రివ్యూ

ఫలించని చుంబన కేళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

24 కిస్సెస్ * బాగోలేదు
*
తారాగణం: అరుణ్ ఆదిత్, హెబ్బా పటేల్, రావు రమేశ్, ఆదితి మ్యాకల్
సినిమాటోగ్రఫీ: ఉదయ్ గుర్రాల
సంగీతం: జోయ్ బారువా
కళ: హరివర్మ
కూర్పు: అనిల్ ఆలయం
నిర్మాతలు: సంజయ్‌రెడ్డి, అనిల్ పల్లాల
దర్శకత్వం: అయోధ్యకుమార్
*
అన్ని ముద్దుల్నీ ఒకేలా చూడకండి. శృంగార ప్రేరేపణలో చూపించేవి, సాన్నిహిత్యంలోని పవిత్రతను చూపించేవి. మా ముద్దులు రెండోరకం అంటూ చెప్పుకొచ్చిన ట్వెంటీఫోర్ కిస్సెస్ టీం- స్క్రీన్‌మీద మాత్రం హద్దులుదాటిన ముద్దుల్నే చూపించింది. తెలుగు సినిమాకు ముద్దు సన్నివేశాలు కొత్తకాదు. కానీ -కొద్దిరోజుల ముందువరకూ అవి ముద్దుముద్దుగానే ఉండేవి. తరువాత రెండడుగులు ముందుకేసి యాధృచ్చికంగానో, యాక్సిడెంటల్‌గానో హీరోయిన్ అధరాలతో హీరో అధరాలు ముడిపడే సన్నివేశాలు చిత్రీకరించారు. అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్ 100 చిత్రాలతో ఆ కొద్దిపాటి హద్దులూ చెరిగిపోయాయి. అయితే ఇదంతా కథలో భాగంగా చోటుచేసుకునే సన్నివేశాలు కావడంతో -చర్చించి వదిలేసిన బాపతే అయ్యింది. తెరమీద ముద్దుల్ని తప్పుగా భావించే రోజులకు కాలం చెల్లిందని ఆ సినిమాలు రుజువుచేశాయి. దాంతో తరువాతి సినిమాల దర్శక నిర్మాతలకి ‘ముద్దు’దారులు తెరుచుకున్నాయి. ముద్దొక సేలబుల్ పాయింట్‌గా మారిన టైంలో -ముద్దుల ఇతివృత్తంతో కథ చెబుతున్నానంటూ ‘24 కిస్సెస్’ చిత్రం స్క్రీన్‌కు వచ్చింది. తెరతీసిన ముద్దుని పోస్టర్‌కు ఎక్కించటంతో -ప్రచార చిత్రాలు కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించాయి. ‘మిణుగురులు’ చిత్రంతో ప్రతిభ చాటుకున్న అయోధ్యకుమార్ చిత్రాన్ని తెరకెక్కించటంతో -అభ్యంతర సన్నివేశాలు ఉండకపోవచ్చన్న నమ్మకాలు కుదిరాయి. అలాంటి ‘24 కిస్సెస్’లో ఏముందో చూద్దాం.
కథ
పిల్లల చిత్రాలను పెద్ద తెరకెక్కించే దర్శకుడు ఆనంద్ (అరుణ్ ఆదిత్). ఆడా మగా మధ్య సహజ ఆకర్షణ, సంబంధాలకు ఏదోక పేరు పెట్టాల్సిన అవసరం లేదన్న మైండ్‌సెట్ అతనిది. అమ్మాయిలతో అన్ని రకాల రిలేషన్స్‌కు ‘యస్’ చెప్పే ఆనంద్ -ప్రేమజోలికి పోడు, పెళ్లంటే నమ్మకాన్ని చూపించడు. ఇదీ అతని క్యారెక్టరైజేషన్. అలాంటి జర్నీలో మాస్ కమ్యూనికేషన్ స్టూడెంట్ శ్రీలక్ష్మి (హెబ్బాపటేల్) కనెక్టవుతుంది. ఆమె అందానికి ఆకర్షితుడవుతాడు. ఇద్దరి మధ్య లైట్ రిలేషన్ మొదలవుతుంది. అది ముదిరే సరికి -మనిద్దరిదీ ప్రేమేనంటుంది శ్రీలక్ష్మి. అలాంటివి తనకు పడవంటాడు ఆనంద్. వాదనతో ఇద్దరూ దూరమవుతారు. ఆనంద్, శ్రీలక్ష్మిలు మళ్లీ కలిశారా? లేదా? ఎవరు ఎవరిని కలిశారు? ఆనంద్ మనసులోవున్నది ప్రేమేనన్న భావన ఎప్పుడు కలిగింది? పెళ్లిపై ఏమాత్రం నమ్మకంలేని అతని జీవితంలో ప్రేమభావన ఎలాంటి గందరగోళాన్ని సృష్టించింది. పెళ్లిపట్ల అతనికున్న వ్యతిరేకతకు అసలు కారణమేంటి? ఈ ప్రశ్నలకు క్లైమాక్స్ ఆన్సరే -24 కిస్సెస్.
ఎలావుంది:
