రివ్యూ

గురి తప్పిన మిసైల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశపు మొట్టమొదటి స్పేస్ సినిమాగా తెరకెక్కిన టిక్ టిక్ టిక్ ఓ వినూత్న ప్రయోగమే! కానీ ఓ సినిమాకు కొత్త అంశాన్ని ఎన్నుకున్నపుడు మామూలు సినిమా కన్నా ఎన్నో రెట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. అందులోనూ వైజ్ఞానిక అంశాల విషయాల్లో అయితే శాస్ర్తియత, తర్కాన్ని బలంగా ఎస్టాబ్లిష్ చేయగలగాలి.
వైజాగ్‌లో ఓ ఉల్క (ఆస్ట్రాయిడ్) పడడంవల్ల స్వల్ప ప్రాణనష్టం జరుగుతుంది. కానీ ఇంకో వారంలో 4 కోట్లమంది ప్రాణాలకు ముప్పు కలిగించే ఇంకో ఉల్క భారత్ చిత్రపటానే్న సమూలంగా నాశనం చేయబోతుందన్న విషయం తెలుసుకున్న భారతీయ డిఫెన్స్ స్పేస్ డివిజన్ బృందం, ఎలాగైనా ప్రజల్ని ఆ ఘోర ప్రమాదం నుండి కాపాడాలనుకుంటుంది. ఆ క్రమంలో వారికి 20 కేజీల టన్నులున్న క్షిపణి అవసరమవుతుంది. అంతటి బరువున్న క్షిపణిని ప్రయోగించడం అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధం.
ఆ క్షిపణిని వేరే దేశం ఆధీనం నుండి దొంగిలించడం ఒకటే మార్గం. దానికి ఓ తెలివైన దొంగ అవసరం పడుతుంది. ఆ తెలివైన దొంగ మరియు మెజీషియన్ (విదూషకుడు) వాసు (జయమ్ రవి). ఆ తరువాత అతనికి క్షిపణి తనకు అప్పగించాలని లేకపోతే అతని కొడుకుకే ప్రమాదం అని బెదిరింపు కాల్ వస్తుంది.
చివరకు కొడుకును, 4 కోట్ల మంది ప్రాణాలను ఎలా కాపాడటం జరిగింది అన్నదే కథాంశం. ఈ సినిమాలో ఆస్ట్రాయిడ్స్ అంశంతోపాటు ఇంకో దేశం కూడా ఇమిడి ఉంది. దేశాలమధ్య యుద్ధానికి దారితీసే అంశాలు ఉన్న ఈ సినిమాను ఓ మూస హీరో విలన్‌ను ఎలా కొడతాడో, అలాగే ఆ దేశంపై కూడా అలాంటి తెలివితోనే క్షిపణి సాధించడం వంటి అంశాలు ‘స్పేస్ ఫిల్మ్’ అన్న ఫీల్‌ను ప్రేక్షకుల్లో కోల్పోయేలా చేశాయి.
విషయ పరిజ్ఞానం, అనుభవం కన్నా ‘కామన్‌సెన్స్’ ముఖ్యం అని తెలిపే పాత్ర హీరోది. అలాగే కొడుకు ప్రాణాలా? లేక నాలుగు కోట్లమంది ప్రాణాలు ముఖ్యమా అన్న సందిగ్ధత ఏర్పడినపుడు మొదట్లో కొడుకు ప్రాణాలకే ప్రాధాన్యత అని అనుకుని లిక్విడ్ హైడ్రోజన్ లీక్ అయ్యేలా చేసిన సందర్భంలోనూ, అలాగే ప్రారంభంలో ఓ వాచ్‌మాన్‌ను కాపాడడం కోసం తాను జైలుపాలవ్వడం వంటి సన్నివేశాలతో సినిమాలో ఎమోషన్స్‌ను పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
ఉన్న రెండు పాటల్లో ఒక్క పాట తండ్రీ కొడుకుల అనుబంధానికి సంబంధించినది అయినప్పటికీ ఆ అనుబంధ గాఢత స్పష్టంగా లోపించింది. స్పేస్ సినిమాలోని వైజ్ఞానిక అంశాలు వీలైనంత వరకూ ప్రేక్షకులందరికీ అర్థమయ్యేలా చూపించినప్పటికీ స్పేస్ అంటే ఇంతేనా? అనే ఓ భావన ఓ క్షణంలో ప్రేక్షకుడికి కలిగేంత పేలవంగా కొన్ని సన్నివేశాలు చిత్రించబడ్డాయి.
అంతేకాకుండా ఇంటర్‌స్టెల్లార్ లాంటి హాలీవుడ్ సినిమాలు చూసిన వారికి ఈ సినిమాలోని ముడులన్నీ ముందే విప్పేసి ఉంటాయి. సినిమాలో ఉత్కంఠ కలిగించే ట్విస్టులు ఎన్నో ఉన్నాయని అనిపించినప్పటికీ అవన్నీ లాజిక్‌కు దూరంగానే ఉంటాయి.
