రివ్యూ

సీన్ రివర్స్ స్టోరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోటా * బాగోలేదు
*
తారాగణం: విజయ్ దేవరకొండ, మెహ్రీన్, సంజన, నటరాజన్, సత్యరాజ్, నాజర్ ప్రియదర్శి
సినిమాటోగ్రాఫర్: యస్ కృష్ణ రవిచంద్రన్
సంగీతం: సియస్ సామ్
నిర్మాత: జ్ఞానవేల్‌రాజా
దర్శకత్వం: ఆనంద్ శంకర్
*
అర్జున్‌రెడ్డితో ఆకస్మిక స్టార్‌డమ్‌ను సంపాదించి ‘రౌడీ గ్యాంగ్’లాంటి అభిమాన ఆర్మీనే సృష్టించాడు హీరో విజయ్ దేవరకొండ. ఆ వైరల్ వీడకముందే -గీత గోవిందంతో ఫ్యామిలీ ప్రేక్షకుల నాడినీ పట్టేశాడు. ఇక కెరీర్‌కు బలమైన పునాది వేసిన -పెళ్లిచూపులు ఎలాగూ ఉండనే ఉంది. ఈ హిట్లు చాలు -ఇండస్ట్రీలో కుర్ర హీరోలు బెంబేలెత్తిపోడానికి. విజయ్ అంటే టాలీవుడ్‌లో ఓ రేంజ్ క్రేజ్. కథల ఎంపికలోనే చాకచక్యం చూపిస్తోన్న ఈ కుర్ర హీరో -సడెన్‌గా పొలిటికల్ ఫార్మాట్‌ను స్టోరీ చేసుకున్నాడు. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా నిర్మించిన తెలుగు, తమిళ భాషా చిత్రమే -నోటా. ఆనోట ఈనోట పడి అమాంతం అంచనాలు పెరిగిపోయిన నోటా- రాజకీయం ఏమిటో చూద్దాం.
***
అవినీతి కేసులో శిక్షపడిన సీఎం (నాజర్) పదవికి రాజీనామా చేస్తాడు. హై పొలిటికల్ పవర్‌తో కొడుకు విజయ్ (విజయ్ దేవరకొండ)ని సీఎంగా నియమిస్తాడు. రాజకీయాలంటే అస్సలు అవగాహన లేని కుర్ర సీఎం రొటీన్ లైఫ్‌లో సాయంత్రం పబ్బులు, క్లబ్బులంటూ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తుంటాడు. తండ్రి బయటకు వచ్చేవరకే కదా? అనుకున్న పెద్ద పదవే -అతని మెడకు గుదిబండ అవుతుంది. పదవి -రాజకీయాన్ని నేర్పిస్తుంది. రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతాయి. రాజకీయ ప్రభావంతో తండ్రే -పదవిలోవున్న కొడుక్కి వ్యతిరేకమవుతాడు. సీఎం పదవినుంచి దింపేసేందుకు కుట్రలు పన్నుతాడు. తండ్రి ఎందుకు రివర్స్ అయ్యాడు? రాజకీయ చదరంగంలో కుర్ర సీఎం ఆడిన ఆట ఏమిటి? అతన్ని దింపడానికి విపక్షాలు ఎలాంటి కుట్రలు పన్నాయి?లాంటి ఆసక్తి కలిగించే ప్రశ్నలకు సమాధానమే -మిగతా సినిమా.
