రివ్యూ

కేరాఫ్ విజయతీరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరాఫ్ కంచరపాలెం *** బాగుంది

తారాగణం:

సుబ్బారావు, రాధాచెప్సీ కేశవకర్రీ, నిత్యశ్రీ కార్తీక్ రత్నం, విజయప్రవీణ ప్రణీతా పట్నాయక్, మోహన్‌భగత్
ఉమామహేశ్వరరావు కిషోర్ పొరిమెల తదితరులు.
సంగీతం: స్పీకర్ అవస్థి
నిర్మాత: విజయప్రవీణ పరుచూరి
సమర్పణ: రానా దగ్గుబాటి
దర్శకత్వం: మహా వెంకటేష్

* ** *************************

‘తెలుగు చిత్రాలు- సహజత్వం’ రెండూ ఎప్పుడూ కలవని రైలు పట్టాల్లాంటివని చాలామంది అంటూంటారు. ఇలా సహజత్వానికి ఆమడేకాదు, పట్టలేనంత దూరం అని ఒక్క మాటతో కొట్టిపారేసే వారందరికీ దీటైన సమాధానం ‘కేరాఫ్ కంచరపాలెం’ ఒక్క మాటలో చెప్పాలంటే ‘సహజత్వం’ అన్న పదానికే దాదాపు ‘సహజత్వం’నేర్పించిన చిత్రంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళితే.. కంచరపాలెం (ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణానికి శివారులో ఉన్న ప్రాంతం)లో సృష్టించిన నాలుగు కథల గమనం, అవి చేరుకున్న గమ్యం అయితే ‘సృష్టి’అని అన్నా, ఇవి మనం చాలాచోట్ల చూసినవే. ఏళ్లు గడిచి సాంకేతికత విజృంభించినా ఛాందస వాదాలవల్ల నలిగిపోతున్న ప్రేమబంధాలే ఇవన్నీ.. తన క్లాస్‌మేట్ సునీతపై సుందరం పెంచుకున్న అభిమానానికి మించిన ఆకర్షణ ఒక కథ కాగా, జులాయిగా తిరిగే జోసఫ్, తనకా గొడవల్లోనే పరిచయమైన బ్రాహ్మణ వనిత భార్గవితో పెళ్లిదాకా చేర్చేలా చేసిన అనుబంధం ఇంకో కథ వైన్‌షాపులో వర్కరైనా, తనకు నచ్చినదే చేసే మనస్తత్వంకల గడ్డం, ఆ షాపువద్దే పరిచయమైన వేశ్య సలీమాతో విషయం తెలిసినా వివాహానికే మొగ్గుచూపే నిష్కపటత్వం ఉదంతం మరో ముచ్చట. నలభై తొమ్మిదేళ్లు వచ్చినా వివాహయోగ్యతకు నోచుకోక అందరూ తనని ‘నట్టుగాడు’ (వివాహార్హతకు కేంద్రంగా ఉన్న సంగతికి అనర్హుడా అన్న అర్ధానికి ఈ సినిమాలో ఇచ్చిన సంకేత పదం) అని గేలిచేస్తున్న అటెండర్ రాజుకి, అదే ఆఫీసులో ఆఫీసరు హోదాలో అదే ఊరికి బదిలీపై వచ్చిన రాధాచెప్సీతో (వితంతువు, 20 ఏళ్ల కూతురు కూడా ఉంది) ఏర్పడిన బంధం విశే్లషణ నాల్గో కథ. కథలు ఏ తీరుగాఉన్నా అన్నిటి మూల కేంద్రంగా ‘ప్రేమే’ఉండడంతో ప్రేక్షకులు ఇట్టే కనక్టవుతారు. అయితే ఈమధ్యలో మానవీయ కోణాలూ సంస్కరణాభిలాషత్వంతో కూర్చిన సన్నివేశాలు సినిమాని ఉన్నతస్థాయికి చేర్చాయి. ఓ సందర్భంలో రాజు, రాధని సింహాచలం తీసుకువెళ్తాడు. అక్కడ ‘నువ్వు లోపలికి రావా’ అని ఆమె అతన్నడుగుతుంది. ‘నా నమ్మకాలు వేరు’అంటూనే ‘నేను మనుషుల్లోనే దేవుణ్ణి చూస్తాను...’