రివ్యూ

పంచభూతాలే కాపాడాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాక్ష్యం * బాగోలేదు

తారాగణం:

బెల్లంకొండ శ్రీనివాస్, పూజాహెగ్డే జగపతిబాబు, అశుతోష్ రాణా
వెనె్నల కిషోర్, శరత్‌కుమార్, మీనా జయప్రకాష్, పవిత్ర లోకేష్
బ్రహ్మాజీ, ఝాన్సీ, లావణ్య అనంత్ శ్రీరామ్, రవికిషన్ మధు గురుస్వామి తదితరులు.
కళ: ఏ.ఎస్.ప్రకాష్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
కెమెరా: ఆర్థర్ ఎ.విల్సన్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
ఫైట్స్: పీటర్ హెయిన్స్
సంగీతం: హర్షవర్థన్ రామేశ్వరన్
నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్
నిర్మాత: అభిషేక్ నామా
రచన, దర్శకత్వం: శ్రీవాస్

** ** *** ************

తెలుగు చిత్రసీమలోకి ‘అల్లుడుశీను’తో ఎంతో గ్రాండ్‌గా తెరంగేట్రం చేసిన యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అటు తర్వాత సినిమా సినిమాకు తన మార్కెట్‌ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. సినిమాల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నాడు. తొలి చిత్రంతోనే హీరోగా బలమైన పునాదులు వేసుకున్న అతడు చేసే ప్రతీ చిత్రం ఉన్నతమైన నిర్మాణ హంగులతో రూపుదిద్దుకునేలా చూసుకుంటున్నాడు. గత చిత్రం ‘జయ జానకి నాయక’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. దాంతో అతడు యమజోరు మీదున్నాడు. అదే ఊపు.. అదే జోరు కొనసాగిస్తున్నాడు. తాజాగా యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘సాక్ష్యం’తో మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు వచ్చాడు. భారీ నిర్మాణ హంగులు.. అంతే భారీ తారాగణం.. అతడికి తోడయ్యింది. ఓ మినీ ‘బాహుబలి’లా చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్రం యూనిట్ చెప్పుకుంది. పంచభూతాలే కర్మకి సాక్షి అనే అంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకుడు. గతంలో ఆయన లక్ష్యం, లౌక్యం, డిక్టేటర్ చిత్రాలు తీసి బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండించుకున్నాడు. మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాడు. సృష్టిలో జరిగే దానికి నాలుగు దిక్కులే కాదు.. ప్రకృతి కూడా సాక్ష్యం. సమయం వచ్చినప్పుడు ప్రకృతే ప్రక్షాళన చేస్తుందనే ఆసక్తికరమైన కానె్సప్ట్‌ని ఎంచుకున్నాడు దర్శకుడు. సాక్ష్యం ట్రైలర్, మేకింగ్ వేల్యూస్ సినిమాపై అంచనాలను పెంచాయి. అంతేకాదు, ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ‘సాక్ష్యం’ మరోసారి బెల్లంకొండకు సక్సెస్‌ని అందించిందా? ఇప్పటివరకు తన చిత్రాల ద్వారా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు తెరకెక్కించిన దర్శకుడు శ్రీవాస్ ఈ సినిమాతో భారీ యాక్షన్ చిత్రాలను కూడా డీల్ చేయగలడని నిరూపించుకున్నాడా? మరి ‘సాక్ష్యం’ ఎలావుంది? ఏమేరకు ఫలితాన్నిచ్చింది? తెలుసుకోవాలంటే కథేంటో చూడాల్సిందే..
