రివ్యూ

పాత.. పలవరింత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** హలో గురు ప్రేమకోసమే

నటీనటులు: రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్‌రాజ్, ప్రణీత, ఆమని తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: విజయ్ కె చక్రవర్తి
కథ, మాటలు: ప్రసన్నకుమార్
నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్
స్క్రీన్‌ప్లే: త్రినాథరావు, ప్రసన్నకుమార్
దర్శకత్వం: త్రినాథరావు నక్కిన

ఉన్నది ఒకటే జిందగీ సినిమా -కెరీర్ ఆశలు నీరుగార్చడంతో సరైన్ హిట్ కోసం ప్లాన్ చేశాడు హీరో రామ్. అందుకే నేను లోకల్, సినిమా చూపిస్త మావలాంటి సాలిడ్ హిట్స్ అందుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కినతో సినిమాకు ఓకె చెప్పాడు. ఇక దిల్‌రాజు కూడా ఈమధ్య సక్సెస్‌పరంగా కాస్త స్లో అయ్యాడు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో భారీ అంచనాలతో వచ్చిన చిత్రం -హలో గురూ ప్రేమకోసమే. అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమాలో ప్రేమ ఎవరెవరి జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చిందన్నదే సింపుల్ స్టోరీ.
కథ
సంజయ్ (రామ్) కాకినాడలో సరదాగా స్నేహితులతో కాలక్షేపం చేసే కుర్రాడు. దాంతో తనకు ఇష్టం లేకపోయినా తండ్రికోరిక మేరకు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయడానికి వెళ్తాడు. అక్కడ తన తల్లి స్నేహితుడైన విశ్వనాథం (ప్రకాష్‌రాజ్) ఇంట్లో ఉంటాడు. తన ఆఫీస్‌లో పనిచేసే కొలీగ్ రీతూ (ప్రణీత) సంజును ప్రేమిస్తుంది. విశ్వనాథం కూతురైన అను (అనుపమ పరమేశ్వరన్)తో తనకు తెలియకుండానే ప్రేమలో పడతాడు సంజు. కానీ విశ్వనాథం ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి ఖాయం చేస్తాడు. ఈ పరిస్థితుల్లో అనును దక్కించుకోవడానికి సంజయ్ చేసిన ప్రయత్నాలు ఏమిటన్నది మిగతా కథ.
పెర్ఫార్మెన్స్ గురించి పెద్దగా చర్చించుకునే అవసరం లేని స్టోరీ. హీరో రామ్ తనకునప్పే పాత్రలో రాణించాడు. అయితే, సంజు క్యారెక్టర్ చాలాచోట్ల ‘నేను శైలజ’లోని హీరో పాత్రను గుర్తుకు తెస్తుంటుంది. తన పాత్రను అండర్ ప్లే చేయడానికి ప్రయత్నించాడు. కామెడీ సీన్లలో రామ్ టైమింగ్ ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్లలోనూ బ్యాలెన్స్ తప్పకుండా నిలబడ్డాడు. క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా అనుపమ పరమేశ్వరన్ పెర్ఫార్మెన్స్ టైలర్‌మేడ్ అనిపించింది. కాకపోతే పాత్రలో డెప్త్ లేకపోవడం లోపం. కథలో ఉండాల్సినంత ప్రాధాన్యం ఆమెకు దక్కలేదు. లవ్ ప్రపోజ్ చేసే సన్నివేశాల్లో అనుపమ హావభావాలు ఆకట్టుకుంటాయి. ఇక ప్రకాష్‌రాజ్ సినిమాకు బలం. అలవాటైన పాత్రే అయినప్పటికీ కొత్తదనాన్ని చూపించేందుకు చేసిన ప్రయత్నం వర్కవుటైంది. ప్రణీత సినిమాకు మైనస్. ఆమె లుక్ ఏమాత్రం ఆకట్టుకోదు. అటు పాత్రపరంగానూ ప్రాధాన్యత కరవు. ఇక మిగతా నటీనటులు వారివారి పాత్రల్లో ఓకే అనిపించారు.
