రివ్యూ

యాక్షన్ డ్రామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** పంతం
**
తారాగణం:
=======
గోపీచంద్, మెహరీన్,
పృథ్వీ, తనికెళ్ల భరణి,
‘మిర్చి’ సంపత్, జయప్రకాశ్‌రెడ్డి,
ముఖేష్ రుషి, శ్రీనివాస్‌రెడ్డి,
షాయాజీషిండే, రాళ్లపల్లి,
ప్రభాస్ శ్రీను తదితరులు.

ఎడిటర్: ప్రవీణ్ పూడి
కళ: ఎ.ఎస్. ప్రకాశ్
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
నిర్మాణం: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
నిర్మాత: కె.కె రాధామోహన్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.చక్రవర్తి
**
యాక్షన్ హీరో గోపీచంద్ గత కొంత కాలంగా ఒక్కటంటే ఒక్క విజయం కోసం తెగ తపించిపోతున్నాడు. వరుసగా ప్రతీ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుండటంతో కెరీర్ కష్టాల్లో పడింది. మూడు భారీ ఫ్లాపులను చవిచూసి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అతడు తాజాగా ‘పంతం’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇది తన 25వ చిత్రం కావడం విశేషం. సామాజిక సమస్యలను ఇతి వృత్తాలుగా ఎంచుకుని సినిమాలు చేయడంలో గోపీచంద్ ముందుంటాడు. ఈ ‘పంతం’ కూడా అలాంటి సమస్యలపైనే తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన గోపీచంద్ కెరీర్ తొలి నాళ్లలో విలన్‌గా కూడా నటించి మెప్పించాడు. కథానాయకుడిగా మారాక విజయాలు వరించినా.. తర్వాత అదే పరంపరను అందుకోవడంలో సతమతమవుతూ వస్తున్నాడు. గోపీచంద్ గత చిత్రం ‘ఆక్సిజన్’ అతడిని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎలాగైనా ఇక హిట్ సాధించాల్సిందే అనుకుని ‘పంతం’ నెరవేర్చుకోవడానికి ఇలా ముందుకొచ్చాడు. మరి గోపీచంద్ ‘పంతం’ నెగ్గిందా? కెరీర్ మళ్లీ ట్రాక్‌లో పడిందా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
విక్రాంత్ సురానా (గోపీచంద్) ఎంతో తెలివైన వాడు. మంత్రులు దాచుకుంటున్న అక్రమ సొమ్మును తన తెలివితేటలతో కొట్టేస్తుంటాడు. అలా కొట్టేసిన సొమ్మును దుర్గాదేవి ఛారిటబుల్ ట్రస్ట్‌కి పంపిస్తుంటాడు. ఆ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సాయం అందుతుంది. దాంతో పాటు అతడు నివాసం ఉంటున్న కాలనీని కూడా బాగుచేస్తాడు. విక్రాంత్ వల్ల నష్టపోయిన మంత్రులు జయేంద్ర ఉరఫ్ నాయక్ (సంపత్), ఆరోగ్యరావు (జయప్రకాశ్ రెడ్డి). ఈ మంత్రులకు విక్రాంత్‌కి ఉన్న సంబంధం ఏమిటి? వారి అక్రమ సొమ్మును ఎందుకు కొట్టేస్తున్నాడు? ఈ మంత్రులనే ఎందుకు టార్గెట్ చేశాడు? అసలు విక్రాంత్ ఎక్కడి నుంచి వచ్చాడు? అతడు సాధించాలనుకున్నదేమిటి? అన్నదే కథ.
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం ప్రకటించే సాయం ఎంతమంది బాధితులకు చేరుతుంది? మధ్యలో మంత్రులు, అధికారులు ఆ డబ్బును ఎలా దోచుకుంటున్నారు? అన్న పాయింట్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్‌ని జోడించాడు దర్శకుడు చక్రవర్తి. గోపీచంద్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టు వరుస యాక్షన్ సీన్స్‌తో అలరించాడు. అయితే హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నంలో లాజిక్‌లను పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది. విలన్ క్యారెక్టర్‌ను మరింత బలంగా చూపించాల్సింది. కథనం మధ్యలో పాటలు స్పీడు బ్రేకర్లల అడ్డు తగులుతాయి. ఉన్నవాడి దగ్గర దోచుకుని లేనివాడికి పెట్టడం అనే రాబిన్‌హుడ్ తరహాకథ ఇది. ఎప్పుడూ కొత్త తరహా కథలను ఎంచుకునే గోపీచంద్ తన 25వ సినిమా కోసం రొటీన్ కథను ఎంచుకోవడం ఆశ్చర్యమే. హీరో డబ్బులు ఎత్తుకుపోవడం లాంటి సన్నివేశాలను కూడా రొటీన్ పద్ధతిలోనే తెరకెక్కించాడు. కథానాయిక