స్వస్తిక్ నగరం అనే చారిత్రాత్మక ప్రాంతం. ఆ ప్రాంత ప్రజల ఆరాధ్యుడు రాజుగారు (శరత్‌కుమార్). రాజుగారు అంటే ప్రజల్లో గొప్ప పేరు. అతడి భార్య (మీనా). ఈ దంపతులకు ఎన్నో పూజలు, వ్రతాలు తర్వాత కలిగిన సంతానమే విశ్వజ్ఞ (బెల్లంకొండ శ్రీనివాస్). రాజుగారిది ఉమ్మడి కుటుంబం. ఎంతో అన్యోన్యంగా ప్రజల ఆదరాభిమానాలకు నిలయమై ఉంటుంది. కాగా, అదే ప్రాంతంలో మునిస్వామి (జగపతిబాబు) అతడి సోదరులు చేసే దుర్మార్గాలకు, అన్యాయాలకు రాజుగారు అడ్డుతగులుతున్నాడని కుడుకు విశ్వజ్ఞ పసిబిడ్డగా ఉన్నప్పుడే అతడి కుటుంబం మొత్తాన్ని అతి కిరాతకంగా దారుణంగా తుదముట్టిస్తాడు. రాజుగారి భార్య తన కొడుకును ఓ లేగ దూడకు కట్టి, అక్కడి నుంచి తప్పించి తను ప్రాణాలు కోల్పోతుంది. అలా చావునుంచి తప్పించుకున్న పిల్లాడు ఒక దగ్గర మట్టిలో పడి ఉండటంతో ఓ వ్యక్తి (సూర్య) చూసి.. చేరదీసి చివరకు కాశీలోని ఆలయంలో వదిలేస్తాడు. ఇదంతా పంచభూతాల సాయంతో నాటకీయ పరిణామాల మధ్య జరుగుతుంది. అలా ఆలయంలో వున్న ఆ పసిబిడ్డ పేరున్న బిజినెస్ ఫ్యామిలీ అయిన శివప్రసాద్ (జయప్రకాష్ పవిత్ర లోకేష్) దంపతుల వద్దకు చేరుకుంటాడు. సంతానం లేని ఆ దంపతులు కాశీలో దొరికిన ఆ పసిబిడ్డను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వారి కొడుకుగా అమెరికాలో పెరిగి పెద్దవాడవుతాడు. వీడియోగేమ్ డెవలపర్‌గా ఎంతో పేరు తెచ్చుకుంటాడు. అడ్వంచరస్ లైఫ్‌ను ఇష్టపడే విశ్వ రియాలిటీ వీడియో గేమ్స్ డిజైన్ చేస్తూ ఉంటాడు. అలాంటి విశ్వజ్ఞకు ప్రవచనాలు చెప్పే సౌందర్య లహరి (పూజాహెగ్డే) తారసపడుతుంది. తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. ఆమె అంటే ఎనలేని అభిమానాన్ని పెంచుకుంటాడు.
ఇండియన్ ట్రెడిషన్‌పై తానుచేసే ఓ వీడియోగేమ్‌కు సాయం చేయమని అడుగుతాడు సౌందర్యను. ససేమిరా అంటూనే..చివరకు అక్క (ఝాన్సీ), బావ (బ్రహ్మాజీ) జోక్యంతో ఒప్పుకుంటుంది. అందుకు వాల్మీకి (అనంత్ శ్రీరామ్) అనే వ్యక్తిని విశ్వకు పరిచయం చేస్తుంది సౌందర్య. వాల్మీకి పంచభూతాల నేపథ్యంలో రివేంజ్ డ్రామా కానె్సప్ట్ చెబుతాడు. అదే సమయంలో విశ్వ, సౌందర్యలు చిన్న అపార్థం కారణంగా దూరమవుతారు. ఇండియాలో వున్న తండ్రి (రావురమేష్)కు యాక్సిడెంట్ జరిగిందని తెలుసుకుని స్వదేశానికి ప్రయాణమవుతుంది సౌందర్య. అలా ఆమె ప్రేమనుపొందే క్రమంలో తన స్నేహితుడు (వెనె్నల కిషోర్)తో కలిసి ఇండియా చేరుకుంటాడు విశ్వ. సౌందర్య ప్రేమకోసం ఇండియా వచ్చిన విశ్వను పంచభూతాలు ఎలా నడిపించాయి? తనకు తెలియకుండా తన కుటుంబానికి అన్యాయం చేసిన వారిని అతడు ఎలా అంతమొందించాడు. పంచభూతాలు ఆడే నాటకీయ పరిణామాల మధ్య చంపేవాడు (విశ్వ) చచ్చేవాళ్లు (మునిస్వామి, అతడి తమ్ముళ్లు) ఒకరికి ఒకరు తెలియకుండా విశ్వ వాళ్లని ఎలా హతమార్చాడు? చివరకు సౌందర్య ప్రేమను పొంది ఇద్దరు కలిశారా? అసలు విశ్వకు చనిపోయిన అతని కుటుంబం గురించి తెలుస్తుందా? ఈ వ్యవహారంలో అతడికి ప్రకృతి ఎలా సాయపడింది? పంచభూతాలు తమ ప్రతి చర్యను ఎలా చూపాయి? లాంటి విషయాలు తెలియాలంటే ‘సాక్ష్యం’ చూడాల్సిందే.