సినిమా మొదట్లో, అలాగే కొన్ని కొన్ని సన్నివేశాల్లో తప్ప ఎక్కడా కూడా ఈ సినిమాలో ఓ ప్రత్యేక స్పేస్ ఫీల్ కనపడదు. అలాగే, రాకెట్ మిసైల్ గురించి, ఉల్క గురించి క్లుప్తతతోనూ, స్పష్టతలోనూ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేసిన దర్శకుడు ఓ మేరకు విజయవంతం అయినా అది సంపూర్ణ సినీ విజయం అని చెప్పలేం. ఎందుకంటే ఒక్కో సినిమా నుండి ప్రేక్షకులకు ఒక్కో రకమైన అంచనాలు ఉంటాయి. ఇటువంటి వైజ్ఞానిక అంశాలతో తెరకెక్కిన సినిమాలనుండి ప్రేక్షకులు ఆశించేది కొత్తదనం, ఓ కొత్త లోకానికి తీసుకెళ్లే భావన, స్పేస్‌లో వినూత్న అంశాల కలబోత. కొత్తదనాన్ని ప్రయత్నించడం మినహా మిగిలిన అంశాల్లో మిగిలింది వైఫల్యమే.
సినిమాను బలహీనం చేసిన మరో అంశం ప్రతినాయకుడి చిత్రీకరణ. ఆ బృందం చీఫ్ డబ్బుకోసం అంతమంది ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టబోతున్నాడు అన్న విషయాన్ని సస్పెన్స్‌గా మలచలేకపోయారు. అది చాలా సాధారణమైన అంశంగా ఉంటుంది తప్ప సినిమాకు బలాన్ని ఇవ్వలేదు. సినిమాలో ప్రతి విషయాన్ని దాని సాంకేతికతను విపులంగా వివరించినా, ప్రతినాయకుడు, హీరోతో మాట్లాడిన కమ్యూనికేషన్ చానల్‌ను వివరించలేదు. ఇటువంటి చిన్న చిన్న అంశాలే సినిమాకు విషయపుష్టిని చేకూరుస్తాయి.
ఇంకో అంశం ఏమిటంటే, పరాయి దేశంలో స్పేస్ స్టేషన్‌లో వున్న క్షిపణిని దొంగతనం చేసినపుడు తలెత్తే సమస్యలు, రెండు దేశాలమధ్య కొనసాగే వైరుధ్యాలు చాలా సులభంగా తీరిపోవడం సినిమాలోని గాంభీర్యాన్ని ఈ అంశం పలుచన చేసింది. అలాగే అలా జరిగిన అంశాల్లో శాస్ర్తియత తర్కం (సైంటిఫిక్ లాజిక్) లేకపోవడం సినిమాను ఆకాశం నుండి భూమికి పడేలా చేసింది.
అలాగే చివరికి సినిమాలో టైమ్ సెట్టింగ్ ఎలా మార్చబడిందో కూడా శాస్ర్తియంగా వివరించలేదు. ఓ మామూలు మనిషి ఎంత తెలివైనవాడైనా అంతరిక్ష పరిజ్ఞాన స్థాయిని పరాయి దేశంలో వ్యవహరించే తీరును సునాయాసంగా మలుపులు తిప్పగల వ్యక్తి కాగలిగాడంటే దానికి హీరో చిత్రీకరణ ఎంతో ‘లాజిక్ ఐడెంటిటీ’గా జరగాలి. కానీ అవేమీ ఈ సినిమాలో కనపడవు.
ఓ వినూత్న కథాంశంతో సినిమా తెరకెక్కినపుడు ప్రేక్షకుల్లో ఖచ్చితంగా ఓ మామూలు భావనకు అతీతమైన అద్భుతాన్ని సృష్టించారు అన్న భావన కలుగుతుంది. కానీ మొదటి భారతీయ స్పేస్ సినిమాగా తెరకెక్కినప్పటికీ ఈ సినిమా చూసినపుడు ఓ మామూలు సినిమా చూసిన భావనే కలుగుతుంది తప్ప మరే కొత్త భావన కలుగదు.
ఈ సినిమా మొత్తాన్ని ఓ ముక్కలో తేల్చెయ్యాలంటే అసంపూర్ణంగా మిగిలిన ముక్కల్ని సంపూర్ణం చేయకపోవడం సినిమాకు పెద్ద మైనస్ పాయింట్.
తమిళ సినిమాలు అన్నీ ప్రయోగ దశలోనే సాగుతున్నాయి. ఈ నెలలోనే వచ్చిన అభిమన్యుడు బ్లాక్‌బస్టర్ అయ్యింది. అది వినూత్న అంశమే. ఆ సినిమాలో కూడా ప్రధాన పాత్రల చిత్రీకరణలో లోపాలు కనిపించినప్పటికీ చెప్పాలనుకున్న అంశాన్ని స్పష్టంగా, ప్రేక్షకులు మరచిపోలేకుండా చెప్పడం ఆ సినిమాను హిట్ టాక్ సంపాదించుకునేలా చేసింది.
ఏది ఏమైనప్పటికీ కొత్త కథాంశాలను తెరకెక్కిస్తున్న ఈ తరుణంలో ప్రేక్షకులు కూడా వాటిని ఆదరిస్తున్నారు. విషయగాఢత, స్పష్టత మాత్రమే సినిమాలో ఎక్కడో దాగి వుండే చిన్న చిన్న తప్పుల్ని తెరపైకి రాకుండా చేయగలవు. విషయ స్పష్టతలోనే లోపం ఉంటే, సినిమా బలం కోల్పోయినట్టే. అలాగే సినీ అంశం కొత్తదైనపుడు సినిమా తీసే ప్రక్రియ కూడా కొత్తగా ఉంటేనే సినిమా సక్సెస్ అవుతుంది. అంశం కొత్తదై, ప్రక్రియలు మాత్రం మూసపోయిన పద్ధతిలో ఉంటే టిక్ టిక్ టిక్‌లా గురి తప్పిన క్షిపణులు అవుతాయి. *

--శృంగవరపు రచన 9959181330