రివ్యూ

సందేహాత్మక రుషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహర్షి ** ఫర్వాలేదు
**
తారాగణం: మహేష్‌బాబు, పూజాహెగ్డే, అల్లరి నరేష్, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, జయసుధ, వెనె్నల కిషోర్ తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఛాయాగ్రహణం: కెయు మోహనన్
రచన: వంశీ పైడిపల్లి -హరి -సాల్మన్
నిర్మాతలు: దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి
**
సూపర్‌స్టార్ మహేష్‌బాబు స్పైడర్ పరాజయం తరువాత వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చడంతో మహర్షి సినిమాకు ఓకె చెప్పాడు. రిషి.. మహర్షిగా మారడానికి చాలా టైం పట్టినట్టే ఈ సినిమా విషయంలో దర్శకుడు వంశీ మూడేళ్లు వెయిట్ చేశాడు. సోషల్ మెసేజ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ లాండ్‌మార్క్ మూవీ కావడంతో మొదటినుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను అందుకునేలా మహర్షి పయనం సాగిందా లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
రిషి (మహేష్‌బాబు) హైదరాబాద్ కెపిహెచ్‌బి కాలనీలో వుండే ఓ మధ్య తరగతి కుర్రాడు. తన తండ్రి క్లర్క్‌గా జీవితాన్ని గడుపుతూ.. ఓ ఫెయిల్యూర్‌లా బ్రతుకుతుంటాడు. తన తండ్రికి ఎదురైన వైఫల్యాలు, అవమానాలు చూసి.. తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా బతక్కూడదని.. గొప్ప స్థాయికి ఎదగాలని ఆశపడతాడు రిషి. ఆ తరువాత ఎంటెక్ కోసం వైజాగ్ వెళ్తాడు. అక్కడ అతడికి పూజా (పూజా హెగ్డే, రవి (అల్లరి నరేష్) పరిచయమై స్నేహితులుగా మారుతారు. వీరితో బంధం బలపడుతుంది. కానీ కొన్ని కారణాలతో ఆ ఇద్దరితోనూ రిషి బంధం తెంచుకుంటాడు. దానికి కారణం తన లక్ష్యం. తన లక్ష్యం కోసం అమెరికా వెళ్లిన రిషి.. అక్కడ ప్రపంచంలోనే అతి పెద్దదైన కంపెనీకి సిఈఓ అవుతాడు. ఆ స్థాయిలో వున్న రిషి అనుకోకుండా ఎక్కడో ఇండియాలోని ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మారుమూల పల్లెటూరైన రామవరం గ్రామానికి వస్తాడు. అసలు రామవరానికి రిషికి సంబంధం ఏమిటి? రామవరంలో వున్న సమస్యలపై రిషి ఎందుకు పోరాటం చేస్తాడు. మరి ఈ పోరాటంలో రిషి గెలిచాడా లేదా అన్నది మిగతా కథ. ఈ సినిమా విషయంలో మొత్తం క్రెడిట్ అంతా మహేష్‌బాబుకే దక్కుతుంది. ఇందులో మూడు వేరియేషన్లు వున్న పాత్ర చేశాడు. ఐతే ఒక్క కాలేజీ ఎపిసోడ్‌లో మాత్రమే మహేష్ వైవిధ్యం చూపగలిగాడు. కానీ పెర్ఫామెన్స్ పరంగా అతడికి పరీక్ష పెట్టే స్థాయి సినిమా కాదు. తన పాత్రకు న్యాయంచేశాడు కానీ.. చాలా చోట్ల మహేష్ కొత్తగా చేసిందేమీలేదు. చాలాచోట్ల మహేష్ లుక్స్, హావభావాలు, స్క్రీన్ ప్రెజెన్స్ అతడి గత సినిమాల్ని గుర్తుకుతెస్తాయి. ఏదో పాత సినిమా చూసిన అనుభూతి కలగక మానదు. ఇక హీరోయిన్ పూజాహెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పడానికేమీ లేదు. మొదట్లో ఆమె పాత్ర కొత్తగా ఉంటుందేమో అన్న ఆలోచనలోకి తీసుకెళ్లిన దర్శకుడు ఆ తరువాత రెగ్యులర్ హీరోయిన్‌గానే మారిపోతుంది. ఇక కథలో కీలకమైన పాత్రలో అల్లరి నరేష్ రాణించాడు. రవి పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అతడి కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర ఇది. ద్వితీయార్థంలో చాలా ప్రాధాన్యంతో కనిపించే ఈ క్యారెక్టర్‌ని అనవసరంగా సైడ్ చేసేశారు. విలన్ పాత్రలో జగపతిబాబు రొటీన్‌గా బోర్ కొట్టిస్తాడు. ప్రకాష్‌రాజ్ ఉన్నంతలో బాగానే చేసినా ఆయన పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఇక మిగతా పాత్రల్లో రావు రమేష్, సాయికుమార్, రాజీవ్ కనకాల, జయసుధ, వెనె్నల కిషోర్‌లు తమ పరిధిలో బాగానే చేశారు.
