రివ్యూ

గెలవడానికే పుట్టిన ఫ్లిక్కర్ సింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్మా **** చాలా బాగుంది

** ** ** ** *** * * * * * * *

ఒకే తరహా సినిమాలు మరలా వస్తే అది ప్రేక్షకుల మనసును దోచుకునే సందర్భాలు తక్కువ. కానీ బాలీవుడ్ బయోపిక్‌లు మాత్రం ఇందుకు మినహాయింపు. మొన్న ప్యాడ్‌మాన్, నిన్న సంజూ, నేడు సూర్మా. బయోపిక్ తీయడం సాహసం అయినప్పటికీ, ఆ సాహసాన్ని అవలీలగా చేసేస్తున్నారు బాలీవుడ్ దర్శకులు. తాజాగా షాహద్ అలీ దర్శకత్వంలో విడుదలైన ‘సూర్మా’ కూడా హాకీ ఆటగాడైన సందీప్‌సింగ్ జీవితాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కింది. బయోపిక్‌లు తీయాలంటే ఆ వ్యక్తికి స్టార్‌డమ్ ఉండాలి లేదా సమాజానికి ఏదో చేసి ఉండాలి. సందీప్‌సింగ్ ఈ రెండు లక్షణాలు ఉన్న వ్యక్తి కనుక సినిమా బంపర్ హిట్ అయింది.
సందీప్‌సింగ్ జీవితంలో విజయాలు మాత్రమే లేవు. ఓ మామూలు కుటుంబంలో ఉండే కష్టాలున్నాయి. ప్రపంచ చరిత్రలో తనకొక ముద్ర వేసుకునే అవకాశం వచ్చినపుడు తను చేయని తప్పుకు జీవితం బలైనా, అతను తిరిగి లేచి తన కాళ్ళమీద నిల్చోవడం అసాధ్యం అని వైద్యులే తేల్చేసినా, అతను పట్టు విడువలేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తన గెలుపుతో నిస్పృహకు, భయానికి, ఓటమికి సమాధానం చెప్పాడు. అందుకే అతని జీవితంలో గెలుపుతోపాటు ‘గెలవాలన్న కసి’ ఎన్నో రెట్లు ఎక్కువ ఉంది. అందుకే అప్పటికే బయోపిక్‌లు వచ్చినా సందీప్‌సింగ్ రేసులో ముందున్నాడు.
సూర్మా అంటే తెలుగులో ధైర్యవంతుడైన యుద్ధవీరుడు అని అర్థం. ఆ టైటిల్‌తోనే దర్శకుడు షాహద్ అలీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాడు. తెలుగులో ‘మహానటి’ బయోపిక్ విడుదలైనప్పుడు కీర్తి సురేష్ ఆ పాత్రకు ఎంతమేర న్యాయం చేస్తుందనే సందిగ్ధతలు కొంతకాలం ఉన్నాయి విడుదలయ్యేవరకు. అలాగే ‘సంజు’ విడుదలప్పుడు కూడా రణబీర్‌కపూర్ ఆ పాత్రకు ఎంతమేరకు న్యాయం చేయగలుగుతాడు? అన్న సందేహాలు సినిమా విడుదల వరకు ప్రేక్షకుల మెదడును తొలిచేశాయి. ఇటువంటి సందేహాలు ప్రతి బయోపిక్‌ను తీసినపుడు ఖచ్చితంగా తలెత్తుతాయి. తీసుకున్న పాత్ర ఎంత ఉన్నతమైనదైనా ఆ పాత్రను ప్రేక్షకులకు సన్నిహితం చేసే నటుడు అంతే ఉన్నతంగా నటించాలి.
సందీప్‌సింగ్ పాత్ర పోషించిన దిల్జిత్ దోసంజ్ కానీ, సందీప్‌సింగ్ కానీ మనకు ఈ సినిమాలో కన్పించరు. మనకు కేవలం సందీప్‌సింగ్ కష్టం, కృషి, కసి, గెలవాలన్న తపన, ఆ పరిస్థితులు, సంఘటనలు మాత్రమే కనబడతాయి. ఇది నటనతో నడిచిన సినిమా కాదు. జీవితంతో నడిచే సినిమా. అందుకే ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోతుంది ఈ సినిమా.
సినిమాలో సందీప్‌సింగ్ గురించి చెప్పించిన తీరు కూడా చాలా బావుంది. సందీప్‌సింగ్ భార్య హరిజిందర్‌కౌర్ ఈ కథ చెబుతుంది. వారిద్దరూ చిన్నప్పటినుండి మిత్రులు. అంతేకాదు ఆమె కూడా హాకీ క్రీడాకారిణి. సందీప్‌సింగ్ సోదరుడైన విక్రమ్ కూడా హాకీ క్రీడాకారుడే.