టెక్నికల్ రిజల్ట్‌లో -దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకోలేదు. మామూలు సినిమాలనూ తన మార్క్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసే దేవి, ఈసారి తీవ్రంగా నిరాశపర్చాడు. పాటల్లో రుచించే బాణీ ఒక్కటీ వినిపించలేదు. మనసును హత్తుకునేంత గొప్ప ఫీల్ ఏ పాటలోనూ కలగదు. రామ్- ప్రకాష్‌రాజ్ కలిసి పాడిన పాట ఆసక్తికరం అనిపిస్తుందే తప్ప, దేవి ముద్ర ఎక్కడా వినిపించదు. నేపథ్య సంగీతమూ రొటీన్ వ్యవహారమే. విజయ్ కె చక్రవర్తి ఛాయాగ్రహణం ఓకె. నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపిస్తాయి తప్ప దిల్‌రాజు బ్యానర్ స్థాయికి తగ్గట్టు లేవు. ఇక రచయిత ప్రసన్న కథ విషయంలో తన దారి మార్చుకోలేదు. ఇప్పటికే తాను రుద్దేసిన మామా అల్లుళ్ళ కథను మళ్లీ రిపీట్ చేశాడు. పాత కథకు కొత్త డైలాగులతో కలర్ కోటింగ్ ఇచ్చే ప్రయత్నమే జరిగింది. సింపుల్ డైలాగులతో చాలాచోట్ల నవ్వించాడు. దర్శకుడు త్రినాథరావు ఒక మామూలు కథను ఉన్నంతలో బాగానే డీల్ చేశాడు. కానీ పాత ఫార్ములా కాకుండా కొత్తగా ప్రయత్నిస్తే బాగుండేది.
ట్రైలర్‌లోనే కథాపరంగా కొత్తదనం ఏమీ ఉండదని అర్థమైపోయింది. హీరో రామ్ సైతం ఈ విషయంలో ప్రేక్షకుల్ని ముందే ప్రిపేర్ చేయడానికి ప్రయత్నించాడు. నిజమే.. కథగా చెప్పుకోవడానికి విషయం లేదు. ఇప్పటికే ఎన్నోసార్లు చూసేసిన పాత ఫార్ములా కథ. ప్రథమార్థంలో సరదా సన్నివేశాలు, రొమాంటిక్ ట్రాక్‌తో కథను నడిపిస్తే, ద్వితీయార్థంలో పాత ఫార్ములా.. హీరోకు- మామకు మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ స్టోరీ ఎంటరవుతుంది. హీరో తనదైన శైలిలో హీరోయిన్‌తోపాటు హీరోయిన్ తండ్రిలోనూ మార్పు తేగానే కథ సుఖాంతమైపోతుంది. ఇది ప్రేక్షకుడి అంచనాలకు దగ్గరగా సాగే కథే తప్ప కొత్తగా ఊహించే విషయమేమీ ఉండదు. సినిమా చూపిస్త మావ, నేను శైలజ లాంటి సినిమాల్లో తెలిసిన కథల్నే వినోదాత్మకంగా చెప్పడం ద్వారా ప్రేక్షకుల మనసులు గెలిచిన త్రినాథరావు నక్కిన - ప్రసన్నకుమార్ మరోసారి తమ స్టైల్లో వెళ్లిపోయారు. ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఢోకా లేకుండా చూసుకున్నారు. కొన్ని లాజిక్స్ మాత్రం అర్థం కావు. హీరో తన ఆఫీసులో ఓ అమ్మాయిని ప్రేమించాలని ఫిక్సవుతాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నం ఫలించి తీరా ఆ అమ్మాయి ఇతడికి ప్రపోజ్ చేస్తున్న సమయంలో సరిగ్గా నాకు ఇంకో అమ్మాయిమీద ఇలాంటి ఫీలింగ్సే ఉన్నాయంటూ ఆమె దగ్గరికి పరిగెడతాడు. అంటే తాను లవ్ చేస్తున్నట్లుగా భావిస్తున్న అమ్మాయి తన ఫీలింగ్స్ చెప్పేవరకూ అతడికి హీరోయిన్‌మీద వున్న ప్రేమ తెలియకపోవడం కథానాయకుడి పాత్రౌచిత్యంలో వెలితిని కనబర్చింది. ఇలాంటి లాజిక్‌తో సంబంధం లేని విషయాలు కళ్లముందు సాగిపోతాయి. ఆలోచించడానికి అవకాశం లేని లాజిక్కులు ఆడియన్స్‌కి ఫ్రీ. హీరో తన ప్రేమను హీరోయిన్ తండ్రికి చెబితే, తండ్రిగా వ్యతిరేకిస్తూ.. ఫ్రెండుగా అతడికి సహకారం అందించడానికి సిద్ధపడతాడు. సినిమాలో కొంచెం కొత్తగా అనిపించే పాయింట్ ఇదొక్కటే. కానీ అంత లాజిక్‌గా అనిపించదు. కొట్టొచ్చే తప్పులు కనిపిస్తున్నా, సినిమా మాత్రం భారం అనిపించదు. సరదాగా సాగిపోవడం హలో గురూ ప్రేమ కోసమే చిత్రానికి ప్లస్. రామ్- అనుపమ మధ్య కొన్ని సన్నివేశాలు బావున్నాయి అనిపిస్తుంది. వీరి మధ్య ప్రేమ పుట్టడానికి, బలపడటానికి సరైన కారణాలు చూపించే సన్నివేశాలు మాత్రం మిస్. ఆ సన్నివేశాలను మరిన్ని ఎక్కువ చేసివుంటే, పూర్తిగా పాత కథే అయిపోతుందన్న ఆలోచనతో వాటిని చిత్రీకరించి ఉండకపోవచ్చు. మరీ సింపుల్ సీన్లతో తేల్చేయడంతో ఫీల్ మిస్సైంది. దీంతో ద్వితీయార్థంలో ఒకరికోసం ఒకరు తపించే సన్నివేశాల్లో గాఢత తగ్గి సినిమా పండలేదు.

-శ్రీ