రివ్యూ

రిహార్సల్స్ తక్కువైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటకం * బాగోలేదు
*
నటీనటులు: అశిష్ గాంధి, అషిమా నర్వల్ తదితరులు
సినిమాటోగ్రాఫర్: గురుడవేగ అంజి
సంగీతం: సాయి కార్తీక్
నిర్మాతలు: శ్రీసాయిదీప్ చట్ల, రాధిక శ్రీనివాస్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కల్యాణ్‌జీ గొనగ
*
ఆశిష్‌గాంధి, అషిమా నర్వల్ జంటగా కల్యాణ్ జి గొనగ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నాటకం’. శ్రీ సాయి దీప్ చట్ల, రాధిక శ్రీనివాస్ నిర్మాతలు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ప్రేక్షకుల తీర్పు కోరుతూ థియేటర్లకు వచ్చింది. మరి ఎవరు ఎలాంటి నాటకం ఆడారు.. నాటకంవల్ల ఎలాంటి సంఘటనలు తలెత్తాయన్నదే ముఖ్య కథాంశం.
కోటి (ఆశిశ్ గాంధి) ఊరు చింతలపూడి. ఆ వూళ్లో అతనో జులాయి. త్వరగా పెళ్లి చేసుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నా, విఫలమవుతుంటాయి. ఈక్రమంలో పార్వతి (అషిమా నర్వల్)ని చూసి మనసు పారేసుకుంటాడు. పార్వతి కూడా కోటిని ప్రేమిస్తుంది. ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతూ అన్ని రకాలుగా దగ్గరవుతారు. కొన్ని పరిస్థితుల కారణంగా కోటి అనుకోకుండా పార్వతిని వివాహం చేసుకుంటాడు. దాంతో కథ సుఖాంతం అనుకున్న క్రమంలో పార్వతి గతం గురించి తెలుస్తుంది. ఎవరూ ఊహించని ఆమె గతం కారణంగా కథ మొత్తం రివర్స్ అవుతుంది. అసలు ఇంతకీ పార్వతి ఎవరు? ఆమె ఈ వూరికి ఎందుకొచ్చింది? అన్న విషయాలు ఒకింత ఆసక్తి రేకెత్తిస్తాయి.
హీరోగా పరిచయమైన ఆశిష్ గాంధి తన పాత్రమేరకు వాచకం, అభినయం బాగుండేలా జాగ్రత్తలు పడ్డాడు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాలతోపాటు హీరోయిన్ గురించి అసలు నిజం తెలిసే సన్నివేశం, క్లైమాక్స్ సన్నివేశంలో నాటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ అషిమా నర్వల్ గ్లామర్ పరంగా ఓ రేంజ్‌లో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అందం, అభినయంతో ప్రేక్షకులకు విందు చేసినట్టే. హీరో తండ్రిగా నటించిన తోటపల్లి మధు తన పాత్రలో ఒదిగిపోయాడు. కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడా నవ్వించాడు. హీరోకి ఆయనకు మధ్య సాగే సన్నివేశాలు ఎంటర్‌టైన్ చేస్తాయి. మిగతా నటీనటులు వారి పరిధిలో బాగానే చేశారు.
దర్శకుడు కల్యాణ్‌జీ తీసుకున్న పాయింట్ బాగానే అనిపించినా, కథలో కరవైన ఫ్లో ఒకింత అసహనానికి గురి చేసింది. ఇలాంటి కథకు సంబంధించి స్క్రీన్ ‘ప్లే’లో ఉండాల్సిన టెంపర్‌మెంట్ మిస్సవడంతో సినిమాలోకి ఆడియన్స్‌ని లీనం చేయలేకపోయింది. సన్నివేశాలపరంగా ఓకే అనిపిస్తూనే, సమ్మిళితంగా కథలో ఇమిడినట్టు అనిపించలేదు. అవసరానికి మించిన ట్విస్టులూ థ్రిల్‌కు దూరం చేశాయి. హీరో ఇంట్రోడక్షన్, హీరో తన తండ్రితో కలిసి పెళ్లిచూపులకెళ్లే సన్నివేశాలు కొన్ని మెప్పించాయి. అలాగే సెకెండాఫ్‌లో కొత్తగా రివీలయ్యే కొన్ని ఘటనలు బాగానే ఉన్నాయి. ఆశిష్ గాంధీ, అషిమా నర్వల్ తమ మధ్య నడిచే ప్రేమ సన్నివేశాలు, రొమాంటిక్ కెమిస్ట్రీతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. సంగీత దర్శకుడు సాయికార్తీక్ అందించిన పాటలు ఓకే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఎడిటర్ మణికాంత్ సెకెండాఫ్‌లో ఇంకొంత కేర్ తీసుకుంటే నిడివి తగ్గి ఉండేది. గరుడవేగ అంజి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. పల్లెటూరి విజువల్స్‌ను సహజంగా చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు సినిమాని ఆసక్తికరంగా మొదలెట్టి, తరువాత అనవసర సన్నివేశాలతో విసిగించాడు. అవసరానికి మించి మాస్ మసాలా వేయడంతో ఘాటు అనిపించక మానదు. ప్రేమకోసం, ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతకైనా తెగించే హీరో ఏమైపోతాడోనన్న పెయిన్‌ఫుల్ కంటెంట్‌ను సమర్థంగా వాడుకోవడంలో దర్శకుడి వైఫల్యం కనిపించింది. ‘ప్లే’లో కంటెంట్ ఎలివేట్ చేయడంపై దృష్టిపెట్టినట్టు అనిపించదు. ఆశిష్ గాంధీ హీరోగా చేసిన తొలి ప్రయత్నం అతనివరకూ వర్కవుట్ అయినట్టే. మ్యానరిజమ్స్‌తో తనకంటూ స్టయిల్ క్రియేట్ చేశాడు. దర్శకుడు కల్యాణజీ గొనగ ఎమోషనల్ సన్నివేశాలు, కథలో ముఖ్యమైన ఘట్టాలు ఓకే అనిపించినా.. ఓవరాల్‌గా సినిమాని నిలబెట్టేవి మాత్రం కాదు. నాటకానికి మరికొంత రిహార్సల్స్ కావాలి.