రివ్యూ

అదే.. అంతరాల కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దొరసాని ** ఫర్వాలేదు

తారాగణం:
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్, వినయ్ వర్మ, శరణ్యప్రదీప్, బైరెడ్డి, వంశీకృష్ణారెడ్డి, కిషోర్ తదితరులు
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
ఎడిటింగ్: నవీన్ నూలి
బ్యానర్: బిగ్ బెన్ సినిమాస్
నిర్మాతలు: మధుర శ్రీ్ధర్, యష్ రంగినేని
కథనం, దర్శకత్వం: కెవిఆర్ మహేంద్ర
=================================================================
‘మా ఇద్దరిమధ్యా స్పష్టతుంది’. ఇది -హీరో రాజు (ఆనంద్ దేవరకొండ) తనకీ దొరసాని దేవకి (శివాత్మిక రాజశేఖర్)కి మధ్యనున్న ప్రేమ గురించి శంకరన్న పాత్రతో చెప్పిన వాక్యం. కాకపోతే సినిమాలో చెప్పబోయే అంశంపట్ల ప్రేక్షకులకీ, చిత్ర బృందానికి మధ్య స్పష్టత కనపడలేదు. అయితే సినిమాను బాక్సాఫీసు కోణంలోకి అనువదించడానికి మహేంద్రజాలాలు ఏమీ చెయ్యకుండా దర్శకుడు మహేంద్ర స్వచ్ఛమైన తీరులో చిత్రాన్ని మలచిన విధానం ప్రశంసనీయం. సినిమా స్పష్టతాకోణాన్నీ అనుసరించివుంటే ‘దొరసాని’ మరింత సర్వాంగ సుందరంగా తయారైవుండేది.
ఇళ్లకు సున్నాలేసే నిరుపేద దంపతుల కొడుకు రాజు (ఆనంద్ దేవరకొండ). దొరసాని దేవికను తొలి చూపునుంచీ ఆరాధిస్తాడు. ఆరాధన ప్రేమగా మారుతుంది. దేవిక వైపునుంచీ సానుకూల సంకేతాలే విస్తరించాయి. కానీ -నిజమైన ప్రేమకు అనాదిగా అడ్డుగోడలవుతున్న అంతస్థుల తారతమ్యాలే ఇక్కడా తాండవించాయి. ఫలితంగా పరిస్థితులెలా పరిణమించాయి? ప్రేమికుల కథ ఎలా ముగిసిందన్న దానితో సినిమా ఎండవుతుంది. పేదింటి అబ్బాయి, పెద్దింటి అమ్మాయి కానె్సప్టుతో సినిమాలు శ్రీకారం పడినదగ్గర్నుంచీ ఇప్పటివరకూ చాలా సినిమాలే వచ్చాయి. ఇకముందూ వస్తాయి. అయితే ఇందులో కథాబలం 1987గానూ తెలంగాణాలోని గ్రామీణ ప్రాంతాల్లోవున్న ‘గడీ’ కుటుంబంగానూ ఎంచుకున్నారు. దానికితోడు భూస్వాములపై తీవ్రవాద ఉద్యమకారులు వ్యవహరించే తీరునీ చూపారు. అయితే ఈ కథలో ఆ ఉద్యమకారులు ప్రత్యక్షంగా చేసినదేం లేదు. కేవలం అది సినిమా మలుపుకోసం పెట్టినట్టు అనిపించింది. వాస్తవానికి కథానాయకుడి తరహా స్వప్నాలూ, పంథా ఆ ఉద్యమానికి పొసగని అంశం కూడా. కేవలం హీరో కవితలు రాసుకోవడానికే వారి కరపత్రాల వెనుకభాగం పనికివచ్చినట్టు చూపడం ఉద్దేశ్యం అర్థం కాలేదు. అలాగే సినిమా మొత్తంలో ప్రథమార్థం అంతా నాయకి వారి ఇంటి కిటికీ తీయడం, అలా తీసినప్పుడు కిటికీ బయట నాయకుడు కనపడటం, అతను తిరిగి చూడటం తతంగంతోనే నడవడంతో ప్రేక్షకుడు తీవ్ర అసహనానికి గురవుతాడు. అంతకన్నా దర్శకుని సంకల్పానికి సరిపోయే విధంగానే సన్నివేశాలు ఆసక్తికరంగా తీర్చిదిద్దితే బావుండేది. సినిమా మొత్తం తెలంగాణ భాషలోనే సాగినా, యాసను దొర కొడుకు పాత్రకు కొన్నిచోట్ల ఇవ్వలేదు. అదేవిధంగా ‘బోసిడిక్కి’ అనే పదం తెలంగాణ ప్రాంతంలో అంతగా వాడరు. ఆ పదాన్ని దొర సహాయకుడు పాత్ర ద్వారా ఓచోట అనిపించారు. రాజు, దేవిక సన్నిహిత స్థితిని చూసిన సిద్ధయ్య రాజును చిత్రహింసలు పెడతాడు. ఆ స్థితిని దొరసాని దేవికకు చూపుతాడు. ఎందుకిది అంటే, ‘నిన్ను తాకినందుకు’ అంటాడు. మరి ‘నేనూ తాకానుగా..’ అన్న ఆమె చిన్న వాక్యం ‘వ్యవస్థలో ఇదేం న్యాయం?’ అని సూటిగా ప్రశ్నించిన తీరును దర్శకుడు బాగా చూపారు. కానీ ఒక దశలో దొరతో రాజు ‘మీ అమ్మాయిని దొరసానిలా ఏ కష్టం లేకుండా చూసుకుంటా’నంటాడు. మరి దొరసానిలా చూసుకోడానికి ఆర్థికపరంగా స్వయం పోషకత్వం సాధించడానికి ఏ దిశగా కృషి చేస్తున్నాడో ఎక్కడా చూపలేదు. అది చూపితే బావుండేది. ఇలా దొరను చూడడానికి వచ్చిన ముందు సీన్‌లోనే పోలీసులు తమదైన శైలిలో రాజును ట్రీట్ చేసినట్టు చూపారు. కానీ దాని బాపతు శారీరక అసౌకర్యం ఏమీ లేనివిధంగానే రాజు నడకను చూపడం కంటిన్యుటీని విస్మరించినట్టే అనిపించింది. అలాగే పతాక సన్నివేశానికి ముందు దొరసాని అన్న రాజుతో ‘ఇకముందు ఏం చేద్దామనుకుంటున్నావ్?’ అంటే ‘చదువు చెప్తాను’ (ట్యూషన్స్ అని అర్థం చేసుకోవచ్చు) అంటాడు. చిత్రం మొదట్లో కూడా మనం ఇలా అణిగివుండడానికీ, భయం భయంగా ఉండడానికి కారణం ‘అవిద్యే’నంటూ ‘నేను ఇక్కడి వాళ్లందరికీ చదువు చెప్తాను’ అంటాడు. కానీ అనంతర సన్నివేశాల్లో ఆ ఊసునే మర్చిపోయాడు. వాస్తవానికి చిత్రం నిడివి రెండు గంటల పద్ధెనిమిది నిమిషాల్లో కావలసినన్ని అర్థవంతమైన సన్నివేశాల్ని తెరపై ఆవిష్కరించొచ్చు. కానీ అవి చేయక సినిమా ఫస్ట్ఫా మొత్తం హీరో హీరోయిన్ మధ్య ప్రేమ ఎస్టాబ్లిష్ చేయడానికే వినియోగించి విసుగు తెప్పించారు. నటనాపరంగా ఆనంద్ దేవరకొండ - శివాత్మిక రాజశేఖర్‌లలో శివాత్మికకే ప్రథమ స్థానం ఇవ్వాలి. కేవలం కొన్ని సంభాషణల్లోనే చక్కటి అర్థవంతమైన భావప్రకటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. అందుకు అందమైన విశాలమైన కళ్లు సహాయపడితే, ఆమెకిచ్చిన కాస్ట్యూమ్స్ వగైరా ఆ ఆకర్షణను మరింత ద్విగుణీకృతం చేశాయి. కొన్ని యాంగిల్స్‌లో శివాత్మిక, తొలినాళ్లలో జీవిత (శివాత్మిక తల్లి)ను చూసినట్టే ఉంది. అయితే భావోద్వేగ సన్నివేశాల బలానికి శివాత్మిక ఇంకా శిక్షణ పొందాలి. ఉదాహరణకు రాజు ఉన్నాడేమోనని చూడడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సన్నివేశంలో మరింతగా శివాత్మిక లీనమై నటించాల్సిన అవసరం స్పష్టంగా కనపడింది. రాజు పాత్రలో ఆనంద్ శక్తికొలదీ నటించాడు. కొన్ని లుక్స్‌లో వారి సోదరుడు విజయ్ దేవరకొండలాగే కనిపించడం ఈయనకు బాగా ప్లస్ అయింది. దేవిక సహాయకురాలు చంద్రిక పాత్రధారిణీ మంచి నటన ప్రదర్శించారు. మిగతా పాత్ర పోషకుల పరిధిమేరకు నటించారు. డైలాగులు కూడా చిన్న చిన్నవిగా ఉండి కొన్నిచోట్ల బాగున్నాయి. ‘ప్రేమ కూడా ఉద్యమం లాంటిదే’ అన్న వాక్యాన్ని మరింత విస్తరించి వివరిస్తే బావుండేది. ‘దొరసాని గడీ దాటి బయటికొచ్చిందంటేనే నీ ప్రేమ గెలిచిందని అర్థం’ అన్న సంభాషణా బాగుంది. ప్రశాంత్ పాటల్లో ‘నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే’ అన్నపాట మధురంగా ఉంది. కానీ ‘కళ్లల్లోన కలవరమే’ అన్న పాట 2017లో వచ్చిన అర్జున్‌రెడ్డి చిత్రంలో ఓ పాట బాణీలా అనిపించింది. పాటల్లోనూ మంచి మంచి పదాలు తారసపడ్డాయి. ‘కంచెలడ్డుకున్నా కోకిల కూతనాపునా.. కదిలే సుడులున్నా సేప ఈత నాపునా?.. వంతెనేది లేకున్నా మనసు పరుగు నాపునా?’ లాంటివి ఈ కోవకు వస్తాయి. మొత్తంమీద దొరసాని నీట్‌గాతీసిన చిత్రంగా ఫర్వాలేదనిపించినా సీన్స్ మధ్య క్లారిటీ, ఇంకాస్త స్పీడ్‌నీ సంతరించుకుంటే బావుండేది అని మాత్రం చెప్పక తప్పదు.

-అన్వేషి