రివ్యూ

సాంకేతిక కనువిందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2.ఓ *** బాగుంది
***
తారాగణం: రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీజాక్సన్, సుధాంశుపాండే, ఆదిల్ హుస్సేన్, కళాభవన్ షాజహాన్ తదితరులు
సంగీతం: ఏఆర్ రెహమాన్
ఛాయాగ్రహణం: నీరవ్ షా
ఎడిటింగ్: ఆంటోనీ
నిర్మాణం: లైకా
కథ- స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: శంకర్
***
దక్షిణాది సినిమాను భారీస్థాయికి, భారతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు -శంకర్. సినిమా ఏదైనా, జానర్ ఇంకేదైనా -శంకర్ కథే ఓ హీరో. అలాంటి హీరోకు సూపర్‌స్టార్ రజనికాంత్ తోడైతే. అలాంటి కాంబో ఎలా ఉంటుందో ఇప్పటికే రోబోగా ఒకసారి రుచి చూశాం. సైంటిస్ట్‌గా రజనీని చూపిస్తూనే, అతను ప్రాణం పోసిన యంత్రుడిగా చిట్టినీ చూపించి సెనే్సషన్ సృష్టించాడు. అప్పట్లో రోబో సంచలన విజయం దర్శకుడిగా శంకర్ స్థాయిని చెప్పకనే చెప్పింది. అందుకే ఇప్పుడు దానికి సీక్వెల్ తెచ్చాడు. 2.ఓ పేరిట ఐదొందల కోట్ల బడ్జెట్‌తో నాలుగేళ్లు అహర్నిశలూ కష్టపడి తెరకెక్కించాడు. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రంగా ఇది విడుదలకు ముందే రికార్డులు సృష్టించుకుంది. అనూహ్య విజువల్ ఎఫెక్ట్‌లతో, భారీ సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిన సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కావడం మరో రికార్డు. ఒకపక్క రోబోకి సీక్వెల్, మరోపక్క అత్యధిక బడ్జెట్, ఇంకోపక్క అత్యాధునిక థర్డ్ డైమన్షనల్ మూవీ, చివరిగా ఫోర్డీ సౌండ్ సిస్టమ్.. ఇన్ని ప్రత్యేకతలను ప్రచారానికి పెట్టడంతో సహజంగానే అంచనాలు అనూహ్యమయ్యాయి. మాతృక తమిళమే అయినా, శంకర్ చిత్రాలు తెలుగులోనే బాగా ఆడతాయన్న నమ్మకాలు ఎలాగూ ఉన్నాయి కనుక, అదే నమ్మకంతో 2.ఓను ఇక్కడా భారీగానే విడుదల చేశారు. టెక్నాలజీని తొలిసారి లోతుల్లోకి టచ్‌చేసి -ఓ సామాజికాంశాన్ని సాంకేతికత కోణంలో స్పృశించిన శంకర్ 2.ఓ విజువల్ వండర్ ఎలా ఉందో చూద్దాం.
కథ: చెన్నై సిటీలో ఓరోజు. -హఠాత్తుగా జనం చేతుల్లోని మొబైల్ ఫోన్లు గాల్లోకి ఎగిరిపోతుంటాయి. ఓ అదృశ్యశక్తి ఆకర్షిస్తున్నట్టుగా ఆకాశంవైపు దూసుకుపోతుంటాయి. కారణం ఏమిటన్నది ప్రభుత్వానికే కాదు, శాస్తవ్రేత్తలకూ అంతు చిక్కదు. అదే సమయంలో ఓ పెద్ద మొబైల్ షోరూమ్ యజమాని, మొబైల్ కంపెనీ సీఈవో, అలాగే టెలికాం మంత్రి అదృశ్య శక్తి చేతుల్లో హతమవుతారు. మిస్టరీని చేధించలేని సర్కారు, సైంటిస్ట్ వసీకర్ (రజనీకాంత్) సహాయం కోరుతుంది. తన అసిస్టెంట్ హ్యూమనాయిడ్ రోబో వెనె్నల (అమీజాక్సన్) సాయంతో మ్యూజియంకే పరిమితమైన రోబో విభాగాలను మళ్లీ కలిపి చిట్టి (రజనీకాంత్)కి ప్రాణం పోస్తాడు వసీకర్. అలా రంగంలోకి దిగిన చిట్టి, అదృశ్య శక్తి మిస్టరీని చేధిస్తుంది. గతంలో ఉరివేసుకుని ప్రాణం తీసుకున్న పక్షిరాజు (అక్షయ్‌కుమార్) చేస్తున్నాడన్న రహస్యాన్ని బయటపెడుతుంది. దాన్ని అడ్డుకుని భద్రంగా బంధిస్తారు. అయితే డేరా బోణి డాక్టర్ కొడుకు బోరా దాన్ని అక్కడినుండి దొంగిలించి కొత్త శక్తి ఇవ్వాలని ట్రై చేస్తాడు. కానీ అక్కడ నుంచి తప్పించుకున్న పక్షిరాజు బోరాని హత్య చేస్తుంది. ఇకపై ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరినీ చంపేస్తానని పక్షిరాజు ప్రయత్నిస్తుంటాడు. పక్షిరాజును అడ్డుకునేందుకు వసీకర్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు వసీకర్‌లోకి పక్షిరాజు ఆత్మ ప్రవేశిస్తుంది. అలా భారీ విధ్వంసానికి ఒడిగట్టిన పక్షిరాజును చిట్టి అడ్డుకోవడంతో, చిట్టిని ముక్కలు చేస్తాడు పక్షిరాజు. తరువాత వెనె్నల సాయంతో చిట్టి 2.0గా మారతాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏమిటన్నది మిగతా సినిమా.