హర్యానాలోని ఓ గ్రామంలో జన్మించాడు దేశం గర్వించే ఆటగాడు. హాకీలో అతి కష్టమైన అంశంగా పరిగణించే ‘డ్రాగ్ ఫ్లిక్’ను సునాయాసంగా మెరుపులాంటి వేగంతో ఆడేస్తాడు. అందుకే దేశం అతనికిచ్చిన పేరు ‘్ఫ్లక్కర్ సింగ్’. 1986లో జన్మించిన ఈ ఆటగాడి ప్రస్తుత వయసు 32 ఏళ్ళు అంతే. ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో డిఎస్పీ హోదాలో ఉన్నాడు.
18 ఏళ్ళకే భారత జాతీయ హాకీ జట్టులో చోటు సాధించాడు ఫ్లిక్కర్‌సింగ్. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో జర్మనీలో ఆడటానికి తన బృంద సభ్యులను కలిసి తర్వాత వెళ్లడానికి శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. అది 22 ఆగస్టు 2006. అంతర్జాతీయ స్థాయిలో ఆడబోతున్నానన్న ఆనందం ఏ క్రీడాకారుడికైనా జీవితంలో మరిచిపోలేని అనుభూతి. వరల్డ్ కప్ కలలు కంటున్నాడు. కానీ విధి ఇంకోలా తలచింది. అనుకోకుండా పేలిన తుపాకీలో నుండి చొచ్చుకువచ్చిన బుల్లెట్ అతని శరీరాన్ని చీల్చివేసింది. అతని కలల్ని కాల్చివేసింది.
దాదాపు అతని శరీరం అంతా చచ్చుబడిపోయింది. ఇక సందీప్ తన కాళ్లమీద తాను నిలబడే అవకాశమే లేదని వైద్యులే తేల్చేశారు. అసలు హాకీ ఆడే అవకాశం అయితే అస్సలు లేదన్నారు. అసాధ్యమని వదిలేస్తే అతను స్పోర్ట్స్‌మెన్ ఎందుకవుతాడు? వైద్యుల మాటని అబద్ధం చేశాడు. అనుక్షణం యుద్ధం చేశాడు. వీల్‌ఛెయిర్‌తో రణరంగంచేశాడు. శరీరంలో దహించుకుపోయే బాధతో పోరాటం చేశాడు. చివరికి తన కాళ్ళమీద తాను నిలబడ్డాడు. అంతటితో ఆగలేదు, పరుగెత్తాడు. హాకీ ఆటగాడికి కావాల్సిన కసరత్తులు అన్ని చేసి యోధుడిలా యుద్ధానికి సిద్ధమయ్యాడు.
క్రీడారంగం ఏ ఒక్కరికి రెండో అవకాశం ఇవ్వదు. కానీ సందీప్‌సింగ్ పోరాడి తీసుకున్నాడు. జనవరి 2009న టీమ్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. అప్పటికే 13 ఏళ్ళుగా పాకిస్తాన్‌పై గెలుపుకోసం ఎదురుచూస్తున్న భారత్ జట్టుకి విజయాన్నిచ్చాడు. అంతేకాదు ఆ టీమ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో వున్న అతని ఫ్లిక్ వేగం ఇప్పటికీ ప్రపంచ స్థాయి రికార్డుగానే నిలిచిపోయింది. 2010లో అర్జున అవార్డు అందుకొన్నాడు. ఇది క్లుప్తంగా సందీప్‌సింగ్ జీవితం. దీన్ని దర్శకుడు ఎంతో సున్నితంగా నిర్మించాడు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి ఇంకో వ్యక్తిలా మారలేడు. కానీ బయోపిక్‌లో ఆ దర్శకుడు, నటుడు ఖచ్చితంగా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలి. షాహద్ అలీ, దిల్జిత్ దోసన్‌జీ ఇద్దరూ ఆ పరకాయ ప్రవేశంలో విజయం సాధించారు.
జాతీయ స్థాయి శిక్షణ సమయంలో ఆటగాళ్ళు రాత్రుళ్ళు ఆడటం నిషిద్ధం. కానీ గెలవాన్న తపనతో ఆ నిషిద్ధ సమయంలో కూడా ఆడతాడు. అతని పట్టుదలకే ఫెడరేషన్ దిగివచ్చి అతన్ని ప్రోత్సహించింది. అతని కుటుంబ వాతావరణాన్ని, ఆట వాతావరణాన్ని కూడా కంటికి కట్టినట్టు తన దర్శకత్వ ప్రతిభతో చూపాడు దర్శకుడు. పైన చెప్పిన చిన్న చిన్న సన్నివేశాల్లో దర్శకుడు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధే ప్రేక్షకులను సందీప్‌సింగ్ జీవితంతో బలంగా కనెక్ట్ అయ్యేలా చేసింది.
