రివ్యూ

జీరోను దాటేశాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీరో ** ఫర్వాలేదు
**
తారాగణం:
షారుక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ, జీషన్, ఆయుబ్, అభయ్ డియోల్, మాధవన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: మను ఆనంద్
సంగీతం: అజయ్ -అతుల్
ఎడిటింగ్: హేమల్ కొఠారి
నిర్మాణం: రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్
కథ, స్క్రీన్‌ప్లే: హిమాన్షు శర్మ
దర్శకత్వం: ఆనంద్ ఎల్ రాయ్
**
షారుక్ ఖాన్ గతంలో చేసిన సినిమాలతోనే ఇంకా బాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా కొనసాగుతున్నాడు. చాలాకాలం క్రితం వచ్చిన చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూయర్, దిల్‌వాలే చిత్రాల తరువాత చెప్పుకోదగిన చిత్రం ఒక్కటీ కింగ్‌ఖాన్ అకౌంట్‌లో లేకుండా పోయింది. యే దిల్ హై ముష్కిల్, డియర్ జిందగీ, రరుూస్, ట్యూబ్‌లైట్, జబ్ హ్యారీ మెట్ సెజల్ చిత్రాలు ఒక మోస్తరు నుంచి డిజాస్టర్ ఫలితాలే ఇవ్వడంతో -తాజా ‘జీరో’మీద షా రుక్ పెద్ద ఆశలే పెట్టుకున్నాడు. కొత్త ప్రాజెక్టుతోనే మళ్లీ ఫాంలోకి వచ్చేందుకు ప్రయోగాత్మక కథను ఎంచుకున్నాడు. అలా తెరకెక్కిన చిత్రమే జీరో. ఆడియన్స్‌కు దగ్గరయ్యేందుకు మ్యాజిక్ ఒక్కటే ఫలితాలివ్వగలదన్న ఆలోచనతో ‘బౌవ్వ’ అనే మరుగుజ్జు పాత్రతో కష్టపడ్డాడు. దర్శకుడిగా ఆనంద్ ఎల్ రాయ్‌ని ఎంచుకోవడం, సొంత బ్యానర్‌పై సినిమా నిర్మాణం చేపట్టడం కెరీర్ కష్టాల్లో పడిన కారణమే. స్ట్రేంజర్స్, తోలి లైఫ్ తోడా మ్యాజిక్ లాంటి విమర్శకుల ప్రశంసలందుకున్న చిత్రాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్. ఆ తరువాత తను వెడ్స్ మను, రాన్‌జానా, తను వెడ్స్ మను రిటర్న్స్ లాంటి కథలతో బాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్స్ స్థాయికి వెళ్లాడు. బావోద్వేగాలను పండించటంతో ఆనంద్‌కంటూ ఓ మార్క్ వేసుకున్నాడు. అందుకే బావోద్వేగాన్ని అద్భుతంగా చూపించే అవకాశమున్న కథను ఎంచుకోవడం, ఆనంద్‌ను దర్శకుడిగా తీసుకోవడం షా రుక్ చేసిన ప్రయోగం. తాగుడుకు బానిసైన సినీ సూపర్‌స్టార్‌గా కత్రినా కైఫ్, సెరిబ్రల్ పాల్సీ వ్యాధితో కుర్చీకే పరిమితమైన నాసా శాస్తవ్రేత్తగా అనుష్క శర్మ పాత్రలు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశాయి. ఆసక్తి కలిగించే పోస్టర్లు, టీజర్, ట్రైలర్లతో ‘జీరో’కు పెద్దఎత్తున ప్రచారం కల్పించిన షా రుక్, మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడో లేదో తెలుసుకునే ముందు.. చిత్రం విడుదలకు అతను చేసిన సెంటిమెంట్ ప్రకటనను గుర్తు చేసుకుందాం.
