రివ్యూ

విల్‌స్మిత్ వన్‌మాన్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లాద్దీన్ *** బాగుంది

తారాగణం: విల్‌స్మిత్, మేనా మస్సౌడ్, నవోమి స్కాట్, మార్విన్ కెన్జరి, నవీద్ నగ్బాన్, నసీం పెడ్రాడ్, బిల్లీ మాగ్నుస్సెన్
సంగీతం: అలెన్ మానె్కన్
సినిమాటోగ్రఫీ: అలెన్ స్టివార్ట్
ఎడిటింగ్: జేమ్స్ హెర్బట్
స్క్రీన్‌ప్లే: జాన్ ఆగస్ట్, గై రిట్చీ
నిర్మాత: డాన్ లిన్, జొనాథన్ ఇరిచ్
బ్యానర్: వాల్ట్ డిస్నీ పిక్చర్స్
దర్శకత్వం: గై రిట్చీ
==================================================
కొత్త కథను సులువుగా చెప్పొచ్చు. తెలిసిన కథనూ మార్పులు చేర్పులతో చెప్పడమూ సులువే. కానీ, ప్రపంచానికి సుపరిచితమైన కథను ఏమాత్రం మార్చకుండా ఏమార్చి చెప్పడం అంత సులువైన పనేంకాదు. సినిమా కోణంలో చూస్తే అది రిస్క్ కూడా. అలాంటి రిస్క్‌లు ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ పిక్చర్స్‌కి కొత్తకాదు. అందుకే అలాద్దీన్ కథతో అలాంటి ప్రయోగమే చేసింది. నిజానికి ‘అలాద్దీన్’ అనేది అరబిక్ జానపద కథ. ఈ కథను ప్రపంచ సినిమాయే కాదు, జాతీయ, ప్రాంతీయ భాషలు సైతం తమకు నచ్చినట్టుగా, తమకిష్టమొచ్చినట్టుగా నెత్తికెత్తుకుని ఎడాపెడా సినిమాలు తీసేశాయి. ఓ భూతం.. దాని చేతిలో దీపం/ ఓ సామాన్యుడు.. కోటలోని యువరాణి/ హీరోయిజం (మంచి).. విలనిజం (చెడు)తో సన్నివేశాలు అల్లుకుని ఇప్పటికే చాలా రకాలుగా చాలామంది చాలా చాలా కథలే చెప్పేశారు. వీటన్నింటికీ అలాద్దీన్ మాతృక. ఆ మాతృకను 1992లోనే డిస్నీ యానిమేషన్ రూపంలో తెరకెక్కించింది. ప్రపంచ ఆడియన్స్ ఆ సినిమా చూసి అబ్బురపడ్డారు. శెహబాష్ అన్నారు. అరబిక్ జానపదం ఆధారంగా రూపొందిన కథ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆ చిత్రానే్న మళ్లీ లైవ్ యాక్షన్‌గా దర్శకుడు గై రిట్చీ తెరకెక్కించాడు. ప్రధాన పాత్రలైన జీనీగా విల్‌స్మిత్, అలాద్దీన్‌గా మేనా మస్సౌడ్, యువరాణి జాస్మిన్‌గా నవోమి స్కాట్ ఏమేరకు మాయ చేశారో చూద్దాం.