సినిమా అన్నాక నాటకీయత కూడా కొంతమేరకు ఉండాలి. దాన్ని అతని భార్య పాత్ర ద్వారానే కాస్త పండించాడు దర్శకుడు. హాకీని చిన్ననాడు మొదలెట్టిన సందీప్ మధ్యలో వదిలేస్తాడు. కానీ అతని సోదరుడు షికమ్ మాత్రం బాల్యం నుండే హాకీలో ఉంటాడు. తరువాత ఓసారి ప్లేగ్రౌండ్‌లో కలిసిన అమ్మాయి ప్రేమకోసం అతను హాకీని మరలా ఆడటం మొదలుపెడతాడు. ఆమె పాత్ర పోషించింది తాప్సీ. ఆమెకోసమే ఆడి జాతీయ స్థాయికి ఆడతాడు. కానీ అతని తుపాకీ దెబ్బ తిన్నపుడు చూడటానికి ఓసారి వచ్చి తరువాత ఆమె కనపడకుండా వెళ్లిపోవడంతో అతను పిచ్చివాడయిపోతాడు. చివరికి మరలా ఆమెను సాధించడానికే హాకీ కోసం సిద్ధమవుతాడు.
కానీ ఇక్కడ ఓ సమస్య ఉంది. ఈ మాత్రం ప్రేమ లేకపోతే సినిమా పండదు. కానీ సినిమాలో ప్రేక్షకుడికి కనిపించాల్సింది సందీప్‌లోని ఆటగాడు కానీ ప్రేమికుడు కాదు. అందుకే దర్శకుడు ఆ కోణాన్ని కూడా ఆలోచించి రెండు సంఘటనల ద్వారా సందీప్‌లోని ‘వీరుడైన ఆటగాడిని’ ప్రేక్షకులకి చూపిస్తాడు.
ఓసారి ఆట ఆడుతున్నపుడు తన ప్రేయసి రావడంతో గోల్ కోల్పోతాడు సందీప్. అది సినిమా ఇంటర్వెల్ ముందు భాగంలో జరిగింది. కానీ సినిమా చివరిలో పాకిస్తాన్ ప్రత్యర్థిగా ఆడుతున్నపుడు మరలా ప్రేయసి వస్తుంది. అపుడు అతని గోల్ మిస్ కాదు. అంతేకాకుండా టాప్ స్కోరర్‌గా, అత్యధిక వేగ ఫ్లికర్‌గాను నిలుస్తాడు. ఇపుడు ‘ఇండియా కోసమే ఆడుతున్న సందీప్‌ని చూస్తున్నాను’ అన్న డైలాగ్ ద్వారా సందీప్‌లోని పరిణతి చెందిన గొప్ప క్రీడాకారున్ని చూపిస్తాడు దర్శకుడు.
ముందే చెప్పుకున్నట్టు ఈ సినిమాలో నటన, నటుల గురించి ఏ మాత్రం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడా మనకు నటన కనిపించదు, ఓ క్రీడాకారుడి తపన మాత్రమే కనిపిస్తుంది. అందుకే మార్కులన్నీ సినిమాకే పడతాయి. కానీ అలా అనుకునేలా చేసింది పరోక్షంగా నటులే కనుక, ఆ క్రెడిట్ వారికే దక్కుతుంది.
ఏదైనా కష్టం వచ్చినపుడు ‘ది స్పోర్టివ్’ అని ఎందుకంటారో ఇటువంటి ‘స్పోర్ట్స్‌పర్సన్’ జీవితాలని చూసినపుడే అర్థం అవుతుంది. సినిమాకి సామాజిక ప్రయోజనాన్ని చేకూర్చే ఇటువంటి సినిమాలు కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాక అన్ని సినీ తెరలపైకి రావాలని ఆశిద్దాం. ఎందుకంటే బాలీవుడ్ బయోపిక్‌లలో వైవిధ్యత ఎక్కువ. కేవలం నటుల బయోపిక్‌లకు పరిమితం కాకుండా, అన్ని కోణాల్లో సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల ఎంపికలో బాలీవుడ్ పరుగులు పెడుతున్నట్టు తాజా సినిమాలు చూస్తే అర్థమవుతుంది. చూద్దాం.. త్వరలో ఇంకెన్ని ప్రయోగాలతో వారు ముందుకు వస్తారో!

-శృంగవరపు రచన 99591 81330