సూపర్‌స్టార్‌గా ఓ రేంజ్ మాస్ ఇమేజ్‌వున్న రజనీకాంత్ ఇమేజ్ చట్రం నుంచి దూరంగా మాస్ ఫార్ములాకు భిన్నంగా రోబో ఒప్పుకున్నప్పుడు అందరికీ సందేహాలు కలిగాయి. అయితే ఆ సందేహాలను పటాపంచలుచేస్తూ రోబోతో భారీ విజయాన్ని అందుకుని తాను దేనికైనా సిద్ధమేనని చాటిచెప్పాడు. ఇంత వయసులోనూ అంత శ్రమను ఓర్చుకుని కష్టపడిన తీరుకి హాట్సాఫ్ అన్నది చిన్న మాటే. వశీకర్ అంటే రెండు పాత్రల చిట్టిగా వన్‌మ్యాన్ షో చూపించేశాడు రజని. తన స్టయిల్ ఈజ్‌తో మెప్పించడం తలైవాకే చెల్లింది. రజనీని తప్ప చిట్టిగా ఇంకెవరినీ ఊహించుకోలేను అన్న శంకర్ మాటకు పూర్తిన్యాయం జరిగింది. కొన్ని సన్నివేశాల్లో రజనీ నటన అద్భుతం. ప్రీ క్లైమాక్స్‌నుంచి 2.ఓ మినీ రోబోగా రజని ఓహో అనిపించాడు. పక్షిరాజు అక్షయ్‌కుమార్ విలనీని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మేకప్ కోసమే కఠోరమైన శ్రమపడిన అక్షయ్, శారీరకంగా మానసికంగా పడిన కష్టం తెరమీదా కనిపించింది. ఫ్లాష్‌బ్యాక్‌లో పక్షుల బాగుకోసం తపించే వృద్ధుడిగా అద్భుత నటన చూపించాడు. ఇలాంటి పాత్రకు స్టార్ హీరో హోదాలో ఒప్పుకోవడమే సాహసం. అమీజాక్సన్ ఉన్నంతలో ఓకే అనిపించింది. అయితే ఆమెని గ్లామర్ కోణంలో చూడలేం. వీళ్లు తప్ప సినిమాలో గుర్తుండేలా, ఆకట్టుకునే పాత్రల్లో ఎవరూ కనిపించరు. రోబో విలన్ డానీ కొడుకు (సుధాంశుపాండే)గా ఓ పాత్రను పెట్టారు కానీ కథనంలోని బలహీనతవల్ల తేలిపోయింది.
భారీ కమర్షియల్ హంగులున్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన శంకర్ నుంచి వచ్చిన మరో విజువల్ వండర్‌గా 2.ఓను చెప్పుకోవాలి. తీవ్రమవుతున్న సాంకేతిక సంకేతాల ఉరితాళ్లకు పక్షులు అంతరించిపోవడం, మానవాళి మనుగడకే ఎంత ప్రమాదమో హెచ్చరించే పాయింట్‌లో మంచి విషయం ఉంది. జీవించే హక్కున్న పక్షులను హతమారుస్తున్న మానవ నిర్లక్ష్యంపై యుద్ధం చేయడం, ప్రతీకారం తీర్చుకోవడం తప్ప మరో పరిష్కారం లేదన్నట్టు పక్షిరాజు పాత్రను డిజైన్ చేయడంతో -కథ దారి మళ్లిందన్న భావన అక్కడక్కడా కలుగుతుంది. తనలోని బెస్ట్ టెక్నీషియన్‌ని శంకర్ ఇందులో మరోసారి ఆవిష్కరించాడు. హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూసే టాప్ మేకింగ్‌ని తనదైన శైలితో ఇండియన్ స్క్రీన్‌మీద ఆవిష్కరించాడు. ఎంతసేపూ పక్షిరాజు రాక్షస ప్రవర్తన తప్ప అతనిలో సదుద్దేశం విసిగిస్తుంది. కథలో టెంపో లేదే అనే ఫీలింగ్ కలిగించాడు శంకర్. దర్శకుడిగా అతనిమీదున్న గౌరవం కొన్ని లోపాలను కప్పిపుచ్చేలా మాత్రం చేసింది. తన సినిమాల్లో ఏదోక సోషల్ మెసేజ్ తప్పకుండా ఉండేలా చూసుకునే శంకర్, ఇందులోనూ మంచి పాయింట్ తీసుకున్నాడు. కాకపోతే ఎమోషనల్ కనెక్టివిటీ బ్లాక్‌లను పూర్తిగా