రివ్యూ

‘అతీ’తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అబ్బాయితో అమ్మాయి (బాగోలేదు)
తారాగణం:
నాగశౌర్య, పల్లక్ లల్వానీ, మోహన్, రావు రమేష్, ప్రగతి, తులసి, తేజస్వి, షకలక శంకర్, మధునందన్ తదితరులు
సంగీతం: ఇళయరాజా
నిర్మాతలు:
వందన అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, సమ్మెట శ్రీనివాస్
దర్శకత్వం: రమేష్ వర్మ

ప్రేమకు ప్రత్యామ్నాయాలుండవ్. ఒక్కసారి ఒకరిని ప్రేమిస్తే వాడు మోసగాడైనా, మంచివాడైనా -ఆ మనసు వేరొకరిని ఇష్టపడదు... అది నిజమైన ప్రేమ అయితే! ప్రేమికుడు తనను ప్రేమతోకాకుండా కోరికతోనే ప్రేమించాడు, అందుకోసం ఎన్నో అవకాశాలను సృష్టించాడు, తరువాత తాననుకున్న పని చేశాడని తెలిసిన ప్రేమికురాలి మనస్తత్వం ఎలా ఉంటుంది? ఆమె నిజం తెలుసుకుని ఆ ప్రేమికుణ్ని క్షమించగలదా? అసలు ఆ ప్రేమికుడి అంతరంగం ఏంటి?
కథేంటి?
అభి (నాగశౌర్య) అల్లారు ముద్దుగా పెరిగే గారాల కొడుకు. నచ్చింది చేస్తాడు. అందుకు తండ్రి ప్రోత్సాహమిస్తాడు. ఎంత ప్రోత్సాహం అంటే -ప్రేమించిన అమ్మాయితో లిప్ టు లిప్ కిస్ తీసుకోవడానికీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేంతగా. అటువంటి అభి, తన మనసుకు నచ్చే ప్రేమికురాలి కోసం వెతుకుతుంటాడు. పనిలో పనిగా ఫేస్‌బుక్‌లో సమంత అనే అమ్మాయి ఎదురవుతుంది. మొదట సమంతతో అయిష్టంగా చాటింగ్ చేసినా, తరువాత మంచి స్నేహితుడిగా మారిపోయి, కేవలం ఫేస్‌బుక్‌లో చాటింగ్‌తోనే తమ స్నేహాన్ని కొనసాగిస్తుంటాడు. ఒకరినొకరు చూసుకోరు. ఈ నేపథ్యంలో అభికి ప్రార్థన (పల్లక్ లల్వాని) అనే అమ్మాయి ఎదురవుతుంది. ఆమెను చూడగానే ప్రేమలో పడిపోతాడు అభి. తన ప్రేమ గురించి సమంతకు చాటింగ్‌లో చెబుతాడు. ఆమె ప్రేమను పొందడం కోసం ఎన్నో మార్గాలను అనే్వషించి తానే ఆ మార్గాలన్నింటికి పూలదారులు వేసుకుంటూ విజయం సాధిస్తాడు. ప్రార్థన కూడా తన చాటింగ్ స్నేహితులు పవన్‌కళ్యాణ్‌తో ఈ విషయాలన్నీ చెబుతూనే ఉంటుంది. ప్రార్థన తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో అభితో బర్త్‌డే పార్టీ జరుపుకుంటుంది. ఆ రోజంతా ఆమెతోనే ఉంటాడు అభి. తెల్లవారాక తల్లిదండ్రులు వచ్చి జరిగిన తప్పును అర్థం చేసుకుని ప్రార్థనను ఇంట్లోనుంచి వెళ్ళగొడతారు. అభి ఇంటికి వెళ్లిన ప్రార్థన అక్కడ తనను ప్రేమించడానికి అతను పన్నిన మాయోపాయాల గురించి తెలుసుకుంటుంది. వెంటనే అక్కడినుంచి వెళ్లిపోతుంది. అభిని తన జీవితకాలంలో క్షమించలేనంటుంది. ఈ నేపథ్యంలో అభి తల్లిదండ్రులు ప్రార్థనను తమ ఇంట్లో ఉండటానికి అనుమతిస్తారు. అదేసమయంలో తమ కొడుకు అభిని ఇంట్లోనుంచి వెళ్లగొడతారు. అభి వెళ్లి ప్రార్థన ఇంట్లో ఘరానాగా చేరిపోతాడు. ఇక్కడనుండి కథ కొత్తమలుపు తిప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. పవన్‌కళ్యాణ్ తన స్నేహితురాలు ప్రార్థన ఇబ్బందులు గమనించి ఆమెను చదువువైపు దృష్టి మళ్లించమని చెబుతాడు. చివరికి తాను అనుకున్న గోల్‌ను చేరుకున్న ప్రార్థన అమెరికా వెళుతుంది. తనను క్షమించమని అభి ఎంత బతిమాలినా కాదనుకుని వెళ్లిపోతుంది. ఆ తరువాత మిగతా కథ ఏంటి? అనేదే సినిమా. ఇంతకూ కథలో సమంత, పవన్‌కళ్యాణ్‌లు ఎవరు? వారిద్దరి కథ ఏంటి? అనేది సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. ఇంతగా చెప్పాక తెలుగు ప్రేక్షకులు అర్థం చేసుకోనివాళ్లేం కాదు!
ఎలా వుంది?
మొదటినుండీ పాత్రలన్నీ సంఘానికి వ్యతిరేకంగా, విలువలకు అతీతంగా ప్రవర్తిస్తాయి. ప్రతి పాత్ర అతిగా ఆలోచిస్తుంది. తల్లిమీద కోపం కూతురుమీద చూపించే ప్రార్థన తండ్రి పాత్ర డిజైనింగ్‌లో అతి కనిపిస్తుంది. అలాగే అభి తండ్రిగా మోహన్ చేసిన పాత్ర కూడా అతిగా ఉంటుంది. అభి ప్రార్థనను ప్రేమలోకి దించడానికి చేసే పనులన్నీ అతిగానే ఉంటాయి. ఇద్దరూ కలిసి తప్పు చేసినపుడు ఒక్క ప్రార్థనే బాధపడదు. అతిగా బాధపడే కథానాయకుడు కూడా ఉన్నాడు. తనను ఇంట్లోనుంచి వెళ్ళగొట్టాక అభి ఇంటికి వచ్చిన ప్రార్థన ఏం విన్నది, ఎందుకు వెళ్లిపోయింది అన్నది కథాపరంగా బాగానేవున్నా, దాన్ని తెరపై ఆవిష్కరించడంలో మరికొన్ని సన్నివేశాలను రాసుకోవాల్సిందే. ఆమె వచ్చినపుడు వాళ్లు మాట్లాడుకున్న మాటలన్నీ ఆమె విన్నది అన్న సన్నివేశం పూజ్యం. అందుకే ఆ సన్నివేశంలో ఉన్న గాఢత సామాన్యుడికి అర్థం కాదు. కథలోవున్న ఫ్లేవర్ తెలియదు. అందుకే ద్వితీయార్థంలో ఏ పాత్ర ఎందుకు ప్రవర్తిస్తుందో, అతిగా ఎందుకు ఆలోచిస్తుందో అన్న విషయంలో క్లారిటీ ఉండదు. తెలుగు ప్రేక్షకులకు నచ్చిన ముగింపేవున్నా అది రెండేళ్ల తరువాత అంటూ మరికొంత కథను అక్కడికక్కడే కత్తెర వేసినట్లుగా అయింది. దీంతో ప్రేక్షకుడు సినిమా కథలో మమేకం కావడం కష్టం. ఇక నటీనటుల్లో నాగశౌర్య చూడ్డానికి బానేవున్నా, ఎక్స్‌ప్రెషన్స్ పలికించడంలో పేలవంగా కనిపించాడు. పల్లక్ లల్వాని ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. ఇక చిత్రంలో కొద్దో గొప్పో బాగా చేసింది మోహన్, ప్రగతి. తులసి, రావు రమేష్‌ల పాత్రలు కొంచెం అతిగానే ఉంటాయి. షకలక శంకర్, అపూర్వల కామెడీ ఎపిసోడ్‌లో కూడా అతి కొట్టొవచ్చినట్టు కనిపించింది. అలా సినిమా అంతా మామూలు సినిమాకు భిన్నంగా ‘అతీ’తంగా కన్పిస్తుంది. సాంకేతికంగా అద్భుతంగా ఉన్నది ఒక్క కెమెరా పనితనమే. సంగీతం పేరుకు ఇళయరాజా అయినా ఒక్క హిట్ పాట వినపడలేదు. నేపథ్య సంగీతం పాత్రలు చెప్పే డైలాగులను మింగేసింది. కోరస్ గోల -కథను అర్థంకాకుండా చేసింది. ఏదో చెప్పాలన్న ప్రయత్నమే తప్ప, సరైన పద్ధతిలో చెప్పడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు.

-సరయు