గత సినిమాల వైఫల్యానికి నేనే కారణమనుకోను. ఏ ప్రాజెక్టుకైనా అంతా కష్టపడే పనిచేస్తాం. ఆపై భగవంతుడి అదృష్టం కూడా ఉండాలి. ఈ సినిమా కూడా పోయిందంటే -నేను చేయగలిగేది ఏమీ ఉండదు. మరో ఏడెనిమిది నెలలు పనిలేకుండా పోతుంది. కాకపోతే -ఈసారి అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటానని అనుకోవడం లేదు. సక్సెస్ కోసం టీం మొత్తం కష్టపడింది. సో, సినిమా విడుదల తరువాత నాకు వెంటనే పని దొరుకుతుందనే అనుకుంటున్నా.
ఆకారానికి తక్కువ, వెటకారానికి ఎక్కువ -బౌవ్వా సింగ్ (షారుక్). పెళ్లి ఆలోచన వచ్చిన తరువాత మ్యారేజ్ బ్యూరో ద్వారా ఓ అందమైన అమ్మాయి కోసం ఆరాటపడతాడు. ఆ ప్రయత్నంలో ఆఫియా (అనుష్క శర్మ) తగులుతుంది. ఫొటోలో ఆఫియా అందానికి మగ్దుడైన బౌవ్వా, తన అదృష్టానికి తనే పొగుడుకుంటూ పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని అనుకుంటాడు. ఆఫియా ఇంటికెళ్లిన తరువాత అసలు విషయం తెలుస్తుంది. సెరిబ్రల్ పాల్సీ వ్యాధికి గురైన ఆఫియా చక్రాల కుర్చీకే పరిమితమై ఉంటుంది. ఆమె నడవలేదన్న విషయం తెలుసుకుని, నిరాశపడతాడు. మరో అందమైన అమ్మాయి కోసం వేట కొనసాగిస్తూనే, ఆఫియాతో స్నేహాన్ని కొనసాగిస్తుంటాడు. మరుగుజ్జును పెళ్లి చేసుకునే మహారాణి ప్రప్రంచంలో దొరకదన్న విషయం త్వరగానే బోధపడుతుంది. దీంతో ఆఫియాతో స్నేహబంధాన్ని వివాహ బంధం చేయాలని ఆశపడతాడు. ఈక్రమంలో బౌవ్వా లైఫ్‌లోకి బబితా కుమారి (కత్రినా కైఫ్) వస్తుంది. సినిమా హీరోయిన్‌తో అనుకోకుండా ఏర్పడిన పరిచయం ఇంటికి ఆహ్వానించేంత వరకూ వెళ్తుంది. మళ్లీ బౌవ్వా మనసు బబిత మీదకు మళ్లుతుంది. అత్యాశకు పోయిన బౌవ్వాకు బబిత ఇంట్లో ఘోర పరాభవం ఎదురవుతుంది. అందుకు కారణమేంటి? ఆ పరిస్థితిని బౌవ్వా సింగ్ ఎలా ఎదుర్కొన్నాడు? అతని జీవితం ఏమైంది? లాంటి ముగింపు ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా.
స్ట్రెయిట్‌గా చెప్పాలంటే ‘జీరో’ మూలకథ -విచిత్ర సోదరులు చిత్రంలోని మరుగుజ్జు కమల్‌హాసన్ పాయింట్‌కు ఎక్స్‌టెన్షన్ అన్నట్టే అనిపిస్తుంది. ఒక మరుగుజ్జు అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడితే’ అన్న పాయింట్‌మీద కథా విస్తరణ, గమనం, సన్నివేశ చిత్రీకరణను మార్చినట్టే అనిపిస్తుంది. కథానాయకుడి పాత్ర మానసికంగా ఆశ, నిరాశల మధ్య ఊగిసలాటను చూస్తున్నపుడు -మరుగుజ్జు కమల్ మస్తిష్కంలోకి రాకపోడు. కాకపోతే ఇలాంటి పాత్రను మొట్టమొదట బాలీవుడ్‌లో తన పంథాలో ప్రదర్శించిన హీరోగా షా రుక్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. ప్రథమార్థంలో షారుక్ స్క్రీన్‌మీద ఉన్నంతసేపూ ఫన్‌తో మ్యాజిక్ చేసేశాడు. ద్వితీయార్థంలోనే మలుపు కథ మొదలవుతుంది. ఆఫియాను పెళ్లి చేసుకోవడానికి వెళ్లినప్పటి సన్నివేశాల్లో షారుక్ కేవలం తన వాచకంతో నవ్వులు పూయించాడు. బట్లర్ ఇంగ్లీష్‌లో షారుక్ డైలాగులు ఆకట్టుకుంటాయి. కత్రినా పరిచయమైన తరువాత, బౌవ్వాను ఇంటికి ఆహ్వానించడంలాంటి సన్నివేశాలు -ఆడియన్స్‌లో ఆసక్తి రేకెత్తించలేకపోయాయి. బౌవ్వాకు ఎదురు దెబ్బ తప్పదన్న విషయం (విచిత్ర సోదరులు చిత్రంలోని కమల్ క్యారెక్టర్‌ను గుర్తు తెచ్చుకున్న వాళ్లకు) ఆడియన్స్‌కి ముందే అర్థమైపోతుంటుంది. కథానాయకుడి పాత్రకు ఇక్కడ ఆడియన్స్ నుంచి సింపతీ దొరకలేదు. భావోద్వేగాలను ఒడిసిపట్టి ఆడియన్స్‌ని కథలోకి లాక్కెళ్లగలిగే దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ సినిమాటిక్ యుక్తి ఇక్కడ మిస్సైంది. పైగా షారుక్‌ను దృష్టిలో పెట్టుకుని తన మార్క్‌నుంచి ఆనంద్ ఒకింత పక్కకు వచ్చాడన్న విషయం ఆయన చిత్రాలు చూసిన వాళ్లకు సులువుగానే అర్థమవుతుంది. దీనికితోడు సెకెండాఫ్‌లో సాగదీత సన్నివేశాలు విసుగుపుట్టిస్తాయి. అతిథి పాత్రలుగా సల్మాన్‌ఖాన్, కరిష్మా కఫూర్, శ్రీదేవి, కాజోల్, ఆలియా భట్, మాధవన్, అభయ్ డియోల్ కనిపించి ఒకింత రిలీఫ్ పంచారు. సొంత బ్యానర్‌లో ప్రాజెక్టు కావడంతో చిత్రీకరణ విషయంలో షారుక్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు తగిన రిచ్‌నెస్ సినిమాలో కనిపించింది. సాంకేతికంగా అజయ్ -అతుల్ సంగీతం, మను ఆనంద్ సినిమాటోగ్రఫీని ఎంచాల్సిన పని లేదు. సెకెండాఫ్‌లో హేమల్ కొఠారి తన కత్తెరకు కొంచెం పనిచెప్పివుంటే బావుండేది.
నిజానికి -షారుక్, అనుష్క శర్మ పాత్రలే కథకు మూలం. మరుగుజ్జు పాత్రలో అటు ఆహార్యంతోను, ఇటు వాచకంతోను షారుక్ మేజిక్ చేసేశాడు. షారుక్ ‘డర్’ చిత్రంలో వాచకంలో ఒకతరహా మేనరిజం ప్రదర్శించినట్టే, ఇందులో పిల్లాడి మనస్తత్వాన్ని వాచకంలో ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. సెరీబ్రల్ పాల్సీ వ్యాథితో బాధపడుతున్న నాసా శాస్తవ్రేత్త ఆఫియాగా అనుష్క అభినయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. నాసా శాస్తవ్రేత్తే అయినా, జీవితంలో అందని కొన్ని మధుర క్షణాలు, భావనలు ఎంతగా బాధిస్తాయో కళ్లతో పలికించి కన్నీరు పెట్టించింది. సూపర్ ఇమేజ్‌వున్న బబిత పాత్ర కత్రినాకు టైలర్‌మేడ్. పొడగరి అందం, పల్పీ డ్యాన్స్‌లతో ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. మిగిలిన పాత్రలు పరిధిమేరకు కనిపిస్తాయి. చివరిగా హిట్టుకొట్టాలన్న షారుక్ ఆశ నెరవేరలేదుగానీ, ఓదార్పు అందించింది జీరో.