కథ: అలాద్దీన్ (మేనా మస్సౌడ్) సాధారణ దొంగ. పెంపుడు కోతితో ఆగ్రాబాలో నివశిస్తుంటాడు. ఆ రాజ్యం యువరాణి జాస్మిన్ (నవోమీ స్కాట్)ను ఓ సందర్భంలో ఆపదనుంచి రక్షిస్తాడు. ఆమె అలాద్దీన్‌ను ఇష్టపడుతుంది. ఆ ప్రేమకు అంతస్థులు అడ్డొస్తాయి. మరోపక్క ఆగ్రాబా సుల్తాన్‌కు విశ్వాసపాత్రుడైన జాఫర్ (మర్వాన్ కైన్జైరీ) రాజ్యాన్ని కబళించే పన్నాగం పన్నుతుంటాడు. ఓ గుహలోవున్న అద్భుత దీపాన్ని సొంతం చేసుకుంటే, దాని మాయాశక్తితో రాజ్యాన్ని సొంతం చేసుకోవచ్చని తెలుసుకుంటాడు. దీపాన్ని సాధించగల సాహసి కోసం వెతుకుతున్న సమయంలో, అలాద్దీన్ దొరుకుతాడు. ‘నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ధనవంతుడివి కావొచ్చు. జాస్మిన్‌ను పెళ్లి చేసుకోడానికి అంతస్థులు అడ్డురావు’ అంటూ ఆశ పెడతాడు జాఫర్. జాస్మిన్‌పై ప్రేమతో అద్భుత దీపాన్ని సాధించడానికి సాహశిస్తాడు అలాద్దీన్. మాయ తివాచీపై గుహకు చేరిన అలాద్దీన్, అక్కడ అద్భుత దీపాన్ని సాధించాడా? దీపంతో ప్రత్యక్షమైన జీనీ (విల్‌స్మిత్)ని ఏం కోరుకున్నాడు? జాఫర్ దుష్టపన్నాగం నెరవేరకుండా ఎవరు ఎలా అడ్డుకున్నారు. అందుకు జీని ఎలా సహకరించాడు?లాంటి ఆసక్తికరమైన అంశాలను తెరపై చూడాలి.
ఓ రాజ్యంలో నివశించే నిరుపేద.. రాజకుమారి మనసు గెలుచుకుని ఆమెను ఎలా సాధించుకున్నాడన్నదే సినిమా సీడ్. ఈ కథను, అందులోని పాయింట్ బేస్ చేసుకుని అనేక భాషల్లో అనేకానేక సినిమాలు ఇప్పటికే వచ్చాయి. ఈ సింపుల్ పాయింట్‌లో సినిమాకు పనికొచ్చే గొప్ప ముడిసరుకు మాత్రం -జీనీ పాత్ర. జీనీ పాత్ర ప్రవేశించిన దగ్గర్నుంచే కథపై ఆసక్తి పెరుగుతుంది. అయితే, మాతృకను మాతృకలా చూపిస్తూనే దర్శకుడు గై రిట్చీ -సన్నివేశాలను ఆసక్తికరంగా తీర్చిదిద్దడం బావుంది. జాస్మిన్ ప్రేమకోసం దీపాన్ని సాధించే సాహసానికి అలాద్దీన్ ఒడిగట్టడం, అక్కడ ప్రత్యక్షమైన జీనిని మూడు వరాలు కోరడంలాంటి సుపరిచిత సన్నివేశాలనూ ఆసక్తిగా చూపించాడు దర్శకుడు. జీనీ తెరపైకి రావడంతోనే కథలో వేగం పెరుగుతుంది. జీనీ మాటలు, మాయలు, మంత్రాలు ఆకట్టుకుంటాయి. యానిమేషన్ కంటెంట్‌ను లైవ్ యాక్షన్‌గా మలచటంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. సన్నివేశాల్ని సహజత్వానికి దగ్గరగా చూపించగలిగాడు.
ప్రథమార్థం మొత్తం -జాస్మిన్ మనసు గెలుచుకోవడానికి అలాద్దీన్ పడే పాట్లు, జాస్మిన్‌పై ఆశతో జాఫర్ మాయలో పడటం, అద్భుత దీపం కోసం చేసే సాహసకృత్యాలతో సినిమా సాగుతుంది. ఇంటర్వెల్ తరువాతే దర్శకుడు అసలు కథను అందుకున్నాడు. జీనీ రాకతో ఆడియన్స్ మరోలోకంలోకి అడుగు పెడతారు. కథలో వేగం కనిపిస్తుంది. రాజ్యాన్ని కబళించాలన్న జాఫర్ పన్నాగాన్ని తిప్పికొట్టడంలో ఎవరెలాంటి పాత్రలు పోషించారన్నది సెకెండాఫ్‌లో చూస్తాం. చిత్రమేమంటే హీరోయిజాన్ని ఒకింత పక్కనపెట్టి, జాఫర్‌ను నియంత్రించటంలో జాస్మిన్ ఎలాంటి పాత్ర పోషించిందన్న విషయాన్ని దర్శకుడు కాస్త బలంగా చెప్పగలిగాడు.
