ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ కనిపించడం లేదు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ పాత చింతకాయ పచ్చడి లాంటి కథను ఏమనుకుని చేసాడో.. హీరో రవితేజ ఇందులో ఏముందని ఒప్పుకుని నటించాడో కానీ, సినిమా మొదలైన దగ్గర్నుంచీ ముగింపు కోసం ఎదురు చూసేలా చేస్తుంది ‘నేల టిక్కెట్టు’. ఇంటర్వెల్‌కు ముందు వరకు అసలు హీరో లక్ష్యం ఏమిటో బయటపడకపోవడంతో కొంత చికాకు కలిగించింది. ద్వితీయార్థంలో హీరో చేసే ప్రయాణం విసుగు తెప్పించింది. ప్రతి పదినిమిషాలకు సినిమా ట్రాక్ మారుతూ పోతుండటంతో ఎక్కడా ప్రేక్షకుడికి కుదురుగా సినిమా చూసే వీలు కలగలేదు. కథనం ఎలాగూ బాగాలేదు. కనీసం నడిచే సన్నివేశాలైనా బాగున్నాయా? అంటే అదీ లేదు. ప్రతి సన్నివేశం రొటీన్‌గా, సాగదీసినట్టు, కథనం మధ్యలో బలవంతంగా జొప్పించినట్టు ఉంది. దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించిన విధానం చూస్తే అసలిది ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం..’ వంటి సినిమాలను తీసిన కళ్యాణ్ కృష్ణ పనితీరేనా అనిపిస్తుంది. ఆ రెండు సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు కల్యాణ్ కృష్ణ. గత రెండు చిత్రాల నైపుణ్యం.. వాటిల్లో చూపించిన ప్రతిభ ‘నేల టిక్కెట్టు’లో మచ్చుకైనా కనిపించకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కథలో కొత్తదనం లోపించింది. మంచికీ చెడుకీ మధ్య యుద్ధం ఎన్నో ఏళ్లుగా చూస్తున్నదే. ప్రతి సినిమాలోనూ అదే పాయింట్ ఉంటుంది. అదే కథను ఎంత కొత్తగా చూపించాం అన్నదే కీలకం. కానీ కళ్యాణ్ అటు వైపుగా ఆలోచించలేదు. కథ ప్రారంభం నుంచి సన్నివేశాలు నడుస్తుంటాయి కానీ. వాటికి, అసలు కథకు సంబంధం ఉందా లేదా? అన్నది మాత్రం ప్రేక్షకుడికి అంతుచిక్కదు. ద్వితీయార్థం కూడా ఇలాగే ఉంది. గందరగోళం కనిపించింది. కథను ఎలా ముగించాలో తెలియక సన్నివేశాలను పొడిగించుకుంటూ వెళ్లాడు. పతాక సన్నివేశాల్లో ప్రతి నాయకుడు కూడా మారిపోవడం మరింత మెలోడ్రామాగా అనిపిస్తుంది. హీరో పాత్ర, ఇంటర్వెల్ బ్లాక్, కొన్ని ఫన్నీ సన్నివేశాలు మినహా మిగతా చిత్రం మొత్తం పరమబోర్ కొట్టించేలా సాగింది. బలహీనమైన రెగ్యులర్ కథ, సన్నివేశాలు, ఎటుపోతుందో తెలియని, ఖచ్చితమైన గమ్యం లేని కథనం, పాటలు అన్నీ కలిసి ప్రేక్షకుడికి వినోదం కరువయ్యేలా చేశాయి. ‘చుట్టూ జనం మధ్యలో మనం’ అనే కానె్సప్ట్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. బడాబాబులు అనాథాశ్రమాల మీద కన్ను వేయడం, దానికి సంబంధించిన డబ్బును చేజిక్కించుకోవడం, స్థలాలను కబ్జా చేయడం.. వారి బారి నుంచి హీరో వాటిని కాపాడటం వంటివి మామూలుగా ఇంతకు ముందే చాలా సినిమాల్లో చూశాం. అయితే అనాథాశ్రమంలో పెరిగిన ఓ కుర్రాడే అలాంటి పనిచేయడమనేది ఇందులో కొత్తగా వుంది. కానీ కథ చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు మాత్రం పేలవంగా ఉన్నాయి. బోలెడన్ని సన్నివేశాలు, ఒక్కో సన్నివేశంలో ఫ్రేమ్‌నిండా మనుషులు.. వామ్మో తల్చుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. తొలిసగంలో అసలు కథేంటో ఓ పట్టాన అర్థం కాదు. రెండో సగంలో కథ నత్త నడక నడుస్తుంది. బ్రహ్మానందం లాంటి స్టార్ కమెడియన్ ఇలాంటి పాత్రను ఎందుకు చేశాడో అర్థం కాదు. ఆయన పాత్రే కాదు, చాలా పాత్రలు ఎందుకు వస్తాయో, ఎందుకు పోతాయో అంతుచిక్కదు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్..