క్యారెక్టర్‌కి, ఆమెతో నడిచే ప్రేమకథకి ఏ మాత్రం ప్రాధాన్యం లేకుండా పోవడంతో వారి మధ్య నడిచే సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. ద్వితీయార్థంలో దర్శకుడు ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశాడు. విక్రాంత్ ఫ్లాష్‌బ్యాక్, తాను దొంగగా మారడానికి దారితీసిన పరిస్థితులు, అతని లక్ష్యం ఇవన్నీ సమంజసంగానే అనిపిస్తాయి. కోర్టులో సన్నివేశం ఆసక్తికరంగా అనిపిస్తుంది. అవినీతి, లంచగొండితనం, ప్రభుత్వ పథకాలు అందవలసిన వారికి సరిగ్గా అందకపోవడం వంటి పాయింట్లపై గోపీచంద్ పలికిన సుదీర్ఘమైన సంభాషణలు రచయితగా దర్శకుడిలో ఉన్న ప్రతిభను చాటాయి. పతాక సన్నివేశాల్లో రొటీన్‌గా యాక్షన్ జోలికి వెళ్లకుండా డైలాగులతో సరిపెట్టేశారు. గోపీచంద్ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించాడు. ఒకవైపు కోటీశ్వరుడుగా, మరోవైపు రాజకీయ నాయకుల నల్లధనాన్ని దోచుకునే దొంగగా మెప్పించాడు. ఇక హీరోయిన్ మెహరీన్ పాత్ర పాటలకే పరిమితం అయింది. మెయిన్ విలన్ పాత్రలో సంపత్ సునాయసంగా నటించాడు. ఫస్టాప్‌లో పృథ్వీ తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరో స్నేహితుడి పాత్రలో శ్రీనివాసరెడ్డి పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. విలన్‌గా సంపత్‌రాజ్ రొటీన్ పాత్రలో కనిపించారు. అవినీతి పరుడైన రాజకీయ నాయకుడిగా తనదైన స్టయిల్‌లో ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో జయప్రకాష్‌రెడ్డి, షాయాజీషిండే, ముఖేష్ రుషి, తనికెళ్ల భరణి పరిధి మేరకు ఆకట్టుకున్నారు. యాక్షన్ హీరోగా గోపీచంద్‌కు మంచి పేరుంది. అతనికి సరిపడే కథ ఇది. కానీ ఆ కథలో కొత్తదనం లేకపోవడంతో అతడి నటన కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది. ద్వితీయార్థంలో చాలా స్టయిలిష్‌గా కనిపించాడు. దర్శకుడు చక్రవర్తి తొలి సినిమాకు కొత్త సబ్జెక్ట్ కాకుండా కమర్షియల్ సినిమాకు మెసేజ్ మిక్స్‌చేసి చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే సెకండాఫ్‌లో ఉన్న ఎఫెక్ట్ ఫస్ట్ఫాలో కనపడదు. గతంలో చూసిన రెగ్యులర్ సినిమాల స్టయిల్‌లోనే సినిమా నడుస్తుంది. సినిమాలో ప్రధాన ప్లస్ పాయింట్ అంటే సినిమా ప్లాట్. చాలా సినిమాల్లో చూసినట్టుగా కాకుండా ఇందులో పొలిటీషియన్స్ కాజేసే డబ్బుకు సంబంధించిన అంశం ఆసక్తికరంగా, ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. హీరో గోపీచంద్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకోగా పరిణితి చెందిన ఆయన నటన, యాక్షన్ సన్నివేశాల్లో ఫైట్స్ బాగున్నాయి. అయితే సినిమా ప్లాట్ సామాజిక అంశాలతో ముడిపడి బాగానే వున్నా ఇప్పటికే అలాంటి ప్లాట్ ఆధారంగా చాలా సినిమాలు వచ్చి ఉండటంతో సినిమా చూస్తున్నంత సేపు పెద్దగా థ్రిల్ కలగదు. దర్శకుడు చక్రవర్తి రాసుకున్న కథనం ఆఖరి క్లైమాక్స్ మినహా మరెక్కడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రతి సన్నివేశం ఎక్కడో చూసినట్టుగానే ఉంటుంది. సినిమా సగం పూర్తయిన తర్వాత కానీ అసలు కథ, హీరో లక్ష్యం ఏమిటి? అనేది రివీల్ కాకపోవడంతో అసలు సినిమా గమ్యం ఏమిటో బోధపడక చూసే వారిలో కొంత నీరసం కలుగుతుంది. సాంకేతిక విభాగం విషయానికొస్తే.. రమేశ్‌రెడ్డి, శ్రీకాంత్ సంభాషణలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు సన్నివేశాలు, సంభాషణలు కట్టిపడేస్తాయి. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ రిచ్‌గానే ఉంది. గోపీసుందర్ నేపథ్య సంగీతం ఫర్వాలేదు. పాటలు ఏ మాత్రం ఆకట్టుకోవు. నిర్మాత కె.కె రాధామోహన్ పాటించిన నిర్మాణ విలువలు బావున్నాయి.

--రతన్