రివ్యూ

నిస్సహాయ ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగారి బాలరాజు * బాగోలేదు
*
తారాగణం: రాఘవ, కరోణ్య కత్రీన్, మీనాకుమారి, దూకుడు శ్రవణ్, సారిక రామచంద్రరావు, కిరాక్ ఆర్‌పి
సంగీతం: చిన్నికృష్ణ
చిట్టిబాబు రెడ్డిపోగు
కెమెరా: జిఎల్ బాబు
నిర్మాతలు: కెఎండి రఫి, ఆర్‌ఆర్ రెడ్డి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కోటేంద్ర దుద్యాల
*
ఆధునికతవైపు ప్రపంచం పరుగులు తీస్తున్న సమాజంలోనే.. కులమతాల పట్టింపులు మనుషుల్ని వేరు చేస్తున్నాయి. పరువు ప్రతిష్ఠల కోసం కొందరు ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్న రియల్ సంఘటనలు కళ్లముందు కనిపిస్తూనే ఉన్నాయి. పంతాలు, పట్టింపులతో ప్రేమికులను వేరు చేయడం రోమియో- జూలియట్, సలీం- అనార్కలి కాలం నుంచే ఉంది. అయితే ఇటీవలి కాలంలో తరచూ ఏదోకచోట చోటు చేసుకుంటున్న పరువు హత్యలు చర్చనీయాంశమవుతుంది. యథార్థ సంఘటనల సమాహార కానె్సప్ట్‌తో వచ్చిన చిత్రమే -బంగారి బాలరాజు. రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా నంది క్రియేషన్స్ పతాకంపై కెఎమ్‌డి రఫి, రెడ్డం రాఘవేంద్రరెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రానికి దర్శకుడు కోటేంద్ర దుద్యాల. రొటీన్ ప్రేమకథకు పరువు అంశం పెద్ద అడ్డంకిగా మారింది. ఈ సమస్యను ఆ ప్రేమ ఎలా ఎదుర్కొందో తెలియాలంటే బంగారి బాలరాజు కథలోకి వెళ్లాలి.
కథ
అమ్మంటే అపురూపమైన ప్రేమ బాలరాజు (రాఘవ)కి. ఊళ్లోనే ఉంటూ సివిల్స్‌కి ప్రిపేర్ అవుతుంటాడు. చదువుకుంటూనే స్నేహితులతో సరదాగా గడిపేస్తుంటాడు. ఓ అనూహ్య సంఘటనలో ఓ అమ్మాయి కళ్లు బాలరాజుని ఆకర్షణలో పడేస్తాయి. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునే క్రమంలో -అదే ఊళ్లోని ఫ్యాక్షనిస్టు జగ్గారెడ్డి కూతురు బంగారి (కరోణ్య కత్రిన్) బాలరాజు కనిపించినపుడల్లా ఏడిపిస్తూ ఉంటుంది. ఆమె చేసే పనులను ముందు టార్చర్‌గా భావించిన బాలరాజు, చివరకు బంగారి తను ప్రేమించిన అమ్మాయని తెలిసి ఆనందపడేలోపే విషయం జగ్గారెడ్డికి తెలిసిపోతుంది. పరువుకోసం హత్యలు చేసే జగ్గారెడ్డి వారిని చంపడానికి బయల్దేరుతాడు. తరువాత ఏం జరిగింది? పరువుకోసం ప్రాణం తీసే జగ్గారెడ్డి వీరి ప్రేమని ఒప్పుకున్నాడా? ప్రేమంటే పడని జగ్గారెడ్డి బాలరాజుని, అతని తల్లిని ఏంచేశాడు? బాలరాజు తనప్రేమను గెలిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏమిటి? అన్న విషయాలు మిగతా కథ.