పగ, ప్రతీకారం అంటూ వచ్చిన ఎన్నో అరిగిపోయిన పాత చింతకాయ పచ్చడి లాంటి నేపథ్యాల్ని ఎంచుకొని వచ్చిన సినిమాలను టాలీవుడ్‌లో మనం ఎన్నో చూశాం. అయితే, దానికి ఓ కొత్త నేపథ్యం ఎంచుకొని గాలి, నిప్పు, నీరు, నేల, ఆకాశం అంటూ పంచభూతాలను దర్శకుడు ఎంతో తెలివిగా వాడుకున్నాడు. హీరో తన తల్లిదండ్రులను చంపిన వారిని ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ చంపడం అనే పాయింట్ బలహీనంగానూ, రొటీన్‌గాను అనిపిస్తుంది. ప్రథమార్థంలో ఎంతో పట్టుగా, ఉత్కంఠ భరితంగా సినిమాపై ఆసక్తి కలిగించేలా చేసిన దర్శకుడు రానురాను అదే ఊపును కొనసాగించలేకపోయాడు. కథంతా గందరగోళం అయి ట్రాక్ తప్పుతుంది. ఎక్కడెక్కడికో తీసుకెళ్లి చికాకు తెప్పిస్తుంది. విదేశాల్లో విశ్వ, సౌందర్య లహరిల ప్రేమకథ విసిగించి ముప్పుతిప్పలు పెడుతుంది. ఇక వీడియో గేమ్‌లకథ కూడా అంతే! హీరో ఇండియా వచ్చాక శత్రు సంహారం మొదలుపెట్టిన తర్వాత కథ మళ్లీ ఆసక్తి కలిగించినా.. అది చివరి వరకు కొనసాగలేదు. విశ్రాంతి ఉత్కంఠ రేకెత్తించినా ఫలితం శూన్యమే! ద్వితీయార్థంలో శత్రువులను హీరో చంపే విధానం మాస్‌ను బాగా ఆకట్టుకునేలా తెరకెక్కింది. యాక్షన్ ఎపిసోడ్ ఒక్కొక్కటి విభిన్నతరహాలో సాగుతుంది. హీరోకు తన గతం తెలియకుండా దాస్తూనే, తనకు అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునేలా చూపించడం బావుంది. గాలి, నిప్పు, నీరు, నేల, ఆకాశం.. ఈ పంచభూతాలు మనిషిని సృష్టిస్తాయి. నాశనం చేస్తాయి. ప్రకృతి ధర్మాన్ని మనం పాటిస్తే మన ఉన్నతికి తోడ్పడతాయి. వాటిని అతిక్రమిస్తే అంతం చూస్తాయి అని చెప్పడం బావుంది. అయితే ఇలాంటి సినిమా చేస్తే అది ఆధ్యాత్మిక సినిమా అవుతుంది. దీనికి తెలివిగా వీడియోగేమ్‌ని జతచేసిన దర్శకుడు శ్రీవాస్ పక్కా కమర్షియల్ అంశాలను జోడించి నరకయాతన చూపించాడు. బెల్లంకొండ శ్రీనివాస్‌కు గత చిత్రం ‘జయ జానకి నాయక’తో వచ్చిన మాస్ ఇమేజ్‌ను దృష్టిలోపెట్టుకొని ఎక్కువగా యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌తో కథను లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. ప్రథమార్థాన్ని యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా బ్యాలెన్స్‌చేసిన దర్శకుడు ద్వితీయార్థాన్ని పూర్తిగా యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో నడిపించి ఇదేం సినిమారా.. బాబోయ్! అనిపించాడు. క్లైమాక్స్ మరీ ఇంత చీప్‌గా ఉంటుందా? అనిపిస్తుంది.