టాలీవుడ్‌లో విజయ్ క్రేజ్ మామూలుగా లేదు. దీంతో -విపరీతమైన అంచనాల మధ్య నోటా విడుదలైంది. అర్జున్‌రెడ్డిలాంటి వైవిధ్యమైన పాత్ర ఆడియన్స్‌పై బలమైన ప్రభావం చూపడంతో -అదే కోణంలోనే ‘నోటా’ను ఊహించుకుంటూ థియేటర్‌కు వచ్చారు ప్రేక్షకులు. విజయ్ మార్క్ అగ్రెసివ్‌నెస్ స్క్రీన్‌పై కనిపించకపోవడంతో -ప్రోటగానిస్ట్‌తో ప్రేక్షకుడు జర్నీ చేయలేకపోయాడు. ‘డమీ సిఎం’లాగే -విజయ్ పాత్ర కూడా డమీగా మారిపోయింది. రాష్ట్రానికి సీఎం అయివుండీ, ఎవరికీ సంబంధం లేకుండా గదిలో వీడియో గేమ్స్ ఆడుకుంటూ సంతకాలు చేసేసే పాత్ర విజయ్‌ది. కథకు తగిన క్యారెక్టరైజేషనే అయినా, విజయ్ ఇంటెన్సిటీని చూసే అవకాశం ఎక్కడా లేదు. ఫిమేల్ లీడ్‌రోల్‌గా మెహరీన్‌ను చెప్పుకోవడానికే తప్ప, కథకు ఆమె పాత్రకు సంబంధం లేదు. అసలు హీరోతోనే సంబంధం లేనట్టు -లవ్, అట్రాక్షన్ ఫీల్‌కు దూరంగా సాగిపోతుంది. వాస్తవానికి మెహరీన్‌ది -ఓ గెస్ట్‌రోల్. మెహరీన్ కంటే విజయ్ చెల్లి పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు దర్శకుడు. సీఎంగా నాజర్ (ఒక్క క్లైమాక్స్‌లో మోర్ డ్రామా, అతి మేకప్ తప్ప) ఓకే అనిపిస్తే, సత్యరాజ్ తన పాత్ర ప్రాధాన్యతను ప్రదర్శించాడు.
రాజకీయం.. అందులోని పదవీ కాంక్ష ఎంత భయానకంగా ఉంటాయో ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేసిన విషయమే. ఇక్కడ తండ్రీ -కొడుకుల మధ్య పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడంలో దర్శకుడు ఆనంద్ శంకర్ ప్రతిభ కనిపించింది. ప్రేక్షకుడు ఆసక్తి కనబర్చేసరికే -పసలేని కథనం చిరాకు పెట్టడం మొదలెట్టింది. పొలిటికల్ కంటెంట్, దానిలోని ఇంటెన్సిటీని స్క్రీన్‌పై ఆవిష్కరించటంలో దర్శకుడి వైఫలం కొట్టొచ్చినట్టు కనిపించింది. సియస్ సామ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఫర్వాలేదనిపించినా, పాటలు మాత్రం ఆడియన్స్‌ని కథలోకి ఇన్వాల్వ్ చేయలేకపోయాయి. యస్ కృష్ణరవిచంద్రన్ సినిమాటోగ్రఫీ ఓకే. రియలిస్టిక్ అప్రోచ్‌తో చాలా సన్నివేశాలను బ్యూటిఫుల్‌గా చూపించాడు. నిజానికి రాజకీయ కథలు నిదానంగా, సైలెంట్‌గా సాగేవే అయినా వాటి ఎత్తుగడలోని బలం, వేగం -రేమండ్ ఎడిటింగ్‌లో కనిపించలేదు. క్రేజ్‌వున్న హీరో కనుక -నిర్మాణ విలువలు రిచ్‌గానే ఉన్నాయి. పొలిటికల్‌గా పెద్దఎత్తున చర్చకు తావిచ్చిన ‘నోటా’ కంటెంట్‌ను సినిమాటిక్‌గా మలచి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించామని మేకర్స్ పదేపదే చెప్పినా, తెలుగు సినిమా పూర్తిగా (డబ్బింగ్) తమిళ వాసనలోనే సాగింది. పాటలు, సంభాషణలకు చాలాచోట్ల లిప్‌సింక్ కుదర్లేదు. పొలిటికల్ డ్రామాని ఇంత పేలవంగానూ తీయొచ్చన్న విషయాన్ని మాత్రం నోటా నుంచి తెలుసుకోవచ్చు. ‘లుంగీ గట్టిగా కట్టుకోండి, లేదంటే లాగేస్తారు’, ‘కాళ్లే కాదు అప్పుడప్పుడూ మొహం కూడా చూడండి. లేదంటే సరిగా చూడలేదంటూ శిలావిగ్రహాలు తప్పుగా చెక్కుంతారు’లాంటి కొన్ని సబ్‌స్టాండర్డ్ డైలాగులనే పొలిటికల్ పంచ్‌లు అని చెప్పుకోవాలేమో.