రాఘవ్, కరోణ్య కత్రిన్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేసిన చిత్రమిది. తొలి చిత్రమే అయినా పెర్‌ఫార్మెన్స్ ఫర్వాలేదనిపించారు. మెళకువలు గ్రహించి తప్పొప్పులు సరిదిద్దుకుంటే నటనలో రాణించే అవకాశం ఉంది. డైలాగ్ మాడ్యులేషన్‌లో రాఘవ్ ఆటిట్యూడ్‌తో ఆకట్టుకున్నాడు. ఎక్స్‌ప్రెషన్స్‌లో వీక్ అనిపించాడు. కరోణ్య కత్రిన్ అందం, చలాకీతనంతో ఆకట్టుకుంది. గ్లామర్ పరంగానే కాకుండా, లుక్స్, నటనతోనూ ఓకే అనిపించుకుంది. మిగిలిన నటీనటుల విషయంలో హీరో తల్లి పాత్రలో మీనాకుమారి ఆకట్టుకుంది. హీరో ఫ్రెండ్ పాత్రలో కిరాక్ ఆర్పీ, జబర్దస్త్ బాబి మంచి కామెడీ టైమింగ్‌తో మెప్పించారు. జగ్గారెడ్డి పాత్రధారి ఓకె. దూకుడు శ్రవణ్ పోలీస్ పాత్రలో కనిపించేది కొద్దిసేపే అయినా మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్నాడు. మిగిలిన వారంతా పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
బర్నింగ్ కానె్సప్టునే ఎత్తుకున్నా, ఆన్ స్క్రీన్‌మీద ఆ పెయిన్ చూపించటంలో దర్శకుడు కోటేంద్ర మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. జిఎల్ బాబు కెమెరా పనితనం ఇంప్రెస్‌గా ఉంది. ఆయన తీసిన విజువల్స్, కొన్ని షాట్స్ పెద్ద సినిమా ఇంప్రెషన్ కలిగించాయి. చిన్నికృష్ణ- చిట్టిబాబు రెడ్డిపోగు అందించిన సంగీతం కథకు తగినట్టుగానే ఉంది. ఎడిటింగ్ వెరీ పూర్. దర్శకుడి అభిరుచికి తగ్గట్టే సాగదీతే కనిపించింది. బలమైన కంటెంట్‌ను చిన్న బడ్జెట్‌తో స్క్రీన్‌కు ఎక్కించే ప్రయత్నంలో నిర్మాతలు కెఎండి రఫి, రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాణ ప్రయత్నం ఆకట్టుకోలేకపోయింది. మొదటిభాగమంతా సంబంధం లేని సీన్లు, అర్థంలేని పాటలతో టార్చర్‌గా సాగిపోతుంది. సెకెండాఫ్‌లో అసలు కథ మొదలైనప్పటికీ, దర్శకుడి వైఫల్యంతో సాగతీత సన్నివేశాలు, ఎమోషన్ సన్నివేశాల్లో గాఢత లోపించటం, అసందర్భ పాటలతో విసుగు పుట్టించింది. ప్రధానంగా రెండో భాగంలో వచ్చే కానె్సప్టుకి సంబంధించిన సన్నివేశాలూ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. హీరో క్యారెక్టరైజేషన్‌ను డిజైన్ చేసుకోవడంలో సత్తా చూపించకపోవడం మరో లోపం. ప్రేమతోపాటు హీరో తన లక్ష్యాన్ని ఎలా సాధించాడనే విషయాన్ని స్పష్టంగా చూపించలేకపోయాడు దర్శకుడు. సినిమాలో ఎక్కువగా కొత్తవాళ్లే కావడం కూడా భావాన్ని ఆడియన్స్‌కి చేర్చలేకపోయారు. చాలా సన్నివేశాల్లో హావభావాలు, ఆహార్యం, బాడీ మూమెంట్స్, ఆర్టిస్టుల స్టేజింగ్ సైతం విసుగు పుట్టించింది. సాంకేతిక వర్గంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, పాటల బాణీలు ఓ మోస్తరు.
కులం, మతం, ఆస్తి అంతస్తుల్లో వ్యత్యాసాలు ఉన్న ప్రేమికులకు పెద్దలు అడ్డుతగలడం చూస్తున్నదే. అయితే పరిణామాలు ప్రేమికుల ప్రాణాలు తీసేవరకు వెళ్లడం సహించరాని నేరం. కేవలం పరువు ప్రతిష్ఠకోసం కన్నబిడ్డలను కడతేర్చేవారికి కనువిప్పు కలిగేలా సినిమాను సందేశాత్మకంగా చెప్పడానికి చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి. స్క్రిప్టు, మేకింగ్‌లో దర్శకుడు మరింత శ్రద్ధపెడితే తీసిన చిత్రానికి ఫలితం ఉండేది. అక్కడక్కడ లాజిక్ లేని సన్నివేశాలు, వేగంలేని కథనం, మెప్పించలేకపోయిన దర్శకత్వ పనితనం, అనాసక్తి సన్నివేశాలు, హావభావాలు పలికించలేని కొత్త నటీనటులు.. -ఇలా అన్నీ కలగలిపి ‘బంగారి బాలరాజు’ ప్రయత్నాన్ని దెబ్బతీశాయి.

-త్రివేది