రివ్యూ

రక్తికట్టని రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు *ఎన్‌జికె
*
తారాగణం: సూర్య, సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌సింగ్, దేవరాజ్, బాలాసింగ్, నీళల్‌గళ్ రవి, పోన్‌వన్నన్ తదితరులు
సంగీతం: యువన్ శంకర్‌రాజా
కెమెరా: శివకుమార్ విజయన్
నిర్మాతలు: ఎస్‌ఆర్‌ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్‌ప్రభు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరాఘవ
*
ఈమధ్య తమిళ హీరో సూర్యకు వరుస ఫ్లాపులు తెగ టెన్షన్ పెడుతున్నాయి. అందుకే ఈసారి కొత్త తరహా ప్రయోగం చేయాలని భిన్నమైన చిత్రాల దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సెల్వరాఘవన్ (శ్రీరాఘవ)తో సినిమా ప్లాన్‌చేశాడు సూర్య. ఎన్‌జికె పేరుతో విడుదలైన ఈ సినిమాతోనైనా తన ఫ్లాపులకు ఫుల్‌స్టాప్ పడుతుందని ఆశపడుతున్నాడు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నందగోపాలకృష్ణ పేరుతో తెలుగులోకూడా శుక్రవారం విడుదలైంది. మరి ఎన్‌జికె ఎవరు? ఆయన కథేమిటి? ఈ సినిమాతో సూర్య హిట్ అందుకున్నాడా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ: నందగోపాలకృష్ణ (ఎన్‌జికె) ఎంటెక్ (అగ్రికల్చర్) పూర్తిచేసి విదేశాల్లో కొన్నాళ్లు జాబ్ చేసి.. ఇక్కడ ఇండియాలోనే ఉంటూ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం పండించాలని తన ఊరివాళ్ళతో కలిసి వ్యవసాయం చేస్తుంటాడు. తన ఊరివాళ్ళందరి తలలో నాలికలా ఉండే గోపాల్ అంటే అక్కడున్నవారికి మంచి అభిమానం. అతని భార్య గోపిక కుమారి (సాయిపల్లవి) తన భర్తకు ఎప్పుడూ సపోర్టు చేస్తూ ఉంటుంది. అయితే ఆ ఊరిలో సేంద్రియ వ్యవసాయం చేయడం ఇష్టంలేని కొందరు ఎంఎల్‌ఏ మనుషులు ఆ పంటలను నాశనం చేస్తారు. దాంతో పెద్ద నష్టం కలగడంతో పాటు రౌడీలు వీరిని బెదిరిస్తారు. పలు రకాలుగా ఇబ్బందులు పెడతారు. ఈ విషయం గురించి ఎంఎల్‌ఏను కలిసి తనను, తన వాళ్లను రౌడీలు బెదిరిస్తున్నారని, వారిని ఆపమని చెప్పండి అని చెబుతాడు. దాంతో ఎంఎల్‌ఏ నేను సహాయం చేస్తాను, మరి నాకేమిస్తావ్ అని అతనిని ఇరుకున పెడతాడు. ఈ దేశంలో పనులు జరగాలంటే పలుకుబడి ఉండాలని తెలుసుకున్న గోపాల్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఎంఎల్‌ఏ దగ్గర సహాయకుడిగా చేరి రాజకీయాలు నేర్చుకుంటాడు. పెద్దలక్ష్యంతో తెలివిగా అడుగులు వేస్తున్న అతను చాలామందికి విరోధి అవుతాడు. అతని ఎదుగుదలను సహించని కొందరు ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తారు. మరి వాటన్నింటినీ తట్టుకుని ఎన్‌జికె అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది మిగతా కథ. ఎన్నో అద్భుత చిత్రాలతో తెలుగులో స్టార్ హీరోలతో సమానంగా ఇక్కడ మార్కెట్ పెంచుకున్న హీరో సూర్య చేయాల్సిన సినిమా మాత్రం ఇది కాదు. హీరో పాత్రకోసం సూర్య చాలా కష్టపడ్డాడు. కొన్ని సన్నివేశాల్లో అతని నటన ఆకట్టుకుంది. సూర్య నటన గురించి కూడా కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే పాత్ర నేపథ్యం బట్టి సూర్య ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. అయితే ఈ సినిమాలో అసలు కథేమిటి? ఎవరి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారో అర్థం కాదు. హీరో అనవసర విషయాల్లో ఎక్కువ తలదూర్చడం చికాకు తెప్పిస్తుంది. ఇక హీరో భార్య పాత్రలో నటించిన సాయిపల్లవి రెండు మూడు సన్నివేశాల మినహా ఎక్కడా కన్పించదు. పైగా ఆమె పాత్రకు ఏ మాత్రం ప్రాముఖ్యత లేదు. ఇక గ్లామర్ భామ రకుల్‌ప్రీత్‌సింగ్ మాత్రం మంచి పాత్ర పట్టేసింది. రకుల్ ఈ తరహా పాత్రలో మొదటిసారి చేసి అదరగొట్టింది. ఇక మిగతా నటీనటుల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
సాంకేతిక విషయాల గురించి ప్రస్తావిస్తే.. ఈ సినిమాలో కేవలం మూడు సాంగ్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి రొమాంటిక్ సాంగ్.. ఉన్నంతలో ఆ సాంగ్ బాగుంది. మిగతా రెండు పాటలు అసలు వినడానికి బాగాలేవు. ఇక రీరికార్డింగ్ గురించి పెద్గగా చెప్పుకునేది ఏమీ లేదు. యువన్-సెల్వరాఘవన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు నేపథ్య సంగీతం హైలెట్‌గా నిలుస్తాయి. కానీ ఈ సినిమాలో మాత్రం ఆ విషయం గురించి చెప్పుకోవడం కూడా వేస్ట్. విజయ్ శివకుమార్ ఛాయాగ్రహణం యావరేజ్. ఎక్కడా ఫొటోగ్రఫి అద్భుతం అనిపించదు. ఇక ఎడిటింగ్ విషయం కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు సెల్వరాఘవన్ గురించి చెప్పాలంటే.. భిన్నమైన కథలతో మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఆయన ఎందుకు ఈ పొలిటికల్ కథను ఎంచుకున్నాడో అర్థంకాని విషయం. ఏ మాత్రం ఆసక్తిలేని కథ.. కథనం ప్రేక్షకులను బోర్ కొట్టిస్తాయి. ఎక్కడా పసలేని కథ, ఎలాంటి మలుపులు లేకుండా సాగిపోతుంది. కథలను అద్భుతంగా డీల్‌చేసే సెల్వరాఘవన్ ఈ సినిమా విషయంలో ఎక్కడో మిస్టేక్ చేసాడని అనిపిస్తుంది. అసలు ఈ కథను ఎందుకు ఆయన ఎంచుకున్నాడా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలు సినిమాలో ఏ మాత్రం ఆయన శైలి ఎక్కడా కనిపించదు. ప్రస్తుతం సినిమాల్లో ట్రెండ్ మారింది. ముఖ్యంగా ప్రేక్షకులు బాగా అడ్వాన్స్ అయిపోయారు. రాజకీయాలంటే కార్యకర్తలు కేవలం పనిమనుషులు అనే ఆలోచనలోనే ఉన్నాడు దర్శకుడు. ఇపుడు అంతా మారిపోయింది. రాజకీయాల్లోకి వచ్చేవారు ఎన్నో జిమ్మిక్స్ చేసి క్రేజ్ తెచ్చుకుని ఆశించిన పదవుల్లో రాణిస్తున్నారు. ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఎదగడం అన్నది మంచి పాయింట్.. కానీ దానికి అవుట్‌డేటెడ్ కోటింగ్ ఇచ్చి బోర్ కొట్టించాడు దర్శకుడు. సూర్యలాంటి హీరోని పెట్టుకుని ఎలాంటి సినిమా చేయొచ్చు.. కానీ పేలవమైన కథను ఎంచుకుని అంతకంటే పేలవంగా ఎన్‌జికెను తయారుచేశాడు. సూర్య, రకుల్ ఈ సినిమాకు ప్లస్ అయితే.. మిగతా అంశాలన్నీ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాయి. మొత్తానికి ఓ బోరింగ్ కథనాన్ని ప్రేక్షకులమీదకు రుద్దే ప్రయత్నం చేశారు.

-త్రివేది