అంటూ తనకు సాయంచేసిన వ్యక్తుల చిట్టాచెప్తూ, దేవుళ్లు చేసే పనులే వీళ్లూ చేస్తున్నారు అంటూ అటు దైవత్వ ప్రాశస్థ్యాన్ని పరోక్షంగా ప్రశంసిస్తాడు. అలాగే చిన్న వినాయక పటానికి కొబ్బరికాయ కొట్టిన మర్నాడే తన క్లాస్‌మేట్ సునీల్ తనతో మాట్లాడేలా చేసేసిన ఆ దేవుడి గొప్పతనాన్ని వేనోళ్ల ప్రస్తుతించాక అదే సుందరం, సునీత ఢిల్లీకి వెళ్లిపోయిందా తెలిసిన తక్షణం. ‘ఇదేమిటి దేవా?’అంటూ మానవ సహజతత్వాన్ని వెళ్లగక్కేస్తారు. ఇలా ప్రతీ సన్నివేశానికి సహజత్వమే చిత్ర ప్రాణవాయువుగా తీసుకున్నాడు దర్శకుడు. భార్గవి-జోసఫ్‌ల వివాహానికి అడ్డం ఏమిటి? అన్న దానికి కారణం ‘మతం’అని ముక్కుసూటిగా చెప్పించారు ఇందులో. కానీ ఇక్కడ చిన్న పొసగని విషయం ఏమిటంటే, చిన్ననాటినుంచి ధైర్యంతో పెరిగినట్లు చూసిన భార్గవి (అంతకుముందు ఓ ముగ్గురు కలిసి ఒక్కణ్ణి కొట్టడం సన్నివేశంలో తండ్రి వద్దంటున్నా స్కూటరు దిగి బుద్ధిచెప్పే తత్వం ఆమెదిగా చూపారు) తాను జోసఫ్‌ను పెళ్లిచేసుకుంటే ‘నేను ఉరిపోసుకుంటాను’అన్న తండ్రి మాటకు తలవొగ్గడం అంత సబబుగా లేదు. ‘ఎవరికి నచ్చినట్లువాళ్లు చెయ్యడమే నాకు నచ్చుతుంది’అని ఈ సినిమాలో గడ్డం చెప్పినట్లే, దర్శకుడికి నచ్చినట్లు దర్శకుడు చేశాడు అని దీనికి సమాధానం చెప్పుకోవాలేమో. ‘నీ కళ్లు చూసి ప్రేమించానని, ఆ కళ్లు వేశ్యవని తెలిసినా ప్రేమ కొనసాగించే సుధృడ తత్వంగల గడ్డానికీ ప్రేమ సాఫల్యత పొందకపోవడం, అందుకూ పరోక్షంగా మాత్రమేనని చెప్పడం బాధాకరమే అయినా, ఆ దారిలోనే దాన్ని ముగించడమూ సహజత్వానికి దగ్గరే. ఇక రాజు-రాధల మధ్య అంకురించిన ప్రేమకిచ్చిన ముగింపు మాత్రం దర్శకుడులోని ఎల్లలు లేని సహజ ధైర్యవిశ్వరూపాన్ని ప్రదర్శింపచేసింది. నలభై రెండేళ్ల వితంతువుకీ (అదీ 20 ఏళ్ల టీనేజ్ గర్ల్‌తో ఉన్నది) నలభై తొమ్మిదేళ్ల పెళ్లికాని వ్యక్తి. (అదీ అంతస్థులు తేడా, భాషల వైరుధ్యంతో కూడినవి) మధ్య చిగురించిన ప్రేమకు మాత్రం అటు రాధ సోదరుడు తీవ్ర అభ్యంతరం తన గ్రామస్థులలో తెలుపుతున్న, కంచరపాలెం వాస్తవ్యుల సహకారంతో విజయపథాన చేర్చడంతో హాయిగా సినిమా ఆడిటోరియం ఆనందంతో వెళ్లగలిగారు. ప్రేమ సఫలతకు రాధ కూతురు చేసిన సాయమూ అభినందించతగ్గది. ఈ చిత్రం నిశ్చయంగా ఆమూలాగ్రం వెంకటేష్ ‘మహా’ప్రతిభకు నిదర్శనం. ఎందుకంటే సినిమా నటనంటే ఏమిటో దాదాపు తెలియని ఎనభై ఆరు మందితో ఎక్కడా తప్పుపట్టలేని విధంగా చేయించడం రాజు పాత్ర