రివ్యూ

కారిపోయిన బొట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు*బొట్టు
*
తారాగణం: భరత్, ఇనియా, నమిత, నిరోషా, షకీలా, సృస్టిడాంగే, మనీషాయాదవ్, ఊర్వశి, షాయాజీషిండే తదితరులు..
సంగీతం: అమ్రిష్ గణేష్
నిర్మాత: జి కుమార్‌బాబు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విసి వడి వుడియన్
*
ఏ సినిమా కథైనా వాస్తవానికి దూరంగానే ఉంటుందనుకుంటే, ‘బొట్టు’లాంటి ఆత్మలు, పరకాయ ప్రవేశాలూ, పగతీర్చుకోడాలు ప్రాతిపదికలుగా వుండే ఇతివృత్తాల చిత్రాల్లో ‘వాస్తవం’ అనేమాట ప్రస్తావనకు కూడా దొరకదు. అలాంటి ఒరవడిలోనే వడి వుడియాన్ (చిత్ర దర్శకుడు) తెలుగు, తమిళ ప్రేక్షకులపై వదిలేసిన సినిమాయే ‘బొట్టు’. వివరాలకు వస్తే డాక్టర్ అవుదామని మెడికల్ కాలేజీలో చేరిన కథానాయకుడు అర్జున్ (భరత్)ని ఓ ఆత్మ ఆవహించి విచిత్రంగా ప్రవర్తించేలా చేస్తుంది. దానివల్ల అతని తల్లిదండ్రులు (ఊర్వశి, తంబి రామయ్య), ప్రేయసి నిత్య మిగతా సన్నిహితులూ సతమతమవుతూ ఉంటారు. మరి ఈ ఆత్మ అర్జున్‌ని ఎందుకు పట్టుకుంది? అసలు ఆత్మ కథేమిటి? అన్న విషయాలను ఛేదించి అర్జున్‌ని మామూలు మనిషిగా చేయడంతో సినిమా ముగుస్తుంది. ఇలా ఆత్మల ప్రవేశాలూ, నిష్క్రమణలూ అన్న ఊహాతీత తంతులతో తామరతంపరలుగా అనేకానేక సినిమాలు అన్ని భాషల్లోనూ అదేపనిగా వచ్చేశాయి. వాటిలో విజయవంతమైన చిత్రాలు ఎన్ని అని విశే్లషించుకోవడంకంటే, వరసగా ఇదే తరహా వాణిజ్య దినుసులు దట్టించేసి పంపడంవల్ల అటు ప్రొడ్యూసర్లకు కానీ, ఇటు ప్రేక్షకులకుగానీ ఒరిగేదేమిటి? అన్న అత్యంత సామాన్య ప్రశ్నను చిత్ర బృందం సంధించుకొని వుంటే ‘బొట్టు’ లేదా ‘పొట్టు’ (బొట్టుకు తమిళంలో ఇచ్చిన పేరు పొట్టు) మనముందుకు వచ్చేదే కాదు. ‘బొట్టు’ విషయంలో జరిగిన ఓ విచిత్రమైన విషయమేమిటంటే- సాధారణంగా చిత్రాల్లో కమర్షియల్ గిమ్మిక్‌లకోసం ఏ బాపతు లాజిక్ వంకా చూడరు. కానీ ఇందులో తాము ఏర్పరచుకున్న కల్పిత కథలో ఏర్పరచుకున్న విధానాన్ని వారే ఉల్లంగించడం. అదెలాగంటే.. ఓ సామాన్య గిరిజన తండాలో వున్న యువతి మెడికల్ కాలేజీలో చదువుతూ అక్కడి వారి దౌష్ట్యానికి చనిపోతుంది. సినిమాలో ఎక్కడా ఆమెని విచిత్రమైన భంగిమలు గల యువతిగా చూపలేదు. పైగా ఆ ఊరి వారంతా దేవతగా ఆరాధించే వనితగా చూపారు. కానీ ఆమె ఆత్మ ప్రవేశించిన అర్జున్ మాత్రం నపుంసకునిలా ప్రవర్తించడం చూపారు. అంటే చిత్ర దర్శకుడు తానేర్పరచిన యువతి ఆకృతినీ, తత్వాన్నీ విస్మరించి, కేవలం గతంలో వచ్చిన ఈ బాపతు ఆత్మ ప్రేరిత చిత్రాల్లో అనుసరించిన కారెక్టరైజేషనే్న అర్జున్‌కీ ఇచ్చేశారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు, సినిమాపై చిత్ర బృందానికున్న నిబద్ధతాలేమిని పేర్కోడానికి. అలాగే గిరిజన యువతినీ, అక్కడివారినీ ఆకర్షించడానికే