విశే్లషణ: లైవ్ యాక్షన్ అలాద్దీన్ సినిమా వన్ మాన్ షో చేసింది హాలీవుడ్ హార్డ్‌కోర్ స్టార్ నటుడు విల్‌స్మిత్. సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది విల్‌స్మిత్ గురించే. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలే ఎక్కువ చేసినా, భావోద్వేగాలను రుచి చూపించగల పాత్రల్నీ విల్‌స్మిత్ పోషిస్తూ వచ్చాడు. అందుకే విల్‌స్మిత్‌ది హాలీవుడ్‌లో సెపరేట్ ట్రాక్.
ఇప్పుడిక జీనీగా విల్‌స్మిత్ వన్‌మాన్ షో చూపించాడు. విల్‌స్మిత్ ఈ పాత్రకు ఓకే చెప్పినట్టు చాలా విమర్శలే వచ్చాయి. కోట్ల రూపాయల బడ్జెట్‌తో డిస్మీ సంస్థ ప్రయోగమే చేస్తోందంటూ ముందస్తు రివ్యూలూ వచ్చాయి. వాటన్నింటినీ పటాపంచలు చేశాడు విల్‌స్మిత్. ఓరిజినల్‌గా జీనీ ఉంటే, ఇలానే ఉంటుందేమోనన్నంత అద్భుతంగా పాత్రను పోషించాడు. డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్‌తో సినిమాను ఒక్కడి భుజంపై మోసేశాడు. అందుకే అలాద్దీన్ సినిమా విల్‌స్మిత్‌ది వన్‌మేన్ షో అనేది. తెలుగు వరకూ చూస్తే -విల్‌స్మిత్ పోషించిన జీనీ పాత్రకు టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మరింత ఆకట్టుకుంది. విల్‌స్మిత్ ఎక్స్‌ప్రెషన్స్‌కు వెంకటేష్ వాయిస్ ఓవర్ ఆప్ట్‌గా అనిపించింది.
ఇక అలాద్దీన్ పాత్రలో మేనా మస్సౌడ్ చక్కగా అమరాడు. అతని వస్తధ్రారణ, సంభాషణా చాతుర్యం, సాహసిగా యాక్షన్ సన్నివేశాల్లో రాణింపు ఆకట్టుకుంది. తెలుగు వర్షన్‌లో మేనా మస్సౌడ్‌కు వరుణ్ తేజ్ వాయిస్ ఇవ్వడం కూడా సరైన ఎంపిక. ఎలాంటి తడబాటు లేకుండా హావభావాలకు తగిన వాయిస్‌ని ఇవ్వగలిగాడు. జాస్మిన్‌గా నవోమి స్కాట్ అందంగా కనిపించింది. అయితే, దర్శకుడు చేసిన చిన్న ప్రయోగాన్ని ఆమె సమర్థవంతంగానే పోషించింది. అలాద్దీన్ కథలో చిన్నపాటి మార్పు చేస్తూ, జాస్మిన్ పాత్రను బలోపేతం చేశాడు దర్శకుడు. అందుకు తగిన నటన నైపుణ్యాన్ని అలవోకగా ప్రదర్శించి మెప్పించింది స్కాట్. చివరిలో జాఫర్ ఆట కట్టించేది కూడా జాస్మినే. మిగిలిన పాత్ర ధారులు వంకపెట్టలేని నటనతో ఆకట్టుకున్నారు. సాంకేతికంగా సినిమా డిస్నీ స్టామినాను రుచి చూపించింది. ఈతరానికి ఈ కథను చెప్పడానికి డిస్నీ చేసిన ప్రయోగం అద్భుతమనే చెప్పాలి. వ్యాపార కోణంలోనూ యానిమేషన్ కథను లైవ్ యాక్షన్ చేయడం తెలివైన ప్రక్రియ. నేపథ్య సంగీతం సినిమాకు మరింత బలాన్నిస్తే, విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమాటోగ్రఫీ టీం ప్రాణం పోసేసింది. దర్శకుడు గై రిట్చీ టేకింగ్ బావుంది. మొత్తంగా అలాద్దీన్ ఈ వేసవిలో ఓ చక్కని వినోదాన్ని అందిస్తాడు.