వేడుక చూద్దాం లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించిన కల్యాణ్ కృష్ణ మూడో ప్రయత్నంగా మాస్ హీరోతో ఓ కమర్షియల్ కథను ఎంచుకున్నాడు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు సందేశాత్మక కథాంశాన్ని ఎంచుకున్న దర్శకుడు ఆ కథను ప్రేక్షకులను మెప్పించేలా తెరమీద చూపించడంలో పూర్తిగా తడబడ్డాడు. ఫస్ట్‌హాప్ అంతా అసలు కథను మొదలు పెట్టకుండా సరదా సన్నివేశాలతో లాగేయడం, ఆ సన్నివేశాల్లో రవితేజ మార్క్ కామెడీని పండించలేకపోవడంతో ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. సెకండ్ హాఫ్‌లో అసలు కథ మొదలైనా కథనంలో వేగం లేకపోవటం నిరాశపరస్తుంది. నేల టిక్కెట్టు కథ ఎలాగున్నా కథనంతో కాలక్షేపం అయిపోయేలా చేయవచ్చు. కానీ కథనం రాయడానికి కూడా సత్యానంద్ లాంటి వెటరన్‌ని ఎంచుకోవడంతో ఆయన ఈ కథకి ఏ మాత్రం న్యాయం చేయలేకపోయాడు. అరిగిపోయిన పాత తరం స్క్రీన్‌ప్లేతో కానిచ్చేశాడు. కనీసం సన్నివేశాలైనా రక్తి కడితే బావుండేది. కానీ ఇందులో సన్నివేశాలు చూస్తుంటే ప్చ్..! అనిపించక మానదు. ఇక హీరో హీరోయిన్ల లవ్‌ట్రాక్ అయితే ఏ మాత్రం అలరించలేకపోయింది. సినిమాలో హీరో పాత్ర, ఇంటర్వెల్ సీన్ మినహా చెప్పుకోవడానికి వేరే బలమైన పాత్రలు, సన్నివేశాలు అస్సలు కనిపించవు. సంపత్, జగపతిబాబు, పోసాని, బ్రహ్మానందం, అలీ వంటి వారున్నా పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు దర్శకుడు. వీటన్నిటికీ తోడు మధ్యలో వచ్చే పాటలైతే అస్సలు వినదగినవిగా లేవు. బాబోయ్.. ఇదేం సంగీతం? అనిపిస్తుంది. పాటలు సందర్భానుసారంగా లేకపోవడంతో పాటు వాటిలో మెరుపు తగ్గడంతో అవి కూడా స్పీడు బ్రేకర్లలాగే పనిచేశాయి.
ఇక నటీనటుల విషయానికొస్తే.. సినిమాకు ప్రధాన బలం హీరో రవితేజ. తనదైన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ‘నేల టిక్కెట్టు’ను నడిపించే ప్రయత్నం చేశాడు. కామెడీ టైమింగ్‌తో పాటు యాక్షన్, రొమాన్స్‌లో ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగే హుషారుగా కనిపించడానికి ప్రయత్నించాడు. అతడొక్కడే సినిమాను నెట్టుకురావడానికి శతవిధాలా శ్రమించాడు. కానీ, కథలో పాత్రలో బలం లేకపోవడంతో ఆయన కూడా ఏమీ చేయలేకపోయాడు. రవితేజ చేసిన చాలా కమర్షియల్ సినిమాల్లో ఇదీ ఒక్కటి అన్నట్టు ఉంది. ‘నేల టిక్కెట్టు గాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు’ వంటి డైలాగులు అక్కడక్కడా మాస్‌ను ఆకట్టుకుంటాయి. హీరోయిన్ మాళవికాశర్మ గ్లామర్ సన్నివేశాల్లో ఓకేగానీ నటిగా ఇంకా మెరుగుపడాలి. ఆమెకు ఇదే తొలిచిత్రం. చూడ్డానికి బాగానే ఉన్నా రవితేజతో పాటు ఆమె కెమిస్ట్రీ అంతగా పండలేదు. జగపతిబాబుకి ఫణీంద్ర భూపతి ఎంత పేరు తెచ్చిందో ఈ ‘ఆదిత్య భూపతి’ అంత పాయింట్‌లెస్‌గా మిగిలిపోతుంది. సంపత్‌రాజ్, అలీ, ప్రవీణ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, జయప్రకాష్ రెడ్డి, ప్రియదర్శి ఇలా తెరనిండా నటీనటులున్నా ఎవరినీ కనీసం గుర్తుంచుకునే ఛానే్స ఇవ్వలేదు. సంగీత దర్శకుడు శక్తికాంత్ సంగీతం ఏ కోశానా మెప్పించలేకపోయింది. ఏ ఒక్క పాట అలరించలేకపోయింది. ముఖే ష్.జి సినిమాటోగ్రఫీ సోసోనే. ఎడిటర్ చోటా కె.ప్రసాద్ తన ఎడిటింగ్ ద్వారా అనవసరమైన సన్నివేశాలను తొలగించాల్సింది. రామ్ తాళ్లూరి నిర్మాణ విలువలు బావున్నాయి. మొత్తం మీద ఈ సినిమాలో దర్శకుడిగా కళ్యాణ్ కృష్ణ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. హీరో పాత్రను బాగానే రాసుకుని, దాని ద్వారా మెసేజ్ ఇచ్చిన ఆయన కథ, కథనాల విషయంలో తీవ్ర నిరుత్సాహానికి గురిచేశాడు. సినిమాను ఒక దిశలో నడపకుండా అనవసరమైన అనేక పాత్రలతో, సన్నివేశాలతో, పేలవమైన కథనంతో ప్రేక్షకులను ముప్పుతిప్పలు పెట్టాడు. ప్చ్.. ఇన్ని లోపాలున్న ఈ సినిమా ‘టిక్కెట్టు తెగడం కష్టమే!’ మరి! *

--ఎం.డి. అబ్దుల్