పోషించిన సుబ్బారావు వద్దనుంచి శిల్పి భార్య పాత్ర పోషించిన నటీమణి వరకు అందరిచేతా ఆమోదయోగ్య నటనను రాబట్టారు. అందరిలో సలీమా పాత్ర పోషించిన విజయప్రవీణ (ఈమె ఈ చిత్ర నిర్మాత కూడా) సినిమాలో చెప్పినట్లు నేత్రాలతోనే నవ్యావధానం చేశారు. తర్వాత శిల్పి పాత్ర పోషించిన కిశోర్ శివారును ఉదహరించుకోవాలి. తనకు మాటకు చెందిన లోపం ఉన్నా, దాన్నధిగమించి తన భావాల్ని ముఖ కవళికలద్వారా చూపిన విధానం అభినందనీయం. కొన్నికొన్ని చిన్నచిన్న సన్నివేశాల చిత్రణలో సైతం డైరెక్టర్ తన మార్కుని చూపాడు. ఉదాహరణకు తన కలల సాకారం ముప్ఫై అడుగుల గణేశ విగ్రహం మర్నాడు ఆవిష్కృతమవుతుందన్న సంతోష సమయంలో భార్యను చిలిపిగా పట్టుకోబోతూ ఈ పిచ్చి పనులొద్దుగానీ, హాయిగా పడుకో అంటూ ప్రతిగా ఆమె చిలిపిగా మందలిస్తుంది. ఇలాంటివి ప్రేక్షకుల హృదయాన్ని చక్కగా స్పృశించాయి. కానీ కథల కాలాలకీ, చూపిన సన్నివేశాలకీ ఇంకాస్త స్పష్టతుంటే బావుండేది. ఈ సంఘటనలు కాలం ఇదీ అని ఎక్కడా చెప్పకపోయినా ఓ సన్నివేశంలో గోడపై ఉన్న కేలండరు 2017వ సంవత్సరం జూన్ చూపించింది. అదే విధంగా సినిమా నిడివిని రెండున్నర గంటలనుంచి రెండు గంటలకు కుదిస్తే ఇంకా పట్టుగా ఉండేది. మరి ఎందుకనో ఎడిటర్ ఈ పనిని చేపట్టలేదు. అలాగే పాత్రల పరిచయానికే దాదాపు ప్రథమార్థం గడిచిపోయింది. చిత్ర నిర్మాణం అధిక భాగం కంచరపాలెంలో జరగడంవల్ల అక్కడ సమీప ప్రాంతాల పేర్లని (కానె్వంటు జంక్షన్, మాధవధార, జ్ఞానాపురం.. వంటివి) సమర్ధంగా వాడుకున్నారు. అయితే అక్కడి యాసని ఇంకాస్త అన్ని ప్రాంతాలవారికీ అర్ధమయ్యేలా శ్రద్ధవహిస్తే బాగుండేది.
పాటలన్నీ తత్వగీతాల తరహాలో, ఇంకొన్ని జానపద శైలిలో వుండడంవల్ల ఈజీగా వీక్షకుణ్ణి చేరాయి. ముఖ్యంగా ‘పట్టి పట్టి నన్ను సూత్తావే...’ ప్రేక్షకుల్ని పట్టేసింది. సంభాషణలు చాలావరకూ సహజంగానే ఉన్నా, ఈ ‘సహజోత్సాహం’ మరీ కొన్నిచోట్ల ఉరకలెత్తేసి కొన్నిచోట్ల సెన్సారు కత్తెరకూ బలైనట్లు మాటలు లేకుండా పెదాల కదలికనుబట్టి పట్టేయచ్చు. అదే రీతిలో రాజు-రాధల వివాహానంతరపు కార్యక్రమంలో ‘‘నాకిది మొదటిసారి, నాకిది రెండోసారి’’అనిపించడం వంటివి సభ్యతా ‘కంచె’లు దాటేసినట్లే అనిపించింది. ఏవో ఇలా అక్కడక్కడ పంటి క్రింద రాళ్లలా ‘మేమూ ఉన్నాము’అని అనిపించినా, అవన్నీ చక్కటి అంశానికి దిష్టిపోయే సంగతులుగానే పరిగణిద్దాం. మొత్తానికి అభినందనీయ ప్రయత్నపు చిత్రాల ఖాతాలోనే ‘కేరాఫ్ కంచరపాలెం’ను నిరభ్యంతరంగా చేర్చవచ్చు.

-అనే్వషి