రివ్యూ

వృథా ప్రయత్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిచయం * బాగోలేదు
తారాగణం:
విరాట్ కొండూరి, సిమ్రత్ కౌర్, పృథ్వీ, రాజీవ్ కనకాల,
సిజ్జు, శివనారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు చిత్రం భాషా తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
నిర్మాత: రియాజ్
రచన, దర్శకత్వం: లక్ష్మీకాంత్ చెన్నా

*** **** **************

‘పరిచయం’లోని కథా వస్తువు తెలుగు చలనచిత్రాలకు చెంది అపరిచితమైనదేం కాదు. 70-80 దశకాల్లో బాగా అరిగి నలిగిన కేంద్రబిందువే (స్మృతి కోల్పోవడం - తిరిగి రావడం). కానీ ఇందులో వున్న కొత్తదనం కాలానుగుణంగా అంటూ కొందరు దర్శకులు ఫాలో అవుతున్న ‘స్కిన్ షో’ యాంగిల్‌ను వదిలేసి ‘స్కిల్ షో’ కోసం ప్రయత్నించడం. ఎటొచ్చీ ఆ స్కిల్స్ తెరకు ఆవిష్కరణ చేయడంలో దర్శకుడు పడిన తత్తరపాటువల్ల సినిమా కొన్నిచోట్ల డీలాపడిపోయి అనాసక్తిదాయకమైంది. అదేంటో చూద్దాం..సహోద్యోగులైన సాంబశివరావు (పృథ్వీ), సుబ్రహ్మణ్యం (రాజీవ్ కనకాల) మిత్రులకు ఒకేరోజు అమ్మాయి లక్ష్మి (సిమ్రత్‌కౌర్), అబ్బాయి ఆనంద్ (విరాట్ కొండూరి) పుడతారు. వాళ్లిద్దరూ చిన్ననాటినుంచి ఒకరంటే ఒకరు ఇష్టపడతారు. ఆ క్రమంలో వాళ్లిద్దరూ కలిసి తిరుగుతారు. అది చూసిన లక్ష్మి తండ్రి ఆగ్రహోదగ్రుడై చావబాదుతాడు. ఆ తర్వాత కాలేజీ మాన్పించేసి ఇంట్లోనే ఉంచేస్తాడు. ఈ పరిణామాలకు భయపడ్డ లక్ష్మి ఆనంద్‌కు తాను దక్కనేమోనని పురుగుల మందు తాగుతుంది. దీని కారణంగా మతి కోల్పోతుంది. ఇలా తనకు అప్రతిష్టతెచ్చిన కూతుర్ని ఆసుపత్రి నుంచి ఇంటికి సైతం తీసుకెళ్లటానికి ఇష్టపడడు ఆమె తండ్రి. అలా తనకోసం ఆత్మహత్యా ప్రయత్నం చేసిన లక్ష్మిని ఆనంద్ ఏ విధంగా రక్షించుకున్నాడు? తిరిగి పోయిన జ్ఞాపకశక్తి ఎలా వచ్చిందీ అన్నది మిగతా కథ. ఇలా పైన స్థూలంగా వివరించిన కథ పరికిస్తుంటే బోల్డన్ని అపరిపక్వ అంశాలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. అసలా పురుగుల మందు తాగితే ‘మతి’పోవడాలు అన్నది అంతగా అంగీకరించలేని అంశం. అలాగే పతాక సన్నివేశంలో లక్ష్మికి తగిలిన ఎలక్ట్రిక్ షాక్‌వల్ల గతించిన స్మృతి తిరిగి యధాతథ స్థాయికి రావడం అన్నదీ మింగుడుపడని అంశం. ఈ ముఖ్యమైన కథా పాయింట్‌ని విస్మరించినా కొరుకుడు పడని అనేక అంశాలూ ఇందులో యథేచ్చగా దొర్లేశాయి. ఈ కాలంలో ఈ చిత్రంలో ఆడపిల్లల్ని ఆ మాదిరిగా చితకబాదడం జరుగుతుందా అన్నది ఓ ప్రశ్న. ఒకవేళ ఎంతో కఠినాత్ముడైన తండ్రి ప్రతిస్పందన అది అని సూత్రీకరించుకున్నా అనంతరమైనా ఆ అమ్మాయి ప్రతిఘటించదా? అన్నది ఇంకో ప్రశ్న. ఈ రెండు ప్రశ్నలకీ, వాటి పూర్వ సన్నివేశాల్లో ప్రాతిపదికలు చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఇక అంతా బావుంది ‘హమ్మయ్యా’ అని ప్రేక్షకుడు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో హీరోకి ఆశ్రయమిచ్చిన జ్ఞానేశ్వరరావు ప్రత్యర్థి బృందంతో ఫైటింగ్ దృశ్యాలూ వగైరా ఎక్స్‌టెండింగ్ క్లైమాక్స్ అనిపించింది తప్ప కథకు ఒదిగిన సీన్‌లా అనిపించలేదు. వీటినన్నింటినీ పక్కకు పెట్టి చూస్తే విరాట్ కొండూరి (తొలి ప్రయత్నం)కి మొదటి చిత్రంగా లభించిన ఆనంద్ పాత్ర సాధారణంగా ఏ నటుడూ అంగీకరించలేనిది. అలాంటి శక్తికి మించిన ఈ పాత్రని విరాట్ తన శక్తికొద్దీ నటించాడు. భావోద్వేగ సన్నివేశాల్లో ఇంకా పరిణతి అవసరమనీ ఆ సన్నివేశాలు తేల్చేశాయి. లక్ష్మి పాత్రలో సిమ్రత్ కౌర్ అందంగా కనిపించడమే కాక మతిపోయిన స్థితిలోనూ చాలా అమాయకంగా కనిపడి అలరించింది. చాలారోజుల తర్వాత ఒక మంచి పాత్ర సుబ్రహ్మణ్యం ద్వారా రాజీవ్ కనకాలకు లభించింది. దాన్ని ఆయన సమర్థవంతంగా పోషించారు. అలాగే సాంబశివరావుగా పృథ్వీ కూడా బాగానే నటించారు. కాకపోతే ఆ పాత్రకిచ్చిన కొన్ని అపసవ్యతల వల్ల ఇంకా అది రాణించవలసినంతగా రాణించలేదు. కథానాయకుడికి సహాయం చేసిన పాత్రలో పరుచూరి వెంకటేశ్వరరావు నటించారు. నాయకీ నాయికల తండ్రులు రైల్వే ఉద్యోగులు కావడంతో వారి ప్రేమ వగైరా అన్నీ రైలు పట్టాల నేపథ్యంలో జరగడం వంటివన్నీ దర్శకుడు చేసుకోవడం బాగుంది. ముందే చెప్పుకోవాల్సిన మరో అంశం సినిమాలో సంభాషణల గురించి- ‘గుడ్ న్యూస్ చెప్పినా గుండె పగిలినట్టు ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు మావాడు’- అన్న డైలాగ్‌తో ప్రారంభమైన ఈ దాటి, అనేకచోట్ల బాగా కొనసాగింది. ప్రత్యేకించి చిత్రానికి ‘ఆత్మ’ అయిన ప్రేమ విషయం గురించి పలుసార్లు అర్థవంతంగా ప్రస్తావించారిందులో. ‘రెండు మనసుల మధ్య ఆత్మ ప్రేమంటే, ప్రేమను ఫీలవ్వాలి కానీ, ప్రేమించినందుకు ఫీలవ్వకూడదు’, ‘ప్రేమ అంటే ఒకరికొకరు నచ్చినట్లు చేయడం కాదు, ప్రేమకోసం ఏదైనా చేయగలగడం’, ‘మనం ప్రేమిస్తున్నాం అనుకోవడం కన్నా ప్రేమిస్తున్నామా?’ అని ప్రశ్నించుకోడమే సరైనది. దీంతోపాటు ‘కడుపు చేసినవాణ్ణీ కళ్ళల్లో పెట్టుకుని చూసుకొనేవాణ్ణీ ఒకేలా చూడకండి’, ‘కష్టాలు భయపెట్టడానికి రావు - మనం జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి’- అన్న మంచి డైలాగ్స్ ఇందులో వున్నాయి. వీటి బాధ్యుడు దర్శకుడే (దర్శకుడే రచయిత). అరకు అందాల్ని నరేష్ కె.రానా (కెమెరామెన్) బాగా క్యాప్చర్ చేశారు. శేఖర్ చంద్ర స్వరాల్లో ‘అటు ఇటు..’ బాగుంది. చివరకు ఇలా చిరపరిచితమైన కథా నేపథ్యం వున్న ఇలాంటిదానికన్నా, ఓ కొత్త థ్రెడ్‌తో సినిమాని అందించి వుంటే ‘పరిచయం’ ప్రభావం ప్రతిభావంతంగా ప్రేక్షకులపై పడేదన్న భావనైతే కలిగింది.

-అనే్వషి