ఆ అమ్మాయిని డాక్టర్ చదవమని ప్రోత్సహించడానికి కారణం- అక్కడి వైద్య విశ్వవిద్యాలయం డీన్ (షాయాజీ షిండే)కున్న దురుద్దేశం (అవయవాలను దొంగిలించి విదేశాలకు అమ్మేయడం)గా చూపారు. అయితే వాళ్లు చెప్పిన బాంబే బ్లడ్ తదితరాల విషయాలపై ఇంకాస్త స్పష్టత ఇస్తే బాగుండేది. ఇంక మెడికల్ కాలేజీలో విద్యార్థిగా వున్న అర్జున్ పరీక్షలో బ్లాంక్ పేపరిచ్చి దాన్ని రాత్రివేళ దొంగిలించి ఆన్సర్ పేపర్ రాద్దామని ప్రయత్నించే సీన్లు ఎంత సిల్లీగా ఉన్నాయో చెప్పడానికి మాటలే రావడంలేదు. అలాగే అనంతరం జరిగిన విషయంపై విచారణ అన్న మిషతో జరిపిన తతంగం ఇంకా ఘోరంగా వుంది. ఇక ఇందులో రాజేంద్రన్, స్వామినాథన్, ఊర్వశి పాత్రల మధ్య సృష్టించి హాస్య సన్నివేశాలు ఒక్క మాటలో చెప్పాలంటే ‘రోత’ పుట్టించేలా ఉన్నాయి. ఓ పక్క అత్యాధునిక గ్రాఫిక్స్ 52 నిమిషాలు చూపిస్తున్నాం అని చిత్ర ప్రచారం చేసుకున్న పరిస్థితిలో దొంగతనానికి వచ్చినవారు డైనింగ్ రూమ్‌లో తింటూ కూర్చోవడం, అక్కడి పదార్థాల్ని వర్ణించడం తరహా హాస్యం ఏ జమానానాటితో దర్శకుడే చెప్పాలి. అసలిలాంటి బీభత్సాలు సృష్టిస్తున్న సందర్భాల్ని పోలీసుల దృష్టికి తీసుకురావడం మాట అటుంచి ఇదంతా ఓ పోలీసాఫీసరు (కథానాయకుడు అర్జున్ తండ్రిని పోలీసాఫీసర్‌గా చూపారు) సమక్షంలోనే జరిగినట్లు చూపడం ఇంకా బాధాకరం. పాత్రధారుల పెర్‌ఫార్మెన్స్ విషయానికొస్తే కథానాయకుని పాత్ర ఫార్మెట్ ఎలా వున్నప్పటికీ, ఇచ్చిన డిజైన్ ప్రకారం భరత్ తన వంతు కష్టాన్ని ఆయన పడ్డారు. కానీ అది తెరపై రాణించడానికే సరిపోయే సామర్థ్యం వౌలికంగా ఆ పాత్రకివ్వనందువల్ల అది రాణించలేదు. బొట్టమ్మ (గిరిజన యువతి) ఆత్మను బంధించడానికి కృషిచేసే మంత్రగత్తె భ్రమరాంబగా నమిత నటించారు. ఆమె గెటప్ వైవిధ్యంగా వుంది. కథానాయకుని తల్లిగా ఊర్వశి, మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నిరోషా, షకీలా కన్పడ్డారు. కథకు కీలకమైన బొట్టమ్మ పాత్రధారణి అందంగా కన్పడింది. ఈ టైపు చిత్రాల్లో చురుగ్గా ఉండాల్సిన గ్రాఫిక్స్ విభాగం, కెమెరా పనితనం- రెండూ బాగా కృషిచేశాయి. అమ్రిష్ స్వరాల్ని మించి వాయిద్య ఘోష ఉండటంవల్ల పాటల్లో మాటలు వినపడలేదు. చిత్ర ప్రారంభంలో వచ్చిన యుగళగీతంలో కక్ష, శిక్ష అంటూ పాటల రచయిత శివగణేష్ పదాలు వేసి వెరైటీని దించడానికి ప్రయత్నం చేశాడు. సినిమా చివరిలో వచ్చిన అమ్మవారి పాట (మమ్మేలే అమ్మోరు, మా పాలి బంగారం, శివశక్తి నువ్వే తల్లి)లో కొరియోగ్రఫి బాగుంది. సినిమాకు పెట్టే వ్యయంపై దృష్టిపెట్టేముందు, అందులో కంటెంటెపైన సీరియస్‌గా ఫోకస్ చేస్తే తప్ప పెట్టిన ఖర్చు సత్ఫలితం ఇవ్వదు. అపుడే ‘బొట్టు’ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ బోర్డర్‌కు చేరులోనైనా వస్తాయి.

-అనే్వషి