అడ్వంచర్స్‌ని ఇష్టపడే కుర్రాడు విశ్వగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఆకట్టుకున్నాడు. అతడి లుక్స్ అండ్ ఫిజిక్‌పరంగా ఎంతో ఫిట్‌గా కనిపించాడు. తన సిక్స్‌ప్యాక్‌తో గతంలోకంటే పరిణతి చెందిన నటన కనబరిచాడు. అయితే అక్కడక్కడా సందర్భానుసారంగా వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో ఎక్స్‌ప్రెషన్స్‌ని పండించలేకపోయాడు. ఈ విషయంలో శ్రీనివాస్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్రడక్షన్‌లో రిస్క్‌చేసిన అడ్వంచరస్ సీన్ పిల్లలను బాగా ఆకట్టుకుంటుంది. విశ్వ పాత్రలో మనం ఊహించని మెరుపులు ఏవీ లేకపోయినప్పటికీ, ఆ పాత్రకు తగ్గట్టుగానే రాణించాడు. అయితే ఎమోషనల్ డైలాగ్స్ చెప్పే సన్నివేశాల్లో సాయి ఇంకాస్త పరిణతి చూపించాలి. యాక్షన్, డ్యాన్సుల్లో మెప్పించాడు. ఇక హీరోయిన్‌గా నటించిన పూజాహెగ్డే తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో గ్లామర్‌తో చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్‌లా నిలిచింది. అయితే పూజా పాటల్లో ఒకలా, సన్నివేశాల్లో మరోలా కనిపించింది. మరీ బక్కచిక్కినట్టు కనిపించడం ఓ మైనస్సే. ప్రతి నాయకులుగా జగపతిబాబు, రవికిషన్, అశుతోష్‌రాణా, మధుగురుస్వామి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విలన్ గ్యాంగ్‌లో నలుగురు ఉన్నా, ప్రధాన ఫోకస్ అంతా జగపతిబాబు పైనే. వేమన శతకాలు చెబుతూ, విలనిజాన్ని వినూత్నంగా పండించే ప్రయత్నంచేశాడు దర్శకుడు. ఇలా జగపతిబాబు మరోసారి తన మార్క్‌ని చూపించాడు. విశ్వ స్నేహితుడిగా వెనె్నల కిషోర్ తన కామెడీ టైమింగ్‌తో నవ్విస్తాడు. ఇతర పాత్రల్లో జయప్రకాష్, పవిత్రా లోకేష్, రావురమేష్, రఘుబాబు, పోసాని తమ పాత్రల పరిధిమేరకు నటించారు. ఎక్కువసేపు కనిపించకపోయినా కీలక పాత్రల్లో నటించిన శరత్‌కుమార్, మీనా తమ నటనతో ఆకట్టుకున్నారు. సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. హర్షవర్ధన్ రామేశ్వరన్ అందించిన సంగీతం బావుంది. నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు వినడానికి, చూడడానికి బావున్నా కథనం మధ్యలో స్పీడుబ్రేకర్లలా వచ్చిపడి తెగ ఇబ్బంది పెడతాయి. పాటలో ఉన్న హుషారును ఆస్వాదించకుండా చేస్తాయి. వినడానికి పాటలు బాగానే వున్నా వచ్చి పడిన సందర్భం తీవ్ర చికాకు తెప్పిస్తుంది. మధ్య మధ్యలో సినిమాను మరింత కమర్షియల్ చేయడానికి పాటలను ఇరికించాడేమో అనిపిస్తుంది. సందర్భం ఏదైనా ఒక ఫాస్ట్‌బీట్ పాటను పెట్టడం వల్ల కథకు బ్రేకులు పడినట్లు అనిపించింది. ఆర్థర్ ఎ.విల్సన్ సినిమాటోగ్రఫీ సూపర్. యూఎస్, వారణాసి, దుబాయ్ వంటి లొకేషన్స్‌లో ఆయన తీసిన విజువల్స్ వండర్ అనిపిస్తాయి. ఎడిటింగ్‌పై కోటగిరి ఇంకాస్త దృష్టి సారించాల్సింది. సెకండాఫ్‌లోని సాగతీత సీన్స్‌ని కొంత ట్రిమ్‌చేసి వుంటే బావుండేది. ముఖ్యంగా పీటర్ హెయిన్స్ ఫైట్స్ ఈ సినిమాలో ఎక్కువ క్రెడిట్‌ని కొట్టేస్తాయి. ప్రతీ ఫైట్ క్లైమాక్స్ ఫైట్‌లానే ఉంటుంది. గ్రాఫిక్స్‌కూడా బావున్నాయి. సెట్స్ పాటలకు కనువిందు చేశాయి. బుర్రా సాయిమాధవ్ అందించిన సంభాషణలు ఓకే! అభిషేక్ నామా నిర్మాణ విలువలు ఎంతో భారీగా వుండి సినిమాకు కళ తెచ్చాయి. నిర్మాత పెట్టిన ఖర్చు మొత్తం తెరమీద కనిపించింది. మొత్తం మీద ఈ ‘సాక్ష్యం’ తెలుగు సినిమాల మాదిరిగానే రొటీన్‌గా సాగింది. ఆసక్తికరంగా మొదలైనప్పటికీ, ఆ ఉత్సాహాన్ని దర్శకుడు చివరి వరకు కొనసాగించలేక చతికిలపడ్డాడు. అదీకాక నమ్మశక్యం కాని సన్నివేశాలతో, అక్కరకు రాని సీన్స్‌తో సినిమా ఫ్లో మొత్తం దెబ్బతింది. దేవుడా.. ఇన్ని విధాలుగా గందరగోళం సృష్టించిన ఈ సినిమను పంచభూతాలే కాపాడాలి!

-ఎం.డి. అబ్దుల్