వదిలేసి, విజువల్ టెక్నిక్స్‌మీదే ఆధారపడటంతో హాలీవుడ్ మూవీ చూస్తున్న భావన కలుగుతుందే తప్ప, దృశ్యం దాటిపోయినా గుర్తుంచుకునే పరిస్థితి మాత్రం లేదు. ఫస్ట్‌హాఫ్‌లో ప్రీ ఇంటర్వెల్ వరకూ కథ ముందుకెళ్లకపోవడం స్టార్ డైరెక్టర్ చేసిన మైనస్సే. సెల్ ఫోన్లు మాయమవడానికి, అదృశ్యరూపంలోని పక్షిరాజు బిల్డప్ సన్నివేశాలు సాగదీత అనిపించింది. స్థూలంగా 2.0, పక్షిరాజు మధ్య పోరాటం తప్ప కథలో మరేమీ కనిపించదు. కాకపోతే ఇంత గ్రాండియర్ స్కేల్ మీద హాలీవుడ్ స్థాయిలో గ్రాఫిక్స్ ప్రెజెంట్ చేయాలన్న శంకర్ తపనను మెచ్చకుండా ఉండలేం. రోబో మాదిరిగానే ఎమోషన్స్‌నీ సరైన పాళ్ళలో మిళితం చేసి ఉంటే బావుండేదన్న చిన్న నిరాశ మదిని టచ్ చేస్తుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ క్రియేటివిటీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో చూపించాడు. ఉన్న రెండు పాటలూ బాగున్నాయి. నీరవ్‌షా సినిమాటోగ్రఫీని ఎంత చెప్పినా తక్కువే. క్లైమాక్స్‌ని చిత్రీకరించిన తీరుకు ఫిదా అయిపోతాం. రియాలిటీకంటే గ్రాఫిక్సే ఎక్కువగా ఉండే క్లైమాక్స్‌లో ఆయన పనితనాన్ని చూడొచ్చు. ఫైట్లు చెప్పుకోతగినంత. ఆంటోనీ ఎడిటింగ్, లైకా నిర్మాణ విలువలు అబ్బురపరుస్తాయి.
రోబో గ్రాండ్ సక్సెస్‌కు కేవలం గ్రాఫిక్సే కారణం కాదు. సాంకేతికతకు సునిశితమైన హాస్యం, మృధువైన ప్రేమ, శృతిమించని శృంగార మాధుర్యం, గగుర్పొడిచే ఫైటింగులు, హృదయాన్ని మెత్తబర్చే భావోద్వేగాలు, కంటతడి పెట్టించే సెంటిమెంట్.. ఇలా అన్నింటినీ సమపాళ్లలో నూరి మూడుగంటల మాయాలోకం లోకి తీసుకెళ్లాడు శంకర్. దీంతో 2.ఓలో అంతకుమించి ప్రేక్షకులు ఆశించారు. కానీ శంకర్ ఈసారి విజువల్ వండర్‌కే ప్రాధాన్యత ఇవ్వడంతో, కంటికి ఇంపు అనిపించిందే తప్ప హృదయాన్ని హత్తుకున్న కథాభావం ఏమీ లేకపోయింది. అత్యున్నత సాంకేతిక ప్రతిభ అడుగడుగునా కనిపించినా, కథలోకి లాక్కెళ్లలేకపోయింది. శంకర్ చెప్పినట్టుగా గ్రాఫిక్స్ క్వాలిటీ విషయంలో పూర్తి సంతృప్తిచెందలేదన్న మాట కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తుంది. టెక్నాలజీ సాయంతో నడిచే ఇలాంటి కథల్లో కొన్ని చిక్కులుంటాయి. హీరోయిన్ బదులు రోబోరూపంలో అమీని సెట్ చేయడం పాటలు, కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ లోపించడం ఇవన్నీ సాధారణ ప్రేక్షకులకు 2.ఓని పూర్తిగా కనెక్ట్‌కాకుండా అడ్డుపడతాయి. అసలు పక్షిరాజు ఆత్మ పక్షుల ఆత్మలతో జతకూడి అంత శక్తిమంతంగా ఎలా మారిందనేది లాజిక్‌కి దూరంగా ఉంది. ఇలాంటి కొన్ని విషయాలు పక్కనపెడితే.. శంకర్ మూడేళ్ల కృషికి హాట్సాఫ్ చెప్పాల్సిందే. రోబో 2.ఓని విజువల్ వండర్ అని చెప్పాల్సిందే.

-శ్రీనివాస్ ఆర్.రావ్