రివ్యూ

కనెక్ట్‌కాని సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్కార్ * బాగోలేదు
*
నటీనటులు: విజయ్, కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, రాధారవి, పాల కరుపయ్య, యోగిబాబు
సంగీతం: ఏఆర్ రెహమాన్
ఛాయాగ్రహణం: గిరీష్ గంగాధరన్
నిర్మాత: వల్లభనేని అశోక్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎఆర్ మురుగదాస్
*
పొలిటికల్ నేపథ్యంలో ఇప్పటికి చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఓటుకు ఎంత విలువ ఉందో తెలియజెప్పి, మన జీవితాలను మనమే మార్చుకుందాం అన్న సరికొత్త కథాంశంతో గొప్ప ప్రయత్నమే చేసాడు క్రేజీ దర్శకుడు మురుగదాస్. ఇలాంటి పొలిటికల్ కథకు ఓ స్టార్ హీరో తోడయ్యాడంటే ఆ సినిమా రేంజే వేరు. తమిళంలో తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న హీరోగా విజయ్, మురుగదాస్ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘సర్కార్’. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాలు తుపాకి, కత్తి భారీ విజయాలు సాధించిన నేపథ్యంలో హ్యాట్రిక్ సినిమా ‘సర్కార్’పై అంచనాలు భారీగానే పెరిగాయి. పైగా మొదటినుండీ ఆసక్తి పెంచేసిన సర్కార్ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సర్కార్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెచ్చాడు? అసలు ఈ సర్కార్ ఎవరు? అన్న విషయం తెలియాలంటే కథలోకి వెళ్లాలి.
కథ
సుందర్ రామస్వామి (విజయ్) ప్రపంచంలోనే నంబర్‌వన్ కార్పొరేట్ సిఈవో. ఏడాదికి 1800 కోట్ల జీతం తీసుకునే అతను తన సొంత రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి అమెరికా నుంచి వస్తాడు. కానీ అప్పటికే అతని ఓటును ఎవరో వేశారని, ఇక్కడ దొంగ ఓట్లు కామనేనని తెలుసుకుంటాడు? దీంతో అతను న్యాయ పోరాటానికి దిగుతాడు. సుందర్ మళ్లీ ఓటు వేసేవరకు అతడి నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా తీర్పు ఇస్తుంది కోర్టు. తర్వాత మరింతమంది తమ ఓటు విషయంలో ఇలాగే న్యాయ పోరాటానికి దిగడంతో మొత్తం ఎన్నికలే రద్దవుతాయి. దీంతో అధికార పార్టీకి కోపం వస్తుంది. ఆ పార్టీ నేతలు సుందర్‌ను కవ్వించడంతో అతను ఏకంగా ముఖ్యమంత్రి మీదే పోటీకి దిగుతాడు. తర్వాత అన్ని నియోజకవర్గాల్లోనూ తన అభ్యర్థుల్ని నిలబెడతాడు. మరి సుందర్ ఈ పోరులో గెలిచాడా? లేదా? అన్నది మిగతా కథ.
హీరోగా విజయ్‌కి కోలీవుడ్‌లో ఏ రేంజ్ క్రేజ్ వుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాలో అతను మాత్రం కాస్త ఓవర్ యాక్షన్ చేశాడని అనిపించింది. ఒక స్టార్ హీరో నుంచి అభిమానులు ఆశించే పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు విజయ్. అతడి స్టైల్.. స్క్రీన్ ప్రెజెన్స్ ఓకె అనిపిస్తాయి. కథకు కీలకమైన సీన్లతో అతడి నటన ఆకట్టుకుంటుంది. కానీ కొన్నిచోట్ల మాత్రం అతడి పెర్ఫార్మెన్స్ ఓవర్ అనిపిస్తుంది. డ్యాన్సులు, ఫైట్లలో విజయ్ ఎప్పట్లాగే ఆకట్టుకున్నాడు. హీరోయిన్ కీర్తి సురేష్ గురించి చెప్పడానికేమీ లేదు. ఆమెది ఏమాత్రం ప్రాముఖ్యత లేని పాత్ర. అసలు ఆ పాత్ర ఉన్నా లేనట్టే అనిపిస్తుంది. కనీసం హీరోతో లవ్ సన్నివేశాలూ లేవు. ఈ సినిమాలో హీరోకి సరిపోయే ధీటైన విలన్ లేడు. వరలక్ష్మి శరత్‌కుమార్ విలన్‌గా బాగానే చేసినా హీరో ముందు దిగదుడుపే అన్న చందంగా నిలిచింది. ఆమె నటన పెద్దగా ఆకట్టుకోదు. రాధారవి ఉన్నంతలో బాగానే చేశాడు. పాల కుప్పయ్య, మిగతా నటీనటుల్లో ఎవరూ పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేవు. తమిళ కథలు, నేటివిటీ అనేది పెద్ద సమస్యగా మారుతుంటుంది. ముఖ్యంగా రాజకీయాల నేపథ్యంలో సినిమాలంటే అక్కడి పరిస్థితుల చుట్టూనే తిరుగుతాయి. ఇక్కడ కనెక్టివిటీ అనేది పెద్ద సమస్యగా మారుతుంది. అందులోనూ హీరోకు రాజకీయ లక్ష్యాలు ఉండి.. తన ఉద్దేశాల్ని జనాలకు చేరవేయాలని అనుకుంటే.. సినిమా ద్వారా తన పొలిటికల్ ఇమేజ్ పెంచుకోవాలని చూస్తే నేటివిటీ ఫ్యాక్టర్ మరింత పెద్ద సమస్యగా మారుతుంది.