మహేష్ బాబు 25వ సినిమాగా వచ్చిన మహర్షి ల్యాండ్‌మార్క్ సినిమా కావడంతో ప్రేక్షకులు ఆశించినదానికంటే ఎక్కువే ఇవ్వాలన్న ఇంటెన్షన్ మహేష్‌బాబులో కన్పించింది. హీరో పాత్రను ఒక రోల్ మోడల్‌లాగా తీర్చిదిద్దారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన హీరో ప్రపంచంలోనే అతి పెద్ద కార్పొరేట్ కంపెనీకి సిఈఓ అవుతాడు. ఇదో పెద్ద సక్సెస్‌స్టోరీ. ఈ క్రమంలోనే మనకు లెక్కలేనన్ని సందేశాలు కన్పిస్తాయి. ఇక హీరోకు కుచేలుడి లాంటి ఫ్రెండుంటాడు. వీళ్లమధ్య బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో స్నేహం గురించి పెద్ద సందేశం ఉంటుంది. హీరో అమెరికాలో కంపెనీ బాధ్యతలు పక్కన పెట్టి ఆంధ్రాలోని ఒక పల్లెటూరికి వస్తాడు. అక్కడి రైతు సమస్యలమీద పోరాడుతాడు. ఇందులోనూ ఒక పెద్ద సందేశం ఉంటుంది. దాదాపు మూడు గంటల నిడివి వున్న సినిమాలో ఇలా లెక్కలేనన్ని సందేశాలు టెన్షన్ పెట్టిస్తాయి. సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది, సెంటిమెంట్ పండింది.. ఆకట్టుకునే అంశాలు చాలానే ఉన్నప్పటికీ.. సినిమా అంతటా ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలన్న తాపత్రయమే కనిపించింది తప్ప ఎక్కడా కమర్షియల్ సినిమా ఫీలింగ్ కనిపించదు. అనేక పాత సినిమాల్ని తలపించే కథ కథనాలు, సన్నివేశాల కారణంగా సినిమా జనాలకు బోర్ కొట్టిస్తుంది.
ఇక టెక్నికల్ అంశాలను పరిశీలిస్తే.. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఎక్కడా ప్లస్ అవ్వలేదు. ఒక్క క్లైమాక్స్‌లో వచ్చే ‘ఇదే కదా ఇదే..’ పాట ఒక్కటే దేవిశ్రీ ప్రసాద్ గుర్తుకువస్తాడు. మిగతా పాత్రలు మాత్రం ఏవో పాటలు పెట్టాలని పెట్టినట్లు ఉంటాయి తప్ప ఆకట్టుకునే పాటలు లేవు. నేపథ్య సంగీతం కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక కె.యు.మోహనన్ ఛాయాగ్రహణం ఉన్నత స్థాయిలో కనిపిస్తుంది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఇలాంటి ఫ్రేమ్స్ అన్నీ ఆల్రెడీ మహేష్ చేసిన సినిమాల్లో ఇదివరకే చూసిన ఫీలింగ్ కన్పిస్తుంది. నిర్మాణ విలువల గురించి చెప్పేదేముంది? ప్రతి సన్నివేశంలోనూ రిచ్‌నెస్ కనిపిస్తుంది. దర్శకుడు వంశీ తీర్చిదిద్దిన కథలో కొత్తదనం లేకపోయినా.. ఒక ఉదాత్తత అయితే ఉంది. కానీ దాన్ని తెరమీద ప్రెజెంట్ చేయడంలో వంశీ పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. చాలాచోట్ల డైలాగులు వింటుంటే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసుల్లో కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది తప్ప మహేష్ సినిమా చూస్తున్నామా అన్న అనుమానం కలుగక మానదు.
హీరో అనగానే ఒకే గట్టి సంకల్పం.. దానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదుర్కొని పోరాడగలశక్తి ఉంటుంది. హీరో రంగంలోకి దిగి ఏదో చేసేవరకు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. అలాగని అల్లరి నరేష్ పాత్ర అయినా మెరిసిందా అంటే అదీ లేదు. చాలాసేపు చోద్యం చూసిన హీరో ప్రీక్లైమాక్స్ దగ్గర కొంచెం ఉత్సాహం చూపిస్తాడు. సినిమా ముగింపు దశకు వచ్చింది, ఇక మనం ఏదో ఒకటి చేయాలన్నట్లుగా పైకి లేస్తాడు. అక్కడినుంచి కథనం కాస్త పరుగులు పెడుతుంది. రైతు సమస్యలమీద హీరో ప్రెస్‌మీట్ సీన్ ఆకట్టుకుంటుంది. విలన్ పాత్రను తేల్చిపడేయడంతో ముగింపు ఆశించిన స్థాయిలో లేదు. మహర్షిలో అన్ని వర్గాల ప్రేక్షకులకూ ఆకట్టుకునే అంశాల్ని ఒక్కొక్కటిగా ప్రెజెంట్ చేసినట్లు అనిపిస్తుంది. అలా కాకుండా ఒక వ్యక్తి ప్రయాణాన్ని సూటిగా మనసుకు తాకేలా.. బిగితో, ఎమోషన్‌తో చెప్పడంలో మాత్రం వంశీ పైడిపల్లి విఫలమయ్యాడు. మహేష్ నటించిన పాత సినిమాల ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. కాలేజీ ఎపిసోడ్‌లో చాలావరకు 3 ఇడియెట్స్ స్ఫూర్తి కనిపిస్తే.. హీరో పల్లెటూరికి వచ్చి అక్కడివాళ్ళకోసం పోరాడే వైనం శ్రీమంతుడును గుర్తుకు తెస్తుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి స్క్రిప్టు దశలో ఒక్కో ఎపిసోడ్ రాసుకుంటున్నపుడు ఒక్కో సినిమాను రిఫరెన్స్‌గా తీసుకున్నాడేమో అనిపిస్తుంది. మహేష్ లుక్‌తోపాటు బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకుని నటించిన కాలేజీ ఎపిసోడ్ ఎంటర్‌టైన్ చేస్తుంది. కథను చెప్పాల్సిన చోట వంశీ చాలా బలహీనంగా కనిపించాడు.

-త్రివేది