అడ్వాన్స్‌డ్ రిలేషన్స్‌పట్ల ఆసక్తి చూపుతున్న మోడ్రన్ జనరేషన్ స్టోరీ అన్నట్టే దర్శకుడు కథ మొదలెట్టాడు. ఆ రిలేషన్స్‌ని -సేలబుల్ పాయింట్ ‘ముద్దు’కు ముడిపెట్టే ప్రయత్నం చేసి గందరగోళానికి గురయ్యాడు. చెప్పదలచుకున్న పాయింట్‌ని సూటిగా చెప్పకుండా -ముద్దుల తెరలేపడమే కథను కన్ఫ్యూజన్‌లోకి నెట్టింది. ఆ విషయంలో దర్శకుడు అయోధ్య సైతం అనేక గందరగోళాలకు గురైనట్టు అనిపిస్తుంది. మంచో, చెడో విషయమేదైనా సూటిగా చెప్పగలిగితే దాన్ని ఆస్వాదించగలిగే జనరేషన్‌కు -తప్పుదారిలో వెళ్తున్నామన్న అంతర్భావనతో కథ చెప్పడమే 24 కిస్సెస్‌లో కనిపించే అతిపెద్ద పొరబాటు. పైగా కథలోకి చొప్పించిన అనేకానేక విషయాలు అతుకుల బొంతలామారి ఆడియన్స్‌ని గందరగోళానికి గురి చేసింది. చుంబనాల మీద పెట్టిన ఫోకస్, కథలోని సున్నితమైన భావోద్వేగాల మీద పెట్టివుంటే ఆ అనుభూతి వేరే ఉండేది. కానీ సినిమా ఆసాంతం సాగదీతకు గురై, ఆ పాయింట్ వద్దా ఆడియన్స్‌కి కనెక్ట్ కాలేదు.
సైకో థెరపిస్ట్ మూర్తి (రావు రమేష్)కి హీరో ఆనంద్ తన గోడు చెప్పుకోవడంతో కథ మొదలైనా, ఆ సన్నివేశంలోనే ఆసక్తి రేకెత్తించలేకపోవడం, చివరి వరకూ మెలో డ్రామా ఎక్కువవడం -సినిమాను నీరసపర్చింది. ప్రేమ, పెళ్లి పడదనే కుర్రాడు. ఆ రెంటిపైనా బలమైన నమ్మకంతోవున్న అమ్మాయి. వాళ్ల శారీరక అవసరాలు తీరిన తరువాత -నమ్మకాలే ప్రశ్నలుగా మిగులుతాయి. ఆ మానసిక సంఘర్షణ మధ్య ఇద్దరి ప్రయాణాన్ని బలంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. సేలబుల్ కంటెంట్‌ను పచ్చిగా చెప్పాలా? సంస్కారవంతంగా చెప్పాలా? అన్న సందిగ్ధం దర్శకుడిని వెంటాడటంతో కన్ఫ్యూజన్ మొదలైంది. ప్రేమను తిరస్కరిస్తే క్లైమాక్స్ వర్కవుట్ కాదన్న భయం వెంటాడటంతో -కథానాయకుడి చేత ప్రేమకు కనెక్ట్ చేయించాడు. అక్కడా మరో ట్విస్ట్ వెతుక్కుని, పెళ్లిపై నమ్మకం లేదనిపిస్తాడు. పెళ్లిని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడన్న సబ్‌ప్లాట్‌ను ఓపెన్ చేయకతప్పలేదు. చెప్పాలనుకున్న విషయంపై దర్శకుడే కన్ఫ్యూజన్‌కు గురవ్వడంతో -కిస్సెస్ కథ ప్రహసనంలా సాగింది. ముద్దులమీద ముద్దులున్న కథలో -ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్ లేకపోవడంతో ముద్దుల కథ పూర్తిగా తేలిపోయింది.
లీడ్ రోల్స్ చేసిన అరుణ్ ఆదిత్, హెబ్బాపటేల్ కెమిస్ట్రీ వర్కౌటైంది. పాత్రలకి తగిన పరిణితిని మొహమాటం లేకుండా చూపించారు. సైకో థెరపిస్ట్‌గా రావు రమేష్, మోడ్రన్ జెన్ గాళ్‌గా ఆదితి మ్యాకల్ మెప్పించారు. సీనియర్ నరేశ్ ఎలాంటి ప్రాధాన్యత లేని తండ్రి పాత్రలో కనిపించాడు. టెక్నికల్ వాల్యూస్‌లో సినిమా ఓకే.
జోయ్ బారువా బీజీ స్కోరు, రెండు పాటలు బాగున్నాయి. ఉదయ్ గుర్రాల కెమెరా నార్మల్. సినిమాకు తగ్గ నిర్మాణ విలువలు. అవార్డుల మీద అవార్డులు కొట్టిన ‘మిణుగురులు’ చిత్రాన్ని తెరకెక్కించిన ఆలోచనాధోరణి -ఆధునిక భావనల ముద్దు చిత్రాన్ని తెరకెక్కించడానికి దర్శకుడి అనుభవం సరిపోలేదనిపిస్తుంది. ముద్దులమీద ఆపేక్ష ఉన్నోళ్లు -సినిమా చూడొచ్చు.

-ప్రవవి