ఇక టెక్నికల్ విషయాలకి వస్తే.. రెహమాన్ పాటలు జస్ట్ ఓకె అనిపిస్తాయి. సినిమాలో సాంగ్స్ ఏదో అలా నడిచిపోయాయి కానీ.. ప్రత్యేకంగా వినసొంపుగా అనిపించే పాటలేమీ లేవు. అసలు దీనికి రెహమానేనా సంగీతం అందించింది అన్న అనుమానాలు వస్తాయి. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. కీలకమైన సన్నివేశాల్ని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేసింది. గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమా రిచ్‌గా తెరకెక్కింది.
దర్శకుడు మురుగదాస్ ఈ కథను మొదలుపెట్టడానికి ఎంచుకున్న పాయింట్ వరకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది కానీ.. మిగతా కథంతా రొటీనే. ఒకప్పటి మురుగదాస్ సినిమాల్లో కనిపించిన గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే.. ఎంగేజింగ్ పిసోడ్లు సర్కార్‌లో మిస్సయ్యాయి. దర్శకుడిగా మురుగదాస్ మార్కు ఇందులో మిస్సయ్యింది. ఎప్పుడూ కథ చాలా బలంగా ఉండేలా చూసుకునే మురుగదాస్ సైతం ‘స్పైడర్’ తర్వాత ఆత్మవిశ్వాసం కోల్పోయాడేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో కేవలం విజయ్ ఇమేజ్‌ను వాడుకోవడానికి, అతని అభిమానుల్ని మెప్పించడానికి.. అతడికి పొలిటికల్ మైలేజ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సర్కార్ ఒక సాధారణ సినిమాగా మిగిలిపోయింది. విజయ్-మురుగదాస్ కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన తుపాకి, కత్తి సినిమాలకు సర్కార్ దరిదాపుల్లో కూడా నిలవదు.
అసలు విషయానికి వస్తే.. హీరో ఏడాదికి 1800 కోట్ల రూపాయల జీతం తీసుకునే కార్పొరేట్ సీఈవో. అతను ఏ దేశంలో అడుగుపెట్టినా అక్కడి కార్పొరేట్ కంపెనీల్ని కొనేసి తర్వాత వాటిని మూత వేయిస్తాడట. అతను ఇండియాకు వస్తున్నాడనగానే కార్పొరేట్ కంపెనీల్లో అందరూ పనులు మానేసి గుండెలు అరచేతుల్లో పెట్టుకుని నిలబడతారు. అసలు అతను కంపెనీల్ని ఎందుకు కొని మూత వేయిస్తాడు అన్నదానికి కారణం చెప్పలేదు. వేల కోట్ల అధిపతి అయిన హీరో రాజకీయాల్లోకి అడుగుపెట్టాక ఏమీలేనివాడిలా మారిపోతాడా? జనాలు తాము ఉంటున్న ఇళ్లను ఖాళీ చేసి అతడికి రాజకీయ పార్టీకి ఆఫీసు చేసి ఇస్తారు. ఇందులో లాజిక్ ఏంటో అర్థంకాదు. హీరో కాబట్టి ఏమైనా చేసేస్తాడు అన్నట్లుగా వ్యవహారం సాగిపోతుంటుందే తప్ప ఏదీ లాజికల్‌గా... కన్విన్సింగ్‌గా అనిపించదు సర్కార్‌లో. విజయ్-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ఈ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ చిత్రంలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు ఏమీ లేవు.
దర్శకుడు మురుగదాస్ రాజకీయాలకు సంబంధించి మరియు ఓటుకు సంబంధించి మంచి స్టోరీలైన్ తీసుకున్నప్పటికీ.. ఆ స్టైరీలైన్‌కి తగ్గట్లుగా కథా కథనాలను మాత్రం ఆయన ఆసక్తికరంగా రాసుకోలేదు. కాకపోతే సెకెండాఫ్‌లో చాలా సన్నివేశాలు మరీ సినిమాటిక్‌గా సాగడం, చాలాచోట్ల లాజిక్ కూడా లేకపోవడం సినిమా ఫలితాన్ని దెబ్బతీసింది. తన ఓటు ఇంకెవరో వేశారని హీరో పోరాడటం అనే పాయింట్ ఆసక్తికరమైందే. ఎక్కువమందికి కనెక్ట్ అయ్యేదే. హీరో తెచ్చిన చైతన్యంతో మిగతావాళ్లు కూడా పోరాటంలోకి దిగడం వరకు కొంత కన్విన్సింగ్‌గా అనిపిస్తుంది. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ తీర్చిదిద్దిన యాక్షన్ ఎపిసోడ్లు, రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా ఎంగేజ్ చేస్తాయి తప్ప మురగ-విజయ్ కాంబినేషన్‌పై ఆశలు పెట్టుకుని వెళితే నిరాశ తప్పదు.

-శ్రీనివాస్ ఆర్.రావ్