రివ్యూ

24 క్రాఫ్ట్స్‌కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు 24

తారాగణం:
సూర్య, సమంత, నిత్యామీనన్, అజయ్, శరణ్య, గిరీష్ కర్నాడ్ తదితరులు సంగీతం:
ఎఆర్ రెహమాన్ - కుతుబ్
సినిమాటోగ్రఫీ: తిరు
నిర్మాత: సూర్య
రచన, దర్శకత్వం:
విక్రమ్‌కుమార్
--

కాలం -ఎవరికీ అంతుచిక్కని మిస్టరీ. క్షణంపాటు అలా జరక్కుండా ఉంటే బావుణ్ణు అనిపిస్తుంది -ఏదైనా చేదు సంఘటన ఎదురైనప్పుడు. తీయటి అనుభూతి మరికొన్ని క్షణాలు ఆట్టే నిలిచిపోతే -ఎంత బావుణ్ణు అన్న తలంపు మదిలో అలజడి సృష్టిస్తుంది. అయితే- కాలాన్ని కట్టిపడెయ్యటం సృష్టికర్త తరమూ కాదు. సృష్టి మొదలు.. అదొక నిరంతర ప్రక్రియ. ఎడతెగని పోరాటం.. ఈ ఆలోచనల్లోంచి పుట్టిందే కాలంతో ప్రయాణం అన్న మాట. ‘టైం ట్రావెల్’ లేదా ‘టైమ్ ఫ్రీజ్’ అంటూ కాలంతో ముడిపెడుతూ వచ్చాడు మానవుడు. ఈ జీవన చక్రంలో ఒక్క క్షణం వెనక్కి వెళ్తే ఎలా ఉంటుంది? ఈ కానె్సప్ట్‌కి అంతూపంతూ లేకున్నప్పటికీ.. దాని అంతు చూసే ‘స్క్రిప్ట్’ని హాలీవుడ్ హిస్టరీ ఏనాడో తిరగేసింది. ‘సైన్స్ ఫిక్షన్’ జోలికి వెళ్లటం మనవల్ల కాదు.. ఆ టెక్నాలజీని పట్టుకోలేం అని చేతులెత్తేసి ‘ఆదిత్య 369’ వచ్చేవరకూ గమ్మున ఉండిపోయాం. కాలం ముల్లుని వెనక్కితిప్పి.. ‘రాయల’ స్వర్ణయుగం వరకూ వెళ్లి వచ్చాం. అంతే! ఆ తర్వాత్తర్వాత ఆ అంశాన్నీ.. ఆ సబ్జెక్ట్‌ని ముట్టుకోటానికి సాహసించలేదు ఎవరూ. మళ్లీ ఇన్నాళ్లకి ‘24’ అనే ‘టైం ట్రావెల్’ ఫిక్షన్ జోలికి వెళ్లాడు విక్రమ్‌కుమార్.
‘13బి’ ‘ఇష్క్’ ‘మనం’ చిత్రాల పట్ల అభిమానం పెంచుకొన్న ఎవరికైనా విక్రమ్ వీరోచిత స్క్రీన్‌ప్లే కళ్లముందు మెదలుతుంది. ఒక్క క్షణం సాఫ్ట్‌గా.. మరో క్షణం ఉత్కంఠ భరితంగా.. ఇలా ఏ సబ్జెక్ట్‌కి ఆ సబ్జెక్ట్ అతగాడి స్క్రీన్‌ప్లేలో వొదిగిపోయి సగటు ప్రేక్షకుడిని మంత్రముగ్ధుల్ని చేశాయి. ‘టైం ట్రావెల్’ మాట వినగానే- ఏవో ఊహలు తారట్లాడుతాయి. ఈ సన్నివేశం చూస్తే కచ్చితంగా కథలోకి జొరబడతారు.
ఉన్నట్టుండి జోరున వర్షం. ఆ వర్షంలో తడుస్తూ ఇంటికి వచ్చిన తల్లి. టైం వాచ్ ద్వారా కాలాన్ని వెనక్కి నెట్టొచ్చునని గ్రహించిన హీరో -టైంని ముందుకి జరుపుతాడు. అప్పటికి వర్షం ఇంకా స్టార్ట్ అవదు. తల్లికి గొడుగు ఇచ్చి బయటికి పంపిస్తాడు. వర్షం పడకముందే ఆరేసిన బట్టల్ని తెచ్చి ఇంట్లో పెట్టేంతలో -వర్షం. టైం ఫ్రీజ్ మోడ్ నొక్కేస్తాడు కథానాయకుడు. ఉన్నపళంగా వర్షం మధ్యలో ఆగిపోతుంది. చకచకా అన్ని పనులు పూర్తిచేసి ఫ్రీజ్ మోడ్ ఆఫ్ చేస్తాడు.. చూస్తూంటే అలా కాలాన్ని ఒక్క క్షణం ఆపేసే టెక్నిక్ మనక్కూడా తెలిసి ఉంటే బావుణ్ణు అనిపిస్తుంది. ఆ ఫ్రీజ్ మోడ్‌లోంచి -కథలోకి వెళ్దాం.
