రివ్యూ

హాయిహాయిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది --అఆ

తారాగణం:
నితిన్, సమంత, అనుపమ
పరమేశ్వరన్, నరేష్, నదియ,
రావు రమేష్, అనన్య, ఈశ్వరీరావు.
సంగీతం:
మిక్కీ జె మేయర్
కెమెరా:
నటరాజన్ సుబ్రమణ్యం
నిర్మాత:
ఎస్ రాధాకృష్ణ
దర్శకత్వం:
త్రివిక్రమ్
**

మాటల్ని తనకనుకూలంగా ఎలా వాడుకోవాలో.. ఎదుటివాడికి మంత్రంలా ఎలా వినిపించాలో బాగా తెలిసిన మాంత్రికుడు త్రివిక్రమ్. పక్కపక్కనున్న అఆలు కలవడానికి పాతికేళ్లు పట్టిందని ట్రైలర్‌లో చెప్పి, ఈ సినిమాలోనూ అలాంటి సంభాషణలే వినిపిస్తానని ఊరించాడు. సినిమాపై ఆసక్తి పెంచాడు. జీవితంలోని అనుభూతులు.. అనుభవాలను మాటలుగా మాట్లాడితే.. అది అచ్చంగా త్రివిక్రమ్ శైలిలా ఉంటుందని అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ వాడే పొందికైన పొట్టి పదాలు, వాటిలోని భావుకత, దానివెనకున్న మర్మాన్ని ఒకసారి రుచి చూస్తే -అతనికి ఎడిక్టవ్వడం ఎంత ఖాయమో, ఒక్కసారి ఎడిక్టయతే అతన్నించి విడిపోవడం కూడా అంతే కష్టం. ఆ అలుసుతోనే బంధాలు, బాంధవ్యాలను కథలుగా చెబుతూ వస్తున్న త్రివిక్రమ్, ఈసారి ఎండ్లబండిపై వాటి మూలాలకు వెళ్లే ప్రయత్నం చేశాడు. అదే అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి కథ. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలను నిర్మించిన ఎస్ రాధాకృష్ణతో త్రివిక్రమ్‌కు ఇది మూడో సినిమా.
కథేంటో చూద్దాం
మహాలక్ష్మి (నదియా) కూతురు అనుసూయ (సమంత). అన్నయ్య జయప్రకాష్. మహాలక్ష్మికి వ్యాపారం నిమిత్తం డబ్బు అవసరం కావడంతో ఆస్తిని కుదువపెట్టి చెల్లికి సహాయం చేస్తాడు జయప్రకాష్. బ్యాంకుకు ఇన్‌టైంలో రీపేమెంట్ చేయలేకపోవడంతో, అతని ఆస్తిని జప్తు చేస్తారు. దాంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడతాడు. తీసుకున్న డబ్బు ఇచ్చేందుకు వస్తుంది మహాలక్ష్మి. డబ్బు తీసుకోకపోగా ఆమెతో తెగతెంపులు చేసుకుంటుంది జయప్రకాష్ భార్య.
కొనే్నళ్ల తరువాత..
అన్నీ తల్లి ఇష్టంమేరకే జరుగే ఇంట్లో -అనసూయ ఇమడటం కష్టమవుతుంది. జీవితం బోర్ కొడుతుంది. ఈక్రమంలో నాన్న రామలింగం (నరేష్) సలహామేరకు కొన్ని రోజులు ప్రశాంతంగా గడపాలని తన అత్త ఇంటికి వెళ్తుంది అనసూయ. అక్కడే ఆమెకు బావ ఆనంద్ విహారి (నితిన్) పరిచయమవుతాడు. కొద్ది రోజుల్లోనే అనసూయ, ఆనంద్‌ల మధ్య ప్రేమ బలపడుతుంది. ఇదే సమయంలో ఆనంద్ విహారి కుటుంబం మాత్రం కొన్ని ఇబ్బందుల్లో ఉంటుంది. ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే పల్లం వెంకన్న (రావురమేష్) కూతురు నాగవల్లి (అనుపమ)ని ఆనంద్ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరోవైపు అనసూయ తల్లి మహాలక్ష్మికి, ఆనంద్ కుటుంబానికి చాలాకాలంగా వైరం. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అనసూయ, ఆనంద్ ఒకరిపై ఒకరికున్న ప్రేమను చెప్పుకున్నారా? అది ఫలించిందా? ఇలాంటి ప్రశ్నలకు జవాబే -అఆ.
పూర్తిస్థాయి ప్రేమకథలో కుటుంబ బంధాలను కలిపి చెప్పడానికి ఏయే అంశాలు అవసరమో వాటన్నింటినీ త్రివిక్రమ్ పొందుపర్చిన విధానం బావుంది. సినిమాపరంగా చూస్తే ఇంటర్వెల్, క్లైమాక్స్, రావురమేష్ నేపథ్యంలో సాగే ఉప కథలు హైలైట్స్. అనసూయ పాత్రతో నటనలో మరో మెట్టు ఎక్కింది సమంత. ఎమోషన్స్ పండించడంలో సమంత నటన పీక్స్‌కు చేరింది. ఆనంద్ విహారిగా నితిన్ సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చినా, కథాపరంగా ఆ క్యారెక్టర్‌కి అంత ప్రాధాన్యం దక్కలేదు. సినిమా ఎక్కువ శాతం సమంత, నదియ, రావురమేష్‌ల మధ్యే నడిచింది. త్రివిక్రమ్ కథల్లో హీరోకివుండే స్పెషల్ క్వాలిటీస్ ఆనంద్ విహారిలో కనిపించవు. మహాలక్ష్మిగా నదియా ‘అత్తారింటికి దారేది’ క్యారెక్టర్‌ను గుర్తు చేసింది.
ఎప్పటిలాగే రావురమేష్ మరో ఎటకారం క్యారెక్టర్‌ని చేశాడు. హీరో చెల్లెలు భానుగా అనన్య, హీరోని పెళ్ళిచేసుకోవాలని కలలుగనే నాగవల్లిగా అనుపమ పరమేశ్వరన్ ఓకే అనిపించారు. రామలింగంగా నరేష్ తన క్యారెక్టర్‌కి న్యాయం చేశాడు.
కథ ఎక్కువ భాగం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండటంతో సినిమా అంతా పచ్చదనంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. కళ్ళకింపైన ఫొటోగ్రఫీ అందించడంలో నటరాజన్ సుబ్రహ్మణ్యం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ పాత పాటల్ని గుర్తు చేసింది. బిజిఎం ఓకే అనిపించాడు. ట్రైలర్‌లో చూపినంత డైలాగుల పదును చిత్రం మొత్తం లేకున్నా, కొన్ని పంచ్ డైలాగులు పేల్చడంలో త్రివిక్రమ్ కష్టపడ్డాడు. సాదాసీదా కథను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దడంలో దర్శకుడి కష్టం కనిపిస్తుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, ఎస్ రాధాకృష్ణ నిర్మాణ విలువలు ఓకే. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్‌స్టోరీలోని కన్ఫ్యూజన్ చుట్టూనే తిరిగే సినిమా, మాస్ అంశాలు, హైలెవెల్ హీరోయిజాన్ని కోరుకునే ప్రేక్షకులకు కనెక్ట్‌కాదు. రొటీన్ కమర్షియల్ సినిమాలతో విసిగి వేసారిన ప్రేక్షకులకు అఆ ఒకింత రిలీఫ్.

-త్రివేది