అనూహ్యంగా ఒక్కరోజు సీఎం సీట్లో కూర్చోవాల్సి వస్తే -జీవితం ఎలా ఉంటుంది? అతను ఎలాంటి విజయాన్ని సాధించాడన్న పాయింట్‌తో ఒకే ఒక్కడు సినిమా చూసిన అనుభవం ప్రేక్షకులది. అలాంటి పాజిటివ్ పాయింట్‌తోనే -లీడర్, భరత్ అనే నేను చిత్రాలూ వచ్చేశాయి. నిజానికి ‘నోటా’ తాజా రాజకీయాల్లో ఓ కొత్త అనుభవం. ఇష్టంలేని వ్యక్తిని, పార్టీని తిప్పికొట్టగల సామర్థ్యమున్న ఆయుధం. అలాంటి కంటెంట్‌ను బలంగా చర్చించడంలో ఈ ‘నోటా’ మిస్‌ఫైర్ అయ్యింది. బలమైన కాన్ఫ్లిక్ట్‌లో బలోపేతమైన విలనిజాన్ని చూపగలిగిన సినిమాలన్నీ హిట్ రేంజ్‌కు వెళ్లాయి. కానీ నోటాలో -స్వపక్షమే విపక్షమవడం, తండ్రే కొడుకుపై కక్షగట్టడంలాంటి అద్భుతమైన కాన్ఫ్లిక్ట్‌లున్నా -హీరోయిజంలో ఇంటెన్సిటీ లేకపోవడంతో చల్లబడిపోయాయి. తెలుగు నేటివిటీకి దూరమైన -తమిళ రాజకీయాలకు సంబంధించిన కథ కావడంతో ఆడియన్స్ నిరాశపడ్డారు. తమిళ రాజకీయాలపై ఏకొద్దిపాటి అవగాహన ఉన్నా -నోటాతో దర్శకుడు ఏంచెప్పదలచుకున్నాడన్న విషయం అర్థమవుతుంది. లేదంటే, ఫక్తు రాజకీయ డ్రామా చూసిన భావనే కలుగుతుంది. రిసార్ట్ రాజకీయాలు, ఆసుపత్రి వ్యవహారాలు- ఇవన్నీ జయలలిత ఎపిసోడ్‌ని గుర్తుకుతెచ్చాయి.
‘రౌడీ సీఎం’ అన్న టాగ్‌లైన్‌కైనా ప్రాధాన్యత ఇచ్చివుంటే -కథ, దాని కథనం మరోలా ఉండేది. ఓ కొత్తతరహా సీఎం క్యారెక్టరైజేషన్ స్క్రీన్‌పైకి ఎక్కివుండేది. ఇలాంటి పాయింట్లకు దూరంగా సాగిపోయిన నోటా -ప్రేక్షకుడికి ఆసక్తిలేని అంశాలతో నిండిపోయింది. నాజర్ లవ్‌ట్రాక్, సత్యరాజ్ ఎపిసోడ్ మరీ సాగాయి. ఆ ఎడిసోడ్లతోనే క్లైమాక్స్‌పై ఒక అంచనా మన బుర్రల్లోకి వచ్చేసింది. దీంతో పతాక సన్నివేశాల్లోని ట్విస్టు ఏమాత్రం కిక్కివ్వలేదు. పనామాలో ప్రియదర్శి చేసే ఆపరేషన్, పదివేల కోట్ల వ్యవహారం హ్యాకర్‌కి అప్పగించడం, మర్డర్ కేసులో సీఎం కనిపించకుండా పోవడంలాంటి కొన్ని విషయాలు లాజిక్‌కి అందవు. మొత్తంగా -నోటా రూల్స్ ప్రకారం నచ్చకపోతే తిప్పికొట్టే తీర్పునివ్వొచ్చు.

-త్రివేది