శివకుమార్ (సూర్య) ఓ శాస్తవ్రేత్త. భార్య ప్రియ (నిత్యామీనన్). వారికి నెలల వయసు కొడుకు. అందమైన ప్రశాంత జీవితం. శివకి ఓ వాచీని కనిపెట్టాలన్న ఆకాంక్ష. కాలంతోపాటు ప్రయాణించేందుకు దోహదపడే ఆ వాచీని ఎట్టకేలకు రూపొందిస్తాడు. ఆ వాచీని తన సొంతం చేసుకోవాలనుకుంటాడు శివ తమ్ముడు ఆత్రేయ (సూర్య). ఆత్రేయ పన్నిన పన్నాగంలో శివ, ప్రియ ప్రాణాలు కోల్పోతూ.. వాచీని, తమ కొడుకుని ఓ యువతి (శరణ్య)కి అందజేస్తారు. 26ఏళ్ల తర్వాత తల్లి శరణ్యతో కాలం గడుపుతూన్న మణి (సూర్య)కి తమ వద్దనున్న వాచీ ప్రత్యేకత తెలుస్తుంది. మణికి ఆ వాచీ గురించి తెలిసిందన్న సంగతి 26 ఏళ్లు కోమాలో ఉన్న ఆత్రేయక్కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది క్లైమాక్స్.
సైన్స్ ఫిక్షన్ అంటే లాజిక్‌లని వెతుక్కోవాల్సిన అవసరంలేదు. కథ సాఫీగా ఎటువంటి వొడిదుడుకులు లేకుండా వెళ్లిపోతుంది. ‘టైం’ కానె్సప్ట్ చుట్టూ తిరిగే కథ కాబట్టి -ఆట్టే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఐతే- కథలో కొత్తదనం లేకపోయినా.. కథనాన్ని అద్భుతంగా పండించటంవల్ల.. ‘24’ (గంటలు?) కొన్ని క్షణాలుగా గడిచిపోతాయి. సినిమా చూస్తున్నంతసేపూ ఓ కలలా అనిపిస్తుంది. ‘టైం’తో ట్రావెల్ చేస్తున్నట్టు ఉంటుంది. విక్రమ్ కథని చెప్పిన తీరు కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఫిక్షన్‌లో ఉండే గమ్మత్తుని కళ్ల ముందుకి తెచ్చే ప్రయత్నం చేశాడు. మనాళ్లు మెయిన్‌టెయిన్ చేయలేని సబ్జెక్ట్ అన్నవాళ్లు సైతం గుడ్లప్పగించి చూస్తారంటే అతిశయోక్తి లేదు. స్క్రీన్‌ప్లేకి తగ్గట్టు -శివ, ఆత్రేయ, మణి -గా సూర్య నటనకి సరిహద్దులు లేవు. కథ ఎలా నడిస్తే అలా... కథని తాను నడిపిస్తూ.. ప్రేక్షకుణ్ణి సైతం ఇన్‌వాల్వ్ చేసేట్టు కథలో జీవించాడు. నిత్యామీనన్, సమంత పాత్రల పరిధి బహు తక్కువ. ఉన్నంతలో జీవం వొలికించారు.
సాంకేతికంగా ఈ సినిమాకి అన్నీ ప్లస్ పాయింట్లే. కథని చెప్పటం వేరు... దాన్ని స్క్రీన్‌పై దృశ్య కావ్యంలా మలచటం వేరు. అతి క్లిష్టమైన సబ్జెక్ట్‌ని డీల్ చేయాలంటే ఆషామాషీ సినిమాటోగ్రఫీ సరిపోదు. ఆ కాలానికి తగ్గట్టు వెళ్లాలి. ఇందులో ఏమాత్రం తొట్రుపాటు పడినా అభాసుపాలవుతుంది. కానీ ‘తిరు’ ఈ కథని తనదైన శైలిలో చిత్రీకరించి.. ‘టైం’ ఎఫెక్ట్‌ని తెచ్చాడు. హార్సిలీ వ్యాలీ నేపథ్యం అయితే ఇక చెప్పనక్కర్లేదు. దీనికితోడు ప్రవీణ్‌పూడి ఎడిటింగ్ కూడా. తీయటి అనుభూతిని అందించింది. ఎఆర్ రెహమాన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ప్రేమ పరిచయమే’ ‘కాలం నా ప్రేయసి’ ‘లాలిజో’ పాటలు బాగున్నాయి. చిత్రీకరణ బాగుంది. ఈ సినిమాలో ‘24’ ఫ్రేమ్స్ చక్కగా సమకూరటంతో.. ‘టైం ట్రావెల్’లోకి వెళ్లేందుకు ఏమాత్రం సంకోచించాల్సిన పనిలేదు.

-ప్రనీల్